స్క్రీన్‌పై రఘురామ, ఆఫ్ స్క్రీన్ పై చంద్రబాబు, లోకేశ్‌

సొంత ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుతో పాటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ‌డం, అలాగే హైకోర్టు స‌ల‌హాదారుల‌పై చేసిన కామెంట్స్‌పై వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌మ పార్టీ ఎంపీలు రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌ను స‌జ్జ‌ల త‌ప్పు ప‌ట్టారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లే త‌ప్ప‌... రాజీనామాలు చేసిందెక్క‌డ‌? అని ఆయ‌న నిల‌దీశారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజీనామాలకు తాము రెడీ రెడీ అనడమే తప్ప.. టీడీపీ రాజీనామా చేసేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మొద‌ట‌గా తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. 

గతంలో ప్రత్యేక హోదా కోసం త‌మ‌ ఎంపీలు రాజీనామాలు చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం త‌మ‌ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర డిమాండ్‌పై  కేంద్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

ఇక ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కు సంబంధించి హైకోర్టు చేసిన కీల‌క వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌ల స్పందించారు. టీడీపీ హయాంలో 100 మందికి పైగా సలహాదారులు ఉన్నార‌న్నారు. కన్సల్టెన్సీ పేరుతో మ‌రో 200 మందిని నియమించార‌ని గుర్తు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసింది చంద్రబాబే అంటూ ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. పరకాల, కుటుంబరావు రాజకీయాలు తప్ప వేరే ఏమి మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు.

తాము ముందు నుంచి రాజకీయంగా ఉన్నామ‌న్నారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. స‌ల‌హాదారులు రాజ‌కీయాలు మాట్లాడుతున్నార‌నే హైకోర్టు కామెంట్స్‌పై సజ్జ‌ల వివ‌ర‌ణ ఇచ్చారు. సొంత ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై ఆయ‌న మండిప‌డ్డారు. రఘురామకృష్ణరాజు కేసులో సీఐడీ ప్రస్తావించిన విషయం నిజం అని ప్రజలకి తెలుసు నన్నారు.

స్క్రీన్‌పై రఘురామ ఉంటే, ఆఫ్  స్క్రీన్ పై చంద్రబాబు, లోకేశ్‌ ఉన్నారని ఆయన విరుచుకుప‌డ్డారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడానికి కుట్ర చేశారని, ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా ఆధారాలు ఉన్నాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులపై ర‌ఘురామ‌, లోకేశ్ చేసిన‌ కామెంట్స్‌పై కోర్టులు సుమోటోగా తీసుకుని విచారించాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Show comments