అర్జంటుగా రంగంలోకి బీజేపీ... ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో మంట పెట్టిందే బీజేపీ. చక్కగా బంగారంలా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. దానికి కారు చవకగా అమ్మేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో మండిపోయిన ఉక్కు కార్మికులు ఆరు నెలలుగా విశాఖ ఉక్కు గేట్ వద్ద అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

ఈ పోరాటానికి అన్ని పార్టీలు ఇప్పటిదాకా మద్దతు ఇచ్చాయి. మరో వైపు చూస్తే కేంద్రం దూకుడు మీద ఉంది. అయినా సరే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మాత్రం ప్లాంట్ ఎక్కడికీ పోదు అక్కడే ఉంటుంది అంటారు. అవును అది అక్కడే ఉంటుంది, కానీ ప్రభుత్వ రంగంలోనేనా అన్నది మాత్రం కమలనాధులు క్లారిటీగా అసలు చెప్పరు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు అర్జంటుగా ఢిల్లీ వెళ్ళి ఉక్కు మంత్రిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 28 వేల ఎకరాల భూమి ఇస్తే వినియోగించిన  పదివేల ఎకరాలు తప్ప మిగిలిన 18 వేల ఎకరాలు మిగులు భూమిగా ఉంది. 

ఇపుడు ప్లాంట్ ప్రీవేట్ పరం అయితే ఈ మొత్తం భూమి కూడా వారికే దఖలు పడుతుందా లేక వేరేగా వేలం వేస్తారా అన్నది అయితే ఈ రోజుకూ ఎవరికీ తెలియదు. ఈ భూమి విలువ దాదాపుగా మూడు లక్షల కోట్ల పై మాటే అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ వస్తోంది అంటే తమ భూములను అయిదు దశాబ్దాల క్రితం విశాఖ జనాలు ఇచ్చారు. వారి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని నాడు హామీ ఇచ్చారే కానీ ఇప్పటికి కూడా మూడొంతుల మందికి ఏ రకమైన ఉద్యోగమూ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇటు భూమీ లేక అటు ఉపాధీ రాక నిర్వాసితులు నిజంగా దారుణంగా నష్టపోయారు అనే చెప్పాలి.

దాంతో వారి సమస్య వేరేగా ఉంది. అయితే ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీజేపీ కోరడం వెనక అర్ధాలు పరమార్ధాలు ఏంటి అన్న చర్చ కూడా మొదలైంది. బహుశా ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే నిర్వాసితులు నష్టపోకుండా వారికి ఏమైనా ఉపశమనం కలిగించేందుకు ప్యాకేజ్ కోసమా అన్నది కూడా తెలియడంలేదు. 

మొత్తానికి అర్జంటుగా బీజేపీ రంగంలోకి దిగింది ప్రైవేటీకరణను ఆపడానికి అయితే అంతా స్వాగతిస్తారు. కానీ అలా జరుగుతుందా. చూడాలి మరి.

Show comments