ఆ నేస్తం, ఈ నేస్తం.. ఉద్యోగుల్లో పెరిగిన అసహనం

తెల్లారేసరికి జగన్ ఏదో ఒక వర్గానికి చేసిన ఆర్థిక సాయం గురించి పేపర్లో వార్త వస్తుంది. రైతు భరోసా వేశారు, మహిళలకు జగనన్న చేయూత వేస్తున్నారు, ఇప్పుడు కాపు నేస్తం డబ్బులు పడ్డాయి. ఇలాంటి పథకాలు చూసినప్పుడల్లా జగన్ దేవుడంటూ ఆకాశానికెత్తేస్తుంటారు ఆయా వర్గాల లబ్ధిదారులు. జనం లో కూడా జగన్ కి దేవుడనే ఇమేజ్ ఉంది. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అసహనంతో రగిలిపోతున్నారు.

డీఏ అడిగితే డబ్బుల్లేవంటారు, పీఆర్సీ అడిగితే కుదర్లేదంటారు.. మరి ఈ పథకాలన్నిటికీ జగన్ ఎక్కడినుంచి డబ్బులు తెస్తున్నారనేది వారి ప్రధాన ప్రశ్న. అవును, ఓ దశలో ఉద్యోగులకు సగం జీతం ఇచ్చి సరిపెట్టిన జగన్ తర్వాతి నెలల్లో వాటిని సర్దుబాటు చేశారు. కొన్ని సందర్భాల్లో జీతాలు, పింఛన్లు లేటవుతున్న మాట కూడా వాస్తవమే. కానీ అదే సమయంలో రాష్ట్రంలో ఏ ఒక్క ఆర్థిక సాయం కూడా లేటు కాలేదు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి పింఛన్ లేటవుతుందేమో కానీ, సామాజిక పింఛన్ అందుకుంటున్న నిరుపేద వృద్ధులు, వితంతువులకు మాత్రం ఒకటో తేదీనే ఆర్థిక భరోసా అందుతుంది.

నిరుపేదల పథకాలకు ఆటంకం లేకుండా చూస్తున్న జగన్ మంచితనాన్ని మెచ్చుకోవాలా? జీతాలు ఆలస్యం చేస్తున్నందుకు విమర్శించాలా..? సామాజిక న్యాయం కోసం చూసేవాడే సరైన నాయకుడు. ఆ దృష్టితో ఆలోచిస్తే జగన్ చేస్తున్నదే కరెక్ట్. పేదలకు ఇచ్చే సొమ్ముకి లోటు లేకుండా చేస్తున్నారు. అంతో, ఇంతో ఆర్థిక భరోసా ఉన్న ఉద్యోగుల్ని మాత్రం కాస్త వేచి చూడండని చెబుతున్నారు.

అయితే ఉద్యోగ వర్గాలు దీన్ని సరిగా అర్థం చేసుకుంటాయని అనుకోలేం. జగన్ అధికారంలోకి వచ్చినా మనకేం మేలు జరగలేదని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. రోజురోజుకు వాళ్లలో అసహనం పెరుగుతోంది.

చంద్రబాబు పెండింగ్ పెట్టిన డీఏ ఇచ్చారు కానీ, జగన్ వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో పడలేదు. 2018 నుంచి ఆరు నెలలకో సారి ఇచ్చే కరువు భత్యంలో కదలిక లేదు. పీఆర్సీ అమలుపై అస్సలు ఆశలు లేవు. 

ఇక సీపీఎస్ రద్దు వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ దశలో ఉద్యోగుల్లో అసహనం పెరగడం సహజమే. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై జగన్ దృష్టిపెట్టి ఆ వర్గాన్ని కూడా సంతృప్తి పరిస్తే జగన్ కి తిరుగే ఉండదు. 

Show comments