విష్ణు దూకుడు వెనుక...?

మా ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివాన మాదిరిగా తయారవుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకు నేరుగా మీడియా ముందుకు రాని మంచు విష్ణు కూడా రంగంలోకి దిగిపోయాడు.  నిజానికి మా ఎన్నికల తేనెతుట్టను కదిపింది మాత్రం ప్రకాష్ రాజ్ నే. అందరికన్నా ముందుగా ఆయనంతట ఆయనే ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావుడి ప్రారంభించారు. 

తనకు మెగా మద్దతు వుందనే భావనను అన్యాపదేశంగా కలిగించారు. అది చాలదన్నట్లు నాగబాబు నేరుగా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచారు. ఆపైన ఇంకా ముందుకు వెళ్లిపోయి ప్యానల్ ను ప్రకటించి, వాళ్లందరినీ మీడియా ముందుకు తెచ్చి, చేయాల్సింది అంతా చేసి, ఇక ఎన్నికల వరకు గప్ చుప్ అంటూ సైలంట్ అయిపోయారు. 

దాంతో ఎన్నికల భేరి మోగినట్లు అయింది. నిజానికి ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పైగా ఇప్పుడు వున్న కమిటీ డిజాల్వ్ కావాల్సి వుంది. ఇప్పట్లో కమిటీ డిజాల్స్ అయి, ఎన్నికలు ప్రకటించే సీన్ అయితే కనిపించడం లేదు. రెండు వైపుల జరుగుతున్న హడావుడి చూసి సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ చిద్విలాసంగా నవ్వుకుంటూ, తన షూటింగ్ లు తాను చేసుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్ తరువాత రంగంలోకి దిగిన విష్ణు మా బిల్డింగ్ మొత్తం తామే కడతామనే మాటతో, అడ్వాంటేజ్ తీసుకున్నారు. అక్కడితో వ్యవహారం ఆగిపోయే వుంటే బాగుంటడేది. కానీ నాగబాబు అందుకు అవకాశం ఇవ్వలేదు. బిల్డింగ్ కడతారు సరే, స్థలం ఎలా తెస్తారు అంటూ ఎదురు క్వశ్చను వేసారు. అక్కడికి ప్రకాష్ రాజ్ కే బోలెడు పలుకుబడి వున్నట్లు మాట్లాడారు.

దాంతో విష్ణు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగాడు. తనకు వుండే పలుకుబడి తనకూ వుందని క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కాస్త దూకుడుగా కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. బహుశా నందమూరి బాలకృష్ణ ఓపెన్ గా తన మద్దతును విష్ణుకు ప్రకటించడం వల్ల వచ్చిన ఊపు కావచ్చు. మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. 

అటు నాగబాబు ఇటు బాలయ్య ఓపెన్ గా ప్రకాష్ రాజ్, విష్ణు కు మద్దతుగా నిలవడంతో, ఇండస్ట్రీ రెండుగా కనిపిస్తోంది ఇప్పుడు. ఇలాంటి టైమ్ లో విష్ణు ముందుకు వచ్చి ఏకగ్రీవానికి సై అనడం మంచి విషయం. ఇద్దరు పోటీ పడినపుడు, పెద్దలు కలుగచేసుకుని, మూడో వ్యక్తిని రంగంలోకి దింపి, ఇద్దరి పోటీని నివారించడం అన్నది మంచి పద్దతే. 

ఇప్పుడు ఈ దిశగా ఆలోచించడం ఒక్కటే సీనియర్ హీరోల తక్షణ కర్తవ్యం. ఆదే ఇండస్ట్రీకి మంచిది కూడా. 

Show comments