ఎమ్బీయస్‍: దిలీప్ దిల్ – కర్దార్ దర్ద్

దిలీప్ కుమార్ మరణించారు. భారతీయ నటులందరికీ అతను రోల్ మోడల్. నటనతో స్టార్‌డమ్ అందుకుని అక్కడే పాతికేళ్లు విహరించాడు. క్రమేపీ హీరోగా వేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో 1976లో కొంతకాలం రిటైరై, ఐదేళ్ల విశ్రాంతి తర్వాత ప్రాధాన్యత వున్న కారెక్టరు యాక్టరు పాత్రల్లో మళ్లీ ముందుకు వచ్చి, యింకో పదేళ్ల పాటు శభాష్ అని కొత్తతరం చేత కూడా అనిపించుకుని దర్జాగా రిటైరయ్యాడు. సినిమా నటన యిలా వుండాలి అని చేసి చూపించినవాడు దిలీప్. మన నటులందరూ అతని వలన ఇన్‌స్పయిర్ అయినవాళ్లే. అతనెలా చేస్తున్నాడో చూసి అనుకరించినవాళ్లు కొందరైతే, దానికి భిన్నంగా చేయాలని ప్రయత్నించినవాళ్లు కొందరు. కానీ అతని అభినయాన్ని అధ్యయనం చేయనివాళ్లు ఎవరూ లేరు. ఒక సినిమా పూర్తయ్యేవరకు యింకో సినిమా ఒప్పుకోకపోవడం చేత అర్ధశతాబ్ది పై చిలుకు కెరియర్‌లో 60 ప్లస్ సినిమాలు మాత్రమే వేశాడు.

కాస్త పేరు వచ్చాక సాధారణంగా నటులు రొటీన్‌గా వేషాలు వేసుకుంటూ పోతారు. ఆ తరహా పాత్రల్లో జనం ఆమోదించారు కాబట్టి అలాటివే నిర్మాతలు ఆఫర్ చేస్తారు, రచయితలూ అలాగే రాస్తారు. కొంతకాలం పాటు ఆ హవా నడుస్తుంది. మరో కొత్త కెరటం రాగానే వీళ్లు పాతబడతారు. దిలీప్ అలా కాదలచుకోలేదు. అందువలన తనకు వచ్చిన ప్రతి పాత్ర వెరయిటీగా వుండాలని తాపత్రయ పడ్డాడు. మౌలికంగా కథ నచ్చితే, కథాచర్చల్లో పాల్గొనేవాడు. తన పాత్రే కాదు, తనతో పాటు కనబడే పాత్రలను కూడా తీర్చిదిద్దాలని తపించేవాడు. డైలాగులు కాస్త మార్చి రాసుకునేవాడు. అప్పటికే వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాను హిందీలో తీసేటప్పుడు మారిస్తే బాగుంటుంది అనేవాడు. కెమెరా యాంగిల్స్ మార్చమనేవాడు. డైరక్షన్‌లో వేలు పెట్టేవాడు.

గతంలో ‘‘హిందీ సినిమా ముచ్చట్లు’’ శీర్షిక రాసినప్పుడు ‘‘రామ్ ఔర్ శ్యామ్’’ సినిమాలో దిలీప్ నటించేటప్పుడు దానికి మాతృక ఐన ‘‘రాముడు భీముడు’’ సినిమా రచయిత డివి నరసరాజు గార్ని దగ్గర కూర్చోపెట్టుకుని స్క్రిప్టులో ఎలా మార్పులు చేశాడో వివరంగా రాశాను. తాపీ చాణక్యను పక్కకు నెట్టేసి, తనే డైరక్షన్ చేసేయడంతో కోపం వచ్చి హీరోయిన్ వైజయంతిమాల తప్పుకుందని కూడా రాశాను. హీరోగా వున్న రోజుల్లోనే అలా చేశాడని అనుకోనక్కరలేదు. దిలీప్‌కు నివాళి అర్పిస్తూ ఆయన్ను ‘‘కలెక్టర్ గారబ్బాయి’’ సినిమా హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’’లో డైరక్టు చేసిన బి. గోపాల్ రాసినది చూడండి. దానిలో దిలీప్‌ది హీరో పాత్ర కాదు. అయినా సచిన్ భౌమిక్‌ను కూర్చోబెట్టుకుని కథలో మార్పులు చేయించారు. కాదర్ ఖాన్ వంటి మంచి రచయిత రాసిన డైలాగులను కూడా తీసుకెళ్లి మార్చి ఫైనల్ వెర్షన్ రాసుకుని వచ్చేవారు. ఇవన్నీ చేస్తూనే ‘డైరక్టరుగా మీరు ఓకే అంటేనే మార్పులు చేద్దాం.’ అనేవారు. అని. దిలీప్ అంతటివాడు మార్పులు చెపితే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?

ఎందుకిదంతా అంటే దిలీప్‌తో తీసే సినిమా భారీగా వుంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా భారీగానే వుంటాయి. హిట్టయినా, ఫ్లాపయినా పెద్ద స్కేలులోనే వుంటుంది. అందువలన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దిలీప్ తన పాత్రను ఆషామాషీగా తీసుకోకుండా, ప్రతీ డైలాగుని, ప్రతి యాక్షన్‌ను, ప్రతి రియాక్షన్‌ను క్షుణ్ణంగా వంటపట్టించుకుని, రిహార్సల్స్ చేసుకుని తయారవుతున్నాడంటే ఆ ఇన్‌వాల్వ్‌మెంట్‌కు నిర్మాత సంతోషించేవాడు. ఇంతా చేసిన తర్వాత సినిమా ఫెయిలయితే ‘దిలీప్ డైరక్షన్‌లో కలగచేసుకుని చెడగొట్టాడు’ అని వాపోయేవారు. ‘మీరు డైరక్టర్లను వేపుకు తింటారుట కదా’ అని దిలీప్‌ను ఓసారి అడిగితే ‘అలా అయితే నేను బిమల్ రాయ్, ఎస్ ఎస్ వాసన్, ఎస్ యూ సన్నీ, కె అసిఫ్, మెహబూబ్ ఖాన్, బిఆర్ చోప్డా, భీమ్ సింగ్, హృషీకేశ్ ముఖర్జీ, నితిన్ బోస్, అమియా చక్రవర్తి వంటి దిగ్గజాల వంటి దర్శకుల వద్ద హీరోగా ఎలా పనిచేసి వుంటాను? వాళ్లు నన్ను రిపీట్ చేశారంటేనే అర్థమవుతోంది కదా, నేను వాళ్లతో సహకరించానని! డైరక్టరు కన్‌ఫ్యూజన్‌లో వున్నపుడు మాత్రమే నేను కలగచేసుకుంటాను.’ అని సమాధానమిచ్చాడు. ఈ కలగచేసుకోవడం అతి ఘోరంగా దెబ్బ తిన్నది ‘‘దిల్ దియా- దర్ద్ లియా’’ అనే సినిమా విషయంలో!

1944లో ‘‘జ్వార్ భటా’’తో రంగప్రవేశం చేసిన దిలీప్ ‘‘జుగ్నూ’’ (1947)తో స్టార్ అయిపోయాడు. ఇక అక్కణ్నుంచి తారాపథంలో దూసుకుపోయాడు. అతని హైయస్ట్ పాయింటు – ‘‘మొఘలే ఆజమ్’’ (1960) అనే చారిత్రాత్మక చిత్రం. దానిలో సలీం పాత్రలో గంభీరంగా నటిస్తూ ప్రేక్షకులకు పిచ్చెక్కించేశాడు. కామెడీ రంగరించిన జానపద చిత్రం ‘‘కోహినూర్’’ కూడా అదే ఏడాది విడుదలైంది. అదీ సూపర్ హిట్. తర్వాతి సంవత్సరమే వచ్చిన ‘‘గంగా జమునా’’ అతని సొంత సినిమా. డైరక్షన్ కూడా చాలా భాగం అతనే చేసేశాడు. మొఘలాయీ రాకుమారుడికి పూర్తి భిన్నమైన గ్రామీణ యువకుడి పాత్రలో కూడా రాణించాడు. అదీ సూపర్ డూపర్ హిట్. ఇన్ని వరుస హిట్లతో దిలీప్ కంగారు పడ్డాడు. తన ఇమేజి చెడిపోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ భిన్నమైన పాత్రల్లో నటించాలి అని నిశ్చయించుకున్నాడు.

రాజ్ కపూర్‌లా డైరక్షన్ వైపు వెళితే మంచిది కదా అని కొందరు మిత్రులు సలహా యిచ్చారు. దానికి తొలి మెట్టుగా ‘‘లీడర్’’ కథ, మాటలు రాసుకున్నాడు. పై మూడు సినిమాలకు భిన్నంగా యిది అర్బన్ వాతావరణంలో, అవినీతిని బయటపెట్టే జర్నలిస్టు కేంద్రంగా, రాజకీయాలు రంగరించిన సాంఘిక చిత్రం. పెద్దగా మెలోడ్రామా లేకుండా చూసి, కామెడీ కూడా బాగా పెట్టాడు. ఆ కథ చూసి ఎస్. ముఖర్జీ నిర్మిస్తానని ముందుకు వచ్చాడు. ఆయన బాంబే టాకీస్‌తో కెరియర్ ప్రారంభించి, అశోక్ కుమార్ తదితరులతో కలిసి 1943లో ఫిల్మిస్తాన్ స్టూడియో నెలకొల్పి, తర్వాత 1950లలో సొంతంగా ఫిల్మాలయా నెలకొల్పి అనేక హిట్ సినిమాలు తీసి, 1967లో పద్మశ్రీ పొందిన ప్రసిద్ధ నిర్మాత. డైరక్టరుగా ఆయన తన కొడుకు రామ్ ముఖర్జీ పేరు వేశాడు. ‘నిజానికి ఆ సినిమాను ఎస్. ముఖర్జీ, రామ్ ముఖర్జీ, నేను కలిసి డైరక్టు చేశాం.’ అని దిలీప్ తర్వాతి రోజుల్లో చెప్పుకున్నాడు.

‘‘గంగా జమునా’’లో జోడీగా నటించిన వైజయంతి మాలను హీరోయిన్‌గా తీసుకున్నారు. నౌషాద్ సంగీతం. బోల్డు పాటలు. భారీ నిర్మాణం. ఈ సినిమా నిర్మాణంలో వుండగానే వైజయంతిమాలను హీరోయిన్‌గా పెట్టి రాజ్ కపూర్ ‘‘సంగమ్’’ నిర్మించాడు. రెండు క్యాంపుల మధ్య వైజయంతిమాల నలిగింది. ‘‘సంగమ్’’తో పోటీ పడాలని ‘‘లీడర్’’ను మరింత చిత్రీ పట్టారు. దిలీప్ చాదస్తంగా మెరుగులు దిద్దుతూ పోవడం వలన నిర్మాణం మూడేళ్లు పట్టి 1964లో విడుదలైంది. చివరకు సినిమా నిడివి ఎక్కువై, అతుకుల బొంతగా తయారైంది. దిలీప్‌ను కామెడీ రోల్‌లో ప్రేక్షకులు హర్షించలేదు. సినిమాకు పెట్టుబడి తిరిగి వచ్చింది కానీ మూడేళ్ల గ్యాప్ తర్వాత దిలీప్ సినిమా వచ్చింది కాబట్టి ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయి, ఆ స్థాయిని అందుకోలేక పోయింది. పైగా అటు ‘‘సంగమ్’’ సూపర్ హిట్టయింది. తన ట్రాజెడీ హీరో యిమేజి తోనే పోయిన ప్రతిష్ఠ తెచ్చుకోవాలనుకున్నాడు దిలీప్. దాని కోసం యీసారి మెరుగైన, సీరియస్ కథను తయారు చేసుకోవాలనుకున్నాడు.

ఆ దశలో అతని వద్దకు ఎఆర్ కర్దార్ వచ్చాడు. అతను చాలా పెద్ద దర్శకనిర్మాత. లాహోర్‌లో 1928లో నటుడిగా ప్రారంభించాడు. 1929 నుంచి డైరక్షన్ మొదలుపెట్టి, అప్పటికి 36 సినిమాలు డైరక్టు చేశాడు. కర్దార్ స్టూడియో కట్టి, అనేక సినిమాలు నిర్మించాడు. అతను దిలీప్‌తో ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కానీ తోడల్లుడు మెహబూబ్ ఖాన్ దిలీప్‌తో హిట్ సినిమాలు తీస్తూండడం చూసి, అతని భార్య యితన్ని దిలీప్‌తో చేయరాదా అని పోరింది. ఉమర్ ఖయ్యామ్ బయోపిక్ తీద్దామనే ఐడియాతో కర్దార్ దిలీప్ వద్దకు వచ్చాడు. రూ.2 లక్షల అడ్వాన్సు కూడా యిచ్చాడు. చాలా నెలల పాటు చర్చలు జరిగాక ‘అబ్బే, యిది వర్కవుట్ కాదు. ‘‘అందాజ్’’లాటి కథతో రండి.’ అని దిలీప్ చెప్పాడు. కర్దార్‌కు కూడా నిజమే ననిపించింది. అప్పటికే కర్దార్ ‘‘ఉదరింగ్ హైట్స్’’ అనే 1847 నాటి ఇంగ్లీషు నవల ఆధారంగా ఒక స్క్రిప్టు పూర్తిగా రాయించుకుని, బైండ్ చేసుకుని పెట్టుకుని వున్నాడు. దానిలో హీరో అయిన హిత్‌క్లిఫ్‌ను పోలిన పాత్రలను దిలీప్ గతంలోనే వేసేశాడు కాబట్టి మళ్లీ వేస్తాడో లేదో అని అనుమానించి యిన్నాళ్లూ చూపలేదు. ఇప్పుడు చూపించాడు.

చార్లెస్ బ్రాంటీ రాసిన ‘‘ఉదరింగ్ హైట్స్’’ను ఒక భయానక ప్రేమగాథగా చెప్పవచ్చు. ఒక జమీందారు ఒక రోజు పట్టణానికి వెళ్లి తిరిగి వస్తూ హిత్‌క్లిఫ్ అనే ఒక అనాథ బాలుణ్ని చూసి జాలిపడి యింటికి తీసుకుని వస్తాడు. చాలా ఆప్యాయంగా పెంచుతాడు. అతనంటే జమీందారు కొడుకు హిండ్లీకి పడదు కానీ కూతురు కాథరిన్‌కు అతనంటే యిష్టం. హిత్‌క్లిఫ్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఇది గ్రహించిన హిండ్లీ మరీ మండిపడతాడు. జమీందారు చనిపోవడంతో హిండ్లీ అతని స్థానంలోకి వచ్చి హిత్‌క్లిఫ్‌ను సేవకుడి కంటె కనాకష్టంగా హింసిస్తాడు. కాథరిన్‌పై ప్రేమతో హిత్‌క్లిఫ్ అన్నీ భరించి, ఎక్కడికీ పారిపోకుండా అక్కడే పడివుంటాడు. పక్కనే వున్న ఎస్టేటు యజమాని కొడుకు ఎడ్గార్‌తో కాథరిన్ పెళ్లి నిశ్చయం చేశాడు హిండ్లీ. అన్నగారిని ఎదిరించలేక ఆమె సరేనంది. ఇది తెలిసి హిత్‌క్లిఫ్ ఎస్టేటు వదిలి పారిపోతాడు. అతను తిరిగి వస్తాడేమోనని కాథరిన్ మూడేళ్లు ఎదురు చూసి, చివరకు ఎడ్గార్‌ను పెళ్లాడుతుంది.

ఆమె పెళ్లయిన ఆర్నెల్లకు హిత్‌క్లిఫ్ తిరిగి వచ్చాడు. ఈసారి ధనవంతుడిగా వచ్చాడు. హిండ్లీ తాగుడుతో పతనమై పోయి వున్నాడు. హిత్‌క్లిఫ్ అతన్ని జూదమాడించి, ఆస్తినంతా తన పేర తాకట్టు పెట్టించుకుంటాడు. ఎడ్గార్‌పై పగ సాధించేందుకు అతని చెల్లెల్ని పెళ్లాడతాడు కానీ సరిగ్గా చూడడు. దాంతో ఆమె వేరే దేశం పారిపోయి కొడుకుని కని చనిపోతుంది. భర్తను ప్రేమించలేక, పగబూనిన ప్రియుడు హిత్‌క్లిఫ్‌ను వారించలేక కాథరిన్ నలిగినలిగి ఒక కూతుర్ని ప్రసవించి, చచ్చిపోతుంది. ఇకపై హిత్‌క్లిఫ్ మరింత రాక్షసుడవుతాడు. రెండు ఎస్టేట్ల కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు. కాథరిన్ సమాధి చుట్టూ తిరుగుతూ, పరలోకంలోనైనా ఆమెను త్వరగా కలుసుకోవాలని తపిస్తాడు. చివరకు తుపానులో చనిపోతాడు.

ఈ కథలో హిత్‌క్లిఫ్ క్రూరత్వంలో, ద్వేషంలో ఒక అర్థం కనబడినా ఆ పిచ్చి ప్రేమ చూసి భయం వేస్తుంది. దిలీప్‌కు కాస్త విలనిక్ టచ్ వున్న పాత్రలు యిష్టం. హిత్‌క్లిఫ్ పాత్ర స్ఫూర్తితో మలిచిన హీరో పాత్రను‘‘ఆర్జూ’’ (1950)లో వేశాడు. దానిలో ఒక పల్లెటూరి మొద్దబ్బాయి బాల్యస్నేహితురాలైన పొరుగున వున్న పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. నువ్వు వొట్టి పనికిమాలినవాడివి, పిల్లనెలా యిస్తాను? అంటాడు ఆమె తండ్రి. ‘‘నగరానికి వెళ్లి డబ్బు సంపాదించి రా, అప్పటిదాకా నేను వేచి వుంటాను.’’ అంటుంది హీరోయిన్. మర్నాడు పొద్దున్నే హీరో ఊరొదిలి వెళ్లి, సైన్యంలో చేరి, కొన్నేళ్లలో మంచి పదవిని అందుకుని వెనక్కి వస్తాడు.

అయితే హీరో వెళ్లడానికి ముందు రాత్రే ఒక ముసలివాడు అతనింటికి వచ్చి ఆశ్రయం పొందుతాడు. హీరో వెళ్లిపోయిన కొద్ది సేపటికే జరిగిన అగ్నిప్రమాదంలో అతను కాలి బూడిద అవుతాడు. ఊరంతా హీరోయే చచ్చిపోయాడనుకుంటారు. హీరోయిన్ యింకెందుకు ఆగడమని తండ్రి చూపించిన ఓ ఠాకూర్‌ను పెళ్లాడుతుంది. తిరిగి వచ్చిన హీరో పగతో పన్నాగం పన్నుతాడు. ఠాకూర్ సోదరిని ప్రేమించినట్లు నటిస్తూ హీరోయిన్ భర్త కుటుంబాన్ని సతాయిస్తాడు. చివరకు హీరో, హీరోయిన్ల గతాన్ని తెలుసుకున్న ఠాకూర్ హీరోని తుపాకీతో కాల్చబోగా హీరోయిన్ అడ్డువచ్చి ప్రాణాలు కోల్పోతుంది. ఈ కథలోని మొదటి భాగాన్ని తీసుకుని తమిళంలో ‘‘రామన్ ఎత్తనై రామనడి’’ (1970) అనే సినిమా వచ్చింది. దానిలో హీరో సినిమాల్లోకి వెళ్లి హీరో అయిపోతాడు. తెలుగులో ‘‘తిండిపోతు రాముడు’’గా డబ్ అయింది. కొన్నాళ్లకు ఎన్టీయార్ హీరోగా ‘‘కథానాయకుని కథ’’ (1975) పేరుతో రీమేక్ చేస్తూ కథ చాలా మార్చారు.

దిలీప్ హీరోగా ‘‘హల్‌చల్’’ (1951) అనే సినిమాను కె. ఆసిఫ్ నిర్మించాడు. దానిలో హీరోను బాల్యంలో ఒక జమీందారు చేరదీస్తాడు. కొడుకుతో సమానంగా పెంచుతాడు. కానీ ఎప్పుడైతే అతను చనిపోయాడో, అతని కొడుకు అధికారంలోకి వచ్చి యితన్ని పనివాడిలా చూస్తాడు. తన చెల్లెలు యితనితో ప్రేమలో పడిందని తెలిసి చావగొడతాడు. హీరోయిన్ లేచిపోదామంటుంది. అయితే హీరో ‘పట్నానికి వెళ్లి డబ్బు సంపాదించి తెచ్చి గౌరవంగా పెళ్లాడతాను’ అంటాడు. సిటీకి వెళితే ఒక కార్నివాల్ నడిపే ఆమెతో పరిచయమౌతుంది. బట్టలకు నిప్పు ముట్టించుకుని మంటల్లోకి దుమికే సాహసాలు చేసే ఆర్టిస్టుగా యితను పనిచేసి, కంపెనీకి పేరు తెస్తాడు. ఆమె యితన్ని ప్రేమిస్తుంది. ఆమెపై కన్నేసిన ఆమె మేనేజరుకి యిది కంటగింపుగా వుంటుంది.

ఓ రోజు కార్నివాలామె తన ప్రేమను వెల్లడించగా, హీరో తన మనసు హీరోయిన్‌కు ఎప్పుడో అర్పించానని చెపుతాడు. చాలా పొజెసివ్ అయిన ఆమె హీరోని చంపి అతని శవాన్ని దూదితో కుక్కి తన దగ్గర పెట్టుకుంటానంటుంది. ఆమె తన కిష్టమైన పక్షులను కూడా అలాగే చేస్తూ వుంటుంది. తుపాకీతో కాల్చమని మేనేజరుకి చెప్తుంది. మేనేజరు కాల్చబోతూండగా, అంతలోనే ఆమె మనసు మార్చుకుని కాల్చవద్దంటుంది. మేనేజరు ఆమెనే కాల్చేస్తాడు. ఆ హత్యానేరం హీరోపై పడి అతను జైలుకి వెళతాడు. ఆ జైలుకి కొత్త జైలరు వచ్చాడు. అతనికి అప్పుడే పెళ్లయింది. మొదటి రాత్రికి సిద్ధమవుతుంటే ఖైదీలు పారిపోతున్నారని తెలిసి జైలుకి వస్తాడు. ఒక ఖైదీ అతన్ని చంపబోతూవుంటే హీరో కాపాడుతాడు. నీ కథేమిటంటే యిదంతా ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్తాడు. తీరా చూస్తే జైలరు భార్య హీరోయినే! హీరో గురించి ఆగకుండా ఆమెకు పెళ్లి చేసేశారు.....

ఈ సినిమాలు వేసేశాడు కాబట్టి మళ్లీ అదే తరహా కథను మెచ్చడనుకుంటూనే కర్దార్ ఆ స్క్రిప్టును దిలీప్ చేతిలో పెట్టాడు. ‘హీరో పాత్రలోని నెగటివిజమ్ తీసేసి, అతనిపై ప్రేక్షకులకు సానుభూతి కలిగేట్లు చేస్తానంటూ దిలీప్ ఆ కథ తన చేతిలోకి తీసుకున్నాడు. ఆర్నెల్ల తర్వాత వెళ్లి కలిస్తే 80 సీన్లు మార్చేశాడు. అప్పటికే నా ఫైనాన్షియర్లతో కమిట్‌ అయిపోయాను కాబట్టి ప్రాజెక్టు కాన్సిల్ చేయలేకపోయాను.’ అని తర్వాతి రోజుల్లో కర్దార్ బాధపడ్డాడు. కొత్తగా రాసిన కథ ప్రకారం హీరో బేలాపూర్ సంస్థానపు వారసుడు. ఒక ఓడ ప్రమాదంలో అతని తలిదండ్రులతో పాటు అందరూ చచ్చిపోయారు. చిన్న పిల్లవాడుగా వున్న యితను మాత్రం బతికాడు. తాతగారు యితని కోసం వేచి చూస్తూనే ఆస్తిపాస్తులు యితని పేర రాసి చచ్చిపోయాడు.

ఓడ ప్రమాదంలో చనిపోయిన కుర్రవాడు శంకర్ని (దిలీప్) ఓ ఠాకూర్ చేరదీశాడు. అతని కొడుకు రమేశ్ (ప్రాణ్) యితనంటే అసూయ. కూతురు రూప (వహీదా) ప్రేమిస్తుంది. పెద్దాయన చనిపోయాక రమేశ్ జమీందారై హీరోని చావగొడుతూంటాడు. ఓ రోజు అతన్ని కొండ చరియ మీద నుంచి కిందకు తోసేసి, చెల్లల్ని సతీశ్ (రహమాన్) అనే ధనవంతుడికి యిచ్చి పెళ్లి నిశ్చయిస్తాడు. తను తార (రాణి) అనే ఉంపుడుగత్తెను వుంచుకుంటాడు. ఆమెపై మోహంతో ఆస్తంతా ఆమెకు రాసి యిచ్చేస్తాడు. శంకర్ బతకడమే కాక, విధివశాత్తూ బేలాపూర్ వెళ్లి వారసుడిగా గుర్తించబడతాడు. ఇప్పుడు ఆస్తిపరుడయ్యాడు కాబట్టి తిరిగి వచ్చి రమేశ్‌ను ఒప్పించి రూపను పెళ్లాడదామనుకుంటాడు. తార తన డబ్బంతా ఊడ్చేసినా, రమేశ్‌కు శంకర్‌పై చిన్నచూపు పోలేదు. రూప నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. ఇక శంకర్ పగబడతాడు. సతీశ్ చెల్లెలు మాల (శ్యామా)ను ప్రేమించినట్లు నటిస్తాడు. వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి సమకడతాడు....

కథ జమీందారీ నేపథ్యంతో సాగుతుంది కాబట్టి, బొంబాయిలో కాకుండా మధ్యప్రదేశ్‌లోని మాండూ రాజభవనంలో షూటింగు పెట్టుకున్నారు. దాంతో ఖర్చులు పెరిగాయి. కర్దార్ అనుభవజ్ఞుడైన దర్శకుడైనా దిలీప్ అతని చేతిలోంచి దర్శకత్వాన్ని లాగేసుకుని తనే డైరక్టు చేయడం మొదలుపెట్టాడు. నటీనటులందరి దగ్గర్నుంచి బెస్ట్ పెర్‌ఫామెన్స్‌లు రాబట్టాడు. ‘దిలీప్ నా చేత చాలా బాగా చేయించాడు. నేనే కాదు, ఏ ఆర్టిస్టు రీటేక్ అడిగినా సరేననేవాడు.’ అని ప్రాణ్ మెచ్చుకున్నాడు. ఇది ఆర్టిస్టులకు బాగానే వుంది కానీ నిర్మాతకు బాగా లేదు. ‘ఓ రోజు సీను తీయడం, మర్నాడు అబ్బే అది బాగా లేదు, మార్చి యివాళ మరోలా తీద్దాం అనేవాడు. ఇలా రీళ్లకు రీళ్లు తీసేస్తూ మొత్తం 4 లక్షల అడుగుల ఫిల్మ్ తీశాడు. ఆ ఫుటేజితో నేను 8 సినిమాలు తీయగలిగేవాణ్ని. దిలీప్ పెర్‌ఫెక్షన్ నా చావుకి వచ్చింది.’ అని కర్దార్ గోలెట్టాడు.

సినిమా నిర్మాణం సాగిసాగి చివరకు 1966లో రిలీజైంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. పాటలు చాలా బాగుంటాయి. దిలీప్ మనసు పడి యీ సినిమాను ఎంతో బాగా చెక్కినా సినిమాలో అంతటి గాఢమైన సీరియస్‌నెస్‌ను ప్రేక్షకులు భరించలేక పోయారు. సినిమా పేరును ప్యారడీ చేస్తూ ‘పైసా దియా, సర్ దర్ద్ (తలనెప్పి) లియా’ అనసాగారు. సినిమా ఘోరంగా ఫ్లాపయింది. కర్దార్ పూర్తిగా మునిగిపోయాడు. దీని తర్వాత తొమ్మిదేళ్లకు ‘‘మేరే సర్తాజ్’’ అనే ఓ చిన్న సినిమా తీసి, అదీ ఆడకపోవడంతో యిక సినీనిర్మాణం ఆపేశాడు. ‘నీ కారణంగానే కర్దార్ నాశనమయ్యాడా?’ అని దిలీప్‌ను అడిగితే ‘అలా అనడానికి లేదు. కర్దార్ మంచి డైరక్టరే కానీ పిసినారితనంతో సినిమాలను పాడుచేయడం మొదలెట్టాడు. మార్కెట్‌కు అనుగుణంగా మారలేక పోయాడు. వరసగా ఆరేడు సినిమాలు ఫ్లాపయ్యాయి. వాటిలో నాదీ ఒకటి.’’ అన్నాడు.  ఈ సినిమా వైఫల్యం దిలీప్‌నూ దెబ్బ తీసింది. 1961-66 మధ్య అతనివి రెండే సినిమాలు వచ్చాయి. ‘‘లీడర్’’. ‘‘దర్ద్..’’ రెండూ ఫెయిలయ్యాయి.

దీని తర్వాత వచ్చిన ఆఫర్ ‘‘రామ్ ఔర్ శ్యామ్’’ (1967)లో కామెడీ, ట్రాజెడీ రెండూ వున్నాయి. దాన్నయినా జాగ్రత్తగా చేసి హిట్ చేయాలనే తపనతో కథను చాలా మార్చాడని ‘‘హిందీ సినీ ముచ్చట్లు’’లో రాశాను. అయితే ఆ ప్రయోగం సఫలమైంది. సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా తీసిన విజయా వాళ్లు, రామానాయుడు లాభపడ్డారు. దీని తర్వాతి ఏడాది వచ్చిన ‘‘అద్మీ’’ (తమిళంలో ‘‘ఆలయమణి’’ తెలుగులో ‘‘గుడిగంటలు’’ రీమేక్) ఓ మాదిరిగా ఆడింది. అదే ఏడాది మహాశ్వేతాదేవి నవల ఆధారంగా వచ్చిన ‘‘సంఘర్ష్’’ భారీగా తీసినా ఘోరంగా ఫ్లాపయింది. తమిళ సినిమా ‘‘మురడన్ ముత్తు’’ (1964) ఆధారంగా తీసిన ‘‘గోపీ’’ (1970) సినిమా ఓ మాదిరిగా ఆడింది. అలా క్రమేపీ దిలీప్ హీరోగా వేసిన సినిమాలు పెద్దగా ఆడడం మానేశాయి. త్రిపాత్రాభినయం వేసిన ‘‘బైరాగ్’’ (1976) తర్వాత ఐదేళ్లపాటు తెరమరుగై ‘‘క్రాంతి’’ (1981) నుంచి కారెక్టరు యాక్టరుగా ముందుకు వచ్చి మళ్లీ రాణించాడు.  

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

mbsprasad@gmail.com

Show comments