చంద్రబాబు...పెదవి విప్పరేమీ?

ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ రంజయిన రాజకీయ నీళ్ల యుద్దం సాగుతోంది. సమస్య ఎంత తీవ్రమైనది అన్నది పక్కన పెట్టి, ఆ సమస్యను వీలయినంత పలుచన చేసే ప్రయత్నాన్ని రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు యధాశక్తి సాగిస్తున్నాయి. అసలు సమస్య ఏమిటి? శ్రీశైలం లో నీటిని విద్యుత్ ప్రాజెక్టుకు తెలంగాణ వాడేసుకుంటోంది. ఇలా వాడుకోవడం వల్ల దిగువన వున్న ఆంధ్రకు, ప్రత్యేకించి ఆంధ్రకు నీళ్లు అందడం లేదు. 

అసలు తెలంగాణ ఎందుకు వాడుకుంటోంది? ఎందుకంటే విభజన ప్రక్రియలో భాగంగా ఆ ప్రాజెక్టు తెలంగాణకు దఖలు పడింది కనుక. కాళేశ్వరం అనే మహాధ్భుతమైన ప్రాజెక్టును తెలంగాణ తలకెత్తకుంది. దానిని బకాసురుడి ఆకలి. ఎంత కరెంటూ చాలదు. అందుకే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ వాడుకోవాలనుకుంటోంది. అలా అయితే తమ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి అంటోంది ఆంధ్ర. 

ఎవరికి వారికి వారి వారి రాష్ట్రాల వాదన సబబే. దీన్ని సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించాల్సివుంది. కానీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. కానీ ఆవేశ కావేషాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. అయితే చిత్రంగా ఎటుపక్కా ఎవ్వరూ సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. 

ప్రభుత్వాల సంగతి అలా వుంచితే  రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఎగువన వుండి, ఇప్పటికే పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్న తెలంగాణలో ప్రతిపక్షాలు ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది. కానీ నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రతిపక్ష జనాలు అలాగే లైట్ తీసుకుంటున్నారు. అక్కరలేని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదంతా జగన్-కేసిఆర్ డ్రామా అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు.

నిజానికి పట్టిసీమ అనే ప్రాజెక్టు టేకప్ చేయకపోయి వుంటే ప్రతిపక్ష తెలుగుదేశం ఇప్పుడు ఇంత నిశ్చింతగా వుండేది కాదు. ఎందుకంటే ఈ వ్యవహారంలో కృష్ణా డెల్టా ముందుగా నష్టపోయేది. అప్పుడు అర్జెంట్ గా ప్రతిపక్ష తెలుగుదేశం రంకెలు వేస్తూ రంగంలోకి దిగేది. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినపుడు ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. 

ఎగువన వున్న తెలంగాణ వల్ల సాగర్ నీటికి ఎప్పటికైనా సమస్యే అని పసిగట్టింది. అందుకే గోదావరి నీటిని పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణ డెల్టాకు తరలించింది. అయితే అలా తరలిస్తే గోదావరి జనాలు ఎక్కడ అలజడి చేస్తారో అని రాయలసీమ కరువు, అయ్యో పాపం అనే కార్డు వాడింది. 

పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణ డెల్టాకు వెళ్తే శ్రీశైలం-సాగర్ నీళ్లు రాయలసీమకు వెళ్లిపోతాయని నమ్మబలికింది. పైగా గోదావరి జనాలు రెచ్చిపోకుండా బాబుగారి అనుకుల మీడియా వీలయినంత కాపుకాసింది.

ఇప్పుడేమయింది. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు తెచ్చుకుని కృష్ణా డెల్టా హ్యాపీగా వుంది. అక్కడి రైతులు బానే వున్నారు. కానీ మిగులు నీళ్లు వస్తాయి,  సీమకు వెళ్తాయి అనుకుంటే అది కాస్తా వికటించింది. బాబుగారు నిమ్మకు నీరెత్తినట్లు సైలంట్ గా వుండిపోయారు.

గతంలో మహరాష్ట్రకు వెళ్లి, అక్కడ నీళ్ల కోసం యుద్దం చేసి, అరెస్ట్ అయి నానా హడావుడి చేసిన బాబుగారు ఇప్పుడు చేష్టలుడిగినట్లు వుండిపోయారు. అప్పుడూ  ప్రతిపక్షంలో వున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నారు. మరి ఎందుకు పోరు బాట పట్టరు?  పైగా తెలంగాణలో పార్టీ వుంది. దానికి ఓటర్లు దూరం అయిపోతారు అన్న భయం కూడా లేదు. 

తెలంగాణలో పార్టీ ఆల్ మోస్ట్ ఖాళీ అయింది. మిగిలింది పార్టీ భవనం ఒక్కటే. దాన్ని కాపాడుకోవడం కోసమేనా? బాబుగారు మౌనంగా వుంటున్నంది. దాని జోలికి, తన జోలికి కేసిఆర్ రాకుండా వుండాలనేనా తాను , తన చినబాబు మాట్లాడకుండా వుండిపోయింది. 

పార్టీ జనాలు అర్థం లేని స్టేట్ మెంట్ లు ఇస్తూ, ఇస్యూని పలుచన చేస్తుంటే, అన్యాయం అయిపోతున్నది కృష్ణ డెల్టా కాదు, సీమ జనాలు కదా, వాళ్లు ఎలాగూ తమకు పెద్దగా ఓట్లేయలేదు. వేస్తారన్న నమ్మకం లేదు. అనేనా తెలుగుదేశం పార్టీ కానీ దాని అధినేత కానీ నీళ్ల యుద్దంలో తమ వంతు పాత్ర పోషించకుండా అస్త్రశస్త్రాలు కిందపడేసి, జూమ్ మీటింగ్ లు,  ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నది?

కానీ చంద్రబాబు గ్రహించాల్సింది  ఏమిటంటే, జనాలు తను ఏ మేరకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారన్నది గమనిస్తారని. కానీ ఆయనే తన వ్యవహార శైలి ఏ మేరకు వారికి  నచ్చుతోందన్నది గమనించడం లేదు. దీనివల్ల నీళ్ల యుద్దంలో ఏమాత్రం విజయం సాధించినా అది రూపాయికి రూపాయి జగన్ ఖాతాలో పడిపోతుంది తప్ప, బాబుగారికి పైసా కూడా అంటదు. సీమ జనాల దృష్టిలో బాబుగారు మరింత నెగిటివ్ అయిపోవడం ఖాయం.

ఆర్వీ

Show comments