'జగమే తందిరం' రివ్యూ: కష్టం

చిత్రం: జగమే తందిరం
నటీనటులు: ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, జేంస్ కాస్మోస్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
కెమెరా: శ్రేయాస్ కృష్ణ
నిర్మాత: శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్
విడుదల తేదీ: 18 జూన్ 2021
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలవుతున్న పెద్ద సినిమాల జాబితాలోకి "జగమే తందిరం" కూడా చేరింది. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళ హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులోకి కూడా డబ్ చేసి విడుదల చేసారు. ఈ భాషలకు చెందని వారికి వెసులుబాటు కల్పించేలా అన్ని ఓటీటీ చిత్రాల్లాగానే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలాగో ఉన్నాయి.

2012 లో ఓపెన్ చేసిన ఈ కథకి నేపథ్యం ఎల్.టీ.టీ.ఈ అంతిమ దినాల్లోని శ్రీలంక తమిళుల కష్టాలు. శరణార్థులుగా వాళ్లు పడిన అగచాట్లు, బాధలు ఈ కథకి మూలం.

అయితే లండన్లో శివదాస్ అనే ఒక తమిళ డాన్ ఉంటాడు. అతడి ప్రత్యర్థి తెల్లవాడైన గ్యాంగ్స్టర్ పీటర్. ఆ దేశంలో వేరు వేరు దేశాల నుంచి వచ్చే వలస కార్మికులకి అండనా, రేసిజం కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతుంటుంది. కానీ పీటర్ రేసిస్టు. రేసిజం ని తెర వెనుకనుంచి పెంచి పోషించే రాజకీయ నాయకులు పీటర్ ని పరోక్షంగా ప్రోత్సహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జరిగే హింసాకాండలో పీటర్ తన ప్రత్యర్థి శివదాస్ ని ఎదుర్కొనడంలో పడే కష్టాలని అధిగమించడానికి ఒక పన్నాగం పన్నుతాడు.

మదురై లో ఉండే సురుళి (ధనుష్) అనే లోకల్ డాన్ దగ్గరకి ఒక తమిళుడిని పంపుతాడు పీటర్. అతనొక ప్రొపోజల్ పెడతాడు. నెల రోజులు లండన్ వచ్చి పీటర్ తో పని చెయ్యాలి. తన తమిళ ప్రత్యర్థిని పడగొట్టాలి. పని అయిపోయాక తిరిగి ఇండియా వెళ్లిపోవచ్చు. ఈ పనికి వారానికి 2 లక్షల పౌండ్లు బేరం కుదుర్చుకుంటాడు సురుళి. మొత్తానికి లండన్లో దిగుతాడు. కన్సల్టెంట్ దాదా ఉద్యోగం మొదలుపెడతాడు.

అక్కడ తనకొక తమిళమ్మాయి పరిచయం అవుతుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కానీ తానే ఒక కారణం వల్ల ఇతనిని మట్టుబెట్టాలనుకుంటుంది. కారణాలు చెప్పి సస్పెన్స్ లీక్ చేయదలచుకోలేదు.

ఇంతకీ సురుళి తమిళవాడయ్యుండి తెల్లవాడితో పని చేసి తమిళవాడినే చంపుతాడా? లేక మరో రకంగా ప్లేటు తిప్పుతాడా? లేక రెండూ చేస్తాడా? ఇవేమీ కాకుండా మరో విధంగా కథ మలుపు తిరుగుతుందా? తెలుసుకోవాలంటే రెండున్నర గంటలు దీనికి కేటాయించి చూడాలి.

తమిళులు మనోభావాలు, ప్రాంతీయాభిమానం, శరణార్ధుల మానవ హక్కులు మొదలైన అంశాలని టచ్ చేస్తూ ఒక మాస్ యాక్షన్ చిత్రంగా దీనిని తెరకెక్కించారు.

అయితే ఇలాంటివి థియేటర్స్ లో ఫ్యాన్స్ మధ్య బాగానే ఉండొచ్చేమో కానీ ఓటీటీలో సీరియస్ గా, ప్రాక్టికల్ గా, నేచురల్ గా అనిపించాలి. ప్రస్తుతం స్ట్రీం అవుతున్న "ఫ్యామిలీ మ్యాన్" సిరీస్ ఈ విషయంలో ఒక బెంచ్ మార్క్.

"జగమే తందిరం" కథ పరంగా స్పాన్ బాగానే ఉందనిపించినా, చాలా మొమెంట్స్ కృతకంగా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా తాజాగా ఎల్.టీ.టీ.ఈ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ చూసాక "రాజుని చూసి మొగుడిని మొత్తబుద్ధయ్యింది" అనే సామెత గుర్తొస్తుంది.

సురుళిగా ధనుష్ సగటు మాస్ హీరోగా న్యాయం చేసాడు. అక్కడక్కడా తన మామగారిని ఇమిటేట్ చేస్తున్నట్టుగా కూడా అనిపించాడు. అత్తిల పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కూడా తన పాత్ర వరకు ఎమోషన్స్ బానే పండించింది.

గేం ఆఫ్ థ్రోన్స్ లో కనిపించిన జేంస్ కాస్మోస్ ఇందులో పీటర్ పాత్రలో చేయాసినంత పర్ఫామెన్స్ చెయ్యలేదనిపించింది. అతనిలో క్రుయాల్టీని చూపించే ప్రయత్నం కూడా దర్శకుడు పెద్దగా చెయ్యలేదు.

ఈ మధ్యనే వచ్చిన మలయాళ చిత్రం "నాయట్టు"లో మెరిసిన జోజు జార్జ్ ప్రధానపాత్ర శివదాస్ గా ఉన్నంతలో నిండుగా కనిపించాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం, సంతోష్ నారాయణ్ సంగీతం కూడా తమదైన శైలిలో ఉన్నాయి. ఆ స్టైల్ నచ్చే వారికి బాగానే ఉంటుంది.

ఇది సీరియస్ కథతో సాగే యాక్షన్ డ్రామా అయినప్పటికీ ఉన్నంతలో కామెడీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ప్రధానమైన మైనస్ ఏంటంటే నిడివి. రెండున్నర గంటలు చాలా ఎక్కువనిపిస్తుంది.

అంచనాలకు, హైప్ కి తగ్గట్టుగా లేదు ఈ సినిమా. ఈ సినిమాకి పాటలు పెద్ద అడ్డంకి. అవొచ్చినప్పుడల్లా స్కిప్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మరింత భారమయ్యేది.

మెదడుని కదిలిస్తుంది తప్ప మనసుకు పెద్దగా హత్తుకోని విధంగా ఉన్న ఈ సినిమా సమయముండి చూడాలనుకుంటే చూడొచ్చు.

బాటం లైన్: కష్టం

Show comments