ఈసారి సుజానా చౌదరిని ఆదుకునేది ఎవరు?

ప్రజా బలం లేకపోయినా ధనబలంతో రాజకీయాల్లో బాగానే నెట్టుకొస్తున్నారు సుజనా చౌదరి. టీడీపీ హయంలోనే 2 సార్లు రాజ్యసభకు వెళ్లారు. కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించారు. 

ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ అనుభవిస్తున్న ఎంపీ పదవి మాత్రం టీడీపీ పెట్టిన భిక్షే. అందుకే ఆయన చంద్రబాబుని ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు, అనరు కూడా. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ఇప్పటివరకు టీడీపీ ఆదుకుంది.. ఇప్పుడు బీజేపీ ఆదుకుంటుందా? మరోసారి సుజనాకు రాజ్యసభ పదవి ఆఫర్ చేస్తుందా?

పదవి లేకపోతే కష్టమే..

ఆల్రెడీ సుజనా చౌదరిపై అవినీతి ఆరోపణలున్నాయి. డొల్ల కంపెనీలతో వ్యవహారాన్ని మేనేజ్ చేసి వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీల్ లిమిటెడ్ సంస్థ తీసుకున్న అప్పుకి, ఆయన పేరుతోనే ఉన్న మరికొన్ని కంపెనీలు గ్యారెంటీ ఇచ్చాయి. 

అప్పు తీర్చలేదని ఓ దశలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సుజనా ఆస్తుల్ని వేలానికి పెట్టింది కూడా. గతంలో ఆయనపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కోర్టులతో ఈ ఆరోపణలను ఎదుర్కొని, తాత్కాలిక ఉపశమనం పొందారు సుజనా చౌదరి. అధికార పార్టీలో, అందులోనూ పదవిలో లేకపోతే ఆ సమస్యలన్నీ మళ్లీ చుట్టుముడతాయి. అంటే... కచ్చితంగా సుజనాకు మరో దఫా రాజ్యసభ సీటు అత్యవసరం.

అంబానీ, అదానీ బాటలోనే..

పార్టీకి పుష్కలంగా ఆర్థిక అండదండలు అందించే ఇలాంటి వ్యాపార రాజకీయ వేత్తలను బీజేపీ అసలు వదిలిపెట్టదు. సుజనా పెద్ద లాబీయిస్ట్ కూడా కాబట్టి.. బీజేపీ కి ఆయన అవసరం కూడా ఉంది. 

టీడీపీ-బీజేపీకి మధ్య తెరవెనక వారధిగా కూడా సుజనా చౌదరి పనిచేస్తారు కాబట్టి, ఎప్పటికైనా ఆయన అవసరం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. అంటే కచ్చితంగా సుజనాకు మరోసారి ఎంపీ సీటు దక్కే అవకాశం ఉందని అంచనా వేయొచ్చు.

పదవి దక్కకపోతే..?

ఒకవేళ సుజనా చౌదరికి పదవి దక్కకపోతే మాత్రం ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే. ఆపదలో ఆదుకోడానికి టీడీపీ కూడా సిద్ధంగా లేదు. కొడుకు పరిస్థితే తెలియక చంద్రబాబు సతమతం అవుతున్నారు, అసెంబ్లీ సీట్ల లెక్క ప్రకారం టీడీపీకి రాజ్యసభ సీటు దొరికే అవకాశమే లేదు. అయితే చంద్రబాబు తన తెలివితేటల్ని, పాత పరిచయాల్ని ఉపయోగించి.. ఇతర రాష్ట్రాలనుంచైనా సుజనాని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.

ఒకవేళ బాబుతో పాటు బీజేపీ హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటనేదానిపై ఇప్పటినుంచే సుజనా కూడా దీర్ఘాలోచనలో మునిగిపోయారు. మొత్తమ్మీద.. అప్పట్లో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీల భవిష్యత్ ఏంటి? వారి జంపింగ్ వెనక ఎవరున్నారనే విషయం.. సుజనా పదవీకాలం ముగిసే సమయానికి తేలిపోతుంది. 

Show comments