బాబుకి కావాల్సింది పవన్.. బీజేపీ కాదు..!

ఏపీలో టీడీపీ సోలో పర్ఫామెన్స్ కి అవకాశం లేదని చంద్రబాబుకి 2019 ఎన్నికలతో బాగా తెలిసొచ్చింది. గతంలో ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ సంకీర్ణాలతో నెట్టుకొచ్చిన చంద్రబాబు.. 2019లో సోలోగా పోటీకి దిగి చరిత్రలో ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 

అప్పటినుంచి బాబు మళ్లీ ప్రతిపక్షాలను కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమధ్య మహానాడులో కూడా ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వంపై పోరాటం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే.. బీజేపీ ఆ స్టేట్ మెంట్ పై మండిపడింది.

బాబుతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, ఏపీలో అసలైన ప్రతిపక్షం తామేనంటూ వివరణ ఇచ్చుకున్నారు బీజేపీ నేతలు. ఎక్కడ బాబు తమని కలిపేసుకుంటారోనని టెన్షన్ పడ్డారు. అయితే ఈ ఎపిసోడ్ లో జనసేన కానీ, జనసేనాని కానీ ఎక్కడా నోరు మెదపకపోవడం విచిత్రం. 

ప్రతిపక్షాలతో కలసి పనిచేస్తామని చంద్రబాబు చెప్పగానే బీజేపీ ఎక్కువ రియాక్ట్ అయింది కానీ జనసేన అసలు స్పందించ లేదు. వాస్తవానికి బీజేపీ-జనసేన రెండూ ఒకటే అన్నట్టుగా ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబుతో స్నేహం అనే విషయానికొస్తే బీజేపీ వెనకడుగేస్తోంది జనసేన మౌనం వహిస్తోంది.

చంద్రబాబుకి కావాల్సింది కూడా ఇదే. బాబుకి బీజేపీతో చెలిమి అక్కర్లేదు, కేవలం ఆయనకు పవన్ కల్యాణే కావాలి. ఆయన కటౌట్ అడ్డు పెట్టుకుని ఏపీలో రాజకీయం చేయాలి, అధికారం చేజిక్కించుకోవాలి. ఇదే ఆయన మాస్టర్ ప్లాన్.

2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం అనే తప్పుడు అంచనాతో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. తనకి తానే మెల్లగా ఆ పార్టీకి దూరం జరిగి.. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసి ఏపీలో ప్రచారం చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. అయితే ఇప్పుడీ పరిస్థితిలో మళ్లీ మార్పొచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 

సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్లు టైమ్ ఉంది కానీ.. ఇప్పటినుంచే ఆ పార్టీ జాగ్రత్తపడుతోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలు మోదీని బలంగా ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో... ఏపీలో బీజేపీతో పొత్తు ఏ పార్టీకైనా నష్టమే.

సో.. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏపీలో బావుకునేదేం ఉండదు. బీజేపీ వ్యతిరేకత తనకి అంటించుకోకుండా చూసుకోవడం ఒక్కటే ఆయన ముందున్న ఏకైక మార్గం. దీంతో బీజేపీ-జనసేనని విడగొట్టి పవన్ ని తనవైపు తిప్పుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయో లేదో చూడాలి.

Show comments