చంద్రబాబు తొందర.. అటుచూస్తే పార్టీ చిందరవందర

జమిలి జమిలి అంటూ ఆ మధ్య తెగ కుమిలిపోయారు చంద్రబాబు. వస్తున్నాయొస్తున్నాయ్.. ఎన్నికలొస్తున్నాయంటూ, ఏడాదిన్నరలో మనదే రాజ్యం అంటూ ఊదరగొట్టారు, టీడీపీ శ్రేణులకు ఊపిరిలూదే ప్రయత్నం చేశారు. తీరా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులే దొరక్క అవస్థలు పడ్డారు. 

తొందరపడి ముందే కూసిన కోయిల లాగా అన్ని విషయాల్లోనూ తొందర పడుతున్న చంద్రబాబు, 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే ''నిరసన వారం'' అంటూ సమర శంఖం పూరించడానికి రెడీ అయ్యారు.

ఎందుకీ నిరసన.. ఎవరిపై నిరసన...!

కరోనా కష్టకాలంలో పేదల్ని ఆదుకోలేదని టీడీపీ ఈనెల 16 నుంచి 22 వరకు నిరసన వారం చేపట్టింది. వారం రోజులపాటు గ్రామాల్లో నిరసనలు, తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ ఆఫీస్ లు, కలెక్టరేట్ ల వద్ద వినతిపత్రాలివ్వడం, చివరిగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలకు దిగడం ఇదీ ఈ నిరసన వారం షెడ్యూల్. కార్యక్రమం బాగుంది కానీ, అసలీ సమయంలో ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ఎవరొస్తారనేదే అసలు ప్రశ్న.

ఈమధ్యే అన్నదాతలకు రైతు భరోసా నిధులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. జగనన్న తోడు కార్యక్రమం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలిప్పించారు. అంతకు ముందే మహిళలకు సున్నా వడ్డీ రుణాలిచ్చారు. తాజాగా వాహన మిత్ర పేరుతో ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ నెలాఖరులో మహిళలకు జగనన్న చేయూత రావాల్సి ఉంది. ఇన్ని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే.. ఇక ప్రజలు నిరసన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటారు? ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు.

కనీసం బాబు, లోకేష్ వస్తారా?

పోనీ పచ్చ చొక్కాలతోనే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలనుకుంటున్నారా..? కనీసం జనంలోకి రావడానికే భయపడిపోయి మహానాడు సహా అన్నిట్నీ హైదరాబాద్ నుంచి జూమ్ లోనే నడిపించేస్తున్న చంద్రబాబు, లోకేష్.. ఈ నిరసన వారంలో పాల్గొంటారా..? అనేవే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్ని వేధిస్తున్న ప్రశ్నలు.

అదిగో ఇదిగో అంటే రెండేళ్లు గడిచిపోయాయి, మరో మూడేళ్లలో ఎన్నికలొస్తాయి, అప్పుడు విజయం మనదేనంటూ ఇటీవలే చంద్రబాబు ఓ అమాయక స్టేట్ మెంట్ ఇచ్చారు. అసలు రాష్ట్రంలో వైసీపీపై అంత వ్యతిరేకత ఉందా, టీడీపీ రావాలని, చంద్రబాబు పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారా..? వీటిపై క్లారిటీ లేకుండానే చంద్రబాబు, విజయం మాదేనంటూ జబ్బలు చరుచుకుంటున్నారు, ఇప్పటినుంచే నిరసన కార్యక్రమాలంటూ హడావిడి చేస్తున్నారు.

చూస్తుంటే ఇది మేకపోతు గాంభీర్యం కాదు, అంతకు మించి అన్నట్టుంది. ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్కరే చేజారుతున్న వేళ, ముందు పార్టీ సంగతి పట్టించుకోకుండా, అధికారంలోకి వచ్చేస్తామని స్టేట్ మెంట్లివ్వడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. 

Show comments