ఎమ్బీయస్ : వాక్సిన్ కొరత

మనదేశంలో చాలావాటికి కొరత వుంది కానీ ప్రస్తుతం అందర్నీ బాధిస్తున్నది కోవిడ్ వాక్సిన్ కొరత. అది ఎందుకు ఎలా వచ్చింది అనేదాని గురించి యీ వ్యాసం. ఈ కొరతకు నాకు ఎనిమిది రకాల కారణాలు కనబడుతున్నాయి. 1) వాక్సిన్ సంకోచం 2) వాక్సిన్లు ముందుగా బుక్ చేయకపోవడం 3) స్వదేశంలో తయారయ్యే వాక్సిన్లకు ఫండింగ్ చేయకపోవడం 4) విదేశీ వాక్సిన్లను అనుమతించక పోవడం 5) మన దగ్గర తయారైన వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం 6) వాక్సిన్ ధరల పాలసీ 7) వాక్సిన్ పంపిణీలో వ్యత్యాసం 8) ఆరోగ్యవసతుల లేమి కారణంగా వాక్సిన్‌కు అనూహ్యమైన డిమాండ్ రావడం. నేను ఒక్కో పాయింటు గురించి రాస్తూ పోతాను. ఇటీవల ప్రభుత్వాన్ని తిట్టడానికి చాలామంది అతిశయోక్తులను, కవితా ధోరణిని ఆశ్రయిస్తున్నారు. నేను వాటి జోలికి పోకుండా జరిగినదేమిటో రాస్తున్నాను. తప్పులుంటే ఎత్తి చూపండి. దీనిలో కరోనా కేసులు, చావుల గురించి గణాంకాలుండవు. టీవీలు అడలగొడుతున్నది చాలు.

ఈ సమీక్ష ఎందుకంటే, దురదృష్టవశాత్తూ యిటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎదురైతే అప్పటి ప్రభుత్వాలు యీ పొరపాట్లు జరగకుండా చూసుకునే వీలుంటుంది. విషయంలోకి వెళ్లబోయే ముందు చెప్పవలసిన అంశం ఒకటుంది. ఇంతకీ మీరు వాక్సిన్ వేయించుకున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నేను సమాధానం చెప్పినా అది మీకు పనికి రాదు. వైద్యచికిత్సలో డాక్టర్లు పదేపదే ఒకటే చెప్తారు – ఈచ్ ఇండివిడ్యువల్ యీజ్ డిఫరెంట్ అని. ‘నేను తాగను, అయినా లివర్ చెడిపోయింది, వాడు తెగ తాగుతాడు, వాడికి ఏం కాలేదెందుకని?’ అంటే డాక్టరు దగ్గర యీ సమాధానమే వుంటుంది. నా ఆహారపు అలవాట్లు, జీవనసరళి, జీన్స్, ప్రస్తుతం వున్న అనారోగ్యం, వయసు, వాడే మందులు, నివాసముండే యింటి వైశాల్యం, పరిసరాలు, ఇంటి సభ్యుల సంఖ్య, చేసే వృత్తి, మానసిక సంతులత – యిలా ఎన్నో పరిగణించి నాకు మందు కానీ వాక్సిన్ కానీ యిస్తారు.

అవేమీ చూడకుండా అందరికీ ఒకటే మందు అనుకుంటే మెడికల్ షాపతనే చాలు, డాక్టరు వద్దకు ఎవరూ వెళ్లనక్కరలేదు. కరోనా విషయానికి వస్తే నాకు కరోనా రిస్కు ఎంత, వాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్‌ రిస్కు ఎంత అనేది బేరీజు వేసుకుని మరీ నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే యిది పోలియో, బిసిజి వంటి నిర్ధారిత వాక్సిన్ కాదు. ఇంకా పరిణామక్రమంలో వున్న వాక్సిన్. కోవిడ్ సబ్‌కమిటీ ఆఫ్ నేషనల్ టెక్నికల్ ఎడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చైర్మన్ డా. ఎన్‌కె అరోడా ‘‘వీక్’’ (ఏప్రిల్ 25)తో మాట్లాడుతూ ‘‘వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ వాక్సిన్ పోలియో, స్మాల్‌పాక్స్ వాక్సిన్‌ల వంటిది కాదు. ఇది ఏ వేవ్‌నూ నిరోధించలేదు. వ్యాధి సోకినవారికి తీవ్రతను మాత్రం తగ్గించగలదంతే.’ అని స్పష్టం చేశారు.

వాక్సిన్ విషయంలో రెండు డోసుల మధ్య వ్యవధి దగ్గర్నుంచి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్‌లైన్స్ మారుస్తోంది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 వారాలుంటే మంచిదని కంపెనీ చెపుతూంటే అరోడా 16 వారాలుంటే మంచిదంటున్నారు. కోవాక్సిన్ విషయంలో వ్యవధి 4 వారాలని యిన్నాళ్లూ చెప్పారు. ఇవాళే భారత్ ప్రతినిథి ఆరువారాలుంటే మంచిది అని చెప్పారు. ఇక ప్రభుత్వం కరోనా వచ్చి తగ్గిన మూడు నెలలకు కానీ వాక్సిన్ వేయించుకోవద్దని మొన్న చెప్పింది. (అరోడా గారు ఆరు నెలల తర్వాత అయితే బెటరు అంటున్నారు). ఇప్పటిదాకా యిలా చెప్పలేదు. వాక్సిన్ లభ్యత బట్టి యీ పెరామీటర్స్ మారిపోతున్నాయేమో తెలియదు.

అందువలన యీ పరిస్థితుల్లో ఎవరి నిర్ణయం వారిదే. పక్కవాళ్ల పేపర్లో చూసి కాపీ కొడదామంటే లాభం లేదు. నా సంగతి చెప్పినా అది మీకు అన్వయించదు. చెపితే కొందరు ఏం చేయగలరో ఊహించడానికి చిన్నపుడు విన్న ఓ కథ చెప్తాను – ఒకాయన భార్యతో ‘గారెలు వేయడం రాదంటావు, పక్కింటావిడను చూసి అలాగే వేయవచ్చుగా’ అన్నాడట. మర్నాడు చూసేసరికి భార్య గుండు గీయించుకుని, పప్పు రుబ్బుతోంది. అదేమిటంటే, ఆవిడకు గుండుంది కదా అంది భార్య. ‘ఆవిడ తిరుపతి వెళ్లి గుండు చేయించుకుంది, నీకేం పోయేకాలం? అయినా గుండుకీ, గారెలకూ సంబంధం ఏమిటి?’ అంటూ యితను లబలబ లాడాడట! అలా వుంటుంది కాపీ కొడితే! నేను సేకరించిన సమాచారం మీ ముందు వుంచాను. మీ విజ్ఞత ఉపయోగించి, నిర్ణయం తీసుకోండి. నా విషయాన్ని నాకు వదిలిపెట్టండి.

ఇక విషయంలోకి వస్తే – 1) టీకా సంకోచం (ఇంగ్లీషులో వాక్సిన్ హెజిటన్సీ అంటున్నారు) గురించి - వాక్సిన్‌లకు యింత కొరత ఎందుకు వచ్చింది? ఇంత డిమాండు వుంటుందని ఎవరూ అనుకోలేదు కాబట్టి! ఎందుకలా అంటే జనవరిలో వాక్సినేషన్ మొదలుపెట్టినపుడు ఆదరణ లేదు కాబట్టి! డాక్టర్లు, వైద్య సిబ్బంది టీకాపై ఆసక్తి చూపలేదు. (‘‘ఔట్‌లుక్’’ ఏప్రిల్ 12 సంచిక ప్రకారం దేశం మొత్తం మీద 52% మంది హెల్త్‌కేర్ వర్కర్లు మాత్రమే రెండు డోసులు తీసుకున్నారు). నాయకులు ఎవరూ వేయించుకోలేదు. ప్రధాని నుంచి సాధారణ ఎమ్మెల్యే దాకా వేయించుకున్నా పదివేల డోసులయ్యేవి. కోట్లాది డోసులు లభ్యమౌతున్నపుడు ఆ పదివేలు వారికి కేటాయించి వుంటే, డాక్టర్లకు నమ్మకం కుదిరేదేమో.

అది జరగలేదు. దాంతో సాధారణ ప్రజలు పెదవి విరిచారు. వాళ్ల వంతు వచ్చినపుడు పెద్దగా వేయించుకోరని ప్రభుత్వం అనుకుంది. లేకపోతే యిప్పుడు తీసుకుంటున్న చర్యలు (దేశంలోని వాక్సిన్ కంపెనీలకు ఋణాలు యివ్వడాలు, విదేశీ వాటికి అనుమతులు యివ్వడాలు, తగినన్ని టీకాలు బుక్ చేయడాలు వగైరా) జనవరిలోనే చేసి వుండేది. దానికి తగ్గట్టే డాక్టర్ల తర్వాత 60 ప్లస్ వాళ్లకు అవకాశం యిచ్చినపుడు స్పందన అంతంత మాత్రంగానే వుంది. ఎందువలన? వాక్సిన్ నాణ్యత పట్ల ప్రజలకు నమ్మకం చిక్కకపోవడం చేత! నా జనవరి 5 నాటి ‘‘తొందరెందుకు సుందర‘వర్ధనా’? అనే వ్యాసంలో నేను వెలిబుచ్చిన సందేహాలు నిజమయ్యాయని తోస్తోంది.

టీకా 2021 జూన్ నాటికి తయారయ్యే అవకాశం వుందని 2020 నవంబరులో భారత్ బయోటెక్ ప్రకటించింది. అలాటిది ఐదు నెలల ముందే, 2021 జనవరి కల్లా తెచ్చి చేతిలో పెడితే యిదేదో ప్రిమెచ్యూర్ బేబీ, పూర్తిగా తయారుకాని వంటకం అని డాక్టర్లు, ప్రజలు అనుకోవడంలో ఆశ్చర్యమేముంది? వేసుకుంటే ఏమవుతుందోనని భయపడడంలో వింతేముంది? అసలే మన దేశంలో ఎడల్ట్ వాక్సిన్లు సాధ్యమైనంత వరకూ వేయించుకోరు. టీకాలనేవి పిల్లలకే అని మన మనసులో గట్టిగా నాటుకుపోయింది. అలాటిది యీ డేటా ఏదీ లేకుండానే ఎమర్జన్సీ పద్ధతిలో అనుమతి యిచ్చేసిన కొత్త వాక్సిన్‌ను చూసి బెరుకుతో ప్రజలు ముందుకు రాలేదు. నిజానికి సెకండ్ వేవ్ యింత తీవ్రంగా రాకపోతే జనాలు వాక్సిన్‌ల కోసం క్యూ కట్టేవారు కారు. ఇలా వచ్చేదాకా డిమాండు లేకపోవడం చేతనే, చేసిన వాక్సిన్‌లు వేస్టవుతాయని ప్రభుత్వం ఎగుమతి చేయించిందనే అంశం కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి.

వాక్సినేషన్ మొదలుపెట్టినపుడు తగినంతమంది జనాలు ముందుకు రాకపోవడం చేత అనేక ‌డోసులు వృథా అయ్యాయి. ఎందుకంటే మల్టిపుల్ డోసుల వాక్సిన్ వయల్ ఒకసారి తెరిచిన తర్వాత కొన్ని గంటల పాటే వుంటుంది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ రాజీవ్ రంజన్ చెప్పారు (‘‘వీక్’’ మే 9) – ‘వాక్సినేషన్ సెంటర్ల వద్దకు ఐదారుగురే వచ్చేవారు. అదీ సాయంత్రమెప్పుడో! ‘మీ కోసం కొత్తది తెరిస్తే తక్కినవి వృథా అవుతాయనలేం కదా, వచ్చినవాళ్లకు వెయ్యకపోతే వాళ్లు నిరాశపడతారు. అందుకని కొత్తది తెరిచి వేసేవాళ్లం. తక్కినవి వేస్టయ్యేవి. పైగా వీటిని 2-8 డిగ్రీల మధ్య భద్రపరచడం ఒక సమస్య’. అని. ఈ కారణంగా జనవరి 16-ఏప్రిల్ 20 మధ్య తమిళనాడులో 4.50 లక్షల డోసులు వృథా అయ్యాయి. అంటే 12% అన్నమాట. ఏప్రిల్ 11 వరకు మొత్తం దేశంలో 44 లక్షల డోసులు వృథా అయ్యాయని ఆర్‌టిఐ ప్రశ్న ద్వారా తెలిసింది.

ఇక్కడ యింకో విషయం కూడా నేను గమనించాను. 60 ఏళ్లు దాటినవారు తాము వాక్సిన్ వేయించుకుంటూ, సిబ్బందిని మొహమాట పెట్టి, ఎలిజిబిలిటీ లేని తమ పిల్లలకు కూడా వేయించడం జరిగింది. అవన్నీ వేస్టయినట్లు ఆ సిబ్బంది చూపుతూ వుండవచ్చు. అందువలన ఏ మేరకు వృథా అయ్యేయి అన్నది సరిగ్గా చెప్పలేం. మే 13 నాటి ‘‘హిందూ’’ ప్రకారం, మే 11 నాటికి అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చిన మొత్తం డోసులు 18 కోట్లు. 18 ఏళ్లు పైబడినవారిలో 19% మందికి సింగిల్ డోసు యివ్వడానికి మాత్రమే అది సరిపోతుంది. అందువలన 4% మందికి మాత్రమే రెండు డోసులు వేయడం జరిగింది. ఈ కారణం చేత కొన్ని రాష్ట్రాలు 18-45 వాళ్లకు యిప్పుడే టీకా యివ్వం అంటున్నాయి. ఒక మంచి సంకేతం ఏమిటంటే డిమాండు పెరగడం వలన వృథా తగ్గి, 25 రాష్ట్రాలలో 85% వరకు ఉపయోగించుకో గలిగారు.

కరోనా భయం తొలగిపోయిందని ప్రభుత్వం ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని చెప్పకతప్పదు. మార్చి 7న హర్షవర్ధన్ దిల్లీ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మాట్లాడుతూ ‘ఇండియా ఈజ్ ఇన్ ద ఎండ్‌గేమ్ ఆఫ్ ద పాండెమిక్’ (మహమ్మారి అంత్యఘట్టంలో వుంది) అని ప్రకటించారు. మన మందులు గొప్పవి, వాక్సిన్‌లు గొప్పవి అని చెప్పారు. ఏప్రిల్ 16న ఎయిమ్స్ పనితీరును సమీక్షిస్తూ ‘‘కరోనా వైరస్ గురించి ఏమీ తెలియనప్పుడే అద్భుతంగా దాన్ని హేండిల్ చేశాం. ఇప్పుడు దాని గుట్టుమట్లు తెలిసిపోయాయి కాబట్టి, యికపై సులభప్రయాణమే’’ అన్నారు. వీటన్నిటివల్లా ప్రజల్లో యుద్ధం జయించేసిన ఫీలింగు వచ్చేసి, నిర్భయంగా తిరిగి, సెకండ్ వేవ్ వ్యాప్తికి కారకులయ్యారు. స్వయంగా డాక్టరు, అన్నీ తెలిసున్న హర్షవర్ధన్ అలా ఎందుకు చెప్పారాని ఆలోచిస్తే, ఎన్నికలు, కుంభమేళా వగైరాలు నిర్వహించాలని ఆయన పార్టీ నిర్ణయించింది కాబట్టి, దానికి సమర్థింపుగా యిలా చెప్పివుండవచ్చు అనుకోవాలి.

2) వాక్సిన్లు ముందుగా బుక్ చేయకపోవడం- ‘‘ఇండియా టుడే’’ మే 17 సంచికలోని వ్యాసం ప్రకారం 2020 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సిన్ ఎడ్మినిస్ట్రేషన్ (నెగ్‌వాక్)ను ఏర్పరచి వాక్సిన్ పాలసీని నిర్ధారించమంది. అది ఫిక్కి (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ ఇండస్ట్రీ)తో, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఇవై) అనే కన్సల్టెన్సీ సంస్థతో చర్చించి, ఒక స్ట్రాటజీ పేపర్ సమర్పించింది. దాని ప్రకారం - 1.30-1.40 లక్షల వాక్సినేషన్ సెంటర్లు, లక్ష మంది హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, రెండు లక్షల మంది సపోర్ట్ స్టాఫ్ వుంటే 30 కోట్లమంది ప్రయారిటీ గ్రూపుకు ఆగస్టు 2021 నాటికి, 80 కోట్ల మందికి 2022 చివరికి టీకాలు వేయడం వీలుపడుతుంది. పబ్లిక్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 60%ను వాక్సినేషన్ సెంటర్లుగా వాడుకోవాలి. మొత్తం ప్రక్రియలో అవసరమైన మాన్‌పవర్‌లో 60-70% మాత్రమే పబ్లిక్ సెక్టార్ అందించగలదు. తక్కినదానికై ప్రయివేటు సెక్టార్‌పై ఆధారపడవలసినదే!

ఈ అంకెలు చూశాకైనా కేంద్రం మన అవసరాలకు సరిపడా మన దగ్గర వుందా? అని ఆలోచించవలసినది. సీరం, భారత్ రెండూ కలిపి నెలకు 10 కోట్ల డోసుల లోపు మాత్రం తయారు చేయగలవు. పైగా సీరం యితర దేశాలకు కూడా కమిట్ అయి వుంది. ఈ పరిస్థితుల్లో యుకె, యుఎస్‌ల తరహాలో వాక్సిన్‌లను ముందుగానే బుక్ చేసుకోవాలని, టైఅప్ పెట్టుకోవాలని నెగ్‌వాక్ ప్రభుత్వానికి సూచించి వుండాల్సింది. సెప్టెంబరులో ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో నెగ్‌వాక్ కూడా చల్లబడింది. కరోనాను వెళ్లగొట్టేశాం కాబట్టి ఇండియన్ కంపెనీలు తయారుచేసే టీకాలు సరిపోతాయిలే అనుకుందేమో! అది చేసిన యింకో పొరపాటు ఏమిటంటే, ప్రయివేటు సెక్టార్‌ను కూడా టీకాకరణలో ఇన్‌వాల్వ్ చేయండి అని అజీజ్ ప్రేమ్‌జీ కోరినా పట్టించుకోలేదు. ‘‘ఔట్‌లుక్’’ ఏప్రిల్ 12 సంచిక ప్రకారం అప్పటికి మొత్తం 43,182 వాక్సినేషన్ సెంటర్లుంటే వాటిలో 5,630 మాత్రమే ప్రయివేటువి.

కేంద్రం కూడా కరోనా మహమ్మారిని తరిమేశాం అనే మూడ్‌లోకి వచ్చేయడం మూలాన ఏమీ చేయకుండా కూర్చుంది. ఐసిఎమ్మార్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధినేత సమీరణ పాండా ‘‘దిల్లీ, పుణె, వడోదరాలలో అతి తక్కువమందిపై జరిపిన ఒక సర్వే ప్రకారం వాటి జనాభాలో సగం మంది అప్పటికే సీరోపాజిటివ్ అని తేలింది. దాంతో చాలామందికి రోగం వచ్చేసి, శరీరంలో యాంటీబాడీస్ తయారై వుంటాయని, ఇక భయపడనక్కరలేదని అనేసుకోవడం జరిగింది. తీసుకున్న శాంపుల్ చాలా చిన్నదని, దేశమంటే యీ మూడు నగరాలు మాత్రమే కాదనీ ఎవరికీ తోచలేదు. నిజానికి ఏడాది మొదట్లో ఐసిఎమ్మార్ నిర్వహించిన నేషనల్ సెరోలాజికల్ సర్వేలో జనాభాలో 75% మంది కంటె ఎక్కువమందికి కరోనా యింకా సోకలేదని, అందువలన వాళ్లకు సంక్రమించే ప్రమాదం ఉందని తేలింది.’’ అన్నారు. (‘‘వీక్’’ ఏప్రిల్ 25) అయినా రోగప్రమాదం తగ్గిపోయిందంటూ స్పెషల్ కోవిడ్ సెంటర్లనేక వాటిని అధికారులు మూయించేశారు.

తొలిదశలో హెల్త్ కేర్ వర్కర్స్‌కు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు యిచ్చారు. వీళ్లు 3 కోట్ల మంది వున్నారు. తర్వాతి దశలో 60 ఏళ్లు దాటినవారికి, 45 ఏళ్లుండి, యితర ఆరోగ్యసమస్యలున్న వాళ్లకి టీకా యిస్తామన్నారు. వారికే ప్రమాదం ఎక్కువ అనే అంచనాతో! వీళ్లు 27 కోట్ల మంది వున్నారు. మొత్తం 30 కోట్లు. వాళ్లకు కావలసినది 60 కోట్ల డోసులు. వేస్టేజి కూడా కలిపితే కనీసం 70 కోట్లు. కానీ కేంద్రం ఆర్డరిచ్చినది దానిలో ఆరో వంతు కూడా లేదు. ఎందుకలా అని సుజాతా రావు కేంద్రానికి రాసిన లేఖలో అడిగారు. ఈ ఆర్డరు కూడా ఇంకో వారంలో వాక్సినేషన్ ప్రారంభమౌతుందనగా, జనవరి 11న మాత్రమే యిచ్చారు.

60 ప్లస్, రోగాలున్న 45 ప్లస్‌ వాళ్లలో చాలామంది ఉత్పాదకతకు పనికి రాదు. ఉత్పాదనకు దోహదపడే ఏజ్ గ్రూపు 25-45. వారికి రక్షణ కలగలేదు. దురదృష్టవశాత్తూ కరోనా సెకండ్ వేవ్ ఆ గ్రూపునే దెబ్బ కొడుతోంది. వారు మరణించడం వలన వారి కుటుంబాలకే కాదు, సమాజానికి కూడా నష్టం వాటిల్లుతోంది. పై గ్రూపునే లెక్కలోకి తీసుకుని, వీళ్లను తీసుకోకపోవడంతో వాక్సిన్ల అవసరం గురించి ప్రభుత్వం పొరపాటుగా అంచనా వేసి తగినన్ని బుక్ చేయలేదు.

మా వరప్రసాద్ ఓ టీవీ యింటర్వ్యూలో మాట్లాడుతూ ‘మనమంతా తిక్కమనిషి అని తీసిపారేసిన ట్రంప్ 34 కోట్లున్న తన దేశజనాభాకు వాక్సిన్లకై ఫైజర్‌కే 200 కోట్ల డాలర్లు యిచ్చి అవసరానికి మించిన వాక్సిన్లు బుక్ చేసుకుని, (అవసరపడితే యింకా వాక్సిన్లు కొనడానికి కూడా ఒప్పందంలో వెసులుబాటు పెట్టుకున్నాడు) దాని కంటె 100 కోట్ల ప్లస్ ఎక్కువ జనాభా వున్న మన దేశంలో అది ఎందుకు జరగలేదు?’ అని అడిగితే, వెంటనే కొంతమంది నాకు మెయిల్స్ రాశారు – ‘ఆయన గత ఏడాది కరోనా రాగానే ఆర్షధర్మం, శుచీశుభ్రతా అని మాట్లాడితే హిందూమతం పట్ల గౌరవం కలవాడనుకున్నాం. ట్రంప్‌ను మెచ్చుకుని, మోదీని విమర్శించే హిందూద్రోహి అనుకోలేదు.’ అంటూ. మన ప్రభుత్వానికి యీ విషయంలో దూరదృష్టి లోపించింది అనగానే దెబ్బకి హిందూద్రోహి అయిపోయాడు పాపం!

ఇలా వుంటోంది మన ఆలోచనాధోరణి. అమెరికా ఒక్కటే కాదు, ప్రపంచ జనాభాలో 14% కలిగివున్న ధనికదేశాలు తయారవుతున్న మొత్తం వాక్సిన్లలో 53% బుక్ చేసి పెట్టుకుంటూ వుంటే దాదాపు 138 కోట్ల జనాభా వున్న భారతదేశం ఏం జాగ్రత్త పడింది? 11 కోట్ల డోసులు మాత్రమే బుక్ చేస్తే ఎలా అని అనుకోవడం తప్పా?

కరోనా సెకండ్ వేవ్  మార్చిలో సునామీలా వచ్చి తాకడంతో కంగారు మొదలైంది. 60 ఏళ్లవాళ్లకే కాదు, 45 పై బడినవాళ్లకు కూడా ప్రమాదమే అంటూ వాళ్లకూ టీకా వేయాలంది. ఉన్నవాళ్లకే టీకాలు లేకపోయినా ఏప్రిల్ 11-14 మధ్య టీకా ఉత్సవ్ అంది. ఆ గ్రూపులో దాదాపు 34 కోట్ల మంది వున్నారు. వారికే 70 కోట్ల డోసులు కావాలి. రోగం ఉధృతి పెరగడంతో అందరూ టీకాలకు ఎగబడ్డారు. చేతిలో వున్న స్టాక్ సరిపోవటం లేదు. అయినా ఎందుకోగానీ మే 1 నుంచి 18-45 గ్రూపుకి కూడా టీకా వేస్తామని (వీళ్లు 59 కోట్ల మంది వున్నారు) ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఫస్ట్ డోస్‌కే 100 కోట్ల డోసులు కావాలన్నమాట. అన్ని ఎక్కడున్నాయి? అందువలన చాలా రాష్ట్రాల్లో 18 ఏళ్లు దాటినవారికి టీకా యిచ్చే కార్యక్రమం వాయిదా వేసేశాయి.

ఇచ్చే చోట కూడా వాక్సిన్ బుకింగ్ యాప్‌లో 18 ప్లస్ వాళ్లకు స్లాట్ దొరకడం అసాధ్యంగా వుంది.  ఇక టీకాకై ఎగబడేవాళ్లు ఒక్కసారిగా పెరిగిపోయారు. ఇవతల చూస్తే టీకాలు లేవు. దాంతో తొడతొక్కిడి ప్రారంభమైంది. ఫస్ట్ డోస్ వేయించుకున్నవాళ్లు సెకండ్ డోస్ దొరక్క అల్లాడారు. మూడో వేవ్‌లో పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు అంటే వాళ్లకూ టీకా అంటే మరో 100 కోట్ల డోసుల అవసరం వుంది. మరి ఎలా మేనేజ్ చేస్తారో, ఎప్పటికి లక్ష్యం పూర్తవుతుందో భగవంతుడికే తెలియాలి. తక్కిన అంశాల గురించి ‘‘ఒక్క వాక్సిన్‌కి ఇన్ని రేట్లా?’’ అనే వ్యాసంలో చెప్తాను. (సశేషం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

Show comments