విరాటపర్వం విడుదలయ్యాక సంచలనమే

పది పన్నెండేళ్లు ఇండస్ట్రీకి వచ్చాక కానీ డైరక్షన్ చాన్స్ రాలేదు. ఈ లోగా అటు ఇటు ఊగుతూ సాగిన జీవితం. కానీ దాన్ని ఎటో వెళ్లనివ్వకుండా అనుకున్న గమ్యం వైపే నడిపిన వైనం. మధ్యలో వేరే వృత్తుల ఆఫర్లు వచ్చినా కనుతిప్పి చూడని పట్టుదల. ఆఖరికి పది పన్నెండేళ్లకు ఫలించింది. 

నీదీ నాదీ ఒకే కథ అంటూ ఓ చిన్న సినిమా తీసి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఆ వెంటనే రానా తో పెద్ద సినిమా చేతిలోకి వచ్చింది. దాదాపు రెడీ అయింది కానీ ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ఆ సినిమానే విరాటపర్వం. ఆ దర్శకుడే వేణు ఊడుగుల. సిద్దాంతాలు, సాహిత్యాలు, సినిమాలు..ఇలా అన్నీ కాస్త గట్టిగానే ఔపాసన పట్టేసిన ఈ కుర్రాడిని కరోనా టైమ్ లో కాస్సేపు పలకరిస్తే...

హాయ్..అండీ ఎప్పుడు చూపిసారు మాకు సినిమా..

పరిస్థితులు చూస్తున్నారుగా..ఎప్పుడో గత ఏడాది సమ్మర్ కు రావాల్సిన సినిమా. ఈ సమ్మర్ కూడా దాటేస్తోంది. 

అసలు ప్లాన్ చేసి కూడా చాలా కాలం అయిందనుకుంటాను.

కథ వెంటనే ఓకె అయిపోయింది. రానా గారి ఆరోగ్యం, పెళ్లి ఇవన్నీ అయ్యాక స్టార్ట్ చేసాం. ఇప్పుడు కూడా వర్క్ అంతా అయిపోయింది. కొద్దిగా పోస్ట్ ప్రొడక్షన్, సిజి వర్క్ వుంది. మహా అయితే ఓ పదిహేను రోజులు.

అదేంటీ విడుదలకు జస్ట్ రెండు వారాల ముందు కదా వాయిదా అనౌన్స్ చేసారు.

నిజమే. కానీ అంతకు రెండు వారాల ముందు నాకు కోవిడ్ వచ్చింది. అప్పటికే  నిర్మాతలు సుధాకర్ చెరుకూరు,  సురేష్ బాబు బయట వ్యవహారం గమనించేసారు. టెన్షన్ పడొద్దు. సినిమా విడుదల చేసే వాతావరణం కనిపించడం లేదు. వాయిదా తప్పదు అని చెప్పేసారు. దాంతో ఆ వర్క్ వుండిపోయింది.

మొదటి సినిమా రావడానికి పదేళ్లు. మలి సినిమాకు మరో మూడేళ్లు. మొదటి పదేళ్ల అనుభవం ఎలా వుంది

నేను పెద్దగా ఎవరి దగ్గరా పని చేయలేదు. మదన్ గారి దగ్గర పెళ్లయిన కొత్తలో సినిమాకు పని చేసాను. శంకర్ గారి దగ్గర ఓ  సినిమా చేసాను. అంతే. ఎక్కువగా ప్రకటనలు, ఘోస్ట్ వర్క్ లు. ఘోస్ట్ వర్క్ లు కూడా డైరెక్ట్ గా కాదు. ఘోస్ట్..కు ఘోస్ట్ గా..అలా అన్నమాట. సాక్షి పత్రిక ప్రారంభమైన కొత్తలో అందులో చేరమని సలహా వచ్చింది. నెలకో ముఫై వేలు ఇస్తారు. హ్యాపీగా గడిచిపోతుంది అని. అలా వెళ్లిపోయి వుంటే ఇప్పుడు మీలాగే టార్గెట్ అయి వుండేవాడినేమో? డైరక్టర్ కావాలనే పట్టుదలే ఇంత వరకు తెచ్చింది.

విరాటపర్వం మీరు స్టార్ట్ చేసేసరికి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒకటే సినిమా. ఇప్పుడు మరికొన్ని యాడ్ అయ్యాయి కదా.

మరి కొన్ని వున్నాయంటారా? ఆచార్య ఒకటే అనుకుంటాను.

నక్సలిజం దాదాపు మాయమైపోతున్న నేపథ్యంలో, పైగా ఈనాటి యువతకు పట్టని సమయంలో మీరు ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఓ ప్రేమ కథకు ఏదో ఒక నేపథ్యం వుండాలనా? 

అలా ఏదో ఒక నేపథ్యం అని ఎవరు తీసుకున్నా, అంతకన్నా భావ దారిద్ర్యం మరోటి వుండదు. ఇక్కడ అవసరం అయ్యే తీసుకున్నా. 1990 దశకంలో మా ప్రాంతంలో జరిగిన సంఘటనలు, మసిలిన వ్యక్తులు, వీటన్నింటి నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది.

పరిటాల రవి జీవితం స్పూర్తితో అని ఎక్కడో వినిపించింది. 

అస్సలు కాదు. దీని వ్యవహారమే వేరు. ఇది ఓ అమ్మాయి కోణంలో చూపించే కథ. ఈ సినిమా విడుదలయిన తరువాత కొన్నాళ్లు దీని గురించి మాట్లాడుకుంటారు. డిస్కషన్లు పెడతారు. 

ఎవరైనా వర్తమాన నాయకులు, సంఘాలు తమను సినిమాలో ఐడెంఫై చేసుకునే అవకాశం వుందా? నక్సలైట్లు? పోలీసులు ఇలా ఫీల్ కావచ్చు.

వ్యక్తులు కాదు. సంస్థలు వుండొచ్చు. సంఘటనలు వుండొచ్చు. ఒకటి రెండు చోట్ల విరసం ప్రస్తావన వుంటుంది. ఇటు నక్సల్ ఆర్గనైజేషన్లు, అటు పోలీసులు ఇద్దరూ ఫీలయినా అవ్వొచ్చు. అంతే కాదు అప్పట్లో జరిగిన అద్వానీ ఏక్ తా యాత్ర ప్రస్తావన కూడా వుంటుంది. 

అలా అయితే సెన్సారు సమస్యలు వస్తాయేమో?

రావనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కేవలం మానవ హక్కులు, ఓ అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ ఇలాంటివే వుంటాయి. అవన్నీ చూపించే నేపథ్యంలో అప్పటి వ్యవహారం ప్రస్తావన కొంచెం వుంటుంది. 

టీజర్ లో సాయిపల్లవి చేత దొంగలంజడి కొడకా అనే పద ప్రయోగం చేసారు. దాని సంగతేమిటి?

మనం వాడే తిట్లు అన్నీ ఎక్కువగా స్త్రీ ద్వేషపూరితంగా వుంటాయి. ఎవరినో మగాడిని తిట్టడానికి కూడా ఓ మహిళను అన్యాపదేశంగా తిట్టాలా? నిజానికి లంజకొడకా బదులు లంజడి కొడకా అన్న పదం కొత్తది కాదు. చాలా ప్రాంతాల్లో వున్నదే. గతంలో భాషా శాస్త్రవేత్తలు చర్చించినదే. లంజడి కొడకా అనే పురుష పద ప్రయోగం గా వుంటుంది. సెన్సారు వాళ్లు కూడా ఇదేంటీ అన్నారు. మొత్తం వివరించాను. అయినా తిట్టే కదా. మ్యూట్ చేయాల్సిదే అన్నారు. యూ ట్యూబ్ లోకి మాత్రం అలా వదిలేసాము.

నక్సల్స్ బ్యాక్ గ్రవుండ్ సినిమా అంటే అటు పోలీస్ హింస అయినా వుండాలి. లేదా ఇటు నక్సల్స్ హింస అయినా వుండాలి. కానీ ఓ లవ్ స్టోరీకి ఇవి కాస్త ఇబ్బందిగా వుంటుందేమో? 

ఇది ఓ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నక్సలిజం సిద్దాంతాలు, పోలీసు ఎన్ కౌంటర్లు డిస్కస్ చేసింది కాదు. ఓ అమ్మాయి పెర్ సెప్షన్ లో చెప్పే కథ. ఆ కథలోకి వచ్చిన పలు సంఘటనలు. 

1990 దశకం అంటే మీకు పట్టుమని పదిహేను నుంచి ఇరవై ఏళ్లు వుంటాయి. అప్పట్లో మీ ప్రాంతంలో మీ మీద నక్సలిజం ప్రభావం ఎలా వుండేది.

అందరి లాగే. అప్పట్లో కుర్రాళ్లు నక్సలిజంతో ప్రేమలో పడేవారు. నిజానికి చాలా వరకు ఆ యూనిఫారమ్, చేతిలో గన్ చూసే. మీరు చూడండి. గన్ అనేది అధికారానికి ప్రతీక. జస్ట్ ఓ రైఫిల్ పట్టుకున్న కానిస్టేబుల్ ను చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఓ పవర్ సెంటర్ ను చూసినట్లు. అప్పట్లో మాకు అలాగే వుండేది. అంతకు మించి లేదు.

నిజానికి 1990 దశకం నాటికే నక్సలిజం ప్రభావం చాలా వరకు తగ్గింది కదా.

ఆంధ్రలో తగ్గింది. కానీ తెలంగాణలో కాదు. ఇక్కడ సమస్యలు, పోరాటం ఎక్కువ కదా.

లెఫ్టిస్ట్ ఆలోచనల సినిమా. దానికి మైథలాజికల్ పేరు. చిత్రంగా లేదూ

నిజానికి నేను ఆలోచించింది. కమర్షియాలిటీ. ఎర్ర సైన్యం అనో మరోటి అనో నక్సలిజాన్ని సూచించే టైటిల్ పెడితే జనం రావాలి కదా. పైగా విరాటపర్వం లో జరిగింది ఏమిటి? హైడింగ్. అంతేగా. ఆ పర్వం లో మెయిన్ ఎలిమెంట్ కు ఈ కథలో మెయిన్ ఎలిమెంట్ కు కాస్త కనెక్ట్ కావడంతో అలా టైటిల్ పెట్టాను.

నీదీ నాదీ ఒకే కథ...విరాటపర్వం...ఇలాంటి సినిమాలే చేస్తారా? ట్రాక్ వేరేది వుందా?

అయ్యో..అదేం లేదు. నాలో భయంకరమైన కామన్ ఆడియన్ వున్నాడు. వాడు మాంచి మాస్ సినిమా చూస్తే విజిల్ వేయాలనుకుంటాడు. నేను ఇప్పుడు రెండు మాంచి కమర్షియల్ కథలు తయరు చేసుకుంటున్నారు. పెద్ద హీరోలు ఎవరికైనా పక్కా మాస్ మీటర్ తో సెట్ అయ్యే కథలు అవి.

థాంక్యూ అండీ..విరాటపర్వం అలాగే ఇంకా మంచి మంచి సినిమాలు మీ నుంచి రావాలి..

థాంక్యూ...థన్యవాదాలు

విఎస్ఎన్ మూర్తి. 

Show comments