వకీల్ సాబ్ కు సీక్వెల్ రాబోతోందా?

పవన్ కల్యాణ్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చింది వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కొన్నాళ్లకే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేసే ఉద్దేశంతో, ఈ గ్యాప్ లో ఆయనకు దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అందులో కొంత నిజం కూడా ఉంది.

ఈ సంగతి పక్కనపెడితే.. పవన్ కల్యాణ్, దిల్ రాజు కాంబోలో రాబోయే సినిమా వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ గానే ఉంటుందంటూ కొత్త కథనాలు ఉపందుకున్నాయి. ఈ పుకార్లు కూడా ఊరికే పుట్టుకురాలేదు. దర్శకుడు వేణుశ్రీరామ్ చేసిన ఓ ప్రకటన వల్ల "వకీల్ సాబ్-2" తెరపైకొచ్చింది.

"నిజానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన నాకు రాలేదు. కానీ చాలామంది నన్ను వకీల్ సాబ్ కు సీక్వెల్ చేయమని అడుగుతున్నారు. వాళ్లు అడిగిన తర్వాత నాకు కొత్త ఆలోచన పుట్టింది. వకీల్ సాబ్ ఎవరనేది ఫిక్స్ కాబట్టి మంచి కథ తీసుకొని నేను రంగంలోకి దిగగలను."

ఇలా వకీల్ సాబ్ సీక్వెల్ పై స్పందించాడు వేణుశ్రీరామ్. కోర్టు డ్రామా రాయడంలో తనకు అనుభవం వచ్చేసింది కాబట్టి, పవన్ కల్యాణ్ తనకు మరో అవకాశం ఇస్తే వకీల్ సాబ్-2 తీయడానికి తను సిద్ధమేనని ప్రకటించాడు. అంతా బాగానే ఉంది కానీ వకీల్ సాబ్ సినిమానే పవన్ రేంజ్ లో ఆడలేదు. ఇక దీనికి సీక్వెల్ తీస్తే ఆడుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

Show comments