ఊపిరి పోస్తున్న వైసీపీ ఎంపీ

మంచి ఎవరూ చేసినా మెచ్చాల్సిందే. అందునా కష్టకాలంలో కరోనా కాలంలో ఏ చిన్న సాయం చేసిన అది వేయింతలుగానే చూడాలి. ఎవరెన్ని మాట్లాడుకున్నా తనదాకా వస్తేనే కష్టం తెలుస్తుంది. అలాంటపుడు ఊపిరి విలువ ఏంటో తెలుస్తుంది. ఇపుడు కరోనా రెండవ దశ ఏకంగా ఊపిరినే నొక్కిపెడుతోంది. మనిషి పాలిట  మరణశాసనం రాసేస్తోంది. దాంతో ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది.

చాలా మంది ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. ఈ నేపధ్యంలో కరోనా రోగుల కోసం విశాఖలో రెండు వందల ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అభినందించకుండా ఉండలేరు కదా. 

విశాఖలోని షీలానగర్ లో ఈ నెల 8న ఆయన 200 పడకలను ప్రారంభిస్తున్నారు. అక్కడ కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఆక్సిజన్ అవసరం ఉన్న వారు చేరవచ్చు. ఇక వైద్యం, మందులు, భోజనం వంటివి కూడా ఉచితంగా అందిస్తున్నారు. పైగా కరోనా రోగికి ఎలా ఉందో అన్నది ప్రతీ రోజూ వారి బంధువులకు సమాచారం కూడా ఇస్తారు.

ఏడాది క్రితం విశాఖలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసిన విజయసాయిరెడ్డి ఇపుడు కరోనా రోగులను ఆదుకునేందుకు నడుం కట్టారు. 

ఇక మరో రెండు వందల ఆక్సిజన్ బెడ్లను కూడా విశాఖలో తొందరలోనే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన స్పూర్తితో మరింతమంది సాయానికి ముందుకు వస్తే ప్రజల ప్రాణాలు దక్కుతాయి. విమర్శలకు ఇది సమయం కాదు, సాయాన్ని కోరుతున్న చేతులను గుర్తించి ఆదుకోవడమే మానవత్వం.

Show comments