భయపెట్టి చంపారు కదా... ?

విశాఖలో అత్యంత ప్రమాదకరమైన కొత్త రకం కరోనా వైరస్ ఎన్440కె వ్యాపిస్తోందని గత కొద్ది రోజులుగా  చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడం లేదని కూడా కొందరు నాయకులు ఆరోపణలు చేశారు.

ఇలా ఏపీలో భయంకరమైన వైరస్ వ్యాప్తి అంటూ ఊదరగొట్టేశారు. అయితే ఈ వైరస్ విషయంలో భయాలు అవసరం లేదని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ స్పష్టం చేయడంలో విశాఖ వాసులు ఒక్కసారిగా  ఊపిరి పీల్చుకుంటున్నారు.

కరోనా వైరస్ జన్యు పరిణామక్రమాన్ని విశ్లేషించినపుడు ఎన్440కె రకం బయటపడినట్లుగా బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్ వెల్లడించడం విశేషం. ఈ వైరస్ అంతే వేగంగా మాయమైందని కూడా పేర్కొన్నారు. 

ఇక దాని విస్తరణ కూడా ఎక్కడా కనిపించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అలాగే దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో కర్నూల్, విశాఖ జిల్లాలలో ఎన్440కె వైరస్ అంటూ జనాలను తీవ్రంగా వణికించేశారు కదా అని ప్రజలు ఇపుడు మండిపడుతున్నారు. 

కరోనా వైరస్ రెండవ దశతో నానా బాధలూ పడుతున్న వేళ ఈ తరహా ప్రచారం చేయడం దారుణమని కూడా వైద్య నిపుణులు అంటున్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి ప్రమాదకర వైరస్ లు ఇప్పటికైతే ఏపీలో లేవనే చెప్పాలని అంటున్నారు.

Show comments