ఓటీటీ బిజినెస్ లోకి బొద్దుగుమ్మ

క్రేజ్ తగ్గిన ముద్దుగుమ్మలంతా ఓటీటీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇక్కడో బొద్దుగుమ్మ మాత్రం ఓటీటీల్లో నటించడం కంటే, తనే ఓటీటీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది. ఆమె మరెవరో కాదు నమిత.

హీరోయిన్ నమిత తన పేరిట ఓటీటీ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు నమిత థియేటర్. ఈ ఓటీటీకి నమిత బ్రాండ్ పార్టనర్ కాగా.. రవివర్మ మేనేజింగ్ డైరక్టర్. ఇతడొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

మిగతా ఓటీటీలతో పోలిస్తే ''నమిత థియేటర్''కు ఓ ప్రత్యేకత ఉంది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన షార్ట్ ఫిలిమ్స్, సినిమాలకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. తన ఓటీటీ ద్వారా చిన్న నిర్మాతలు, కొత్త దర్శకుల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తానని ప్రకటించింది నమిత.

ఇప్పటికే సౌత్ లో చాలా ఓటీటీలు, ఏటీటీలు వచ్చాయి. వీటిలో క్లిక్ అయినవి కొన్ని మాత్రమే. అయినప్పటికీ నమిత ధైర్యంగా అడుగు ముందుకేసింది. ఓవైపు నాగార్జున లాంటి ప్రముఖులు ఓటీటీ బిజినెస్ లోకి రాబోతున్నారంటూ కథనాలు వస్తున్న వేళ.. నమిత ఏకంగా తన కొత్త ఓటీటీ వెంచర్ ను ప్రకటించి చిన్నపాటి సంచలనం సృష్టించింది.

Show comments