నేత‌ల్లారా మీరెక్క‌డ‌?

క‌రోనా సెకెండ్ వేవ్ స‌మాజాన్ని అత‌లాకుతలం చేస్తోంది. ప్ర‌తి మ‌నిషి బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్న ద‌య‌నీయ స్థితి. ఒక వైపు జ‌నాలు పిట్ట‌ల్లా రాలుతుండ‌డంతో చావు భ‌యం వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు అంత‌మ‌వుతుందో తెలియ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలో భార‌తీయ స‌మాజం జీవ‌నం సాగిస్తోంది. ఇక్క‌డ అక్క‌డ‌ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భ‌యాందోళ‌న రాజ్య‌మేలుతోంది.

ఇలాంటి ద‌య‌నీయ స్థితిలో బ‌తుకు పోరాటం సాగిస్తున్న జ‌నానికి భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పించే రాజ‌కీయ నాయ‌కులే క‌రువయ్యారు. ఇప్ప‌టితో పోలిస్తే క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ ప‌క్షాల రాజ‌కీయ నేత‌లు కొద్దోగొప్పో ప్ర‌జానీకం యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌మ శ‌క్తి మేర‌కు సాయం అందించారు.

ఫ‌స్ట్ వేవ్ కంటే సెకెండ్ వేవ్ తీవ్ర‌ అల‌జ‌డి సృష్టిస్తోంది. అయినా ప్ర‌జ‌లను ప‌ల‌క‌రించే నేత‌లే క‌రువ‌య్యారు. క‌రోనా బారిన ప‌డిన రోగులు, బంధువులు, స్నేహితులు మాన‌సికంగా కుంగిపోతున్నారు. ఆస్ప‌త్రిలో చేరుదామ‌న్నా బెడ్స్ దొర‌క‌ని ద‌య‌నీయ స్థితి. ఊపిరాడ‌క ఆక్సిజ‌న్ సౌక‌ర్యం కోసం ఆస్ప‌త్రుల చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తున్నా ... దొర‌క‌ని ద‌య‌నీయ స్థితి. రాజ‌కీయ నేత‌లు త‌మ ఫోన్ల‌ను స్విచ్ఛాప్ చేసుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

సెల్‌ఫోన్లు మోగితే చాలు ...ఆక్సిజ‌న్ బెడ్స్ కోసం సిఫార్సు చేయాల‌ని అడుగుతార‌నే భ‌యం త‌మ‌ను త‌ప్పించుకుని తిరిగేలా చేస్తోంద‌ని రాజ‌కీయ నేత‌లు వాపోతున్నారు. 

ఎందుకంటే డిశ్చార్జి అయ్యే వాళ్లు చాలా త‌క్కువ‌య్యార‌ని, చేరేవాళ్ల సంఖ్య అంత కంత‌కూ రెట్టింపు అవుతోంద‌ని అంటున్నారు. దీంతో రోగుల‌కు త‌గినంత‌గా ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందించ‌లేక చేతులెత్తేయాల్సి వ‌స్తోంద‌ని ఇటు ఆస్ప‌త్రుల య‌జ‌మానులు, అటు రాజ‌కీయ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు క‌రోనా సెకెండ్ వేవ్ ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుండంతో రాజ‌కీయ నేత‌లు బెంబేలెత్తుతున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసేందుకు సాహసించ‌డం లేదు. ముందు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డం మొద‌టి ప్రాధాన్యమైంద‌ని వారు చెబుతున్నారు. 

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏదో ఒక కార‌ణంతో జ‌నాన్ని క‌లిసి క‌రోనా బారిన ప‌డ‌డానికి సిద్ధంగా లేమ‌ని రాజ‌కీయ నేత‌లు నిర్మొహ మాటంగా చెబుతున్నారు. ప్రాణాల మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు ప‌ల‌క‌రించని నేత‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌నే అస‌హ‌నం జ‌నం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. 

Show comments