మ‌హ‌మ్మారిని హ‌డ‌లెత్తిస్తున్న ఒకే ఒక్క‌డు

సుదీర్ఘ రాజ‌కీయ‌, పాల‌నానుభ‌వం ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న నైజాన్ని దాచుకోలేకపోయారు. క‌నీసం ఓ పెద్ద విప‌త్తు స‌మ‌యంలోనైనా రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల ప్రాణాల కోసం ఏదైనా మంచి చేస్తామ‌నే ఆలోచ‌న ఆయ‌న‌కు లేక‌పోయింది. త‌న మాట‌ల‌కు జ‌నం న‌వ్వుకుంటార‌ని తెలిసి కూడా, ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది.

కరోనా ప్రభావం, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు బుధవారం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... ప్రభుత్వాన్ని విమర్శించడం త‌న‌ ఉద్దేశం కాదన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఎంతో బాధ, ఆవేదనతో, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నదే త‌న‌ అభిమత‌మ‌ని చెప్పు కొచ్చారు. 

కరోనా నియంత్రణ వ్యవహారాన్ని మంత్రుల కమిటీకి, కింది వారికి వదిలేసి ఊరుకోవడం సరికాద‌న్నారు. ముఖ్యమంత్రే స్వయంగా సమీక్షించాల‌ని, ప్రజలు ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి అని అన్నారు. సీఎంకి తెలియకపోతే... నిపుణుల్ని పెట్టుకుని, వారి సలహాలు తీసుకోవాల‌ని అని చంద్రబాబు హిత‌వు ప‌లికారు.

క‌రోనా దెబ్బ‌కు కుటుంబాల‌కు కుటుంబాలే పోతున్నాయ‌ని తీవ్ర ఆవేద‌న చెందుతున్న చంద్ర‌బాబు... బాధ్య‌త గ‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఇంత‌టి విపత్క‌ర కాలంలో ప్ర‌జ‌లకు ఏం చేస్తున్నారు?  కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే త‌న బాధ్య‌త అని భావిస్తున్నారా? ప్రభుత్వాన్ని విమర్శించడం త‌న‌ ఉద్దేశం కాదని స‌న్నాయి నొక్కులు నొక్క‌డం చూస్తే... ఈ స‌మ‌యంలో కూడా రాజ‌కీయ స్వార్థానికి క‌రోనాను వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు గురి అవుతామ‌ని సిగ్గు ప‌డుతున్నారా?

ఉదాహ‌ర‌ణ‌కు వామ‌ప‌క్షమైన సీపీఎంను తీసుకుంటే క‌రోనాతో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు అండ‌గా నిలుస్తున్న తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఐసొలేష‌న్ సెంట‌ర్లు, కాల్‌సెంట‌ర్లు ఏర్పాటు చేసి బాధితుల‌కు అండ‌గా నిలుస్తోంది. అవ‌స‌ర‌మైన వారికి త‌మ శ‌క్తి మేర‌కు వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. 

మ‌రికొన్ని చోట్ల కాల్‌సెంట‌ర్లు ఏర్పాటు చేసి, వైద్యం కోసం ఎక్క‌డికెళ్లాలి? ఏం చేయాల‌నే గైడెన్స్ ఇస్తోంది. ఇలాంటి ప‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ ఎందుకు చేయ‌కూడ‌దు? త‌న పార్టీ సానుభూతిప‌రుల వైద్య‌శాలల్లో దోపిడీ ర‌హిత వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు ఎందుకు తీసుకోకూడ‌దు?

క‌ర‌డుగ‌ట్టిన అవ‌కాశవాద రాజ‌కీయానికి చంద్ర‌బాబు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఎందుకు పాత్రుడ‌య్యారో జ‌నానికి ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. చివ‌రికి క‌రోనాను కూడా ఆయ‌న విడిచి పెట్ట‌లేదంటే ...ఎంతటి రాజ‌కీయ స్వార్థ‌ప‌రుడో అర్థం చేసుకోవ‌చ్చు. 

బ‌హుశా ఆయ‌న స్వార్థ‌, అవ‌కాశ‌వాద చింత‌న‌ను చూసి మ‌హ‌మ్మారి క‌రోనానే హ‌డ‌లి చ‌స్తుందేమో! క‌రోనాను భ‌య‌పెట్టిన ఒకే ఒక్క‌డిగా చంద్ర‌బాబు నిలుస్తార‌ని నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు.

Show comments