అంతా నా ఘనతే.. చంద్రబాబుకు తగ్గ కొడుకు

ఎట్టకేలకు లోకేష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు. చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయిన లోకేష్.. ఒకే ఒక్క విషయంలో మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటో చూద్దాం?

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు రద్దు చేయాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు లోకేష్. ఈయన ఒక్కడే కాదు, బీజేపీతో పాటు, అసెంబ్లీలో అడుగుపెట్టలేని పవన్ కల్యాణ్ కూడా ఇవే డిమాండ్స్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పరిస్థితులకు తగ్గట్టే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

మొన్నటివరకు షెడ్యూల్ కు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల వాయిదాకు మొగ్గుచూపింది. సరిగ్గా ఇక్కడే లోకేష్ లో చంద్రబాబు బయటకొచ్చారు. 

తన డిమాండ్స్ వల్లనే, ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసిందంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఎక్కడ ఈ క్రెడిట్ ను పవన్ కల్యాణ్ కొట్టేస్తారో అనే భయంతో ఏకంగా థ్యాంక్స్ చెబుతూ సీఎంకు లేఖ కూడా రాసేశారు మన లోకేషం.

మూడు వారాల ఆందోళన, న్యాయపోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు అంటూ పెద్ద లేఖ అందుకున్నారు లోకేష్. చంద్రబాబు కూడా ఇంతే. దేశంలో ఏం జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి అస్సలు సిగ్గుపడరు. సెల్ ఫోన్ కనిబెట్టింది నేనే, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే అని చెప్పుకోవడం బాబుకు హాబీ.

అంతెందుకు.. సెల్ ఫోన్ ధరలు తగ్గడానికి కూడా తనే కారణం అంటూ అప్పట్లో ఏకంగా అసెంబ్లీలో ప్రకటించుకొని నవ్వులు పూయించారు. ఇప్పుడీ లక్షణాలన్నీ లోకేష్ లేఖలో కనిపిస్తున్నాయి. తన వల్లే ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయంటూ ఆయన తెగ సంబరపడిపోతున్నాడు. (అదేం ఆనందమో ఆయనకే తెలియాలి).

ఇక్కడే మరో తెలివైన అడుగేశాడు లోకేష్. కరోనా దెబ్బతో రాబోయే రోజుల్లో ఇంకేవైనా పరీక్షలు వాయిదా పడితే దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేలా లేఖలో మంచి పదాలు దట్టించారు.. మే నెలలో జరగబోయే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని ఓ ముక్తాయింపు ఇచ్చేశారు.

తన లేఖ వల్లే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసిందని లోకేష్.. తన ప్రెస్ నోట్ వల్లనే జగన్ సర్కార్ ఎగ్జామ్స్ వాయిదా వేసిందని పవన్ కల్యాణ్.. రాబోయే రోజుల్లో వాదించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Show comments