కమల్ కంటే పవన్ కొద్దిగా బెటర్

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చలపై చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేకపోయినా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీజేపీ భవిష్యత్తు ఏమిటనేదానిపై డిస్కషన్స్ సాగుతున్నాయి. వివిధ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు చేసిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అంచనాలు తప్పలేదు.

ఈ ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైన విషయమేమిటంటే ... సినిమా హీరోలు రాజకీయాల్లో విజయం సాధించడం అంత సులభం కాదని అర్ధమైంది. సినిమా హీరోలుగా వారు తోపులై ఉండొచ్చు. కానీ ఎన్నికల్లో విజయం సాధించలేరు. అందరూ విజయం సాధించలేరని చెప్పలేం. కొందరు నాయకులు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ...వీరంతా సినిమారంగానికి సంబంధించినవారే కదా. 

తమిళనాడులో సొంతంగా పార్టీ పెట్టి అధికారం సాధించింది ఎంజీఆర్ ఒక్కడే. డీఎంకే కరుణానిధి సొంత పార్టీ కాదు. కానీ 13 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత అన్నా డీఎంకే పార్టీలో చేరి ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఎన్టీఆర్ కూడా సొంతంగా పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా సొంతంగా పార్టీ స్థాపించి ముఖ్యమంత్రులు కావాలని కలలుగన్న తమిళ, తెలుగు హీరోలు కొందరు పూర్తిగా విఫలమైపోయారు. వారి పార్టీలను ఎన్నికల్లో ప్రజలు దారుణంగా తిరస్కరించారు.

తెలుగు, తమిళం హీరోలు కొందరు పార్టీలు స్థాపించారు. రాజకీయాల్లో రాణించాలని చూసారు.  కానీ విజయం సాధించింది లేదు. సినిమాల్లో వాళ్లు నెంబర్ వన్ హీరోలైనా కూడా పాలిటిక్స్ మాత్రం వాళ్లకు హ్యాండ్ ఇచ్చింది.ఇది మరోసారి రుజువైంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్లారు కమల్ హాసన్. కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసారు. మొత్తం 234 స్థానాలకు పోటీ చేసిన కమల్.. ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలవలేకపోయారు.

కనీసం ఆయన కూడా గెలవలేదు.దాంతో కమల్ పార్టీ నేతలు నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈయన్ని చూస్తుంటే జనసేన గుర్తుకొస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు సైతం ఇలాంటి దారుణమైన ఫలితమే ఎదురైంది.కాకపోతే కమల్, పవన్ పార్టీలకు ఒక్కటే తేడా. జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. కానీ కమల్ పార్టీకి ఆ ఒక్క సీట్ కూడా రాలేదు.

గుండుసున్నాతో సరిపెట్టుకున్నారు లోకనాయకుడు. ఎన్నికల ప్రచారం కోసం ఎంతగా తిరిగినా కూడా ఆయనకు ఫలితం మాత్రం శూన్యమే మిగిలింది. ఒకప్పుడు చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీ పెట్టి పరాభవమే ఎదుర్కొన్నారు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే వచ్చాయి. సినిమాలో గొప్ప హీరోలు సైతం రాజకీయాల్లో రాణించలేకపోవడానికి సరైన కారణాలేమిటో ఇప్పటివరకు ఎవరూ అనలైజ్ చేయలేకపోయారు. 

Show comments