ఏకాకిగా మిగిలిపోయిన 'బాబు'

దేశం మొత్తం మీద రాజకీయ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే మోడీ లేదా యాంటీ మోడీ. కానీ ఒక్క చంద్రబాబు మాత్రమే ఎటు అన్నది తెలియకుండా వుండిపోయారు. జగన్ సంగతి ఏమిటి అని ప్రశ్న అక్కరలేదు. ఎందుకంటే చాలా విషయాల్లో మోడీ నిర్ణయాలకు పార్లమెంట్ లో మద్దతు పలికారు. అంశాల వారీ మద్దతు వుంటుందని చాలా ఏళ్ల కిందటే క్లారిటీ ఇచ్చేసారు. 

కానీ చంద్రబాబే పాపం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 2014లో కిందా మీదా పడి భాజపా పంచన చేరారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి భాజపా సీనియర్లకు మొక్కి మరీ అక్కడ ప్లేస్ సంపాదించుకున్నారు. 

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ, తనంత సీనియర్ లేరంటూ, క్రైసిస్ మేనేజ్ మెంట్ గురూ అంటూ, ఇలా రకరకాల బిరుదులు అందుకున్నారు. జాతీయ మీడియా చేత జేజేలు అందుకునే విధంగా వ్యూహాలు రచించి అమలు చేయించుకోగలిగారు.

కానీ 2019 నాటికి మోడీకి దూరమై అతి పెద్ద తప్పు చేసారు అనిపించుకున్నారు. తెలుగుదేశం ఆజన్మశతృవు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ పక్కన నిల్చుని, వేదికపై నుంచి రెండు వేళ్లు చూపించి చిరునవ్వులు చిందించారు. కానీ ఎప్పడయితే ఆ వ్యూహం రాంగ్ స్టెప్ అయిందో మౌన మునిగా మారిపోయారు.

అక్కడే మళ్లీ తప్పు చేసారు. తీసుకున్న నిర్ణయం మీదే వుంటూ యాంటీ మోడీ కాంపయిన్ ను అలా కంటిన్యూ చేసి వుంటే, ఇవ్వాళ జనం చంద్రబాబును శభాష్ అనేవారు. వివిధ అంశాల మీద గళం విప్పే అవకాశాన్ని చంద్రబాబు దూరం చేసుకున్నారు. 

మోడీని ఎలాగైనా మంచి చేసుకోవాలని ఆ విధంగా ఒకే బుల్లెట్ కు రెండు పిట్టల్ని కొట్టాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమయింది. దేశంలో మోడీ ప్రభ మసకబారడం ప్రారంభమైంది. ఆంధ్రలో కూడా అదే పరిస్థితి. అయినా కూడా చంద్రబాబు గొంతెత్తి మోడీని విమర్శించలేకపోతున్నారు. 

ఇదే సమయంలో యాంటీ మోడీ పక్షాలు కూడా చంద్రబాబును దూరం పెట్టేసాయి. గతంలో అన్ని రాష్ట్రాలు తిరిగి, అందరివాడు అనిపించుకున్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లో ఒంటరి అయిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చినా కామెంట్ చేయలేనంతంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. 

ఇప్పుడు ఆయన ముందు బలమైన చిక్కు ప్రశ్న మిగిలి వుంది. దేశంలో మోడీకి వ్యతిరేకంగా బలమైన నాయకుడు లేడు. బలమైన కూటమి లేదు. అందువల్ల మోడీ వెంట వెళ్లడానికే కిందా మీదా పడడమా? లేదా జనాల్లో యాంటీ మోడీ అన్నది బలమైన భావనగా మారుతోంది. 

దానికి అనుగుణంగా తను కూడా మారడమా? ఎటూ తేల్చకుండా, తేల్చుకోకుండానే మోడీ తప్పులకు కూడా జగన్ ను మాత్రమే విమర్శించుకుంటూ మరో రెండేళ్లు కాలక్షేపం చేసేసాలా వున్నారు.

Show comments