కేంద్రాన్ని నిల‌దీసిన చిరంజీవి

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేట్‌ప‌రం చేయ‌డాన్ని వ్య‌తిరేకించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి ఉక్కు ప‌ట్టు ప‌ట్టారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేట్‌ప‌రం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో చిరంజీవి గ‌ట్టిగా వ్య‌తిరేకించి ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచారు. మ‌రోసారి ఆయ‌న త‌న వ్య‌తిరేక‌త‌ను పున‌రుద్ఘాటించ‌డం విశేషం. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

‘దేశమంతా ఆక్సిజన్‌ దొరకక కరోనా పేషెంట్స్‌ అల్లాడిపోతున్నారు. గురువారం ఓ ప్రత్యేక రైలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరుకుంది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేస్తుంది. 

ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌ పరం చేయడం ఎంత వరకూ సమంజనం? మీరే ఆలోచించండి’ అని చిరంజీవి ట్విట్టర్‌లో స్ప‌ష్టంగా  పేర్కొన్నారు.

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విశాఖ ఉక్కు క‌ర్మాగారం దేశానికి ఎలా ఆక్సిజ‌న్ అందిస్తున్న‌దో చెబుతూనే, ఇలాంటి ప‌రిశ్రమ‌నా మీరు ప్రైవేట్‌ప‌రం చేయాల‌ని ప‌ట్టు ప‌ట్టింద‌నే భావ‌న వ‌చ్చేలా గ‌ట్టిగా నిల‌దీశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ల‌క్ష‌లాది మందికి ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసే విశాఖ ఉక్కు క‌ర్మాగారం న‌ష్టాల్లో ఉంద‌నే సాకుతో ప్రైవేట్ ప‌రం చేయ‌డం ఎంత వ‌రూ స‌మంజస‌మ‌ని ట్విట‌ర్ వేదిక‌గా చిరంజీవి నిల‌దీయడం స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 

Show comments