బిగ్‌బాస్ ఫేం రెండో పెళ్లికి కొడుకుల గ్రీన్‌సిగ్న‌ల్‌

ప్ర‌ముఖ టీవీ న‌టి, బిగ్‌బాస్ సీజ‌న్‌-6 విజేత ఊర్వ‌శి ధోలాకియాకు కొడుకులు ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌ స‌ల‌హా ఇచ్చారు. అది త‌న వివాహ బంధం గురించి కావ‌డం విశేష‌మ‌ని ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. క‌సౌటి జింద‌గీ కే ఫ‌స్ట్ ఎడిష‌న్‌లో కొమోలికా పాత్ర‌త‌తో ఊర్వ‌శి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత దేఖ్ భాయ్ దేఖ్‌, శ‌క్తిమాన్‌, క‌బీ సౌతాన్ క‌బీ సాహెలి, చంద్ర‌కాంత -ఏక్ మాయావి ప్రేమ్ గాథా త‌దిత‌ర టీవీ షోల‌లో న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. పెద్ద సంఖ్య‌లో త‌న‌కు అభిమానులుగా మార్చుకున్నారు. అనంత‌రం బిగ్‌బాస్ సీజ‌న్‌-6 విజేత‌గా నిలిచి మ‌రింత పాపులారిటీని సంపాదించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆమె త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించి సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకున్నారు. ఇటీవ‌ల సింగ‌ర్ సునీత రెండో పెళ్లి చేసుకోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. అంతిమంగా ఆమె నిర్ణ‌యానికే మెజార్టీ ఓట్లు ప‌డ్డాయి. సునీత పెళ్లి త‌ర్వాత ఒంట‌రి మ‌హిళ‌ల పెళ్లిళ్ల‌పై సోష‌ల్ మీడియాలో వివిధ ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న పెళ్లికి సంబంధించి ఊర్వ‌శినే స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం వైర‌ల్ అవుతోంది.  

బాల నటిగా తాను ఇండస్ట్రీలో ప్రవేశించిన‌ట్టు ఊర్వ‌శి తెలిపారు. 16వ ఏట ప్రేమ, ఆ వెంట‌నే పెళ్లి అయ్యాయ‌న్నారు. 17వ ఏట త‌న‌కు కవలలు పుట్టార‌న్నారు. సాగర్‌, క్షితిజ్ త‌న ఇద్ద‌రు కుమారులని చెప్పుకొచ్చారు. అయితే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా భ‌ర్త‌తో విడిపోవాల్సి వ‌చ్చిన‌ట్టు నాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. 

అప్ప‌టి నుంచి తాను ఒంట‌రిగానే ఉంటున్న‌ట్టు ఊర్వ‌శి తెలిపారు. త‌న పిల్ల‌లిద్ద‌రికీ మంచి చదువు, కెరీర్‌ అందించేందుకు రాత్రింబవళ్లు శ్ర‌మించిన‌ట్టు ఆమె వివ‌రించారు. చూస్తుండగానే త‌న కొడుకులిద్దరుపెద్దవారై, త‌మ‌ కాళ్ల మీద తాము నిల‌బ‌డ్డార‌ని ఊర్వ‌శి గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.

ఇంత కాలం త‌మ కోసం జీవితాన్ని త్యాగం చేసిన త‌న‌ను కొడుకులిద్ద‌రూ గుర్తించార‌న్నారు. అందువ‌ల్లే ఇక మీద‌ట త‌న కోసం తాను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాల‌ని, ఇందుకోసం మ‌రో పెళ్లి చేసుకోవాల‌ని కొడుకులిద్ద‌రు కోరుతున్నార‌ని ఊర్వ‌శి ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆ విష‌యం ఆమె మాట‌ల్లోనే...

‘ఇప్పుడు కుటుంబ సభ్యులు, నా కొడుకులిద్దరు నేను జీవితంలో సెటిల్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నా బిడ్డలు ఓ అడుగు ముందుకు వేసి ‘అమ్మ నీకు నచ్చిన వ్యక్తిని వివాహం అయినా చేసుకో.. లేదంటే  డేటింగ్‌ చేయ్‌’ అని అడుగుతుంటారు. వారి మాటలను నేను పెద్దగా పట్టించుకోను. నవ్వేసి ఊరుకుంటాను’ అని ఊర్వ‌శి చెప్పు కొచ్చారు. తాను స్వ‌తంత్ర భావాలున్న మ‌హిళ‌న‌ని, త‌న‌కు న‌చ్చిన‌ట్టు జీవితాన్ని గ‌డుపుతాన‌న్నారు.

ఎవ‌రి కోస‌మో త‌న‌ను తాను మార్చుకోలేన‌న్నారు. త‌న భావాల‌ను అర్థం చేసుకునే వ్య‌క్తి తార‌స‌ప‌డితే అప్పుడు త‌ప్ప‌క పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని ఊర్వ‌శి తెలిపారు. అయితే ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే టైం లేద‌ని 41 ఏళ్ల ఊర్వ‌శి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి రెండో పెళ్లికి కొడుకుల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఇక నిర్ణ‌యం ఊర్వ‌శి చేతుల్లోనే!

Show comments