బాలీవుడ్ కోసం వెంపర్లాడను- నాగార్జున

కెరీర్ స్టార్టింగ్ నుంచి బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నాగార్జున. హిందీలో 2 హిట్స్ కూడా కొట్టాడు. కానీ ఎప్పటికప్పుడు హిందీ సినిమాలకు బ్రేక్ ఇస్తూనే ఉన్నాడు. అవకాశాలు వచ్చినా చేయలేదు. దీనికి కారణం ఏంటి?

"నా కెరీర్ లో బాలీవుడ్ ఎంత రోల్ ప్లే చేసిందనే విషయం నాకు తెలీదు. ఎందుకంటే నేనెప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు. కానీ ఎప్పుడు హిందీలో సినిమా చేసినా ప్రేక్షకులు ఆమోదిస్తున్నారు. అది నాకు చాలు."

బాలీవుడ్ ను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదంటున్నాడు నాగ్. అందుకే ఎక్కువగా సినిమాలు చేయలేదని చెప్పుకొచ్చాడు. మంచి పాత్రలు, మనసుకు నచ్చినప్పుడు చేస్తున్నానని, ప్రస్తుతం చేస్తున్న బ్రహ్మాస్త్ర కూడా అలాంటిదేనంటున్నాడు.

"నిడివితో సంబంధం లేకుండా, మంచి క్యారెక్టర్ పడి, అది నాకు సూట్ అవుతుందనుకుంటే చేస్తాను. లేదంటే లేదు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో చాలా కంఫర్ట్ గా ఉంది."

ప్రస్తుతం తన సినిమాల్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో చూస్తున్నారని.. దాని వల్ల నిర్మాతలకు ఇంకాస్త ఎక్కువ లాభం వస్తే అదే తనకు చాలంటున్నాడు. త్వరలోనే వైల్డ్ డాగ్ ను హిందీలో రిలీజ్ చేస్తానంటున్నాడు నాగ్. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

Show comments