పార్టీ లేదు.. బొక్కా లేదు.. అచ్చెన్నకు పదవీ గండం!

"పార్టీ లేదు.. బొక్కా లేదు. వాడే మంచిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది." స్వయంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలివి. ఇప్పుడీ కామెంట్స్ అచ్చెన్న పదవికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఈ మేరకు అచ్చెన్నను తొలిగించాల్సిందిగా చంద్రబాబుపై తనయుడు లోకేష్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

క్రమశిక్షణకు మారుపేరు అని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే.. జాతీయ అధ్యక్షుడి తనయుడు, భావి పార్టీ లీడర్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఎలాంటి క్రమశిక్షణ చర్యల్లేవు. పైపెచ్చు ఆ వెంటనే లోకేష్-అచ్చెన్న కలిసి మీటింగ్స్ లో పాల్గొన్నారు కూడా.

ఆ తర్వాత అచ్చెన్న కూడా చంద్రబాబును, లోకేష్ ను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. లోకేష్ తానా అంటే అచ్చెన్న తందానా అనడం మొదలుపెట్టారు. అయితే బిస్కెట్ కార్యక్రమాలేవీ అచ్చెన్న పదవిని కాపాడలేవనేది పార్టీలో ఇంటర్నల్ టాక్.

నిజానికి అచ్చెన్న నియామకంపై లోకేష్ మొదట్నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. అప్పట్లో ఏపీ అధ్యక్ష పదవిని బీద రవిచంద్రకు అప్పగించేందుకు లోకేష్ తెగ ప్రయత్నించారు. కానీ మునిగిపోతున్న పార్టీని కాస్త నోరున్న వ్యక్తి అవసరమనే ఉద్దేశంతో అచ్చెన్నకు ఓటేశారు బాబు. అదే సమయంలో ఎప్పటికైనా లోకేష్ కు అచ్చెన్న థ్రెట్ అవుతారంటూ విశ్లేషణలు కూడా వచ్చాయి.

రీసెంట్ గా వచ్చిన వీడియోలతో లోకేష్ పై అచ్చెన్నకు ఎంత ''మంచి'' అభిప్రాయం ఉందో తేలిపోయింది. ఈ క్రమంలో అచ్చెన్నకు పదవీ గండం పొంచి ఉందని పార్టీలో నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. 

బాబుపై లోకేష్ ఓ రేంజ్ లో ఒత్తిడి తీసుకొస్తున్నారట. అచ్చెన్న స్థానంలో అతడి కుటుంబానికే చెందిన రామ్మోహన్ నాయుడ్ని నియమించినా తనకు అభ్యంతరం లేదని తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది.

క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే టీడీపీలో అచ్చెన్నపై ఎట్టిపరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందేనంటూ లోకేష్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తనయుడి ఒత్తిడికి తండ్రి లొంగితే మాత్రం అచ్చెన్న పదవి పోవడం ఖాయం. అదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న ఆ కొద్దిపాటి ''సైకిల్ వెలుగు'' మసకబారడం కూడా అంతే ఖాయం. 

Show comments