ఎమ్బీయస్: టిడిపిలో చీలిక వస్తుందా?

వినగానే ‘నాన్సెన్స్’ అనిపించే ప్రశ్న యిది. ‘ప్రస్తుత పరిస్థితిలో బాబును ఎదిరించి బయటకు వెళ్లే టిడిపి నాయకుడున్నాడా? వెళ్లినా టిడిపి క్యాడర్ అతనితో నడుస్తుందా? ఇది ఒట్టి ఊహాగానమే’ అని కొట్టి పడేస్తాం. 1995లో ఎన్టీయార్ టిడిపి అధినేతగా వుండగా కూడా యిలాగే అనుకున్నాం. విడిగా వెళ్లిన నాదెండ్ల, రేణుకా చౌదరి లాటి వాళ్లు సోదిలో లేకుండా పోయారు. పైగా 1994 ఎన్నికలలో ఎన్టీయార్ కనీవిని ఎరుగని రీతిలో 216 సీట్లు గెలిచి శిఖరాగ్రంపై వున్నారు. 

ఏడాది పోయేసరికి ఎక్కడున్నారు? ఈసారి ఎవరూ బయటకు వెళ్లలేదు. ఆయన్నే బయటకు నెట్టేశారు. ‘టిడిపి నాతో వచ్చింది, నాతో పోతుంది’ అన్నారు ఎన్టీయార్. పోయిందా? 25 ఏళ్లు దాటినా నిలబడింది కదా! ఈ క్షణాన బాబు లేని టిడిపి వూహించలేం అనుకుంటాం. బాబు లేకపోయినా పార్టీ బతకవచ్చు. కాంగ్రెసు కూడా గాంధీ నెహ్రూలతో పోయిందా? రూపం మార్చుకుంటూ, నాయకుల్ని మార్చుకుంటూ బతికింది. విదేశీయురాలైన సోనియా వచ్చి పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందని ఎవరైనా కలగన్నారా? చరిత్రలో ఏదైనా జరగవచ్చని ఒప్పుకుంటే, ఎంతటి ఊహాగాన్నయినా వినే ఓపిక వస్తుంది.

అసలీ ఆలోచన ఎందుకు రావాలి? 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాలేదు కదా అంటే అప్పుడు బాబు ఫీనిక్స్ లాగ మళ్లీ పైకి లేస్తారు, జగన్‌కి పాలన చేతకాక చతికిలపడతాడు అనుకున్నారు. కానీ జగన్ పాలన నడిచిపోతోంది. దీర్ఘకాల దుష్ఫలితాల మాట ఎలా వున్నా ప్రస్తుతానికి సంక్షేమ పథకాల కారణంగా జనాభాలో సగం మంది ప్రజలు సంతుష్టిగా వున్నారు. కోర్టుల ద్వారా తప్ప రాజకీయంగా ఎదురు దెబ్బలు తగలటం లేదు. 

ఇటు టిడిపి చూస్తే నానాటికి నిస్తేజం అయిపోతోంది. కార్యకర్తల్లో పోరాడే ఉత్సాహం లేదు. గెలుస్తామనే హుషారు లేదు, ఇటీవల బాబు నాయకత్వంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. వాటిని ఖండించడానికి కూడా టిడిపి నాయకులు ముందుకు రావటం లేదు. కానీ యిలాటి పరిస్థితుల్లో కూడా టిడిపికి 30% ఓటు బ్యాంకు మిగిలింది. దాన్ని కాపాడుకోవాలంటే బాబుని ఎవరో ఒకరు ఎదిరించి బయటకు రావాలి. వాళ్ల వెనకాల ఎంతమంది కార్యకర్తలు, ఓటర్లు నిలబడతారన్నది బయటకు వచ్చినవారి సామర్థ్యంపై, వారిపై ఓటర్ల నమ్మకంపై ఆధారపడి వుంటుంది.

ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేసేటప్పుడు ఓటింగు సరళిని, శాతాలను గుర్తు పెట్టుకోవాలి. బెంగాల్ అనగానే కమ్యూనిస్టులది అనేస్తారు. 1950 నుంచి చూసుకుంటే 22 ఏళ్లు కాంగ్రెసు, 3 ఏళ్ల చిల్లర ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్లు, తృణమూల్ 10 ఏళ్లు పాలించాయి. ఏ పార్టీ అధికారంలో వున్నా దానికి యించుమించు సమాన స్థాయిలో ప్రతిపక్షం వుంటూ వచ్చింది. ఓట్లలో మహా అయితే ఏ 5% తేడాయో వుండవచ్చు. కేరళను కూడా కమ్యూనిస్టులది అనేస్తారు. కాంగ్రెసు కూటమికి, లెఫ్ట్ కూటమికి మధ్య 1-2% తేడాయే వుంటూంటుంది. సుమారుగా ప్రతి ఐదేళ్లకు అధికారం చేతులు మారుతూంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి 1983 వరకు 28 ఏళ్లు కాంగ్రెసే పాలించింది. దాని అర్థం 1983 వరకు నూటికి నూరు శాతం ఓట్లు కాంగ్రెసుకే పడ్డాయనా? ప్రతిపక్షాలు ఏకమై దాన్ని ఓడించలేక పోయాయనే అర్థం. అంతెందుకు యిప్పుడు ఆంధ్రలో జగన్ హవా గట్టిగా వీస్తోంది కదా, తాజా ఎన్నికలలో వారి ఓటింగు 52% మాత్రమే కదా. 48% వ్యతిరేకంగా వున్నారు కదా! దాన్ని కొన్ని ప్రాంతాలలోనైనా గుదిగుచ్చగలిగితే ఆ మేరకు అధికార పార్టీకి అడ్డుకట్ట వేసినట్లే! 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి 151 సీట్లు తెచ్చుకున్నపుడు కూడా 39% మంది దానికి వ్యతిరేకించి టిడిపిని బలపరిచారు కదా. తమిళనాడులో చూడండి, కాంగ్రెసు అధికారం పోగొట్టుకుని 54 ఏళ్లయింది. అయినా దానికి దాదాపు 10శాతం మంది ఓట్లేస్తున్నారు. అందువలన యిప్పటి ఫలితాలను చూసి టిడిపి దుకాణం ఖాళీ అనడం పొరబాటు. ఖాళీ అయినది టిడిపి కాదు, బాబు సత్తా! ఈ రెండిటికి మధ్య తేడాను మనం గుర్తించగలగాలి. నాయకుణ్ని మార్చి పార్టీని బతికించుకోగలిగితే వైసిపి యొక్క ప్రధాన ప్రతిపక్షం సజీవంగా వుంటుంది.

ఓటమి కలిగినప్పుడల్లా బాబు ‘నేను మారాను, మీరూ మారండి’ అని తన సహచరులకు ఉద్బోధ చేస్తూంటారు. ‘అలా అంటారు కానీ మారలేదు, మా మాట వినరు, తనకు తోచిందే చేసి మామీద రుద్దుతారు’ అని సహచరులు వాపోతూంటారు. కమ్యూనిస్టులు తప్పులు చేస్తారు, అది రైటేనని మూర్ఖంగా వాదిస్తారు. తప్పని చెప్పిన పార్టీ సభ్యులను ద్రోహులుగా ముద్ర వేసి బయటకు పంపేస్తారు. తమలో తాము కలహించుకుని, ముక్కలుముక్కలుగా విడిపోతారు. పాతికేళ్లు పోయాక అప్పుడు గతంలో చేసినది తప్పు అని తీర్మానం చేస్తారు. మళ్లీ కొత్త తప్పులు చేస్తారు. వృద్ధనాయకత్వం గద్దె దిగరు, కొత్త నాయకుల ఆలోచనలకు విలువ నివ్వరు. ఫలితం ఏమైందో చూశాం. ఒకప్పుడు కాంగ్రెసుతో కొన్ని రాష్ట్రాలలో పోటాపోటీగా ఢీకొన్న పార్టీ యిప్పుడు నామమాత్రంగా, చరిత్రలో అవశేషంగా మిగిలిపోయింది. కేరళలో అధికారంలో వుందన్న పేరే కానీ, వాళ్ల సిద్ధాంతాలతో ఏ మాత్రం పొసగని మతతత్వ పార్టీలతో, కులాధార పార్టీలతో పొత్తు పెట్టుకుని మనుగడ సాగిస్తున్నారంతే.

తప్పులు ఎప్పటికప్పుడు దిద్దుకోకపోతే టిడిపి కూడా అదే స్థితి వస్తుందేమోనన్న భయం నాది. బాబు వయసు పెద్దది కాదు. 70 ఏళ్లన్నది రాజకీయాల్లో పెద్ద ఎక్కువేమీ కాదు. ఆయనకు ఓపికుంది, సామర్థ్యముంది. ఆయనలో వున్నది ఏటిట్యూడ్ సమస్యంతే. చుట్టూ పాత నాయకులను వదుల్చుకోవడం లేదు, కొత్తవారిని ఆహ్వానించటం లేదు. కుమారుడు పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పొందలేకపోతున్నాడని గ్రహించినా వదలటం లేదు. నేను లోకేశ్‌ను పక్కన పెట్టి, పవన్‌ను తన వారసుడిగా ప్రకటించి, జనసేనను తన పార్టీలో విలీనం చేసుకోవాలని సూచించినప్పుడు కొంతమంది మందలించారు – ‘మీకేమైనా మతోయిందా? ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా అలా చేస్తాడా? అసంభవమైనవాటి గురించి మాట్లాడకండి.’ అని.

కరుణానిధి కొడుకుల్లో అళగిరి, స్టాలిన్ యిద్దరూ రాజకీయాల్లో వున్నారు. అళగిరి రౌడీ రాజకీయాలు చేస్తూంటే కరుణానిధి అతన్ని దక్షిణ తమిళనాడుకి పంపేశాడు, తన తర్వాత స్టాలినే అని పార్టీలో అందరికీ చెప్పాడు. అళగిరి గొడవ చేస్తే ఎంపీని చేసి కేంద్ర మంత్రి పదవి యిప్పించాడు. అతనికి తమిళం తప్ప ఏదీ రాక, దిల్లీలో అభాసు పాలయ్యాడు. దేవెగౌడకి కుమారస్వామి కాకుండా రేవణ్ణ అనే యింకో కొడుకు కూడా వున్నాడు. కానీ కుమారస్వామినే ముఖ్యమంత్రిని చేశాడు. రేవణ్ణను మంత్రిని చేసి వూరుకున్నాడు. బాబుకి లోకేశ్ కాకుండా వేరే కొడుకు వుంటే రాజకీయ వారసత్వం అతనితో ట్రై చేసేవారేమో! కానీ ఒక్కడే కొడుకు కావడంతో యిబ్బంది వచ్చింది. అందుకనే కాబోలు బాబు ఒక దశలో ‘నేను ఒక్కరితోనే ఆపేసి పొరపాటు చేశాను. మీరందరూ ఎక్కువమందిని కనండి.’ అని యువతకు ఉద్బోధించారు.

లోకేశ్ అంటే బాబుకి చాలా గర్వం. ‘వైయస్ పెంపకం చూడండి, నేనెలా పెంచానో చూడండి. మావాడు కార్నెగీ మెల్లాన్‌లో చదివాడు.’ అని గొప్పగా చెప్పుకున్నారు. అలాటి విద్యాధికుడు కార్పోరేట్ రంగంలోకి వెళ్లి ఏదో కంపెనీకి సిఇఓ అయిపోయి వుంటే బాగుండేది. రాజకీయాల్లో తిరగాలంటే చాలా ఓపిక వుండాలి. ఆయనకు ఆసక్తి, శక్తి తక్కువేమో! ఆసక్తి వుంటే శక్తి అదే వస్తుంది. వైయస్ రాజమండ్రిలో పాదయాత్ర చేస్తూంటే ఉండవల్లి కూడా తోడుగా నడుస్తానన్నారట. ‘నువ్వు నడవలేవు. దీనికి కసి అవసరం. పదవి వస్తే సరేసరి, లేకపోతే పోనీలే అనుకుంటావు నువ్వు. పదవి పొంది తీరాలి అనే పట్టుదల, కసి తీవ్రంగా వుంటే తప్ప యిలా నడవడం సాధ్యం కాదు.’ అని వైయస్ చెప్పారట. జైలుకి వెళ్లి వుండకపోతే జగన్‌కూ కసి పుట్టేది కాదేమో. పుట్టింది కాబట్టే అంత దీర్ఘ పాదయాత్ర చేయగలిగాడు.

బాబు కష్టపడి పైకి వచ్చిన మనిషి. ఇప్పటికీ ఆయనకు కసి వుంది. చిన్నప్పటి నుంచి లోకేశ్‌ కష్టపడినదేమీ లేదు. రాహుల్ లాగానే అయాచితంగా హోదా వచ్చింది కాబట్టి శ్రమపడటం లేదు. లేకపోతే పట్టుబట్టి ఆర్నెల్లు నేర్చుకుంటే సభలో మాట్లాడడం వచ్చేసి వుండేది. పోనీ ఇంగ్లీషు వచ్చు కాబట్టి ఇంగ్లీషు టీవీ ఛానెళ్లలో డిబేట్లకు వెళ్లవచ్చు. రాజ్యసభ ఎంపీగా వెళ్లి అక్కడ అద్భుతంగా మాట్లాడి, జాతీయ మీడియా దృష్టిలో పడవచ్చు. అతనికి కసి లేదు కాబట్టి యివేమీ చేయటం లేదు.

ఏ లోపాలున్నా సరే, నా కుమారుడు కాబట్టి వారసుణ్ని చేస్తాను అని బాబు పట్టుబడితే ఏమవుతుంది? లక్ష్మీపార్వతిని వదలనని ఎన్టీయార్ పట్టుబడితే ఆయన్నే దింపేశారు. లోకేశ్‌ను వదలనని బాబు పట్టుబడితే ఆయన్నీ దింపేసే ప్రమాదం లేదా? లక్ష్మీపార్వతిని చూపించి పార్టీ, కుటుంబసభ్యులు ఎన్టీయార్‌ను ఏకాకిని చేశారు. లోకేశ్‌‌ను చూపించి టిడిపి నాయకుడెవరైనా అదే పని చేయవచ్చు. బాబు వీక్‌గా వుంటే కదా, లోకేశ్ మాట వచ్చేది అనవచ్చు. కానీ 1995లో ఎన్టీయార్ వీక్‌గా వున్నారా? అఖండమైన మెజారిటీతో గెలిచి, వెలుగుతున్నారు. ఇప్పటి బాబులా వరుస ఓటములతో కుమలటం లేదు. అయినా ఆయన వీక్ స్పాట్ చూపించి, ‘పార్టీని బతికించుకోవడానికై మా ఆరాధ్యదైవాన్నే పసుపు విఘ్నేశ్వరుడిలా తీసి పక్కన పెట్టాం’ అని చెప్పుకున్నారు తిరుగుబాటుదారులు.

అదే సమస్య యిప్పటి టిడిపి నాయకులకు లేదా? పార్టీ ఎలాగైనా బతకాలి. లేకపోతే వైసిపి చేతిలో పచ్చడవుతారు. వైసిపిలోకి వెళదామంటే అక్కడ సీట్లన్నీ నిండిపోయాయి, పాత శత్రువుల వద్ద చేతులు కట్టుకుని నిలబడాలి, అంతకంటె బలమైన ప్రతిపక్ష నాయకుడిగా వుంటే మేలు. గతం మాట ఎలా వున్నా ప్రస్తుతం బాబు నీరసించారని, భవిష్యత్తుపై పార్టీ కాడర్‌కు ఆశలు కల్పించలేక పోతున్నారని, బాబు నాయకత్వంపై, టిడిపి గెలుపుపై సందేహాలు వచ్చి, టిడిపి నాయకులు ముందడుగు వేయటం లేదని అందరూ అనడమే కాదు, ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మార్చి 21 నాటి కొత్త పలుకులో రాశారు. వాటిలో నుంచి కొన్ని వాక్యాలు -

‘ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని, రాజకీయాలను పూర్తిగా విస్మరించడం వల్ల ప్రస్తుత దుస్థితి దాపురించింది... ఆయనంటే తెలుగుదేశం శ్రేణులకు అభిమానం, గౌరవమూ లేదు, భయమూ లేదు... అధికారంలో వున్నపుడు పదవులు అనుభవించినవారు కూడా మునిసిపల్ ఎన్నికల్లో చేతులెత్తేశారు. కొన్ని చోట్ల వైసిపితో లాలూచీ పడ్డారు... చంద్రబాబు వైపు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి... కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం నాయకులకు లేదనే చెప్పవచ్చు... పార్టీ కోసం చొక్కాలు చించుకొని పనిచేసినా కీలక సమయంలో పక్కన పెట్టరన్న గ్యారంటీ లేదని వాపోతూ, బలమైన నాయకులు తెగబడి పనిచేయడానికి జంకుతారు.

ఆంధ్ర ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో బాబు విఫలమయ్యారు. నిర్ణయాలు తీసుకోవడంలో అంతులేని తాత్సారం చేయడమే కాకుండా తప్పు చేసిన వారిపైన, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుంటారు… .వాడుకుని వదిలేస్తారు అన్న అపవాదు మోసుకుంటూ గడిపే నాయకులకు ఒడిదుడుకులు తప్పవు... టిడిపి పైనుంచి కింది వరకు లోపాలు సరిదిద్దుకుని కలిసికట్టుగా ముందుకు వెళితే భవిష్యత్తు ఉండకపోదు...'. ఇవన్నీ రాసి పార్టీకి కొత్తరక్తం అవసరం అని ముగించారాయన. అది కీలకమైన విషయం.

తరం మారిన కొద్దీ, కొత్త తరంగం రావాలి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొన్ని బ్యానర్లకు ఆస్థాన మ్యూజిక్ డైరక్టర్లుగా వుండేవారు. అయినా తండ్రుల స్థానంలో కొడుకులు నిర్మాతలయ్యేసరికి వాళ్లను పిలవడం మానేశారు. ఎందుకలా అని అడిగితే ఎల్‌పి చెప్పారు – ‘మ్యూజిక్ సిటింగులలో వీళ్లంతా చిన్నపిల్లలుగా మా చుట్టూ తిరిగేవారు. ఈ రోజు మా ట్యూన్ నచ్చకపోయినా, చెప్పడానికి వాళ్లకు సంకోచం వుంటుంది. నీకేం తెలుసురా కుర్రకుంకా అంటామన్న బెరుకు. ఎందుకొచ్చిన గొడవ అని యువ సంగీతదర్శకుల్ని పిలిచి వాళ్లతో ఫ్రీగా మాట్లాడుతూ పని చేయించుకుంటున్నారు.’ అని. ఇది అనేక కార్పోరేట్లలో కూడా చూడవచ్చు. కొత్తతరం వాళ్లు సంస్థలో భీష్ములకు నమస్కారం పెట్టి వెళ్లిపోతారు తప్ప వాళ్ల సలహాలు వినరు. అంతెందుకు వైయస్ పోయాక కెవిపి జగన్‌కు సలహాలు చెప్పగలిగారా? తన తండ్రికి ఫ్రెండయినవాడు తనకు ఫ్రెండు కాడంతే!

ఇప్పుడెవరైనా టిడిపిలో యువనాయకుడికి కొత్త ఐడియా వస్తే బాబు దగ్గరకు వెళ్లి ధైర్యంగా చెప్పగలడా? మహామహా వాళ్ల మాటే బాబు వినరు. మీకేం తెలుసు, మీ మొహం అంటారు. ఇక వీళ్లకు దిక్కెక్కడ? ఎగాదిగా చూసి ‘సరేలే, ఆలోచిద్దాం. నీకు రాజకీయాలు సరిగ్గా తెలియవు, నాది 40 ఏళ్ల ఇండస్ట్రీ. నేను రాజకీయాల్లో వచ్చిన పదేళ్లకి నువ్వు పుట్టావు.’ అంటే ఉత్సాహమంతా నీరు కారిపోతుంది. గతంలో ఎన్టీయార్‌ వద్దకు వెళ్లి చెప్పడానికి భయపడేవాళ్లంతా బాబు చుట్టూ తిరిగేవారు. ఆయనతో స్వేచ్ఛగా తమ భావాలు పంచుకునేవారు. ఇప్పుడు బాబుకి అలాటి వారు ఎవరూ లేరు. లోకేశ్ కనుక నిజమైన నాయకుడిగా ఎదిగి వుంటే, వీళ్లంతా అతని చుట్టూ చేరి వుంటే, బాబుకి ఎక్కువ పనిభారం లేకుండా వాళ్లే చక్కబెట్టేవారు. దేవెగౌడలా బాబు పైపై వ్యవహారాలు చూసుకునేవారు. కానీ ప్రస్తుతం లోకేశ్ కంటె బాబే పదిరెట్లు ఎక్కువ కష్టపడవలసి వస్తోంది.

ఇప్పుడు టిడిపిలో ఎవరైనా యువనాయకుడు బయలుదేరి, బాబు నాయకత్వంపై తిరుగుబాటు చేస్తే టిడిపిలో కొందరు అటు పోవచ్చు. ఎందుకంటే బలమైన టిడిపి ఓటు ఎటో అటు పోవాలి కదా! కాంగ్రెసుది వైసిపికి పోయినట్లు కౌంటర్ ఫోర్స్‌ అయిన టిడిపికి కూడా ప్రత్యామ్నాయం రావాలి కదా! ఇందిరా కాంగ్రెసు పాత కాంగ్రెసులోంచే ఉద్భవించింది. టిడిపిలోంచే తెరాస పుట్టింది. అలాగే టిడిపిలో తిరుగుబాటు రావచ్చు. వస్తే మాత్రం బిజెపి సహకారం దండిగా వుంటుంది. తమిళనాడులో జయలలిత వంటి బలమైన నాయకురాలు లేని పరిస్థితిని అక్కడ వాడుకున్నారు. చంద్రబాబు బలహీన పడిన సందర్భాన్ని వాళ్లు వాడుకోరని చెప్పలేం.

ఎన్టీయార్‌ని దింపడానికి యిద్దరు అల్లుళ్లు, కొడుకు తోడైనట్లు, ఒక కమ్మ, ఒక బిసి అధ్యక్షుడు, సెక్రటరీలుగా ముందుకు వస్తే చాలు, టిడిపిని చీల్చవచ్చు. బిజెపి వాళ్లతో పొత్తు పెట్టుకుంటుంది. వాళ్లకు బాబు అంటే అయిష్టం తప్ప టిడిపితో పేచీ ఏముంది? తమిళనాడులో శశికళను తప్పించి ఎడిఎంకెతో పొత్తు పెట్టుకోలేదా? జగన్‌కు అడ్డుకట్ట వేయాలంటే అదొక్కటే మార్గం. బాబు వెనుక దన్నుగా వున్న ధనిక అనుయాయులు - వారిలో కమ్మలు ఎక్కువమంది వుండవచ్చు, యితరులు కూడా వున్నారు - మోదీతో సున్నం పెట్టుకున్నందుకు ఆయనపై అలకతో వున్నారు. ఎందుకంటే మోదీ ప్రభ యిప్పట్లో తగ్గేట్టు లేదు. కొత్త టిడిపి మోదీతో సఖ్యంగా వుంటుందనుకుంటే వారి లాయల్టీ అటు తిరగవచ్చు. ఎవరూ ఎవరికీ ఎల్లకాలం అంటిపెట్టుకుని వుండరు.

ఈ తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పడం కష్టం. ఇలాటిది తలెత్తకుండా బాబు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు కాబట్టి ఏది ఏమౌతుందో యిప్పుడే చెప్పలేం. ఒకవేళ జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

Show comments