మూవీ రివ్యూ: చావు కబురు చల్లగా

చిత్రం: చావు కబురు చల్లగా
రేటింగ్: 2.5/5
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, రజిత, భద్ర, ప్రభు తదితరులు
కెమెరా: కర్మ్ చావ్లా
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటింగ్: జి. సత్య
నిర్మాతలు: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
విడుదల తేదీ: 19 మార్చ్ 2021

2019 డిసెంబర్లోనే అనౌన్స్ అయినా లాక్డవున్ అనే "చావు కబురు"తో ఆలస్యమయ్యి 2020 చివర్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టుకుని నేటికి "చల్లగా" రిలీజయ్యంది ఈ "చావు కబురు చల్లగా".

మొదటి పాట "మై నేం ఈజ్ రాజు" విడుదలైనప్పటి నుంచి దీనిపై జనం దృష్టి పడింది. రొటీన్ హీరో క్యారెక్టర్ కాకుండా ఏదో వైవిధ్యం చూపిస్తున్నారన్న భరోసా కలిగింది. తర్వాత అనసూయ పాటొకటి రిలీజయ్యి అది కూడా వెరైటీగానే అనిపించి ఇంకొంచెం అంచనాలు పెంచింది.

ఇంతకీ ఫైనల్గా సినిమా విడులయ్యాక ఆ భరోసాలు, అంచనాలు ఏమయ్యాయో చూద్దాం.

బస్తీ బాలరాజు (కార్తికేయ) రోజూ స్మశానానికి శవాల్ని మోసుకుపోయే బండి డ్రైవరు. మల్లిక (లావణ్య) రోజూ పుట్టిన పిల్లల్ని ఎత్తుకునే మెటర్నిటీ వార్డులో నర్సు. భర్త శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్న మల్లిక (లావణ్య) ని చూసి ప్రేమలో పడతాడు ఆ శవాన్ని మొయ్యడానికొచ్చిన బాలరాజు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తప్ప మరో కారణం ఏమీ ఉండదు. ఆమెని పెళ్లిచేసుకోమని జులాయిగా వెంటపడుతుంటాడు. 

ఈ బాలరాజు తల్లి గంగమ్మ (ఆమని). ఆమె భర్త పూర్తిగా మంచాన పడే ఉంటాడు. ఈమె మొక్కజొన్న కంకులు అమ్ముకుని బతుకుతుంటుంది. ఇంతకీ తల్లి, కొడుకు ఇద్దరూ మంచి తాగుడుప్రియులు. భర్త పోయిన మల్లిక, భర్త మంచమ్మీద పడ్డ గంగమ్మల జీవితాలు ఎలా మలుపు తిరిగి ఎక్కడాగుతాయన్నది కథ. 

బ్యాక్ డ్రాప్, ప్లాట్ పాయింటు వినగానే కొత్తగా ఉన్నమాట వాస్తవం. అయితే ఏ కథనైనా నడిపించడానికి అడుగడుగున లాజిక్ ఆలోచించనీయకుండా చేయగల స్క్రీన్ ప్లే, డయలాగ్ ఉండాలి. "ఎందుకిలా? ఏమిటిలా?" అనిపించే ప్రశ్నలకి సమాధానం కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయ్యాలంటే కష్టమే. పైగా సినిమాలో విలన్ లేనప్పుడు అదింకా కష్టం. 

ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు ఎదుటివాళ్లు వెంటనే ఒప్పేసుకోకపోవచ్చు. కాల క్రమంలో ఒప్పుకోవచ్చు. అయితే ఏ కారణం చేత వాళ్ల విముఖత సుముఖతగా మారిందనేది చాలా ఇంపార్టెంట్. మంచి కథనం అనిపించుకోవడానికి, కోకపోవడానికి అదే ముఖ్యమైన అంశం. కథలో వేరే పాయింట్ లేనప్పుడు ఆ "కారణం" దగ్గరే బలంగా నడపాలి. ఆ ఎమోషన్ కథనమంతా నడవాలి. కథ మొత్తాన్ని క్లైమాక్సులో ఒక సీనుకి పరిమితం చేసి, అక్కడే ఆ కారణం వినిపిస్తామని చెప్పి సినిమా మొత్తాన్ని క్లైమాక్స్ వరకు భరించమంటే ఇబ్బందే. 

బంధాలు, బంధుత్వాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. ఈ పాయింటు మీద దర్శకుడు కథైతే బాగానే రాసుకున్నాడు కానీ అవసరమైన ఎమోషన్ ని పండించడంలో విఫలమయ్యాడనలేం కానీ కస్త తడబడ్డాడని చెప్పొచ్చు. ఇలాంటి పెద్ద స్టార్స్ లేని సినిమాకి పకడ్బందీ స్క్రీన్ ప్లేయే ఆయువుపట్టు. స్క్రిప్ట్ మీద ఇంకా ఫోకస్ పెట్టుంటే బాగుండేది. మంచి కాన్సెప్ట్ తీసుకుని దానిని ఫార్ముల స్టైల్లో నడపాలనుకోవడం వల్ల అక్కడక్కడ నవ్వించినా కానీ ఫ్లాట్ అయిపోయింది. 

ఏదైనా ముఖ్యమైన క్యారెక్టర్ చనిపోతే ఆడియన్స్ కి షాక్ గానీ ఎమోషన్ గానీ కలగాలి. అది జరగలేదంటే ఆ పాత్రని ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా మలచలేదనే అర్థం. ఆ పాత్ర ఏమిటో ఇక్కడ చెప్పదలచుకోలేదు. స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇంతకంటే లోతులోకి వెళ్లట్లేదు. 

కార్తికేయ వెరైటీ క్యారెక్టర్లో బాగానే చేసాడు. కార్తికేయకి ఆమని తల్లిలా కనిపించలేదు. అక్కలా ఉంది. కార్తికేయలోని ముదురుతనమో, అంత పెద్ద కొడుక్కి తల్లిలా కనపడలేని ఆమని లోని నాజూకత్వమో..ఏదైనా కావొచ్చు. అయితే ఈ లోపాన్ని కథాపరంగా ఆమెకు 14 ఏళ్ల వయసప్పుడే కొడుకు పుట్టాడని చెప్పి కవర్ చేసారు. మోహన పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్ బాగున్నాడు. మురళీశర్మది మంచి పాత్ర, దానికి తగ్గ నటన. లావణ్య త్రిపాఠిది సీరియస్ రోల్ అనే చెప్పాలి. సినిమా పూర్తయ్యాక కూడా ఆమె ఏడుపు మొహమే గుర్తొస్తుంది. 

టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో బాగున్న అంశాల్లో మొదటిది పాటల్లోని సాహిత్యం. దాదాపు ప్రతి పాటలోనూ ఎంటెర్టైనింగ్ గా వేదాంతం చెప్పడం బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సాహిత్యం వినలేదు. సంగీతం కూడా బాగానే కుదిరింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. 

సినిమా మొదట్లోనే ఒక కార్డ్ వేసారు, "డ్రామా పండితే లాజిక్ అవసరం ఉండదు" అని. నిజమే. ఆ డ్రామా పండించడం పూర్తిగా కుదరకే చాలా చోట్ల లాజిక్ మిస్సవుతున్న ఫీలింగొస్తుంది. అదొక్కటీ సరిచూసుకునుంటే ఇది మంచి సినిమా అయ్యుండేది. 

బాటం లైన్: చల్లబడిపోయింది.

Show comments