మూవీ రివ్యూ: గాలి సంపత్

చిత్రం: గాలి సంపత్
రేటింగ్: 2/5
తారాగణం: శ్రీవిష్ణు,రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, కరాటె కళ్యాణి, అనీష్ కురువిల్ల, రజిత, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
సంగీతం: అచ్చు
ఎడిటింగ్: తమ్మిరాజు
కెమెరా: సాయి శ్రీరాం
నిర్మాత: కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి
దర్శకత్వం: అనీష్ కృష్ణ
విడుదల తేదీ: 11 మార్చ్ 2021.

దర్శకుడు కొత్తైనా అనీల్ రావిపూడి పేరుతో ఈ సినిమా విడుదలవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. రాజేంద్ర ప్రసాద్ మూగవాడిగా, శ్రీవిష్ణు అతని కొడుకుగా కనిపించిన ట్రైలర్లో ఏదో విషయం ఉందన్న అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యింది. కథలో భావోద్వేగాలు, సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్, కామెడీ ఇలా అన్ని రసాలు రంగరించారన్న సూచన కూడా కనిపించింది. ఇంతకీ ఆ మిశ్రమం ఎలా ఉందో పరిశీలిద్దాం.

గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) అరకులో నివసించే వ్యక్తి. అతనికి మాటల్రావు. 'ఫి... ఫి... ఫీ' అంటూ గాలితోనే మాట్లాడతాడు. సత్య అతని భాషకి అనువాదకుడు. సంపత్ కి నాటకాల పిచ్చి. ఎప్పటికైనా నాటకాల్లో గొప్ప నటుడిగా పేరు సంపాదించాలనుకుంటాడు. 

అదలా ఉంటే సంపత్ కి ఒక కొడుకుంటాడు (శ్రీవిష్ణు). అతనికి ఆ ఊరి సర్పంచ్ కూతురితో (లవ్లీ సింగ్) పరిచయం ప్రేమాయణంగా మారుతుంది. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్‌. ఓ బ్యాంకు మేనేజర్‌ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు.

ఆ మాటకి నిజంగా వెళ్లిపోవాలనుకోడు గానీ ప్రమాదవశాత్తూ ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. అరవాలంటే గొంతు పనిచెయ్యదు. ఏదైనా చప్పుడు చేసినా బయటికి వినపడదు. అక్కడినుంచి అతను బయట పడ్డాడా లేదా అనేది సినిమాలో మెయిన్ ప్లాట్. 

రాజేంద్ర ప్రసాద్ ఫిఫిఫి భాష కాసేపు పర్వాలేదు గానీ, కంటిన్యూ అవుతున్న కొద్దీ విసిగిస్తుంది. ప్రతీ డయలాగ్ కి పక్కన సత్య అనువాదం చేయడం వల్ల ఆ సీన్లన్నీ పొడవుగాను, బరువుగానూ అనిపిస్తాయి. శ్రీవిష్ణు చాలా ట్యాలెంట్ ఉన్న నటుడు. ఏ పాత్రనైనా తేలిగ్గా చేయగల దిట్ట. తన పాత్రని ఉన్న నిడివిలో చక్కగా చేసాడు. హీరోయిన్ లవ్లీ సింగ్ కంటికింపుగా ఉంది. మంచి ఫోటొజెనిక్ ఫేస్. నటన కూడా పర్వాలేదు. మరిన్ని అవకాశాలు పొందగలిగే విషయం ఆమెలో ఉంది. 

శ్రీకాంత్ అయ్యంగర్, అనీష్ కురువిల్లల ట్రాక్ జంధ్యాల కాలం నాటి కామెడీ ట్రాక్ ని చూసి వాతలు పెట్టుకున్నట్టుంది. మరీ సిల్లీగా, అసహజంగా ఉంది. 

సాంకేతికంగా సంగీతం, కెమెరా వర్క్ వగైరాలు బాగానే ఉన్నాయి.  స్క్రీన్ ప్లే పరంగా చాలా లోపాలున్న సినిమా ఇది. ప్రతీదీ డైరెక్టర్ కి కన్వీనియంట్ గా ఉండే విధంగా రాసేసుకున్నారు. గోతిలో పడిన రాజేంద్ర ప్రసాద్ కి వినపడడానికన్నట్టుగా కావాల్సిన పాత్రలు ఆ గోతి పక్కన సిమెంట్ బల్ల మీద కూర్చుని మాట్లాడతాయి ఇంకెక్కడా చోటు లేనట్టు. 

ఆ గోతిలో అన్ని రోజులు రాజేంద్రప్రాసద్ ఎలా ఉంటాడా అని ప్రేక్షకులు అనుకోగానే ఒక పిల్లాడు ఆ గోతిలోకి ఏవో చిప్స్ ప్యాకెట్లు, వాటర్  బాటిల్ విసురుతుంటాడు. అలా అంతా కృతకమైన ఏరేంజ్మెంట్ కనిపిస్తుంది తప్ప తెలివైన రచన, సహజమైన స్క్రీన్ ప్లే కనపడదు. ప్రేక్షకులని చాలా తక్కువ అంచనా వేసి టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని, పెద్దగా బుర్రకి పని చెప్పకుండా తయారుచేసిన చిత్రం ఇది. సినిమాటిక్ లిబెర్టీస్ పేరుతో కథనంలో టెన్షన్ పెంచడానికి బదులు ప్రెడిక్టెబుల్ చేసేసుకున్నట్టనిపిస్తుంది. 

కొన్ని చోట్ల లాజిక్ మీద ఫోకస్ పెట్టలేక ఆకాశంలో శివలింగం ఆకారంలో మేఘాన్ని చూపించి డివైన్ ఎలెమెంట్ ని కూడా తీసుకొచ్చారు. ఈ కథ మీద మరింత పని చేసి ఇంకా పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకునుంటే మంచి సినిమా అయ్యుండేది. 

బాటం లైన్: గాలి పోయింది.

Show comments