స్టీల్ ప్లాంట్ ఊసెత్తని సోము?

విశాఖ వచ్చి మరీ తన అభ్యర్ధుల తరఫున బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు  ప్రచారం చేసుకున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ఎవరి పార్టీ  విజయాల కోసం ఆయా పార్టీల  అధినాయకులు వచ్చి జనాలను కోరడం సహజాతిసహజం.

కానీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఈసారి  విశాఖకు వచ్చిన సమయం చాలా భినమైనది, ప్రత్యేకమైనది.  ఒక వైపు విశాఖలో  ఉక్కు ప్రైవేట్ పరం చేయవ‌ద్దు అంటూ నెల రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.

అటువంటి వేళ పచ్చని ఉక్కులో ప్రైవేట్ చిచ్చు పెట్టిన కేంద్రంలోని బీజేపీ ఏపీ శాఖకు సోము ప్రెసిడెంట్. మరి ఆయన విశాఖ వస్తే కచ్చితంగా ఇక్కడ జనాల అతి ముఖ్య సమస్య మీద మాట్లాడాలి కదా. మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోదు అని గట్టి భరోసా ఇవ్వాలి కదా.

అవేమీ కాకుండా విశాఖలో ఏమీ జరగనట్లుగా భావించి సోము తన ఎన్నికల ప్రచారాన్ని చేసుకుని వెళ్ళడమే విచిత్రం, విడ్డూరం, కడు బాధాకరం. విశాఖలో బీజేపీ బలమైన పార్టీ అని ఇక్కడ జనాలు మొదటి నుంచి ఆదరించారని చెబుతున్న సోముకు అదే జనాల ఉక్కు బాధ తన బాధ అనిపించలేదా అని ఉక్కు కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు కేంద్రంలోని బీజేపీ ఉక్కు ప్రైవేటుకు ఒక్కో అడుగూ ముందుకు వేస్తూంటే సోము వీర్రాజు మాత్రం అలాంటిదేదీ లేదని నిన్నటి దాకా మాట్లాడారు. ఇక ప్రధాని మోడీ ఒక వెబ్ నార్ లో ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేట్ పరం చేయడం ఖాయమని కుండబద్దలు కొట్టేసారు. ఆ మీదట అయినా సోము ఉక్కు కర్మాగారం విషయంలో ఏపీ బీజేపీ వైఖరి ఏంటో చెప్పలేదని ఉక్కు కార్మికులు విమర్శిస్తున్నారు. 

మొత్తానికి మోడీ ఊసెత్తకుండా చంద్రబాబు విశాఖలో ఉక్కు పోరాటానికి మద్దతు ఇస్తే అసలు ఉక్కు పరిశ్రమ అన్న మాటే అనకుండా సోము తన ఎన్నికల రాజకీయాలను కొనసాగించారు అంటున్నారు ఉక్కు బాధితులు.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

పవన్ ఓ మానసిక రోగి

Show comments