ఆంధ్రజ్యోతి-నాందీ ప్రస్తావన

ఎంత కాదన్నా, ఎంత లేదన్నా, ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీని దర్శించడం అన్నది రాజకీయ ఆసక్తి వున్న జనాలకు అలవాటైపోయింది. సామ్నా, పాంచజన్య లాంటి రాజకీయ పత్రికల మాదిరిగా తెలుగుదేశం భావాలు, భావజాలం ఆంధ్ర జ్యోతి ద్వారా బయటపడతాయని రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు ఓ స్థిర నిర్ణయానికి వచ్చేసారు. 

2014లో నానా బాధలు పడి, నానా లయిజినింగ్ చేయించుకుంటే తప్ప తెలుగుదేశం-భాజపా బంధం ముడిపడలేదు. అది తెరవెనుక దాగిన బహిరంగ రహస్యం. అలా నానా కష్టాలు పడిన బంధం అమరావతి విషయంలో మోడీ నుంచి సహకారం రావడం లేదని, ఇచ్చిన ప్రతి పైసాకు లెక్కలు, జమా ఖర్చులు అడుగుతున్నారని అన్నింటికి మించి తమకు సహాయకారిగా వున్న వెంకయ్య నాయుడుకు మంచి పదవి ఇచ్చినట్లే ఇచ్చి, యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం చేసారని భావించారు. 

ఇవన్నీ మరీ భయంకరమైన ఇబ్బందికర అంశాలుగా భావించారు. అంతే తప్ప మోడీకి ఇంకా జనాల్లో వున్న చరిష్మాను గమనించలేదు. అలాంటపుడు భాజపాకు-తెదేపా కు మధ్య వున్న దూరాన్ని వీలయినంత ఎడం చేయడంలో కీలకపాత్ర వహించింది ఆంధ్ర జ్యోతి వార్తలు, వంటకాలే. ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డుగా తెలుగుదేశం జనాలు కూడా అంగీకరిస్తారు.

సరే అయిందేదో అయిపోయింది, తెలుగుదేశం పార్టీ తన తప్పిదానికి మూల్యం చెల్లించింది. ఇప్పుడు గత ఏడాదిన్నరకు పైగా చంద్రబాబు మౌనం పాటిస్తున్నారు. ఆయన నోటి వెంట కానీ ఆయన పార్టీ జనాల నోటి వెంట కానీ మోడీ-కేంద్రం అన్న రెండు పదాలు పొరపాటున కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో పెట్రోలు డీజిల్, గ్యాస్ ధరలు, కేంద్రం తీసుకుంటున్న డీ నేషనలైజేషన్ విధానాలు వంటి వ్యవహారాలు బయటకు వచ్చాయి. జనాల్లో నానా గడబిడ ప్రారంభమైంది. అయినా కూడా చంద్రబాబు కానీ ఆయన పార్టీ కానీ పెదవి విప్పడం లేదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ గురించి మాట్లాడడం లేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని భాజపా ఖాతా నుంచి తీసి వైకాపా ఖాతాలో వేసి, విశాఖలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో కుండ బద్దలు కొట్టేసారు. మరోసారి తెలుగుదేశం పార్టీకి భాజపాకు మధ్య బంధాన్ని పుటుక్కున తెంపేదుకు తాను చేయగలిగినంతా చేసేసారు. తన ఎబిఎన్ స్టూడియో లో జరిగిన అనుకోని సంఘటనను ఆయనే భూతద్దం కిందకు తీసుకువస్తున్నారు. సంఘటన జరిగిన తరువాత భాజపా ఓ రేంజ్ లో ఏమీ స్పందించలేదు. కానీ  ఎప్పుడయితే దానికి మూలమైన వ్యక్తిన మళ్లీ స్టూడియోలోకి తీసుకువచ్చి, డిస్కషన్ లో కూర్చో పెట్టడం అంటే అవతలి పార్టీని రెచ్చగొట్టడమే అవుతుంది. ఈ సంగతి ఆర్కేకు తెలియంది కాదు. వీళ్లేం చేస్తారో చూద్దాం అనుకున్నారు.

ఎబిఎన్ ను బహిష్కరిస్తున్నాం అంది రాష్ట్ర భాజపా. కానీ ఆర్కే వ్యవహారం వేరు. ఎబిఎన్ సంబంధిత ఆంధ్రజ్యోతిలో భాజపా సత్యకుమార్ ప్రతి వారం కాలమ్ రాస్తారు. వెంకయ్య నాయుడు కాలమ్ రాస్తారు. ఇప్పుడు అవేమీ ఆగిపోవు కదా. ఇక అప్పుడు బాయ్ కాట్ అంటే అర్థం ఏమిటి? కన్నా లక్ష్మీనారాయణ బాయ్ కాట్ చేయలేదు. ఏం పీకుతారో చూడాలి అన్న రేంజ్ లో ఆర్కే ప్రశ్నించారు. 

ఇవన్నీ ఈ వివాదాన్ని మరింత దూరం  తీసుకెళ్లేవే తప్ప మరోటి కాదు. అన్నింటికి మించి భాజపా నాయకుల మీద ఓ రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా ఆర్కే ఆరోపణలు చేసారు. ఆ నలుగురు జగన్ మనుషులు అని ఆయనే స్వయంగా బురద వేసారు. ఈ మాట రాజకీయ నాయకులు అంటే వేరు. ఓ మీడియా అధినేత అంటే వేరు. ఇప్పుడు కచ్చితంగా ఆ నలుగురు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాల్సిందే. ఆర్కే మీద ఎదురుదాడి చేయాల్సిందే.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఏ విధంగా వుంటాయి. ఇంకా భాజపాకు దగ్గర కావాలనే అనుకుంటుందా?  మోడీకి లేఖ రాయడానికే బోలెడు టైమ్ తీసుకున్నారు చంద్రబాబు. రాష్ఠ్రంలో మోడీ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. మోడీ అన్ని విధాలా కార్నర్ అవుతున్నారని గమనించి ఆఖరికి ఉత్తరం రాసే ధైర్యం చేసారు. మరోపక్కన తెలుగుదేశం పార్టీతో తెరవెనుక భవబంధాలు వున్నవారంతా మోడీని విమర్శించే పనికి చిన్నగా శ్రీకారం చుట్టారు. 

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి నేరుగా భాజపా కీలక నాయకులను టార్గెట్ చేసింది. వాళ్లు జగన్ మనుషులు అని బురదేసింది. ఇలా బురద పడిన వాళ్లలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, రాష్ట్ర భాజపా కేంద్ర పరిశీలకుడు వున్నారు. ఇంతకన్నా కుదుపు ఏమి కావాలి? మీరంటే చంద్రబాబుకు భయమేమో? నాకు కాదు అనడం ద్వారా బాబుగారిని కూడా కార్నర్ లోకి తోసారు. త్వరలో పవన్ కూడా భాజపా నుంచి బయటకు వస్తారని అనడం ద్వారా జనసేనను కూడా సైకలాజికల్ డీల్ లోకి లాక్కు వచ్చారు.

అన్నింటికి మించి ఆర్కే చేసిన కీలకమైన కామెంట్ మరోటి వుంది. మోడీ విధానాల ద్వారా రిజర్వేషన్ వర్గాలకు ముప్పు వస్తోందని, ప్రయివేటు బారిన సంస్థలు పడితే, రిజర్వేషన్ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయనే కొత్త వాదనను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా భాజపా డిఫెన్స్ లో పడుతుంది. 

కొద్ది రోజుల కిందట వరకు తిరుపతి బరిలో భాజపా దిగుతుందని, తేదేపా పరిస్థితి మూడో ప్లేస్ అని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తామే ఫార్వార్డ్ స్టెప్ తీసుకోవాలని తేదేపా ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు భాజపాను కార్నర్ లోకి తోయడం ద్వారా తేదేపా అవకాశాలు మెరుగు అవుతాయి. విశాఖ తదితర మున్సిపాల్టీ ఎన్నికల్లో కాస్త ధైర్యం దొరికితే తెలుగుదేశం పార్టీ ఇక మరోసారి యాంటీ మోడీ స్టాండ్ తీసుకుంటుంది. అందుకు పైలట్ ఎపిసోడ్ మాదిరిగా చోటా మోటా నాయకుల ప్రెస్ మీట్లు, ఆంధ్రజ్యోతి కారాలు మిరియాలు ప్రయోగిస్తున్నారు. 

మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పేరుకు జనసేన-భాజపా పొత్తు , కానీ గ్రామాల్లో జరిగింది తేదేపా-జనసేన పొత్తు. ఇదే పొత్తు ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఖరారు కావచ్చు. భాజపా ఒంటరిపోరుకు రెడీ అయిపోవాల్సి వుంటుంది. వీళ్లందరనీ ఢీ కొనడానికి వైకాపా సన్నద్దం కావాల్సి వుంటుంది. 

అందుకు నాందీ ప్రస్తావనే ఇప్పుడు జరుగుతున్నందంతా. వ్యక్తిత్వ హననం అనే విద్యలో తెలుగునాట కొన్ని మీడియాలు ఆరితేరిపోయాయి. విభజనపాపం కాంగ్రెస్ మీద వేసి అదే పాపంలో వున్న భాజపాను హీరోను చేసిన మీడియానే ఇప్పుడు అదే భాజపాను ఆంధ్రలో దోషిని చేయబోతోంది. అందుకు బలికావడానికి భాజపా రెడీ అయిపోవాల్సిందే. 

ఎందుకంటే ఆ పార్టీకి నాయకులు వున్నారేమో కానీ కింది స్థాయిలో బలం లేదు. నాయకులు కూడా ఎంత గొంతు చించుకున్నా వినిపించాల్సింది మళ్లీ ఈ మీడియానే. అందువల్ల భాజపా వ్యక్తిత్వ హననానికి శ్రీకారం చుట్టారు. దారిలోకి వచ్చి జగన్ ను టార్గెట్ చేస్తారా? లేక ఇలాగే ముందుకు సాగి వారే టార్గెట్ అవుతారా? వెయిట్ అండ్ సీ. 

ఆర్వీ

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

Show comments