నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారినట్లు కనిపిస్తుంది. తాజాగా వచ్చిన విశాఖ స్టీల్ సమస్య వారిని ఇబ్బంది పెడుతోంది. ఒక వైపు ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ కాని, ఇతర కేంద్ర మంత్రులు కాని ప్రైవేటీకరణకు అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో ఎపి బిజెపి వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేని దశలో ఉన్నారు. దాంతో వారు ఏమీచేయాలో తోచక మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టి మాట్లాడుతున్నారనిపిస్తుంది.

ఎవరైనా అలా  మాట్లాడుతుంటే మనం  ఏమని అనుకుంటాం. వీరికి ఏదో అయిందని అనుకుంటాం. భారతీయ జనతా పార్టీ నేతలు అలాగే మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వీరు తాజాగా చేస్తున్న వాదన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నవ్వు కూడా తెప్పిస్తుంది.

ఎపిలో ఆలయాలపై దాడుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను వైసిపి, టిడిపి, కమ్యూనిస్టు పార్టీలు తెరపైకి తెచ్చాయని బిజెపి ఎపి అద్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్లీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. 

నిజానికి వీరిద్దరూ గతంలో కొంత హేతుబద్దంగా మాట్లాడతారన్న బావన ఉండేది. ఏవైనా నిర్దిష్ట ఆరోపణలు చేస్తే అందులో ఎంతో కొంత మెటీరియల్ ఉంటుందని అనుకునేవారు. కాని తాజాగా వారు చేసిన వ్యాఖ్యలతో వీరు కూడా రొటీన్ రాజకీయాలకు అలవాటు పడిపోయారని అర్దం అవుతుంది.

అంతేకాక ఎపిలో బిజెపి దయనీయ పరిస్థితిలో ఉండడం వల్ల కూడా వీరికి కొంత నిరాశ ఎదురు అవుతుండవచ్చు. విశాఖ స్లీట్ ప్రాంట్ ప్రైవేటైజేషన్ పై కేంద్ర అధికారి ఒకరు ట్వీట్ చేసిన మాట నిజం. కేంద్ర ఆర్దిక వ్యవహారాల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే నేరుగా విశాఖ స్టీల్ గురించి కాకపోయినా, ప్రదాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

మరో వైపు  స్టీల్ ప్లాంట్ విషయంపై  విశాఖలోనే కాకుండా, ఎపి అంతటా దీనిపై సెంటిమెంట్ ఏర్పడింది. విశాఖ ఉక్కు-ఆంద్రుల హక్కు అన్నభావనకు గండం ఏర్పడుతోందని అంతా బావిస్తున్నారు. బిజెపి నేతలు కూడా మొదట తాము కూడా ప్రవైటైజేషన్ కు అనుకూలం కాదని , డిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తామని వెళ్లారు. 

సోము వీర్రాజుతో పాటు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. కొందరు మంత్రులను వీరు కలిశారు. హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం వీరు ప్రయత్నించారు కాని ఆయన అందుబాటులోకి రాలేదు.

ఒక సమాచారం ప్రకారం వీరికి కేంద్రంలోని పెద్దలు ఎవరూ నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. బిజెపి అద్యక్షుడు జెపి నడ్డాను కలిస్తే, పార్టీ వ్యవహారాలకే తాను పరిమితం అని స్పష్టం చేశారట. దాంతో వీరు ఏమి చేయలేక నిస్సహాయంగా వెనుతిరిగారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేయాలని భావించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవైటైజ్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? ఉద్యోగులను తప్పుదారి పట్టించి ఉద్యమం ఎలా చేస్తారు? కేంద్రం ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది అని అంటూ, వీరు ఎక్కడా ప్రైవైటైజ్ కాబోదన్న హామీని ఇవ్వలేకపోయారు. అదేమిటంటే ఎపిలో బిజెపి అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్న భయంతో ఆ పార్టీలు కుట్ర పన్ని బిజెపిని అప్రతిష్ట పాలు చేస్తున్నాయని వారు చిత్రమైన ఆరోపణ చేశారు.  

బిజెపి జాతీయ నేతలు అప్పట్లో వాజ్ పేయి , ఆ తర్వాత నరేంద్ర మోడీ ల వల్ల కొన్నిసార్లు ఎపిలో కూడా సానుభూతి వచ్చిన మాట నిజమే. అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది. అంతకు మించి బిజెపి ఎపిలో ఎన్నడూ పుంజుకోలేదు. సమీప భవిష్యత్తులో పుంజుకుంటుందన్న గ్యారంటీ లేదు.

2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా తమ పార్టీలోకి వస్తారని బిజెపి ఆశించింది. కాని అది జరగలేదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలకు గుడ్ బై చెప్పి బిజెపి పొత్తులో మళ్లీ చేరారు. అయినా పంచాయతీ ఎన్నికలలో వీరిద్దరూ కలిసి ప్రభావం చూపింది చాలా తక్కువ. పైగా కొన్ని చోట్ల జనసేన, టిడిపి సహకరించుకున్నాయని కూడా అంటారు. అంతేకాదు. 

పవన్ కళ్యాణ్ కూడా మొదట విశాఖ స్టీల్ విషయంలో సీరియస్ గానే స్పందించారు .బిజెపితో పొత్తు వదలుకోవడానికి కూడా సిద్దమే అన్నట్లు ఆయన ప్రకటించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి డిల్లీ వెళ్లి అమిత్ షా తో సహా కొందరిని కలిసి వచ్చారు. ఆ మీదట ఏమైందో కాని వారి స్వరం మారింది.  రాష్ట్రంలోని వైఎస్  ఆర్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం ఆరంభించారు. పవన్ కళ్యాణ్ దీక్షకు దిగుతానని చెప్పినా ఆ పని చేయలేదు.

అలాగే బిజెపి నేతలు కూడా డిల్లీలో  వారు అనుకున్నది సాధించలేక వెనుదిరిగి, దేవాలయాలపై దాడుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి స్టీల్ ప్లాంట్ అంశం తెస్తున్నారని పిచ్చి ఆరోపణ చేశారు. ఎపిలో దేవాలయాలపై దాడులు ,విగ్రఃహాల ద్వంసం ఘటనలు కొన్ని జరిగిన మాట నిజం. పోలీసు ఉన్నతాదికారులు కాని,ప్రభుత్వం కాని బాగా సీరియస్ అయి వెంటనే చర్యలు తీసుకున్నారు. 

ఆ ఘటనల వెనుక తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల ప్రమేయం ఉందని తేలడం,వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆ దాడులు ఆగిపోయాయి. ఇందుకు ప్రభుత్వాన్ని అబినందించాల్సింది పోయి , లేని విషయాన్ని మళ్లీ ప్రస్తావించి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి వీర్రాజు, జివిఎల్ లు తంటాలు పడ్డారు. ఇక్కడే వారు హేతుబద్దతను కోల్పోయారు.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటన విషయంలో బిజెపి అక్కడ పెద్ద ఆందోళనే నిర్వహించింది. మరో వైపు ప్రభుత్వం ఆ ఘటనపై విచారణకు సిబిఐకి అప్పగించింది. కేంద్రం ఇంతవరకు స్పందించలేదు. దానిపై బిజెపి నేతలు వివరణ ఇవ్వలేకపోతున్నారు. అదే సమయంలో అంతర్వేది ఆలయానికి కొత్త  రధాన్ని మూడు నెలల్లో నిర్మించి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అందులో పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. 

ఇలా రధ నిర్మాణం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ ను అభినందించకపోతే మానే, మళ్లీ ఆలయాలపై దాడులు అంటూ పాతపాట పాడడం చేశారు.అలాగే పంచాయతీ ఎన్నికలలో అరాచకాలు జరిగాయని , బిజెపి జనసేన లు ప్రత్యామ్నాయంగా ఎదగడం ఇష్టం లేక వైసిపి ,టిడిపి కలిసి విశాఖ స్టీల్ అంశాన్ని సృష్టించాయని బజెపి నేతలు ఆరోపించడం విడ్డూరంగా ఉంది.

వైసిపి,టిడిపిల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పోటాపోటీ వాతావరణం కొనసాగుతుంటే, బిజెపి మాత్రం విరుద్దంగా మాట్లాడుతోంది.వారికి వాస్తవం తెలియక కాదు. ఎపి బిజెపి నేతలు డిల్లీ వెళ్లి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ను ఆపాలని కోరినప్పుడు వారు వీరికి క్లాస్ పీకారని పార్టీ లో గుస,గుసలు వినిపిస్తున్నాయి. 

ఆ విషయం బయటకు చెప్పలేరు కనుక ఆలయాలపై దాడులనో, మరొకటనో పిచ్చి వాదన తయారు చేసుకుని బిజెపి నేతలు ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నారని చెప్పాలి. విశాఖలో ఒకప్పుడు బిజెపి కాస్త బలంగానే ఉండేది. కాని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దెబ్బకు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది.అందుకే వారు ఇంత ఆందోళన చెందుతున్నట్లుగా ఉంది.

స్లీట్ ప్రైవేటైజేషన్ జరగకుండా అటు  కేంద్రాన్ని ఒప్పించలేక, ఇటు విశాఖ ప్రజలనుంచి ఎదురయ్య వ్యతిరేకతను తట్టుకోలేక బిజెపి నేతలు గందరగోళంలో పడ్డారని చెప్పాలి. వారు ఆ గందరగోళం నుంచి ఎప్పటికి బయటపడగలుగుతారో? ఎప్పటికి వారు ప్రత్యామ్నాయంగా ఎదగగలుగుతారో?అన్నది దేవుడికే ఎరుక అనుకోవాలి.

కొమ్మినేని శ్రీనివాసరావు

పవన్ ఓ మానసిక రోగి

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

Show comments