అదే జ‌రిగితే జ‌గ‌న్ కు రెండోసారి ఢోకా లేన‌ట్టే!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న దాదాపు రెండేళ్లు పూర్తి అవుతున్న త‌రుణంలో జ‌రిగిన ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని చాటుకుంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదార్లు ఘ‌న విజ‌యాల‌ను సాధించారు. కొన్ని చోట్ల వ‌ర్గాలు చీలినా.. రెండేళ్ల అధికార కాల‌పు ప‌రిణామాల‌తో కొంద‌రు కార్య‌క‌ర్త‌లే అసంతృప్తితో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌మంటూ ప్ర‌క‌టించుకున్నా.. అంతిమంగా పార్టీ మ‌ద్ద‌తుదార్లు విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే త‌మ‌దే రాజ్య‌మంటూ కొంద‌రు భావించారు. టీడీపీ హ‌యాంలో ప‌చ్చ‌చొక్కాలు ఎలా అయితే రాజ్యం చేసి దండుకున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే తాము కూడా  అలా హ‌వా చెలాయించ‌వ‌చ్చ‌ని కొంద‌రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా ఆశించారు. 

ప‌ల్లెల్లో ఇలాంటి వారు చాలా మందే త‌యార‌య్యారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా వీళ్ల‌కు ద‌క్కిన ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవు. జ‌న్మ‌భూమి క‌మిటీ త‌ర‌హాలో జ‌గ‌న్ ఏ ఏర్పాట్లూ చేయ‌క‌పోవ‌డం,  ఆపై వ‌లంటీర్లు, విలేజ్ సెక్ర‌టేరియ‌ట్లు రావ‌డంతో... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు భంగ‌ప‌డ్డారు. త‌మ‌కు ఎలాంటి అవ‌కాశం రాలేద‌ని బాహాటంగానే అసంతృప్తిని చాటారు.

వీరిలో కొంద‌రు ఎమ్మెల్యేల‌కు బుద్ధి చెప్పాల‌నో, పార్టీకి బుద్ధి చెప్పాల‌నో.. లెక్క‌లేశారు. అందుకే..చాటుగా తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికిన వారు కొంద‌రైతే, మ‌రి కొంద‌రు బాహాటంగానే టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. 

తెలుగుదేశం అభ్య‌ర్థిని గెలిపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తామంటూ వీరిలో కొంద‌రు ఎమ్మెల్యేల‌కు స‌వాళ్లు కూడా చేసి వ‌చ్చార‌ట‌. అయితే.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం కార్య‌క‌ర్త‌ల చేతుల్లో లేద‌ని, అది ప్ర‌జ‌ల వ‌ర‌కూ వెళ్లిపోయింద‌నే విష‌యాన్ని వారు గ్ర‌హించ‌లేక‌పోయిన‌ట్టుగా ఉన్నారు.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, అందులోనూ చెప్పిన‌వి చెప్పిన‌ట్టుగా చేయ‌డం.. ఇది జ‌గ‌న్ లో ప‌ల్లె ప్ర‌జ‌ల‌కు బాగా న‌చ్చింది. ప‌ల్లె ప్ర‌జ‌లు ఎలాంటి పౌరుషాలు, రోషాలు, మాట‌ప‌ట్టింపుల‌తో ఉంటారో.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా అలానే క‌నిపిస్తున్నారు. ఒక నాయ‌కుడిలో ఇలాంటి ల‌క్ష‌ణాలు అరుదుగా ఉంటాయి. 

అధికారం అందే వ‌ర‌కూ ఎలా ఆలోచించినా, ప్ర‌జ‌ల‌కు ఎన్ని మాట‌లు చెప్పినా, నిజంగానే మాట‌ల నిల‌బెట్టుకోవాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నా.. తీరా అధికారంలోకి వ‌చ్చాకా మాత్రం నేత‌లు ఏవో లెక్క‌లు వేస్తారు, త‌మ‌కు తాము మిన‌హాయింపుల‌ను ఇచ్చుకుంటారు. అయితే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. అధికారం అందే ముందు ఎలా ఉన్నారో, అధికారం అందాకా కూడా అలానే ఉండ‌టంతో.. ప‌ల్లె ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల పూర్తి ఆమోదం ఉంది.

అక్క‌డ‌కూ ప‌ల్లెల్లో జ‌గ‌న్ ప‌ట్ల కొంత అసంతృప్తి కూడా ఎన్నిక‌ల‌కు ముందు అంచ‌నా వేసింది మీడియా. ఆ అసంతృప్తి కార‌ణం.. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తులు. ఐదారు ఎక‌రాల‌కు మించి భూములున్న రైతుల‌కు, ఇంట్లో ఒక్క‌రు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసినా.. అనేక సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి వారికి అంద‌దు. 

రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ, నెల్లూరు- ప్ర‌కాశం జిల్లాల్లో చూస్తే.. చాలా ప‌ల్లెల్లో ఐదారు ఎక‌రాల‌కు మించి భూములున్న రైతులే ఉంటారు. ఇప్ప‌టికీ అక్క‌డ ప‌దుల ఎక‌రాల్లో భూములున్న రైతు కుటుంబాలున్నాయి. ఇక పిల్ల‌లు జాబ్స్ చేస్తూ, కాస్త సెటిలై ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే స్థాయికి ఎదిగిన కుటుంబాలు కూడా ప్ర‌తి ప‌ల్లెలోనూ ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలోని గ్రామాల్లో అనేక కుటుంబాలు సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధికి నోచుకోవ‌డం లేదు!

ప‌రిస్థితి ఎలా ఉందంటే.. అందే వారికి అన్నీ అందుతున్నాయి. అంద‌ని వారికి ఏమీ అంద‌వు.. అన్న‌ట్టుగా ఉంద‌నేది స‌త్యం. ఈ ప్ర‌భావం ఏదైనా ఉండి ఉంటే అది పంచాయ‌తీ ఎన్నికల మీద బ‌లంగా ప‌డాల్సింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఆ అసంతృప్తి జ్వ‌లించాల్సింది. 

కానీ.. ఈ అసంతృప్త వ‌ర్గాలు ఓటేసిన ప‌ల్లె పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం లాంటి విజ‌యం సాధించింది. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి పొందే వారు జ‌గ‌న్ వెంట ఉన్నారు, సాంకేతిక కార‌ణాల‌తో ఆ ల‌బ్ధి పొంద‌ని వారిలో కూడా జ‌గ‌న్ పై పూర్తి అసంతృప్తి ఏమీ లేద‌ని ప‌ల్లె ఎన్నిక‌లు స్ప‌ష్ట‌త ఇచ్చాయి. ఇలా ప‌ల్లెల‌పై జ‌గ‌న్ పట్టు నిరూపితం అయ్యింది.

ఆ సంగ‌త‌లా ఉంటే..ఇక మున్సిప‌ల్ ఎన్నిక‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న పెద్ద స‌వాల్. ఏపీ రాజ‌కీయంలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ల్లెల ప్ర‌భావం ఎంత ఉంటుందో.. ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే ప‌ట్ట‌ణాల ప్ర‌భావం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ప‌ల్లెల జ‌నాభానే ఎక్కువ అయినా.. ప‌ట్ట‌ణాల ఓట్లు కూడా కీల‌క‌మే. ఇలాంటి ఎన్నిక‌లు పార్టీల గుర్తు మీదే  జ‌రుగుతున్నాయి.

అందులోనూ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. బీసీల జ‌నాభా ఎక్కువ. ప‌ల్లెల్లో అగ్ర‌వ‌ర్ణాల జ‌నాభా ఎక్కువ‌. వ‌ల‌స కార‌ణాలు, ఇత‌ర కార‌ణాల‌తో ప‌ట్ట‌నాల్లో బ‌డుగుబ‌ల‌హీన కులాల జనాభా ఎక్కువ‌గా ఉంటుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటెత్త‌బోతున్న వారిలో మెజారిటీ సంఖ్య బీసీలదే ఉండ‌బోతోంది. 

రాయ‌ల‌సీమ ఏరియాలో బీసీలు చాలా కాలంగా తెలుగుదేశం అనుకూల‌త‌తో వ్య‌వ‌హ‌రించారు. తొలి సారి ఆ సంప్ర‌దాయానికి బ్రేక్ ప‌డింది 2019లోనే. తెలుగుదేశం న‌మ్ముకున్న బీసీ ఓటు బ్యాంకులో బ‌ల‌మైన చీలిక వ‌చ్చింది. మెజారిటీ బీసీలు తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగానే ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. బ‌హుశా ఎన్టీఆర్ త‌ర్వాత రాయ‌ల‌సీమ బీసీల నుంచి ఎక్కువ మద్ద‌తు పొందింది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే!

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి కూడా అది సాధ్యం కాలేదు. వైఎస్ఆర్ రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన‌ప్ప‌టికీ.. బీసీల జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న రాయ‌ల‌సీమ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ నాడు ప‌రిపూర్ణ విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది. అయితే జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కంచుకోట‌ల‌ను బ‌ద్ధ‌లు కొట్టి, ఆ పార్టీని చిత్తు చిత్తు చేసింది. అలా బీసీల్లో బ‌ల‌మైన మార్పు అగుపించింది గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో. మ‌రి మున్సిపోల్స్ లో పురాలు ఎటు మొగ్గు చూపుతాయ‌నేదాన్ని బ‌ట్టి.. రాయ‌లసీమ భ‌విష్య‌త్ రాజ‌కీయ ముఖ చిత్రం పై కూడా స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

ప‌ల్లె వ‌ర్గాలేవీ జ‌గ‌న్ కు దూరం కాలేద‌ని గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు స్ప‌ష్ట‌త ఇస్తే.. పురపాలిక‌ల ఎన్నిక‌లు మొత్తం పొలిటిక‌ల్ సీన్ పై క్లారిటీ ఇవ్వ‌నున్నాయి. మున్సిపాలిటీస్ లో కూడా జ‌య‌కేత‌నం ఎగ‌రేస్తే.. ఇక మ‌ళ్లీ సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి ఢోకా ఉండ‌న‌ట్టే అనే క్లారిటీ రానుంది.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

Show comments