నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌రో సెల్ఫ్ గోల్ కు రెడీ అవుతున్నారా?

స్థానిక ఎన్నిక‌ల‌.. ఏక‌గ్రీవ ఎన్నిక‌కు సంబంధించి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఇచ్చిందీ ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌నే, త‌ను ఇచ్చిన ధ్రువ‌ప‌త్రాల‌పై ఇప్పుడు సంశ‌యాలు వ్య‌క్తం చేస్తున్న‌ద‌నీ ఆ కమిష‌న‌రే! దాదాపు ఏడాది కింద‌ట జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అర్ధాంత‌రంగా నిలిపేసిన ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్, ఆ ప్ర‌క్రియ‌ను త‌న‌కు తోచిన‌ప్పుడు మ‌ళ్లీ ప్రారంభించారు. అయితే ఈ విష‌యంలో నిమ్మ‌గ‌డ్డ తీరు బోలెడంత సందేహంగా ఉంది సామాన్యుల‌కు.

ఒక‌వైపేమో ఆగిన చోట నుంచినే మ‌ళ్లీ మొద‌లుపెట్ట‌డం అన్నారు. గ‌తంలో కోర్టుకు చెప్పిన విష‌యం ఇదే. ఆగిన చోట నుంచినే మ‌ళ్లీ ప్రారంభం అవుతుంద‌ని నిమ్మ‌గ‌డ్డ కోర్టుకు నివేదించారు. దీంతో ఇప్పుడు గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఏ మాత్రం లేకుండా పోయింది. అందులోనూ.. అప్ప‌ట్లోనే ఏక‌గ్రీవాల‌కు సంబంధించి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఇచ్చారు. ఆ ప‌త్రాల‌ను ఇప్పుడు అర్ధాంత‌రంగా ర‌ద్దు చేసి అక్క‌డ మ‌ళ్లీ నామినేష‌న్ల‌ను ఆహ్వానించ‌డం అంత తేలికైన‌ది కాదు!

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ త‌న ప‌నితీరును త‌నే శంకించిన‌ట్టుగా అవుతుంది. అలాంట‌ప్పుడు ఆయ‌న‌కు ఆ ప‌ద‌విలో కూర్చునే అర్హ‌త కూడా ఉండ‌దు! తన హ‌యాంలోనే క‌మిష‌న్ ఏక‌గ్రీవ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌త్రాల‌ను జారీ చేసి, ఇప్పుడు వాటిని ర‌ద్దు చేయ‌డం, చించేయ‌డం ఇదంతా కుదిరే ప‌ని కాదు. ఇలాంటి ఆట‌ల‌పై అభ్య‌ర్థులు కోర్టుల‌ను ఆశ్ర‌యించే అవ‌కాశాలున్నాయి. ఆ ధ్రువ‌ప‌త్రాల‌ను ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేస్తూ.. నిమ్మ‌గ‌డ్డ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆదేశాలు ఇచ్చే సాహ‌సాలు చేయ‌లేదు. అయితే.. అలాగ‌ని కెళ‌క్కుండా వ‌ద‌ల‌నూ లేదు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే హై కోర్టుకు చేరిన ఈ పంచాయ‌తీలో.. నిమ్మ‌గ‌డ్డ‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌నే త‌గిలింది. ఒక్క‌సారి రిట‌ర్నింగ్ అధికారి ఏక‌గ్రీవ ధ్రుప‌త్రాల‌ను ఇచ్చాకా.. ఇక మ‌ళ్లీ పంచాయ‌తీ ఏమిటి? అనే ప్ర‌శ్న అక్క‌డ ఉత్ప‌న్నం అవుతోంది. అంతే కాదు.. ఈ వ్య‌వ‌హారంలో త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఏవీ తీసుకోకుండా.. త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కూ అన్ని చ‌ర్య‌ల‌కూ న్యాయ‌స్థానం స్టే ఇచ్చిన‌ట్టుగా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. 

ఏదేమైనా... తోచిన‌ప్పుడు ఏక‌గ్రీవంగా గెలిచిన‌ట్టుగా ప‌త్రాలు ఇచ్చి, మ‌ళ్లీ ఆ వ్య‌వ‌హారాల‌నే కెళుకుతున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ మ‌రో సెల్ఫ్ గోల్ కు రెడీ అవుతున్న‌ట్టుగా ఉన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో రెండు జిల్లాల ఏక‌గ్రీవాల ఫ‌లితాల‌ను ఆపి, చివ‌ర‌కు వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.  ఆ అనుభ‌వం ఉన్నా.. ఆల్రెడీ డిక్ల‌రేష‌న్ అయిన ఎన్నిక‌ల‌కు సంబంధించి నిమ్మ‌గ‌డ్డ జారీ చేసిన ఇటీవ‌లి ఆదేశాలు.. మ‌రింత విడ్డూరంగా అనిపిస్తున్నాయి స‌ర్వ‌త్రా.

ఈ నేప‌థ్యంలో.. కోర్టులో మొద‌టి రోజే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఒక‌వేళ పాత ఏక‌గ్రీవాల‌ను ఒప్పుకోవాల్సిందే అని కోర్టు ఆదేశాలు ఇస్తే.. వాటిపై ధ‌ర్మాస‌నానికి, సుప్రీంకు కూడా ఆశ్ర‌యిస్తారా? త‌న ఆదేశాల‌ను త‌న చిత్తానికి ర‌ద్దు చేయ‌డం, ఆమోదించుకునే హ‌క్కుంద‌ని ఈ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వాదించ‌బోతున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారిందిప్పుడు!

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది

ఈ ఏడాది ఎలాగైనా 3 సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్

Show comments