ఉండవల్లీ..మీకు తెలియని విషయమా?

ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ బయటకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కుదరదు..దీనిపై అంతా కలిసి పోరాడాలి. ఇగోలు పనికిరావు. ఇంకా..ఇంకా చాలా అన్నారు. 

18వేల మంది పని చేస్తున్నారు. 70 వేల మంది జనాభా. నేరుగా దాని మీద ఆధారపడి వున్నారు. ప్రయివేటు వారు రాగానే ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం వుందని ఉండవల్లి వున్నారు. లోకల్ వాళ్లను కాకుండా బయటవాళ్లను ఉద్యోగాల లోకి తీసుకుంటారు. 

ఇదీ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే జరిగే విపరిణామాలు అని ఉండవల్లి క్లారిటీ ఇచ్చిన విషయం.

అలాగే క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అసలు నష్టాలే వుండవు అని ఆయన చెబుతున్నారు. అది అందరూ చెబుతున్నదే. 

సరే, ఇవన్నీ అలా వుంచుదాం. ఇంతకీ కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అన్నదానికి మీద కన్నా, వేరే విషయాలు అన్నింటి మీదా ఉండవల్లి ఎక్కువ మాట్లాడారు. ఇగోలకు పోకుండా అందరు కలిసి కార్యాచరణ కు కూర్చోవాలి అని ఉండవల్లి సూచించారు.

ఇక్కడ ఉండవల్లి గుర్తు తెచ్చుకోవాల్సింది ఒకటి వుంది. కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఆంధ్ర విభజన పనికిరాదనే అనుకున్నారు. అప్పుడు ఉండవల్లి కూడా ఎంపీగానే వున్నారు. ఇదే భాజపా నేరుగా కాంగ్రెస్ తో చేతులు కలిపింది.  విభజన చేసారు. చిరంజీవి, లగడపాటి, ఉండవల్లి ఇలా చాలా అంటే చాలా మంది ప్రకటనలు చేస్తూ వచ్చారు. విభజన అయిపోయిన తరువాత ఎవరి ఇంటికి వారు పరిమితం అయిపోయారు. 

ఇప్పుడు అవన్నీ మరిచిపోయి, తాము చేయలేనిది పక్కన పెట్టి, మీరంతా కలవండి..మీరంతా చేయండి అని ఉండవల్లి పిలుపులు ఇస్తున్నారు. అంతే కానీ తాను మరి కొందరు ముందుకు కదులుతాం అని కానీ నిరాహార దీక్షకు కూర్చుంటామని కానీ అనడం లేదు. తాతల మూతుల నేతుల వాసనలు చూడమంటున్నారు. ఇంకేవో అంటున్నారు. 

భాజపాను వదిలేసి వైకాపాదే తప్పు అని జనాల్లోకి తీసుకెళ్లడానికి తేదేపా చేస్తోంది.  ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ఎలా కలిసి ముందుకు నడుస్తాయో ఉండవల్లే చెప్పాలి.

Show comments