తనయుడి పట్టాభిషేకం కోసం కేసీఆర్ లో మార్పు?

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజం కూడా ఉంది. అయితే మారుతోంది పీఠం ఒక్కటే కాదు, కేసీఆర్ మనస్తత్వం కూడా. అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

తొడ గొడతా, కేంద్రాన్ని ఢీ కొడతా, హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపక్షాలను కూడగడతా అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత కాలంలో పూర్తిగా మెత్తబడ్డారు, కేంద్రం ముందు సాగిలపడ్డారు.

ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనలో మార్పు తెలిసొస్తోంది. తాజాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో కేంద్ర పథకానికి జై కొట్టారు కేసీఆర్. రెండేళ్లుగా ఆ పథకం అమలుని అదిమిపట్టిన ఆయన.. ఎట్టకేలకు అమలులోకి తీసుకొచ్చేశారు. 

కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయ పరిణతి అని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నా, కేంద్రం ముందు మోకరిల్లారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ను తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ పథకానికి స్వాగతం పలికారు. కేంద్ర పథకంతో వచ్చే లబ్ధిని రాష్ట్ర ప్రజలకు అందించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేసీఆర్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడలేదు.

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెలంగాణవ్యాప్తంగా చేపట్టిన బంద్ కి కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ, చట్టాల రద్దు కోసం డిమాండ్ చేసారు. కేంద్రం సై అన్నా.. తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు. కట్ చేస్తే.. రోజుల వ్యవధిలో కేసీఆర్ మనసు మార్చుకున్నారు.

పంట అమ్మకానికి గేట్లు ఎత్తేసి.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు పరోక్షంగా వత్తాసు పలికారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటల విషయంలో ప్రభుత్వం సూచనలు ఇవ్వదని, ఇకపై ప్రభుత్వం సేకరించబోదని కూడా తెగేసి చెప్పారు.

చివరిగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ పూర్తిగా కేంద్రానికి తలొగ్గారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం 2019 ఫిబ్రవరి నుంచి వాటిని అమలులో పెట్టింది. 

ఈ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కావడంతో.. తెలంగాణలో దీని ప్రస్తావనే లేకుండా చేసింది కేసీఆర్ సర్కారు. దీని బదులు గతంలో తాము ప్రతిపాదించిన ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం కృషిచేసింది. 

అయితే ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానించినా.. దానికి చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రం మోకాలడ్డింది. ఈ క్రమంలో అదీ ఇదీ రెండూ అమలులో లేకుండా పోయాయి.

తీరా ఇప్పుడు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ అడుగు ముందుకేశారు. తెలంగాణలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ ప్రకటించారు. 

కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి స్వాగతం పలికారు. కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయానికి, తనయుడు పట్టాభిషేకానికి లింక్ ఉందంటున్నారు విశ్లేషకులు. కేంద్రంతో సయోధ్య కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని, ఆ తర్వాత కొడుకును సీఎం చేస్తారని భావిస్తున్నారు.

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

క‌థ మొత్తం బంగారం చూట్టే

Show comments