ఆలూ లేదు-చూలూ లేదు.. సీఏం పవన్ కల్యాణ్

తిరుపతిలో జనసేన మీటింగ్ పెట్టుకుంటే.. లోక్ సభ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని అనుకున్నారంతా. తీరా ఆ మీటింగ్ లో డిమాండ్లు వింటే.. పవన్ కల్యాణ్, "సీఎం..సీఎం" అనే మాటల్ని ఎంతలా తలకెక్కించుకున్నారో అర్థమవుతుంది.

తిరుపతి లోక్ సభ సీటు పరిధిలో జనసేన బలం బాగానే ఉందని అన్నారు ఆ పార్టీ నేతలు, అంతవరకు బాగానే ఉంది. అంత బలమైన సీటుని ఒకవేళ బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే కచ్చితంగా బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరు ప్రకటించాలని అనడం మాత్రం అమాయకత్వం.

ఎన్నికలకింకా మూడున్నరేళ్ల టైమ్ ఉంది, పోనీ మోదీ చెప్పినట్టు జమిలి వస్తే ముహూర్తం మరో ఏడాదిన్నర ముందుకు జరుగుతుందని అనుకుందాం. అప్పటి ఎన్నికల కోసం ఇప్పటినుంచే సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ని ప్రకటించాలా? అలా బీజేపీ ప్రకటిస్తే, పవన్ వెళ్లి తీరిగ్గా సినిమాలు చేసుకుంటారా..? సరిగ్గా ఎన్నికల టైమ్ కి బాగా డబ్బులు పోగేసుకుని ప్రజాసేవ చేసేందుకు వస్తారా..? ఇదెక్కడి లాజిక్.

పోనీ తిరుపతి సీటు లాగేసుకోడానికి బీజేపీ అలాంటి ప్రకటన చేసిందే అనుకుందాం.. అంత మాత్రాన పవన్ సీఎం అయిపోతారా, నాదెండ్ల మినిస్టర్ అయిపోతారా? జిల్లా జనసేన నాయకులంతా మిగతా పోర్ట్ ఫోలియోల్లోకి దూరిపోతారా..? ఇదెక్కడి విడ్డూరం. తిరుపతి ఉప ఎన్నిక కోసం మీటింగ్ పెట్టుకున్న జనసేన ఇలాంటి వింత డిమాండ్ ని తెరపైకి తేవడం అర్థంలేని వ్యవహారం.

బీజేపీ, జనసేన వ్యవహారం చూస్తుంటే తిరుపతి సీటు విషయంలో ఏదో జరుగుతుందనే భావన మాత్రం ప్రజల్లో స్థిరపడిపోయింది. బీజేపీ, జనసేన రెండూ ఆ సీటు కోసం కొట్టుకుంటున్నాయని అర్థమవుతోంది. అందుకే విడివిడిగా మీటింగులు పెట్టుకుంటున్నారే కానీ కలివిడిగా ఎప్పుడూ చర్చలు జరపలేదు.

ఉమ్మడి అభ్యర్థిని అతిత్వరలో ప్రకటిస్తామని చెబుతూనే.. ఎవరి పార్టీ నేతలకు వాళ్లు మన అభ్యర్థే నిలబడతారని భరోసా ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈసారి కాస్త గట్టిగానే డిమాండ్ చేసేందుకు పవన్ తిరుపతి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పీఏసీలో చర్చకు వచ్చిన అంశాలన్నిటినీ సెన్సార్ లేకుండా ప్రెస్ నోట్ ద్వారా లీక్ చేశారు, తనని తాను సీఎం అభ్యర్థిని చేసుకున్నారు.

వారం రోజుల డెడ్ లైన్..

వారం రోజుల్లోగా తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని డిసైడ్ చేస్తామంటూ పవన్ తేల్చి చెప్పారు. అంటే పరోక్షంగా బీజేపీ కూడా వారంలోగా ఏదో విషయం తేల్చేయాలని ఆయన డెడ్ లైన్ పెట్టినట్టయింది. 

జనసేనకు టికెట్ ఇస్తే 7 నియోజకవర్గాల్లో నేనే పర్యటిస్తానంటూ పవన్ చెప్పడం కూడా ఈ డిమాండ్ లో భాగమే అనుకోవాలి. బీజేపీకి సీటిస్తే.. జనసైనికులు మరీ అంతగా కష్టపడక్కర్లేదని కూడా పవన్ హింట్ ఇచ్చేసినట్టయింది. చూద్దాం.. వారం తర్వాత పవన్ ఏం చెబుతారో..? ఏ షూటింగ్ లో బిజీగా ఉంటారో..?

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

Show comments