జ‌గ‌న్‌పై అగ్ర‌వ‌ర్ణాల గుస్సా

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌మ‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా  చిన్న‌చూపు చూస్తున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అగ్ర‌కులాల్లో బ‌ల‌మైన అభిప్రాయం ఉంది. 

సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కొన్ని వ‌ర్గాల‌కు మాత్ర‌మే అంద‌జేస్తున్నార‌ని, తాము కూడా ఓట‌ర్ల‌మే అని, కానీ ప‌థ‌కాల అమ‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి నిరాధ‌ర‌ణ‌కు గుర‌వుతున్నామ‌నే అసంతృప్తి, ఆగ్ర‌హం అగ్ర‌కులాల్లో బ‌లంగా గూడు క‌ట్టుకుని ఉంద‌న్న వాస్త‌వాన్ని వైసీపీ ప్ర‌భుత్వం గ్ర‌హించాల్సి ఉంది. వారిని సంతృప్తిప‌రిచే చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో అగ్ర‌వ‌ర్ణాల్లో త‌న‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మంచి అవ‌కాశం ఉంది. కానీ ఆ దిశ‌గా ఆయ‌న ఎందుకు ఆలోచించ‌డం లేదో అర్థం కాదు. 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా ఆ దిశ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు (ఈడ‌బ్ల్యూఎస్‌) ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల కోటాను అమ‌లు చేసేందుకు కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌య‌మై రెండుమూడు రోజుల్లో అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌రత్తు చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు గల అగ్ర కులాల పేదలకు ఈ రిజర్వేషన్లను వర్తింప జేసింది. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్‌ కేటగిరీ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని మోడీ ప్ర‌భుత్వం ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ రెండో ద‌ఫా అధికారంలోకి రావ‌డానికి ఈ రిజ‌ర్వేష‌న్ అమ‌లు కూడా కీల‌క పాత్ర పోషించింద‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు.

తాజాగా ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ కోటాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన తెలంగాణ విష‌యానికి వ‌ద్దాం. తెలంగాణ‌లో ఇప్ప‌టికే  బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. తాజాగా ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకుంటే రిజ‌ర్వేష‌న్లు 60 శాతానికి పెరుగుతాయి.  

అయితే కేంద్ర‌ప్ర‌భుత్వం 103వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా తీసుకొచ్చిన ఈడ‌బ్ల్యూఎస్ కోటా రిజ‌ర్వేష‌న్ అమ‌లు అధికారాన్ని రాష్ట్రాల‌కే ఇచ్చింది.  కానీ కొన్ని రాష్ట్రాలు స్థానిక స‌మ‌స్య‌ల దృష్ట్యా ఈడ‌బ్ల్యూఎస్ కోటాను అమ‌లు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి.

టీడీపీ పాల‌న చివ‌రి రోజుల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాలోని ప‌ది శాతంలో ఐదు శాతం కాపుల‌కు కేటాయించి , హామీని నిల‌బెట్టుకు న్నాన‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే బాబు పాచిక‌లు కాపుల ముందు పార‌లేదు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం  కాపుల‌కు ఇచ్చిన ఐదు శాతం రిజ‌ర్వేష‌న్ చెల్ల‌ద‌ని ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌కుండా తాత్సారం చేస్తోంది. 

మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అణ‌గారిన వ‌ర్గాల‌ను ప‌ట్టించుకున్నంత‌గా త‌మ విష‌యంలో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అగ్ర‌వ‌ర్ణాల్లో కొంత మేర‌కు అసంతృప్తి ఉంది. సంక్షేమ స్కీమ్‌లు అన్నీ వాళ్ల‌కేనా అనే కామెంట్స్ అగ్ర‌వ‌ర్ణాల నుంచి వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ పది శాతం రిజర్వేషన్ల కోటాను ఏపీలో అమ‌లు చేసి, ఆ వ‌ర్గాల్లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌డం లేదో అర్థం కావ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి.  ఈడ‌బ్ల్యూఎస్ కోటా అమ‌లుతో విద్య‌, ఉద్యోగాల్లో అగ్ర‌వ‌ర్ణాల పేద‌ల‌కు కూడా ఎంతో ల‌బ్ధి చేకూరుతుంది.

ప్ర‌భుత్వం అంటే అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోతుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో రావాలి. ఆ దిశ‌గా సానుకూల దృక్ప‌థం క‌లిగించేం దుకు ఈడ‌బ్ల్యూఎస్ కోటా అమ‌లు ఎంతో దోహ‌దం చేస్తుంది. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఆ కోటాను అమ‌లు చేయ‌నున్న నేప‌థ్యంలో, ఏపీ ప్ర‌భుత్వంపై కూడా త‌ప్ప‌కుండా ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంది.

పైగా ఈడ‌బ్ల్యూఎస్ కోటా అమ‌లుకు జ‌గ‌న్‌కు ఇబ్బందులు కూడా లేవు. మ‌రి అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ను ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్పుడు అమ‌లు చేస్తారు?  మ్యానిపెస్టోలో చెప్పిన‌వి, చెప్ప‌న‌వి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి ...ఈడ‌బ్ల్యూఎస్ కోటా రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో మాత్రం ఎందుకు త‌ట‌ప‌టాయిస్తున్నార‌నేది అంతు చిక్క‌కుండా ఉంది.

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

Show comments