వీర్రాజు కోపం.. డీజీపీని సస్పెండ్ చేయాలంట

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూశాయి ప్రతిపక్షాలు. రామతీర్థం ఘటనను అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేశాయి. తప్పు చేసినవారితోపాటు.. ఆ తప్పుని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో మారణహోమం సృష్టించాలనుకున్నవారు కూడా దోషులే. 

అలాంటి దోషులపై కేసులు పెడితే అది తప్పా..? ఇప్పటికే చంద్రబాబు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని పోలీసులపై మండిపడితే.. అటు కాషాయబాబు కూడా పోలీసులదే తప్పంటూ రెచ్చిపోతున్నారు. ఏకంగా డీజీపీని సస్పెండ్ చేయాలని వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. 

విగ్రహాల విధ్వంసం వెనక ప్రతిపక్షాల పాత్ర ఉందని అనడం, బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే డీజీపీ తప్పట. ఆ తప్పుకి సీఎం జగన్ శిక్ష విధించాలట. 

మరి బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ లో అబలలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణం ఎవరు? అక్కడ డీజీపీలను ఎన్నిసార్లు మార్చారో వీర్రాజు సెలవిస్తారా? ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, బీజేపీ అధికార భాగస్వామిగా ఉన్న బీహార్ లో పరిస్థితి ఏంటో కాస్త వీర్రాజు వివరిస్తే బాగుంటుంది. 

శాంతి భద్రతల ఊసేలేని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ ఎలా పనిచేస్తోందని ఎవరూ అడగకూడదు. తప్పు చేసినవారిని చొక్కా పట్టుకుని లోపలేస్తే.. ఇక్కడ ఏపీలో ఏదో అరాచకం జరిగిపోతుందని రచ్చచేస్తారు. ఇదెక్కడి న్యాయం?

విశాఖలో మీడియా సమావేశంలో సోము వీర్రాజు వీరావేశంతో ఊగిపోయారు. దేవాలయాలపై విధ్వంసాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోకుండా, బీజేపీ కార్యకర్తలపై తిరిగి కేసులు నమోదు చేయడం దారుణం అని అన్నారు వీర్రాజు.

హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తప్పు పట్టిన ఆయన, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ని పదవిలోనుంచి తొలగించాలన్నారు.

చర్చిల ఆస్తులు లెక్కిస్తాం..

అక్కడితో ఆగితే పర్వాలేదు.. ఆలయాలు, చర్చిల ఆస్తులపై కూడా రాద్ధాంతం చేశారు వీర్రాజు. హిందూ మత సంస్థల ఆస్తుల్ని లెక్కించిన అధికారులు, చర్చిల ఆస్తుల్ని కూడా లెక్కగట్టాలని డిమాండ్ చేశారు వీర్రాజు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని అన్నారు. 

హిందూత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని, మతం మార్చడానికే పాస్టర్లకు జీతాలిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. 3వేల కోట్ల రూపాయల ఆస్తులుండే చర్చిలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంలో చర్చిల ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

మొత్తమ్మీద ఆలయాలపై దాడులంటూ కాలం గడిపిన వీర్రాజు మెల్ల మెల్లగా చర్చిలపై యుద్ధం ప్రకటిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. మతపరమైన సంస్థల ఆస్తుల గురించి అసలు వీర్రాజు ఏంపని అని విమర్శలు వినిపిస్తున్నాయి? ఇకనైనా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఆపాలని అంటున్నారు నెటిజన్లు. 

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments