తప్పులెన్ను...చంద్రబాబు

తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అన్నది పెద్దల వాక్కు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అపర చాణక్య బిరుదాంకితుడు అయిన చంద్రబాబుకు ఈ మాట పక్కాగా సూటవుతుంది. ఆయనకు సదా కనిపించేవి ఎదుటవారి తప్పులే. లేదా ఎదుటవారి ఒప్పులు కూడా తప్పులుగా కనిపిస్తాయి. 

రాజకీయ నాయకులకు ఎదుటవారి ఒప్పులు కూడా తప్పులుగా కనిపించడం వరకు ఒకె. అది బై డీఫాల్ట్ వారికి వుండే అవలక్షణం. కానీ తమ తప్పులు ఏమిటన్నవి కూడా తెలియాలి. లేదా తెలుసుకోవాలి. అలా కాకపోతే వాటిని సరిదిద్దు కోవడం సాధ్యం కాదు. అలా సాధ్యం కాకపోతే, తప్పులే ఒప్పులుగా భ్రమల్లో పడి, అలా అలా నెమ్మదిగా వెనుకబడిపోతారు. ఫ్రస్తుతం ఇలాంటి సమస్యలోనే ఇరుక్కున్నారు చంద్రబాబు.

పైగా సమస్య ఏమిటంటే, చుట్టూ వున్నవారు మీరు ఇంద్రుడు..చంద్రుడు..మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం..మీరు చేసిన పనులు పరమాద్భుతం అంటూ చిడతలు వాయిస్తూ, భజన కీర్తనలు పాడుతూ వుంటారు. అందువల్ల మన తప్పులు మనకు అస్సలు కనిపించవు. అయితే ఇలా తప్పులు చేస్తూ, ఒప్పులు అనుకోవడం వల్ల అధికారం పోయింది. అలా పోయిన తరువాత కూడా తమ తప్పు ఏమిటన్నది తెలియడం లేదు అన్న మాట చూసారూ...అక్కడే అనుమాన పడాల్సి వస్తోంది. ఈ తరహా జబ్బు ముదిరిపోయిందనో, ముదిరిపోతోందనో.

సాధారణంగా సినిమా జనాలు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రేక్షకులు, ప్రజల తీర్పు శిరోధార్యం అంటారు. తాము మంచి చేసినా ఓడిస్తే, తాము మంచి సినిమా తీసినా చూడకపోతే జనాలది తప్పు అని పొరపాటున కూడా అనరు. ఎందుకంటే అంతిమ నిర్ణయం జనాలదే అన్న మాటను మనసా వాచా నమ్మతారు. అంతే తప్ప జనాలను తప్పు పట్టే ప్రయత్నం, వారి నిర్ణయాన్ని వెటకారం చేసే ఆలోచన చేయరు.

కానీ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. జగన్ మాటలు నమ్మి జనం బొలోమని ఓట్లు వేసారని అన్నారు. అంత వరకు బాగానే వుందనుకుందాం. కానీ అక్కడితో ఆగకుండా సెటైర్లు వేసారు. తనేం తప్పు చేసానో తనకే తెలియడం లేదని, అభివృద్ధి చేయడమే తన తప్పేమో అని అంటున్నారు. అంటే తను అభివృద్ది చేసినా జనం తనను పక్కన పెట్టారని ఆయన పరోక్షంగా దెప్పి పొడుస్తున్నారన్నమాట. జనం తను చేసిన డెవలప్ మెంట్ గుర్తించలేకపోయారని, జగన్ మాయలోపడిపోయారనేగా చంద్రబాబు చెప్పేది.

ఇలా అంటేనే జనానికి వళ్లు మండుకొచ్చేది. చంద్రబాబు తప్పు చేసారా?లేదా? అన్నది పక్కన పెడితే తన తప్పుల కారణంగానే తాను ఓడిపోయానన్న  వాస్తవాన్ని బాబుగారు ఇంకా అంగీకరించలేకపోతున్నారు. ఇప్పటికీ తను ఓడిపోవడం జనం తప్పిదమే అంటున్నారు తప్ప వాస్తవం గమనించడం లేదు. ఇలా వాస్తవం గమనించనన్నాళ్లు ఆయన అలాగే మాట్లాడతారు. అలాగే ఆలోచిస్తారు. అలాగే ఆలోచించినన్నాళ్లు మళ్లీ ఆయన అధికారం సాధించడం అంత వీజీ కాదు.

అసలు బాబుగారు చేసిన తప్పులేమిటో ఓ సారి అవలోకిద్దాం. చంద్రబాబు అసలు సిసలు సమస్య ఏమిటంటే ఆయన ఇన్ స్టాంట్ రెమిడీ కోసం చూసుకుంటారు. ఇప్పటికి ఇలా ఏరు దాటేసామా?లేదా? అన్నది చూసుకుంటారు. కానీ తరువాత ఏమవుతుంది అన్నది ఆలోచించరు.  

నిజానికి తెలంగాణ విభజన కాకుంటే చంద్రబాబుకు అధికారం అంత సులువుగా అందేది కాదు. విభజనకు లేఖ ఇచ్చారు. విభజనకు కారణమైన భాజపాతో అంటకాగారు. అయినా తనే దిక్కు. తనే అనుభవశాలి. తనే స్పెషల్ స్టేటస్ సాధించారు అనే దిశగా ఆయన అను'కుల' మీడియా టముకేసింది. విభజనకు దోహదం చేసిన చంద్రబాబును కన్వీనియెంట్ గా దాచేసింది. భాజపాను వదిలేసి కాంగ్రెస్ ఒక్కదాన్నేదోషిని చేసింది.

ఇలా గెలిచిన చంద్రబాబు ఏం చేసారు? ముందుగా దృష్టి సారించింది అమరావతి మీద. కృష్ణ, గుంటూరు జిల్లాల కోసం అహరహం శ్రమించి, మిగిలిన వారిని పక్కన పెట్టారు. శ్రీశైలం నుంచి ఎక్కడ నీళ్లు సరిపడా రావో అని చెప్పి, రాయసీమకు ఆ నీళ్లు డైవర్ట్ చేస్తాను అని చెప్పి, పట్టిసీమ ప్రాజెక్టు తీసుకున్నారు. 

ఉత్తరాంధ్రకు తెలియకపోవచ్చు కానీ రాయలసీమకు తెలుసుకదా..తమకు ఏం ఒరిగిందో అన్నిది. కర్నూలుకు ఎయిమ్స్ వస్తుందనుకుంటే దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టారు. కనిపించిన ప్రతి దాన్నీ తీసుకెళ్లి విజయవాడ పరిసరప్రాంతాల్లో వుంచారు.  ఆ విధంగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగేలా చూసుకున్నారు.  పేరుకు అమరావతి కానీ ఆఫీసులన్నీ విజయవాడలో.

సైట్ డెవలప్ మెంట్ కు తీసుకున్నబిల్డర్ కొన్నాళ్లు సాగదీస్తాడు. రేట్లు పెరిగే వరకు. అదే విధంగా అమరావతి విషయంలో వ్యవహరించారు. దాన్ని మొత్తానికి ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాదిరిగా భావించారు. ఊహించారు. వ్యవహరించారు. తమ వాళ్లు అంతా బాగుపడేలా అమరావతి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ తప్పుగా చంద్రబాబుకు కనిపించకపోవచ్చు. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్రకు, రాయలసీమకు తెలుసుగా.

కేంద్రం అయిదేళ్లు ఉమ్మడి రాజధాని అంటే ఠాట్ కుదరదు పదేళ్లు కావాలి అని డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. అలాంటి ఉమ్మడిరాజధానిలో వుంటూ, చుట్టుకున్న రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసారు. ఎందుకని? ఓటుకు నోటు లేదా నోటుకు ఓటు కేసులో ఏం జరుగుతుందో? తను హైదరాబాద్ లో వుంటే ఇలా తన ఫోన్ లు, తన వ్యవహారాలు ఎక్కడ టాప్ చేస్తారో? ఇక తన ఆటలు అన్నీ సాగకుండా పోతాయనే భయంతో.

ఇది తప్పు అన్న విషయం ఇప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవచ్చు. కానీ జనానికి అర్థమైంది కదా. తప్పు చేసారు కాబట్టే, భయపడి పారిపోయివచ్చారని. అక్కడే వుండి పోరాడి వుంటే హీరో అయ్యేవారు. అలా చేయక జీరో అయిపోయారు.

రాక రాక పదేళ్ల తరువాత అధికారం రావడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. చంద్రబాబు కూడా తనకు అధికారం అందింది అది చాలు. అమరావతి ప్రాజెక్టు పూర్తయిపొతే అదే పదివేల వేల కోట్ల పెట్టు అనుకున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్ల దందాలు మితిమీరిపోయాయి. లిటిగేషన్లు, ప్రభుత్వ బంజర్లు ఎక్కడపడితే అక్కడ ఆక్రమించేసారు. కాంట్రాక్టులు, నామినేషన్ పనులు, పోస్టులు, అవినీతి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు సకల అవలక్షణాలు ఆవరించేసాయి. డబ్బు..డబ్బు..డబ్బు..అన్నట్లు చెలరేగిపోయారు. 

ఇదంతా బాబుగారి ముద్దుల మీడియా దాచేయగలిగింది. కానీ జనానికి ఎక్కడిక్కడ లోకల్ గా ఏం జరుగుతున్నదీ తెలుసుగా. ఈ సంగతి బాబు గమనించలేకపోయారు. ఆయన కూడా ఆ మీడియానే ఫాలో అవుతారుగా. దాంతో అంతా సస్యశ్యామలం అనుకున్నారు. జరగాల్సిన డ్యామేజ్ జరగిపోయింది.

ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు వేసిన విత్తనాలు. అవి మొలకెత్తి, వృక్షాలై, మానులైపోయాయి. ఇప్పటికీ వాటిదే హవా. వాటి నీడన కొత్త మొక్కలు లేవవు. కొత్త మొక్కలు నాటే ప్రయత్నమూ లేదు. యువతరం అంటే ఆ వయోవృద్దుల వారుసులే తప్ప వేరే వారు కాదు. దాంతో పార్టీని నమ్ముకున్న యువతకు అర్థమైపోయింది. ఇక మరో నలభై ఏళ్లు తాము పల్లకీ మోయడం తప్ప, ఎక్కడం వుండదు అని. దాంతో ఎక్కడిక్కడ తప్పుకోగలిగిన వారు తప్పుకున్నారు. వృద్ద శరణాలయం మాదిరిగా తెలుగుదేశం మిగిలింది.

పవన్ కళ్యాణ్ కు లేని బలాన్ని ఊహించుకుని అతనికి సకల రాచమర్యాదులు చేసారు. కాపులను కేవలం వారి ఓట్లు ఆశించి నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేసారు. కానీ తునిలో కాపుల విషయంలో జరిగింది ఆ సామాజిక వర్గానికి గుర్తు వుండనే వుంది. అందుకే వారు చేయాల్సింది వారు చేసారు. అదే సమయంలో బిసిలకు మండింది. వాళ్లు పక్కకు తప్పుకున్నారు.

ఇక చినబాబు లోకేష్ ను అడ్డదారిలో మంత్రిని చేసారు. ఆయనకు, ఆయన కోటరీకి ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది. ఇవన్నీ చంద్రబాబు గమరించకపోవచ్చు కానీ జనం గమనిస్తూనే వున్నారు. ఎన్నికలు వచ్చిన తరువాత జనాలు గుర్తుకు వచ్చి అర్జెంట్ గా  పసుపుకుంకుమ అంటూ డబ్బులు జల్లారు. అప్పుడు జనాలకు మరింత క్లారిటీ వచ్చింది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అర్థం అయిపోయింది.

ఇలా ఒకటా, రెండా బాబుగారు చేసిన తప్పులు. ఆయన స్వయంకృతాపరాధాలు. కానీ ఇప్పటికీ తాను అభివృద్ది చేయడమే, చేయాలని అనుకోవడమే తప్పయిందని, జనాలు ఏదో మాయలోనో, మత్తులోనో పడిపోయి జగన్ కు ఓటేసారని బాబుగారు తెగవాపోతున్నారు. దాన్నే ఆయన మీడియా ప్రొజెక్టు చేస్తోంది. ఆయన కానీ ఆయన మీడియాకానీ తెలుసుకోవాల్సింది ఒకటి వుంది. జనానికి అన్నీ తెలుసు. 

గతంలో మాదిరిగా మీడియా వార్తలతో వాళ్లని ఎన్నాళ్లోమాయచేలేరు. ఆ సంగతి గమనించి, తన తప్పులు తెలుసుకుని, వాటిని అధిగమించే పని చేస్తే బాబుగారు అధికారం దిశగా నడవగలరేమో? అలా కాకుండా ఆయనే ఆ మీడియా మాయలో వుండిపోతే, ఇక ఆయన అధికారం ఆశలు వదులుకోవాలేమో?

చాణక్య

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే 

Show comments