థియేటర్లపై క్లారిటీ వచ్చినట్లేనా?

కరోనా తరువాత థియేటర్ల పరిస్థితి ఎలా వుంటుందో అన్నది పెద్ద ప్రశ్నగా వుండేది కొద్ది రోజుల క్రితం వరకు. యాభైశాతం ఆక్యుపెన్సీ, కరోనా భయాలు ఇవన్నీ కలిసి సినిమాలకు ఏ మేరకు లాభం చేస్తాయన్నది అతి పెద్ద అనుమానం. 

ఈ వ్యవహారాలన్నింటిపై క్లారిటీ వచ్చింది. పండగ సినిమాలు, వాటి కలెక్షన్లు, వస్తున్న జనాలు, ఇవన్నీ కలిసి ఓ అంచనా అయితే వచ్చింది. వంద కోట్ల బడ్జెట్ రేంజ్ సినిమాలకు ఈ కలెక్షన్లు సరిపోవు. 

టోటల్ ఆడియన్స్ రావాలి అంటే ఇంకా టైమ్ పడుతుంది. ప్రస్తుతానికి మాస్ ఆడియన్స్ లేదా యూత్ మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. ఫ్యామిలీలు ఇప్పటికీ ఇంకా థియేటర్ కు దూరంగానే వున్నారు. 

పండగ సినిమాలు నాలుగు కలిసి విక్రయించిన థియేటర్ హక్కులు ఉభయ రాష్ట్రాల్లో టోటల్ గా,  అరవై కోట్లు దాటలేదు. వచ్చిన కలెక్షన్లు ఫైనల్ లెక్కలు తేలితే మహా అయితే ఎనభై కోట్ల గ్రాస్ దాటదు.

తక్కువ రేట్లకు అమ్మడం, పండగ సీజన్ కావడంతో నాలుగింట మూడు సినిమాలకు బ్రేక్ ఈవెన్ కావచ్చు. ఒకటో రెండో లాభాలు చవిచూడొచ్చు. కానీ ఇకపై వారం వారం విడుదలయ్యే సినిమాలు ఈ విధంగా గట్టెక్కుతాయా? అంటే అనుమానమే. 

పండగ దాటిన దగ్గర నుంచి వారం వారం సినిమాలు వున్నాయి. అవి ఏ మేరకు గట్టెక్కుతాయన్నవిషయంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు వస్తున్న తీరుగా జనాలు వస్తే చిన్న సినిమాలకు తప్ప, మీడియం సినిమాలకు సరిపోదనే టాక్ వినిపిస్తోంది. నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఈ మేరకు కూడా కలెక్షన్లు వుండడం కష్టం అన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. 

అందుకే పవన్ వకీల్ సాబ్ ఏప్రియల్ 9 కి దాదాపు ఫిక్స్ చేసారు. ఆ లోగా నూరుశాతం ఆక్యుపెన్సీ, జనాలకు కూడా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం జరుగుతందని అంచనా వేస్తున్నారు. 

ఉప్పెన సినిమా ఫిబ్రవరి మొదటి, రెండో వారం రావడమా? మార్చి లో శివరాత్రికి షిప్ట్ కావడమా అని డిస్కషన్లు సాగిస్తోంది. కేవలం పది కోట్ల లోపు సినిమాలు మాత్రమే ఇప్పుడు విడుదల కావడానికి ధైర్యం చేస్తున్నాయి. 

ఇరవై కోట్లు దాటిన సినిమాలు వరుస సెలవులు వున్న డేట్ ల కోసం వెదుకుతున్నాయి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు మరీ అద్భుతం కావని ఇదే పిరియడ్ లో గత ఏడాది వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే తేడా అర్థం అవుతుందని ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కోన్నారు. 

మొత్తం మీద పండగ సినిమాలు ఇండస్ఠ్రీలో కదలిక అయితే తెచ్చాయి కానీ పూర్తి భరోసా మాత్రం ఇవ్వలేదనే చెప్పాలి.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments