రవితేజ... ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రాజా!

సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడగా అన్నిటికంటే ముందుగా వచ్చిన ‘క్రాక్’ యునానిమస్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందే విడుదల చేయాలని డిసైడ్ అయిన క్రాక్ టీమ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. 

రిలీజ్ రోజున ఫైనాన్స్ కష్టాలు వచ్చిపడడంతో సినిమా విడుదల డిలే అయింది. అయితే ప్రాజెక్ట్‌పై నమ్మకంతో తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటలకు షోస్ మొదలు పెట్టారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ని మెప్పించింది. 

వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని మరోసారి రవితేజను డీల్ చేయడంలో దిట్ట అనిపించుకోవడంతో ‘క్రాక్’ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి మూడు రోజులు అసలు పోటీనే లేకపోవడంతో ‘క్రాక్’ పండుగ చేసుకుంది. ‘మాస్టర్’ రాకతో ఊపుకి కాస్త బ్రేక్ పడినా కానీ స్టడీగా నిలబడింది. రెడ్, అల్లుడు అదుర్స్ వచ్చినా కూడా క్రాక్ వసూళ్లు నిలకడగా వున్నాయి.

మాస్టర్ సినిమా విజయ్ అభిమానుల కోసమే తీసినట్టుండడంతో అది మన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సేతుపతి పాత్ర, అతని డైలాగ్స్ ఆ సినిమాను కొంత వరకు కాపాడినా కానీ కంటెంట్ పరంగా డిజప్పాయింట్ చేసింది. 

ఖైదీ దర్శకుడు లోకేష్ తన లీడ్ యాక్టర్ స్టార్‌డమ్‌కి సరండర్ అయిపోవడంతో మాస్టర్ నిరాశ పరచినా కానీ మొదటి రోజు వచ్చిన బ్రహ్మాండమైన వసూళ్ల వల్ల తెలుగు డబ్బింగ్ రైట్స్ ఈజీగా రికవర్ చేసేసింది. ఇకపై ఈ చిత్రం వసూళ్లు పూర్తిగా పడిపోయినా కానీ తెలుగు మార్కెట్లో కమర్షియల్ సెక్సస్ అనే చెప్పాలి.  

ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన ‘రెడ్’ మొదటి రోజు మంచి వసూళ్లు తెచ్చుకుంది కానీ టాక్ నిరాశాజనకంగా వుంది. రామ్ ఇమేజ్‌కి తగ్గ కథ కాకపోవడంతో దర్శకుడు కిషోర్ తిరుమల చేసిన మార్పు చేర్పులు రెడ్ సినిమాకు పెద్దగా హెల్ప్ అవలేదు. 

రామ్‌కి వున్న క్రేజ్ కారణంగా పండుగ వీకెండ్ వరకు రెడ్ నిలబడినా కానీ ఆ తర్వాత నిలదొక్కుకోవడం కష్టమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో పాటే సంక్రాంతి నాడు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ ప్రేక్షకులు బెదిరిపోయే రీతిన తెరెకక్కింది. కామెడీ పేరిట సంతోష్ శ్రీనివాస్ చేసిన కిచిడీ బెల్లంకొండ శ్రీనివాస్ ఆశలను ఆవిరి చేసింది. 

ఇది అతని కెరీర్లోనే బ్యాడ్ సినిమా అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. పైగా నాలుగు సినిమాలలోను దీనికే ప్రేక్షకాదరణ తక్కువ వుంది. తొలి రోజు పండుగ అయినప్పటికీ వసూళ్లు చాలా సాధారణంగా వున్నాయి. టాక్ చాలా వీక్‌గా వుంది కనుక ఇది సర్వయివ్ అవడం కష్టమే అనిపిస్తోంది.

మొత్తం మీద ఈ సంక్రాంతికి తిరుగులేని విజేతగా మాస్ మహారాజా రవితేజ నిలిచాడు. గతంలో కృష్ణ, మిరపకాయ్ సినిమాలతో సంక్రాంతికి హిట్ కొట్టిన రవితేజ మరోసారి సంక్రాంతికి రారాజు అనిపించుకున్నాడు. 

వరుసగా నాలుగు దారుణ పరాజయాల తర్వాత మరోసారి మాస్ మహారాజా తన పేరుని ఇటు ఇండస్ట్రీలో, అటు ట్రేడ్ సర్కిల్స్‌లో మోత మోగిస్తున్నాడు. కంగ్రాట్స్ టు మాస్ మహారాజా అండ్ క్రాక్ టీమ్.

మంచి కిక్‌ ఇచ్చారు

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments