మొహ‌మాటానికి పోతున్న వైసీపీ ....

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ వైసీపీ మొహ‌మాట ప‌డుతోంది. చివ‌రికి త‌న ప్ర‌భుత్వానికి, పార్టీకి అప‌ప్ర‌ద తీసుకొస్తున్న ప్ర‌ధాన పార్టీ బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి, ప్ర‌జాకోర్టులో దోషిగా నిల‌బెట్టేందుకు త‌ట‌ప‌టాయించ‌డం ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

మొగ్గ ద‌శ‌లోనే తుంచేయాల్సిన మ‌త క‌లుపు మొక్క‌ల‌ను ఏపుగా పెరిగేందుకు ప‌రోక్షంగా దోహ‌దం చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రానున్న ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్ట‌లేక పోతోందా?  లేక ఏమీ కాదులే అనే నిర్ల‌క్ష్యమా? అనేది అర్థం కావ‌డం లేదు.

ఆలయాల్లో విగ్ర‌హాల విధ్వంసానికి పాల్ప‌డుతూ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టీడీపీ, బీజేపీకి చెందిన కొంద‌రు కుట్ర‌ప‌న్నార‌నే సంగ‌తి త‌మ ద‌ర్యాప్తులో  తేలిన‌ట్టు స్వ‌యంగా డీజీపీ డి గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. 

మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కుట్ర‌కు పాల్ప‌డిన వ్య‌క్తులు, వారికి రాజ‌కీయ పార్టీల‌తో ఉన్న అనుబంధం గురించి పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. ఆల‌యాల్లో విగ్ర‌హాల ధ్వంసానికి పాల్ప‌డుతూ, మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి , ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే లక్ష్యంతో కొన్ని శ‌క్తులు ముందుకెళ్తున్నట్లు డీజీపీ తేల్చి చెప్పారు.

ఈ కేసుల్లో టీడీపీ, బీజేపీల‌కు చెందిన 21 మందికి ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉంద‌ని డీజీపీ తెలిపారు. వీరిలో కొంద‌రిని అరెస్ట్ చేసిన‌ట్టు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆల‌యాల విధ్వంస‌లో కేవ‌లం త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ ప్ర‌మేయం మాత్ర‌మే ఉన్న‌ట్టు అధికార పార్టీ ప‌త్రిక సాక్షిలో రాయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

"ఆల‌య ఘ‌ట‌న‌ల్లో తెలుగుదేశం" కుట్ర శీర్షిక‌తో సాక్షిలో డీజీపీ ప్రెస్‌మీట్ వార్త‌ను చూడొచ్చు. మ‌త రాజ‌కీయాల‌కు బీజేపీ కేరాఫ్ అడ్ర‌స్ అనే విష‌యాన్ని వైసీపీ మ‌రిచిపోయిన‌ట్టుంది. బీజేపీ పాత్ర‌ను క‌నిపించీ, క‌నిపించ‌ని విధంగా అధికార పార్టీ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

టీడీపీ మ‌త రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల ఆ పార్టీనే మ‌రింత న‌ష్ట‌పోతుంది. ఇటీవ‌ల మ‌త‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ...చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా, ఇప్పుడు త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌త‌ప‌ర‌మైన విష‌యాల్లో బీజేపీ దూకుడును నిలువ‌రించాల్సిన బాధ్య‌త వైసీపీతో పాటు ప్ర‌భుత్వంపై కూడా ఉంది.

బీజేపీ మూలాలు, పునాదులు మ‌తంపైన్నే అనే వాస్త‌వాన్ని వైసీపీ గుర్తించాలి. ఎందుకంటే అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణానికి చందాల పేరుతో గ్రామ‌గ్రామానికి బీజేపీ శ్రేణులు దూసుకొస్తున్నాయి. ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటామ‌ని, రాముడి పేరుతో హిందువుల‌ను రాజ‌కీయ కోణంలో ఏకం చేసే ప‌ని ఉధృతంగా చేప‌ట్టేందుకు ఆ పార్టీ ఓ ప‌థ‌కం ప్ర‌కారం ముందుకెళుతోంది.

దీన్ని వైసీపీ, టీడీపీలు అస‌లు గుర్తించిన‌ట్టు లేదు. ఇదేదో రామాల‌య క‌ట్టడానికి కేవ‌లం విరాళాల సేక‌ర‌ణే అనుకుంటే .... అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి లేదు. ఇప్పుడు రామాల‌య క‌ట్ట‌డానికి విరాళాలు, రేపు ఇదే రాముడి పేరుతో ఓట్ల‌ను అడ‌గ‌ర‌నే గ్యారెంటీ ఏముంది? ఇప్పుడిదే గ్రామీణులు వేస్తున్న ప్ర‌శ్న‌. పైపెచ్చు వైసీపీ, టీడీపీ ప‌ర‌స్ప‌రం గొడ‌వ ప‌డుతూ, మూడో పార్టీ బ‌ల‌ప‌డేందుకు చేజేతులా అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు.

ఇప్ప‌టికే బీజేపీతో అంట‌కాగిన టీడీపీకి చివ‌రికి ఏ గ‌తి ప‌ట్టిందో వైసీపీకి క‌ళ్లెదుట నిలువెత్తు ఉదాహ‌ర‌ణ ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌కు ఆ పార్టీ చుక్క‌లు చూపుతున్న విష‌యం వైసీపీకి తెలియ‌ద‌నుకోలేం. అయిన‌ప్ప‌టికీ వివిధ కార‌ణాల‌తో బీజేపీ ఏం చేసినా ...కిమ్మ‌న‌కుండా నోరెత్త‌కుండా వైసీపీ ఉంటోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఆల‌యాల్లో దుర్ఘ‌ట‌న‌ల్లో బీజేపీ పాత్ర‌పై త‌ప్ప‌కుండా జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త వైసీపీపై ఉంది. అంతేకాదు, మ‌త‌ప‌ర‌మైన విద్వేషాల‌కు పాల్ప‌డిన వారి ప‌ట్ల క‌ఠినంగా కూడా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది.

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు

Show comments