ఎమ్బీయస్ : ఫారూక్ రాజీ పడతారా?

కశ్మీరులో జిల్లా అభివృద్ధి సమితులకు (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ – డిడిసి) నవంబరు 28 నుంచి డిసెంబరు 22 వరకు 8 దశల్లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాయి. రాజకీయంగా చూడబోతే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లు తోస్తుంది. 2019 ఆగస్టులో బిజెపి ప్రభుత్వం కశ్మీరుపై ఆంక్షలు విధించి, కేంద్రపాలితం చేసి, తన అదుపులో తీసుకుంది.

దాని ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా కేంద్ర అభివృద్ధి పథకాలు పేదలకు చేరటం లేదని, 370 రద్దు చేయడం ద్వారా ఆ పని పూర్తి చేసి జమ్మూ, కశ్మీరులను అభివృద్ధి పథంలో నడిపిస్తామనీ చెప్పుకుంది. ఆ విధంగా కశ్మీరు లోయలో చాలాకాలంగా పాతుకుపోయిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) అనే రెండు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించి, తను బలపడతానని అనుకుంది. కానీ దాదాపు ఏడాదిన్నర తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే అదేమీ జరిగినట్లు లేదు.

డిడిసి వ్యవస్థ గతంలో లేదు కాబట్టి ఫలితాలను గతంతో పోల్చడానికి అవకాశం లేదు. కశ్మీరును తన అధీనంలోకి తీసుకున్నాక, కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబరులో పంచాయితీ రాజ్ చట్టాన్ని సవరించి యీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, ఎప్పటికి అసెంబ్లీ ఎన్నికలు జరిపే వీలుందో తెలియదు కాబట్టి యీలోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనుకుంది.

ఒక్కో జిల్లాకు 20 మంది ప్రతినిథుల చొప్పున మొత్తం 280 స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది. వీటిలో జమ్ము, కశ్మీరు లోయ ప్రాంతాలలో చెరో పదేసి జిల్లాలు ఉన్నాయి. జమ్మూలో ఎప్పణ్నుంచో బిజెపికి ప్రాబల్యం వుంది. లోయలో ఎన్‌సి, పిడిపిలదే ఆధిక్యం. ఆ పార్టీ నాయకులను, మాజీ ముఖ్యమంత్రులను నెలల తరబడి గృహనిర్బంధంలో వుంచాం కాబట్టి వారి ప్రజాదరణ క్షీణించిందని చూపడం బిజెపి లక్ష్యం.

అంతేకాదు, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని లోయలో ప్రజలు కూడా హర్షిస్తున్నారని, రద్దు చేయడాన్ని ప్రతిఘటిస్తున్న ఎన్‌సి, పిడిపి యిత్యాది పార్టీలను ప్రజలు పట్టించుకోవడం మానేశారనీ లోకానికి చూపడం కూడా చాలా ముఖ్యం. అందువలన స్థానిక పార్టీలకు ప్రత్యామ్నాయం చూపడానికి బిజెపి ఒక కొత్త పార్టీని పురుడు పోసింది.

అది జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ. తమతో తెగతెంపులు చేసుకున్న పిడిపిలోని నాయకులను, కాంగ్రెసులోని కొందరు నాయకులను కలిపి ఆ పార్టీని కూర్చింది. 2020 మార్చిలో ఏర్పడిన ఆ పార్టీలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా వున్నారు. 

అల్తాఫ్ బుఖారీ అనే మాజీ పిడిపి నాయకుణ్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వీళ్లు దిల్లీకి సన్నిహితంగా వుంటూనే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేరు కాబట్టి ‘వంశపారపర్యపు పార్టీలైన ఎన్‌సి, పిడిపి, కాంగ్రెసులతో విసిగిపోయిన సామాన్యజనులం మేం.

జమ్మూ, కశ్మీర్‌కు రాష్ట్రస్థాయి పునరుద్ధరించాలని కోరుతున్నాం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినా, ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేయాలి.’ అని నినదిస్తున్నారు. బయటివాళ్లు యిక్కడకు వచ్చి భూమి కొనుగోలు చేయడంతో వీరికి పేచీ ఏమీ లేదు. వీళ్లు తొలిసారి యీ సమితి ఎన్నికలలో పోటీ చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన యీ జిల్లా సమితులకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందేట్లా ప్లాను చేశారు. ఆ విధంగా వీరు ప్రజల్లో పలుకుబడి పెంచుకోగలుగుతారు. రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఎమ్మెల్యేలుగా ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు నెగ్గినా, ప్రత్యామ్నాయ నాయక వ్యవస్థగా వీళ్లు ఎదుగుతారని ఊహ.

ఈ విధంగా కశ్మీరు రాజకీయ ముఖచిత్రం మార్చడానికి అవకాశముంటుందని కేంద్రం వ్యూహం. ఈ సమితి ఎన్నికలలో తాము, తమకు అనుకూలంగా ఉండే అప్నీ పార్టీ నెగ్గేట్లా చూడాలని బిజెపి సర్వవిధాలా ప్రయత్నించింది. ఎన్నికలు ప్రకటిస్తే ఎన్‌సి, పిడిపిలు ఎన్నికలు బహిష్కరిస్తాయని అనుకుంది. గతంలో స్థానిక ఎన్నికలకు అలా చేసే బిజెపిని నెగ్గేట్లు చేశామని గ్రహించిన అవి యీసారి పోటీ చేస్తాయని ప్రకటించాయి.

పోటీ చేసినా తమలో తాము నిరంతరం కలహించుకునే అవి కూటమిగా ఏర్పడడానికి వ్యవధి లేకుండా చేయాలని కేంద్రం ఎన్నికల ప్రకటన హఠాత్తుగా చేసింది. అయితే దాని ఆశలు వమ్ము చేస్తూ ఆ పార్టీలు మరో ఐదు పార్టీలను కలుపుకుని పిఏజిడి (పీపుల్స్ ఎలయన్స్ ఫర్ గుప్‌కార్ డిక్లరేషన్) అనే కూటమి ఏర్పరచి ఎన్నికలలో పాల్గొన్నాయి.

ఈ గుప్‌కార్ అనే పేరుకి వెనుక వున్న కథ ఏమిటంటే, శ్రీనగర్‌లో గుప్‌కార్ అనే భవంతి ఫారూక్ అబ్దుల్లా నివాసం. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అక్కడ 2019 ఆగస్టు 4న కశ్మీరుకి చెందిన ప్రాంతీయ పార్టీలన్నీ సమావేశమై తమలో తమకు ఎన్ని విభేదాలున్నా కశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడడానికై తామంతా కలిసి పోరాడతామని ఒక ప్రకటన చేశాయి. ఎందుకంటే అప్పటికే కేంద్రం 370ను రద్దు చేయబోతోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే యీ ప్రతిఘటన తీర్మానం.

వీళ్లు ఆ ప్రకటన చేసిన మర్నాడే కేంద్రం ప్రతిపత్తిని రద్దు చేసేసి, వీళ్లందరినీ నిర్బంధంలోకి తీసుకుని నెలల తరబడి ఎటూ కదలకుండా చేసేసింది. అందువలన గుప్‌కార్ డిక్లరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఆ పేరు మీదే అలయన్స్ ఏర్పాటు చేశారు. దీనిలో ఫారూక్ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా పిడిపి, పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి), సిపిఎం, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ మూవ్‌మెంట్, అవామీ ఇత్తెహాద్ పార్టీలున్నాయి.

పేరుకి ఏడున్నా, ప్రధానమైనవి మొదటి రెండే. ఆ యిద్దరిలోనూ ఎన్‌సిదే ముఖ్యపాత్ర. బిజెపితో చేతులు కలపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన పిడిపి కశ్మీరీయుల అభిమానాన్ని కోల్పోయింది. అందుకే 2019 పార్లమెంటు ఎన్నికలలో కశ్మీరులోని మూడు పార్లమెంటు స్థానాలలోనూ ఎన్‌సియే గెలిచింది.

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే గెలుపని, ముఖ్యమంత్రి పీఠం ఫారూక్ కొడుకు ఉమర్‌దేననీ పార్టీ అనుకుంటోండగానే కశ్మీరు మిలటరీ వశమై పోయి, అంతా తల్లకిందులై పోయింది. ఇక 2019 ఆగస్టు తర్వాత ఫారూక్‌ను 7 నెలలే నిర్బంధంలో వుంచినా, మెహబూబాను 14 నెలల పాటు నిర్బంధంలో వుంచిన బిజెపి. ఆ సమయంలో పిడిపిని నిలువుగా చీల్చి కొందర్ని అప్నీ పార్టీలోకి చేర్చేసింది. మరి కొందరిపై కేసులు పెట్టి, జైళ్లలో తోసింది. అందుకని ఆ పార్టీలో వుండడానికి నాయకులు భయపడుతున్నారు. ఎన్‌సి మాత్రం చీలలేదు.

ఈ కూటమిలోకి కాంగ్రెసు చేరలేదు. చేరితే జమ్మూవాసులకు కోపం వస్తుందని దాని భయం. దానికి వున్న బలంలో చాలా భాగం జమ్మూలోనే వుంది. దేశంలో బిజెపి హిందూత్వవాదంతో ఎన్నికలు గెలుస్తూండడం చూసి, కాంగ్రెసు కూడా అదే బాట పడదామని చూస్తోంది. వారి కంటె ఎక్కువ హిందూత్వం ఒలకపోస్తూ రాహుల్ జంధ్యం వేసుకున్న బ్రాహ్మడంటూ ప్రచారం చేసుకుని అతన్ని గుళ్లకూ గోపురాలకూ తిప్పింది.

లేకపోతే ‘అదిగో వాళ్లు ముస్లిములకు అనుకూలమైన పార్టీ’ అని బిజెపి ప్రచారం చేస్తుందనీ, దాన్ని నమ్మి హిందువులు తమకు ఓటేయరనీ కాంగ్రెసుకు భయం. నా సిద్ధాంతం యిది, దానికి నేను కట్టుబడ్డాను అని ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో కాంగ్రెసు ఉభయత్రా నష్టపోతోంది. అయినా తన పద్ధతి మార్చుకోవటం లేదు.

పిఏజిడి ఏర్పడి తనను ఎదుర్కుంటుందనగానే అమిత్ షా దానికి ‘గుప్‌కార్ గ్యాంగ్’ అని పేరు పెట్టి వెక్కిరిస్తూ వారితో చేతులు కలుపుతారా? అంటూ కాంగ్రెసును ఛాలెంజ్ చేశారు. పైగా ఫారూక్ అక్టోబరులో చైనా సహాయంతో 370 పునరుద్ధరింపబడాలని కోరుకుంటున్నానని ‘‘ఇండియా టుడే’’కు యిచ్చిన యింటర్వ్యూలో అనడంతో అతనిపై దేశద్రోహి ముద్ర కూడా పడింది.

అలాటి వాడి నేతృత్వంలోని కశ్మీరు ముస్లిము పార్టీలతో చేతులు కలిపితే జమ్మూలో ఓట్లు పోతాయనే భయంతో కాంగ్రెసు పిఏజిడిలో చేరలేదు. అయితే ఆ కూటమిలో చేరకపోతే కశ్మీరులో నష్టం కాబట్టి ఆ పార్టీ కశ్మీరు అధ్యక్షుడు ‘మాకు కూటమితో ఒప్పందమేమీ లేదు కానీ, దానిలోని భాగస్వాములతో విడివిడిగా పొత్తు వుంది.’ అని చెప్పుకున్నాడు. ఈ ద్వంద్వ వైఖరితో కూటమివాళ్లు కాంగ్రెసును పట్టించుకోలేదు.

కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి అంతా ఒకే గుర్తుపై పోటీ చేయాలని ప్రయత్నించారు కానీ ఎన్నికల షెడ్యూల్ హడావుడిగా ప్రకటించడంతో అది సాధ్యపడలేదు. దాంతో వేర్వేరు గుర్తులపై పోటీ చేశారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా అసమగ్రంగానే జరిగాయి. ఎన్నికల తయారీలో భాగంగా కేంద్రం 25 వేల మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసులను అదనంగా దించింది. వాళ్లు పిఏజిడి నాయకులను ప్రచారానికై పెద్దగా వెళ్లనీయలేదు.

భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అంటూ, అనుచరులతో కలవనీయకుండా హోటళ్లలోనే వుంచడం, సాయంత్రం నాలుగు గంటల కల్లా హోటల్‌కి వెనక్కి వచ్చేయాలనడం, యిలాటి చర్యలతో అభ్యర్థులు విసిగిపోయారు. శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదని అనుకున్నపుడు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టారు? అంటూ మండిపడ్డారు.

ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే ప్రతిపక్షాల మనోస్థయిర్యాన్ని దెబ్బ తీయాడానికి నవంబరు 25న శ్రీనగర్ మేయర్ ఎన్నిక ప్రహసనాన్ని నడిపించారు. జునైద్ మట్టూ అనే అతను రాజకీయాలపై ఆసక్తితో విదేశాల నుంచి తిరిగి వచ్చి ఎన్‌సిలో చేరాడు. ఉమర్ అతన్ని పార్టీ అధికార ప్రతినిథిని చేశాడు. మెహబూబా-బిజెపి ప్రభుత్వం 2018లో కూలిపోయాక, కేంద్రం అర్బన్ బాడీలకు, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించింది.

త్వరలోనే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్‌సి, పిడిపి వాటిని బహిష్కరించాయి. పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి) పార్టీ మాత్రం స్వాగతించింది. ఎన్‌సి నిర్ణయాన్ని నిరసిస్తూ మట్టూ ఆ పార్టీ వదిలి పిసిలో చేరాడు. శ్రీనగర్‌లో ఎన్‌సి, పిడిపిలదే హవా అనుకునే రోజుల్లో పిసి తరఫున ఆ నగరపు కార్పోరేషన్ వార్డు మెంబరుగా నెగ్గాడు. పిసి, బిజెపి పార్టీల సహాయంతో శ్రీనగర్ కార్పోరేషన్ మేయర్‌గా 2018 నవంబరులో ఎన్నుకోబడ్డాడు.

2019 ఆగస్టులో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం, బిజెపి, కాంగ్రెసు తప్ప తక్కిన పార్టీల నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుని 6 నుంచి 14 నెలల వరకు వుంచడం జరిగింది. మట్టూ పిసి అధికార ప్రతినిథిగానే వుంటూ బిజెపికి సన్నిహితుడుగా వుండటం చేత అరెస్టు కాలేదు. ఇలా వుండగా వాళ్ల మధ్య సఖ్యత చెడడంతో 2020 జూన్‌లో బిజెపి, ఎన్‌సి, కాంగ్రెసు కలిసి అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేశాయి.

ఇది జరిగిన కొన్నాళ్లకే రాజకీయ ఖైదీలందరినీ విడిచి పెట్టడం జరిగింది. పిఏజిడి ఏర్పడింది. దానిలో పిసి పార్టీ కూడా భాగస్వామి కావడంతో మట్టూ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపికి మళ్లీ ఆప్తుడై పోయాడు. దానితో అతనికి మేయర్ పదవిని మళ్లీ బహూకరిద్దామనుకుంది బిజెపి. అత్యంత వివాదాస్పదంగా జరిగిన నవంబరు 25 నాటి మేయరు ఎన్నికలో 9 మంది సభ్యులున్న బిజెపి, దాని అనుబంధ కౌన్సిలర్లు, ఇండిపెండెంట్లు కలిసి మట్టూకు ఓట్లేశారు. కాంగ్రెసుకు 17 మంది సభ్యులుంటే వ్హిప్‌ను ధిక్కరించి 10 మంది మట్టూకి ఓటేశారు. మేయరైన రెండు రోజులకు మట్టూ బిజెపికి అనుబంధ పార్టీగా వున్న అప్నీ పార్టీలో చేరాడు.

ఈ విధంగా తనవైపు వుంటే లాభాలూ, తనతో విరోధిస్తే కష్టాలూ తప్పవని నాయకులకు చాటి చెప్పింది బిజెపి. కూటమిని దెబ్బ తీయాలని దాని నాయకుడు ఫారూక్‌పై బిజెపి ప్రభుత్వం చాలా కేసులే పెట్టింది. ఇప్పటికే వ్యాసం పెద్దదవుతోంది కాబట్టి వాటి గురించి మరో వ్యాసంలో రాస్తాను.

ఎన్నికలు జరిగాక చూస్తే మొత్తం 278 స్థానాల్లో పిఎజిడికి 110 స్థానాలు (జమ్మూలో 26, లోయలో 84), బిజెపికి 75 స్థానాలు (జమ్మూలో 72, లోయలో 3), కాంగ్రెసుకు 26 (జమ్మూలో 17, లోయలో 9) దక్కాయి. 50 చోట్ల (జమ్మూలో 19, లోయలో 31) స్వతంత్రులు గెలిచారు. ఇతర పార్టీలకు చెందిన 17 మంది (ఎంతో ఆర్భాటం చేసిన అప్నీ పార్టీ 10 మాత్రమే గెలిచింది) గెలిచారు.

కూటమిలో ఎన్‌సి 168 స్థానాల్లో నిలబడి 67 స్థానాల్లో గెలిచింది. పిడిపి 68 స్థానాల్లో నిలబడి 27 గెలిచింది. ఈ రెండు పార్టీల కన్న బిజెపి స్ట్రయిక్ రేట్ తక్కువ. ఎందుకంటే అది ఎక్కువ స్థానాల్లో నిలబడింది. ఏం చేసినా అది జమ్మూలో మాత్రమే తన అధిక్యతను చూపుకోగలిగింది. అక్కడ 6 జిల్లాలు గెలిచింది. లోయలోని 10 జిల్లాలలో 9 జిల్లాలు కూటమి వశమయ్యాయి.

తక్కిన 5 జిల్లాలలో స్వతంత్రులు హెచ్చు సంఖ్యలో గెలవడం చేత వారిని ఆకట్టుకున్నవారికే ఆయా జిల్లాలు దక్కుతాయి. ఉదాహరణకి శ్రీనగర్ జిల్లాలో సగం సీట్లు స్వతంత్రులే గెలిచారు. మొత్తం మీద చూస్తే అర్థమయ్యేదేమిటంటే బిజెపి గెలిచిన స్థానాల్లో 96 % జమ్మూలోనే ఉన్నాయి కాబట్టి లోయలోకి అది విస్తరించలేదని చెప్పాలి. అక్కడ కేవలం 4 %, అంటే మూడు సీట్లే వచ్చాయి.

పిఏజిడికి వచ్చిన మొత్తం సీట్లలో లోయలో 76% రాగా జమ్మూలో 24% (26 సీట్లు) వచ్చాయి. అంటే బిజెపికి లోయలో వున్న బలం కంటె పిఏజిడికి జమ్మూలో వున్న బలం 6 రెట్లు ఎక్కువగా వుందన్నమాట. కాంగ్రెసుకి వచ్చిన మొత్తం సీట్లలో జమ్మూలో 65%, లోయలో 35% వున్నాయి. స్వతంత్రుల సీట్లలో 38% మంది జమ్మూలో, 62% లోయలో వున్నాయి.

జమ్మూ అంతా బిజెపి వెంట నిలిచిందని కూడా చెప్పలేం. ఎందుకంటే అక్కడున్న మొత్తం 140 సీట్లలో బిజెపికి 51% సీట్లు మాత్రమే వచ్చాయి. పిఏజిడికి 19%, కాంగ్రెసుకు 12%, స్వతంత్రులకు 14%, యితరులకు 4% సీట్లు వచ్చాయి. కశ్మీరుకు వచ్చేసరికి మొత్తం 138 సీట్లలో పిఏజిడికి 61%, బిజెపికి 2%, కాంగ్రెసుకు 7%, స్వతంత్రులకు 22%, యితర పార్టీలకు 8% సీట్లు వచ్చాయి. దీనికి కారణమేమిటి? జమ్మూ అంతా హిందువులే, కశ్మీరంతా ముస్లిములే అనుకోవడం పొరపాటు. లోయలో వున్న జనాభాలో 96.4% మంది ముస్లిములే, కానీ జమ్మూలో హిందువుల శాతం 62.6 మాత్రమే.

జిల్లాల వారీగా చూస్తే జనాభాలో 90% కంటె హిందువులు ఎక్కువున్న జిల్లాలు 4 కాగా, 90% కంటె ముస్లిములు ఎక్కువున్న జిల్లాలు 11. తక్కిన 5 జిల్లాలలో ముస్లిములు 50-70% వరకు ఉంటారు. హిందూ జిల్లాలలోని 56 సీట్లలో బిజెపి 86% గెలిచింది. వీటిల్లో పిఏజిడి 4% మాత్రమే గెలిచింది. ముస్లిము జిల్లాలలోని 152 సీట్లలో బిజెపి 2% మాత్రమే గెలవగా పిఏజిడి 57% సీట్లు గెలిచింది. తక్కిన సీట్లు మిక్స్‌డ్‌గా వున్న 5జిల్లాలలో గెలిచినవి.

బిజెపి బలం హిందూ ఓటర్లకే పరిమితమౌతోందని తోస్తోంది. అది కూడా హిందువులందరూ బిజెపికి వేయలేదని తెలుస్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి తీసేశాక, శాంతియుతంగా వుండే తమ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మూవాసులు ఆశించారు కానీ అది జరగలేదు. పైగా యితర ప్రాంతాల వారు బాగా వచ్చి పడుతున్నారు. కశ్మీరులోయ యింకా ఆందోళనకరంగానే వుంది కాబట్టి వారంతా జమ్మూలో తిష్ట వేస్తున్నారు.  

లోయలో 3 సీట్లు సాధించినానని బిజెపి గొప్పగా చెప్పుకుంటోంది కానీ ఎంత అణచిపెట్టినా పిఏజిడి జమ్మూలో 19% సీట్లు గెలుచుకుందని మర్చిపోకూడదు. కశ్మీరులోని స్వార్థ రాజకీయనాయకుల మాట ఎలా వున్నా, సామాన్య ప్రజలు 370 రద్దును ఆహ్వానించారని చెప్పుకుంటున్న ప్రచారానికి యిది అడ్డుకట్ట వేసింది.

నిజానికి తమ అభిప్రాయం చెప్పడానికే కశ్మీరీయులు యీ ఎన్నికలు ఉపయోగించుకున్నారని పరిశీలకులు అంటున్నారు. లోయలో 34% మంది మాత్రమే (2019లో 19% మాత్రమే వేశారు) ఓటేయగా, ప్రశాంతంగా వున్న జమ్మూలో 68% మంది ఓటేయడంతో మొత్తం అంకె 51 శాతానికి చేరింది.

ఫలితాలు చూశాక రాజకీయ సమీకరణాలు మారవచ్చని ఊహాగానాలు వినబడుతున్నాయి. 2019 ఆగస్టులో 370 రద్దు చేసి, కశ్మీరును కేంద్రం తన చేతిలో తీసుకున్నపుడు ‘కశ్మీరు సమస్యకు మిలటరీ పరిష్కారం సరైన విధానం కాదు.’ అంటూ నేను ఆరు వ్యాసాలు రాశాను. ఏడాదిన్నరయినా కశ్మీరు అదుపులోకి రాలేదు.

బిజెపి కశ్మీరు లోయలో బలపడలేక పోయింది. అందువలన బిజెపి రాజకీయ పరిష్కారం వెతికే క్రమంలో ఎన్‌సితో పొత్తు పెట్టుకోవచ్చని కొందరంటున్నారు. లద్దాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో వారు భాగస్వాములు. ఫారూక్ చైనా ప్రకటన తర్వాత కూడా పొత్తు విచ్ఛిన్నం చేసుకోలేదు.

ఇక కూటమి విషయానికి వస్తే ఎన్‌సి, పిడిపి దృక్పథాల్లో తేడా వుంది. మెహబూబా, బిజెపి ఒకర్ని చూస్తే మరొకరు మండిపడుతున్నారు. 2024 వరకు బిజెపియే కేంద్రంలో వుండబోతోంది. తర్వాత కూడా కొనసాగవచ్చేమోనన్న భయం మెహబూబాకు వుంది. ఆమె బలాన్ని పూర్తిగా క్షీణింపచేసి, ఆమె ముఖ్య అనుచరులపై టెర్రరిస్టు ముద్ర వేసి బిజెపి వేధిస్తోంది. అందువలన ఆమె తెగించి మాట్లాడుతూ, కశ్మీరీయులను ఆ విధంగా ఆకట్టుకుందామని చూస్తోంది.

మరి ఎన్‌సి సంగతి అది కాదు. కశ్మీర్‌లో వాళ్లు యింకా బలంగా వున్నారు. కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం హరించారని ప్రపంచం చేత నింద పడుతున్న బిజెపి, ఎన్‌సితో సయోధ్య కుదుర్చుకుంటే ఉభయత్రా లాభం. ఎన్నికలు నిర్వహించాం, ఎన్‌సి నెగ్గింది. అధికారాన్ని ప్రజలకు అప్పగించేశాం అని బిజెపి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. 

గతంలో కాంగ్రెసు యిటువంటి క్రీడలే ఆడింది. ఇప్పుడు బిజెపి కూడా అదే ఆడవచ్చు. ఎన్‌సి తరఫు నుంచి ఉమర్ సయోధ్య కుదుర్చుకునే పనిలో వున్నాడని, తన పార్టీకి చెందిన శిఖ్కు నాయకుడి ద్వారా బిజెపితో బేరసారాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

వీటితో సంబంధం వుందో లేదో తెలియదు కానీ కోవిడ్ వాక్సిన్ గురించి ఉమర్ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా వుంది. డేటా బయటపెట్టకుండా, మూడో దశ పరీక్షలు పూర్తి కాకుండానే బిజెపి ప్రభుత్వం హడావుడిగా వాక్సినేషన్ చేపట్టడాన్ని కొన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అఖిలేశ్ యాదవ్ దాన్ని బిజెపి వాక్సిన్ అన్న కొద్ది గంటల్లోనే ఉమర్ ‘నేను ఆ వాక్సిన్ వేయించుకుంటాను’ అని ప్రకటించాడు. నమ్మకం వుండి వేయించుకుంటే వేయించుకోవచ్చు కానీ ప్రకటించవలసిన అవసరం ఏమిటో తెలియదు. గుడ్‌విల్ జెస్చరా? ఏమో భవిష్యత్ పరిణామాలు చెపుతాయి. – 

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

Show comments