ఎమ్బీయస్: షేమ్, షేమ్ అమెరికా!

కోడలికి బుద్ధి చెప్పి అత్తగారు తెడ్డు నాకిందట అనే సామెత గుర్తొచ్చింది నిన్న! ప్రపంచం మొత్తానికి ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్తూ, ఏ దేశంలోనైనా ఎన్నికలు సరిగ్గా జరుగుతాయో లేదో అంటూ పర్యవేక్షక బృందాలను పంపిస్తూ, తనకు తానే పుచ్చుకున్న పెద్దరికపు పెత్తనం చెలాయిస్తూ వస్తున్న అమెరికా ఒక్కసారిగా ప్రపంచదేశాల దృష్టిలో చులకన అయిపోయింది. చిన్నాచితకా దేశాల నుంచి, మొన్నటిదాకా దాని కొంగు పట్టుకుని తిరిగిన బ్రిటన్ వంటి దేశాల దాకా అందరూ దానికి చివాట్లు వేసినవారే! ఎవరైనా సరే, నాగరికత మా దగ్గర నేర్చుకోవలసివారే అంటూ బడాయికి పోయిన అమెరికా యీ రోజు బోనులో నిలబడి ‘అబ్బే, అది అమెరికన్ సంస్కృతి కాదు.’ అని చెప్పుకోవలసి వచ్చింది. ఇకనైనా ‘ఫలానా చోట మానవహక్కులకు భంగం కలిగింది, ఫలానా దేశంలో బాలల హక్కులు గుర్తింపబడలేదు, అందువలన వారి నుంచి వస్తువులు కొనం, వారిపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తాం’ వంటి హుంకరింపులు కట్టిపెట్టి, మౌనంగా తన పని తను చూసుకుంటే మంచిది.

పార్లమెంటు భవనంపై దాడి లాటివి మన దేశంలోనూ జరిగాయి. కానీ అవి విదేశీ శక్తులు, స్వదేశీ టెర్రరిస్టులతో కలిసి చేసినవి. కానీ అమెరికాలో చిత్రమేమిటంటే సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుడే యిది చేయించాడు. అతనేదో తిక్కమనిషి, ఓటమితో కృంగిపోయి రోడ్డు మీద కొచ్చి గోల చేశాడు అనడానికి లేదు. అతని తరహా రాజకీయాలను ఎంతోమంది, సరిగ్గా చెప్పాలంటే ప్రత్యర్థితో దాదాపు సరితూగేటంత మంది సమర్థించారని గుర్తు పెట్టుకోవాలి. బాబ్రీ మసీదు కూలినప్పుడు భారతదేశం ప్రపంచం ముందు తలవంచుకోవాల్సి వచ్చింది. కానీ అది ప్రతిపక్షం చేసిన చేష్ట. ప్రభుత్వపక్షం చేతకానితనం వలన సాధ్యపడిన చర్య. పైగా దాన్ని కూల్చిన, లేదా కూల్చడాన్ని హర్షించిన హిందూత్వవాదులు ఆ నాటికి సంఖ్యాపరంగా తక్కువమందే. మొత్తం హిందువులలో వారి సంఖ్య అల్పమే. ఇప్పుడైతే హిందూత్వ భావజాలం పెరిగి, ఆ శాతం పెరిగి వుండవచ్చు. కానీ ప్రజాస్వామ్యానికి దేవాలయం అనదగిన తమ పార్లమెంటుపై దాడి చేసిన ట్రంప్ అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదని అనిపిస్తోంది.

బాబ్రీ మసీదు విషయంలో రాష్ట్రప్రభుత్వం హామీ యిచ్చి దగా చేసింది. ఆ రోజు ఉదయం రగడ ప్రారంభమైనప్పుడు కొన్ని గంటల్లోనే ఆ భారీ కట్టడం మాయమౌతుందని దేశప్రజలు ఎవరూ ఊహించలేదు. కాస్సేపటికే పోలీసులు వచ్చి చెదరగొట్టేస్తారని అనుకున్నారు. ఇప్పుడీ కాపిటల్ హిల్ విషయంలో ట్రంప్ చెప్పి మరీ కొట్టాడు. డిసెంబరు 31 నుంచి దాడి చేయండి అని బహిరంగంగా పిలుపు నిచ్చాడు. హింస జరగబోతుందని ముందుగానే హెచ్చరించాడు. అప్పుడు ట్విటర్, ఫేస్‌బుక్ ఏ చర్యా తీసుకోలేదు. అంతా అయిపోయాక ‘చేసింది చాలు, ఇంటికి వెళ్లండిక’ అన్నపుడు బ్లాక్ చేశాయి. అనేక ఊళ్ల నుంచి ట్రంప్ మద్దతుదారులు కదలివస్తూ వుంటే ఇంటెలిజెన్సు వర్గాలకు తెలియలేదా? ఎక్కడెక్కడి దేశాలలో ఏ మూల ఏం జరుగుతోందో శాటిలైట్స్ ద్వారా నిఘా వేసేవాళ్లకు కళ్లు మూసుకుపోయాయా?

మధ్యాహ్నం ఒంటిగంటకు జనం గుమిగూడారు. రివాల్వర్లు, పైప్ బాంబులు, కెమికల్స్ వంటి ఆయుధాలతో సహా! పోలీసులు వాళ్లను అప్పుడే చెదరగొట్టలేదేం? గంటపావు తర్వాత కాంప్లెక్సులోకి ప్రవేశించారు. పోలీసులు అడ్డుకోలేక పోయారా? అడ్డుకోకపోగా కొందరు పోలీసులు ప్రదర్శనకారులకు సహకరించిన దృశ్యాలు కూడా కనబడ్డాయి. ఇంకో 45 ని.లు గడిచేసరికి వాళ్లు కాంప్లెక్సులో అన్ని రూముల్లోకి చొచ్చుకుపోయి ప్రజాప్రతినిథులను భయభ్రాంతులను చేశారు. వాళ్లు బల్లల కింద దాక్కున్నారు. వణికి పోయారు. ఉపాధ్యక్షుడి దగ్గర్నుంచి సొరంగంలో దాక్కోవలసి వచ్చింది. వచ్చినవాళ్లు ఒసామా లాడెన్ అనుచరులు కాదు. దేశాధ్యక్షుడి వీరాభిమానులే! చివరకు నేషనల్ గార్డ్‌స్‌ను పిలిస్తే తప్ప సెనేటర్లు కాపాడబడలేదు. అంటే పోలీసులు కూడా ట్రంప్‌కు అనుకూలంగా పనిచేశారని స్పష్టమౌతోంది.

తను అధికారంలో వుండగా ట్రంప్ తనకు ఎవరు నచ్చకపోతే వారిని టెర్రరిస్టులన్నాడు, ఫేక్ అన్నాడు. చివరకు తనే ప్రజాస్వామ్యం పాలిట టెర్రరిస్టుగా తేలాడు. తననే ఫేక్ ప్రజాస్వామ్యవాదిగా నిరూపించుకున్నాడు. ఇప్పటికీ అతన్ని సమర్థించే రిపబ్లికన్లు వున్నారు. టీవీ చర్చల్లో వచ్చిన భారతీయ మూలాలున్న రిపబ్లికన్ సమర్థకులు ‘ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ వచ్చిన ట్రంప్‌ను విజేతగా ప్రకటించకపోవడం వలననే యిలాటి నిరసన జరిగింది.’ అంటూ దాడిని వెనకేసుకుని వచ్చారు. నిరసనకు కొన్ని పద్ధతులుంటాయి. ‘ఇటీజ్ నాట్ ప్రొటెస్ట్, ఇటీ యీజ్ ఇన్‌సరక్షన్ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు)’ అన్నాడు జో బైడెన్. ట్రంప్ చర్యను తప్పుపడుతూ యితర దేశాధినేతలూ, అమెరికాలో చాలామంది మాట్లాడడం మొదలుపెట్టడంతో కొందరు రిపబ్లికన్లు, ముఖ్యంగా ట్రంప్ అనుయాయుల్లో కొంతమంది అర్జంటుగా రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు రెండువారాల్లో ఎలాగూ పోయే పదవిని డ్రమటిక్‌గా వదిలేశారు.

ఇప్పుడు ట్రంప్‌ను పరమ దుర్మార్గపు విలన్‌గా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు గుప్పించడం అతి సులభమైన పని. కానీ అతనిలాటి వాడు యిలాటి పని ఎలా చేయగలిగాడు, దానికి దారితీసిన పరిస్థితులేమిటి? అని తరచి చూసినప్పుడు యిలాటివి పునరావృతం కాకుండా చూడగలమా అనేది తెలుస్తుంది. ఒక హిట్లర్ ప్రభవించాడంటే కారణం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధానంతరం విజేతలైన దేశాలు జర్మనీని తీవ్రంగా అవమానించి, అన్యాయం చేయడమే! దాన్ని చూపించే హిట్లర్ జర్మన్‌లను ఏకం చేయగలిగాడు. వారిలో ద్వేషాన్ని రెచ్చగొట్టగలిగాడు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆడ్వాణీ ఒక్కణ్నే తప్పుపట్టి ప్రయోజనం లేదు. రాజీవ్ గాంధీ ముస్లిం మతపెద్దలను సంతుష్టి పరచడానికి షా బానో విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కాలరాయడం, ముస్లిములతో బాటు హిందువులనూ బుజ్జగించాలనుకుంటూ అయోధ్య గుడితాళాలు తీయించడం వంటివి చేసి, మతభావనలు రెచ్చగొట్టి, ఆడ్వాణీ రథయాత్ర విజయవంతం కావడానికి దోహదపడ్డాడు. పోనుపోను కులరాజకీయాల స్థానంలో మతరాజకీయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే విధంగా ట్రంప్ ఒక్కణ్నీ తప్పుపడితే అది హ్రస్వదృష్టే అవుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ట్రంప్‌కు అనుకూలంగా కొందరు సెనేటర్లు మాట్లాడారని గమనించాలి. ట్రంప్ తరహా రాజకీయాలు వర్ధిల్లడానికి అనువైన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి?

ముందుగా రిపబ్లికన్ పార్టీని అతను లోబరుచుకున్న విధానం చూడండి. అతనేమైనా సిద్ధాంతరీత్యా రిపబ్లికనా? కాదే, క్లింటన్‌ల వంటి డెమోక్రాట్‌లకు ఆప్తుడు. అతను ఎప్పుడైనా ప్రజాసేవ చేశాడా? లేదే! అతని వ్యాపారంలో ఎన్నో లొసుగులు. ఎన్నో కేసులు. పూర్తిగా వివాదాస్పదమైన వ్యవహారాలతో డబ్బు గడించాడు. మరి అలాటివాణ్ని తన పార్టీలో చేర్చుకుని, అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం గ్రాండ్ ఓల్డ్ పార్టీ తప్పు కాదా? ఆ తప్పు జరగడానికి కారణం ఏమిటి? ట్రంప్ ఆ పార్టీ నాయకులను డబ్బు చూపించో, మరొకటి చేసో లోబరుచుకున్నాడని తెలుస్తోంది. దాని అర్థం ఒక వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వద్దామనుకుంటే చాలు, నడుచుకుంటూ వచ్చేయవచ్చు.

ఇప్పుడు మన దగ్గరా అదే జరుగుతోంది. గతంలో బిజినెస్ హౌసెస్ అధికారంలోకి వచ్చే పార్టీలకు విరాళాలు యిచ్చి, వారి ద్వారా తమకు అనుకూలమైన విధానపరమైన మార్పులు చేయించుకునేవారు. ఇప్పుడు ఆ డొంకతిరుగుడు లేదు. డైరక్టుగా తామే అభ్యర్థులుగా దిగిపోతున్నారు. లోకసభకు, శాసనసభకు పోటీ చేయాలంటే ఊరూరూ తిరిగి ప్రజలకు దణ్ణాలు పెట్టాలి. అదెవడు పడతాడని ఎమ్మెల్సీలో, రాజ్యసభ సభ్యులో అయిపోతున్నారు. ఏ సిద్ధాంతాలూ తెలుసుకోనక్కరలేదు. ఏ మానిఫెస్టో చదవనక్కరలేదు. ఏ ఓటరునూ తన గుమ్మం ఎక్కనివ్వనక్కరలేదు. పార్టీ అధినేతలు వీళ్లకిచ్చే ప్రాధాన్యత చూసి కడుపు మండిన కార్యకర్తలు ‘జండాలు మోసిన మాకు టిక్కెట్టు యివ్వరా?’ అని అడిగితే అధినేతలు ‘జండాలు ఎవరైనా మోస్తారు. పార్టీ ప్రతిపక్షంలో వుండగా నడపడానికి నిధులిచ్చినది వాళ్లా? మీరా?’ అని అడుగుతున్నారు. అన్నిటికీ డబ్బే ప్రధానం. సిద్ధాంతం కాదు, ప్రజాసేవ కాదు.

అక్కడ ట్రంప్ అలాగే రిపబ్లికన్‌ పార్టీని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడీ సంఘటన జరగ్గానే ఆ పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షులు ఖండిస్తూ తమ పార్టీకి పట్టిన గతికి వగస్తున్నారు. సరే పార్టీని ఎలాగోలా హస్తగతం చేసుకున్నాడు కానీ ప్రజలు అతనికి ఓటెందుకు వేశారు? గత ఎన్నికలలోనే కాదు, యీ సారి ఎన్నికలలో కూడా, నాలుగేళ్ల అతని పాలన చవి చూసి కూడా, చాలా పెద్ద సంఖ్యలో ఎందుకు వేశారు? వచ్చే వ్యాసంలో అమెరికా ఎన్నికలలో ఓటింగు సరళి గురించి విపులంగా చర్చించవచ్చు కానీ ప్రస్తుతానికి ఒక్క విషయం మాత్రం ఎత్తి చూపి, దీన్ని ముగిస్తాను. అందరికీ తెలుసు, ట్రంప్ సమర్థకులలో చాలామంది అమెరికన్ వైట్స్ అనీ, ఇతర దేశాల, దేశస్తుల కారణంగా తమ ఉద్యోగాలు పోతున్నాయని వారు ఆందోళన పడుతూండడం చేతనే వారికి ట్రంప్ విధానాలు నచ్చుతున్నాయనీ.

వారిలో ఎందుకు అటువంటి అభద్రతాభావం కలిగింది? ప్రపంచంలో ప్రతిభావంతులు ఎక్కడ వున్నా తమ వద్దకు రప్పించి, ఎఱ్ఱ తివాచీ పరిచి, తద్వారా ఉభయత్రా లాభపడిన అమెరికా దేశం యీనాడు యిలాటి భయాందోళనలకు లోను కావడం దేనికి? గ్లోబలైజేషన్ పేరుతో యితర దేశాలలో చొచ్చుకు పోదామనుకుంటే, తామే దానికి బలి అయిపోవడమేమిటి? తయారీ రంగంలో అగ్రస్థానంలో వున్న దేశం యీనాడు పూర్తిగా దిగుమతులపై ఆధారపడి, జనాభాకు ఉద్యోగాలు లేకుండా చేయడమేమిటి? సామర్థ్యం విషయంలో మెజారిటీ యువత యితర దేశపు యువతతో పోటీ పడలేకపోవడమేమిటి? ఉన్నత విద్యార్జన అతి ఖరీదైన వ్యవహారంగా మారి, సాధారణ అమెరికన్ యువత మిడిమిడి చదువులతో ఆగిపోయేట్లుగా విద్యావ్యవస్థను తయారు చేసినవారెవరు?

ఇలాటి అనేక పరిస్థితుల పరిణామమే నిన్నటి ఘటన. ఇది అంతం అనుకోవడానికి లేదు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఇలాటి మరిన్ని ఘటనలతో అమెరికన్ సమాజంలో చీలిక వచ్చే ప్రమాదం పొంచి వుంది. ట్రంప్ అనుయాయులను, అతని విధానాలను సమర్థించి కోట్లాది అమెరికన్లను ఏదో ఒక విధంగా తృప్తి పరచకపోతే ట్రంప్ కాకపోతే మరొకడు వచ్చి యిలాటివి మరిన్ని చేయించగలడు. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, అమెరికన్ వ్యవస్థ ఎదుర్కుంటున్న సమస్య.

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

Show comments