ఎమ్బీయస్ : గొల్లపూడి ‘రాగరాగిణి’

గొల్లపూడి మారుతీరావు ప్రథమవర్ధంతి డిసెంబరులో జరిగింది. ఆయనకు ఎంతో ప్రఖ్యాతి తెచ్చిన ‘రాగరాగిణి’ నాటకాన్ని పరిచయం చేద్దామనుకుంటున్నాను. 1959లో అది ప్రదర్శించేనాటికి ఆయనకు 20 ఏళ్లు. ప్రఖ్యాత నటుడు కె. వెంకటేశ్వరరావు అదే ఏడాది దిల్లీలో బ్రిటిష్ థియేటర్ గ్రూపువాళ్లు ప్రదర్శించిన ‘బియాండ్ ద హొరైజన్’ అనే 1920 నాటి నాటకం చూసి నచ్చి, దాన్ని తెలుగులో రాసి యిమ్మనమని కోరడంతో యీ నాటకం రూపుదాల్చింది. 

కె. వెంకటేశ్వరరావుగారికి, గొల్లపూడికి యిద్దరికీ చాలా పేరు తెచ్చిపెట్టింది. మెలోడ్రామా ఎంతో వున్న నాటకం కాబట్టి ప్రదర్శించిన ప్రతీచోట అవార్డులు గెలుచుకుంది. మూలనాటకం యూజినీ ఓ నీల్ అనే నోబెల్ బహుమతి (1936) పొందిన అమెరికన్ నాటకకర్త రాసినది. చెకోవ్ (రష్యా) ఇబ్సన్ (నార్వే)లలా అమెరికాలో అతను తన నాటకాలకు సుప్రసిద్ధుడు. ఈ నాటకానికి అతనికి పులిట్జర్ బహుమతి లభించింది. ఇద్దరు అన్నదమ్ముల కథ యిది. చాలా కొద్ది మార్పులు తప్ప యించుమించు యథాతథంగానే కథ దించేశారు. 

నాటక కథ చెప్తాను. కేశవరావు ఒక పల్లెటూళ్లో పదెకరాలు వున్న ఆసామి. వ్యవసాయదారుడు. అతని పెద్దకొడుకు శేషు అతనికి పొలం పనుల్లో సాయపడుతూ, అతని కంటె మిన్నగా కష్టపడుతూ, లాభసాటిగా చేస్తున్నాడు. పనివాళ్లను అదలించడంలో, అవసరమైతే తన్నడంలో దిట్ట.కేశవ రెండో కొడుకు రఘుకి పొలం పని అలవాటు లేదు. పుస్తకాలు చదువుతూ, ఊహల్లో తేలిపోతూ వుంటాడు. అతనికి యీ పల్లెటూరి బతుకంటే విసుగు. 

ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లి లోకాన్నంతా చుట్టి రావాలని కోరిక. డబ్బు సంపాదించడానికి కాదు, ఊరికే, దిగంతాలవరకు నాలుగు వూళ్లూ చూసి రావాలని ఆశ. మూడో కొడుకు నీలూ మూగవాడు. (ఈ పాత్ర మూలంలో లేదు. తెలుగులో దీని ప్రయోజనమూ పెద్దగా కనబడదు). మూలంలో ఈ కుటుంబం పొలం పక్కనే ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న వితంతురాలి పొలం వుంది. తెలుగులోకి వచ్చేసరికి ఆమెను విధురుణ్ని (భార్యపోయినవాడిని) చేసి పరంధామయ్య అని పేరు పెట్టి అతన్ని కేశవ భార్య లలితకు అన్నగార్ని చేశారు. ఈ పాత్రకు రాధ అనే ఒక కూతురుంది.

మేనరికాలు మనకు సహజం కాబట్టి అలా మార్చగలిగారు. మూలంలో అయితే వాళ్లు కుటుంబస్నేహితులు మాత్రమే. ఈ రాధను శేషు, రఘు యిద్దరూ ప్రేమిస్తూంటారు. శేషు ఎప్పుడూ రాధను ఆటపట్టిస్తూ, తన అభిమానాన్ని చాటుకుంటూ వుంటాడు. రాధ కూడా అతనితో సరదాగా వుంటూ వుంటుంది. కేశవకు కూడా వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తే, యిద్దరి పొలాలూ కలిపి శేషు చూసుకుంటాడని ఆశ పడుతూంటాడు. రఘు కూడా ఆ విషయాన్ని గ్రహించాడు. అతనికీ రాధ అంటే ప్రేమ కానీ ఎప్పుడూ వెల్లడించలేదు. ఇక్కడే వుండి శేషు, రాధల కాపురం చూస్తూ వుండడం కంటె ఎక్కడికైనా వెళ్లిపోతే మంచిదని అనుకుంటున్నాడు.

ఇలాటి పరిస్థితుల్లో లలిత మరో అన్నయ్య కెప్టెన్ పతి అనే అతను వీళ్లింటికి వచ్చాడు. అతను 45 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఓడల్లో తిరుగుతూ దేశాలన్నీ చుట్టబెడుతూన్నాడు. తనకు సహాయంగా ఎవరైనా వుంటే బాగుండుననుకుని రఘుకి ఆఫర్ చేశాడు. రఘు ఎగిరి గంతేశాడు. ఇది తనకు అన్ని విధాలా సూటయ్యే ప్రతిపాదన. ఇక అతను మర్నాడు వెళ్లిపోతాడనగా, రాధ వచ్చి వెళ్లకు, నువ్వంటే నాకిష్టం అంది. ‘అదేమిటి, నీకు మా అన్నయ్యంటే యిష్టమనుకుని, నేను దూరంగా వెళ్లిపోదా మనుకున్నానే’ అన్నాడు. ‘కాదని యిప్పుడు తెలిసిందిగా, ఇక్కడే వుండిపో, యిద్దరం పెళ్లి చేసుకుందాం’ అంది. అతను మనసు మార్చుకున్నాడు.

మర్నాడు ఉదయం అతని మేనమామ పతి వచ్చేసమయానికి ఆ ముక్క చెప్పేశాడు. ఎందుకని అడిగితే రాధ నన్ను ప్రేమిస్తోంది అన్నాడు. సరిగ్గా అదే సమయానికి యింటికి వచ్చిన శేషు అది విని హతాశుడయ్యాడు. రాధ, తమ్ముడు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూంటే చూస్తూ కూర్చోవడం కన్న దూరంగా ఎక్కడికో వెళ్లిపోతే మంచిది అనుకుని, రఘు బదులు నన్ను విదేశాలకు తీసుకెళ్లు అని పతిని అడిగాడు. రఘు మాటలతో దిగాలు పడిన పతి హమ్మయ్య నువ్వయినా దొరికావ్ అనుకుని వెంటనే సరేనన్నాడు. కానీ యిదంతా కేశవరావుకి నచ్చలేదు. శేషు, రాధ మంచి జోడీ అనుకుంటే రాధను రఘు పెళ్లాడతానంటున్నాడు. పోనీలే అనుకుంటే యిప్పుడు శేషు వ్యవసాయం విడిచి వెళ్లిపోతానంటున్నాడు. అందుకని ‘నువ్వెళ్లిపోతే పొలాలు ఎవరు చూస్తారు?’ అని కొడుకుని తిట్టిపోశాడు.

‘ఏం నేను వ్యవసాయం చేయడానికే పుట్టానా? నాకు అదంటే అసహ్యం. కావలిస్తే నువ్వూ, రఘూ చేసుకోండి.’ అన్నాడు శేషు. దాంతో కేశవకు పట్టరాని కోపం వచ్చింది. కొడుక్కి శాపనార్థాలు పెట్టాడు. నీతో మాట్లాడను పొమ్మన్నాడు. భార్య నచ్చచెప్పబోయినా వినలేదు. ఆమెకు రఘు, రాధ పెళ్లి చేసుకోవాలని, శేషు యిక్కడే వుండి వ్యవసాయం చూసుకోవాలని వుంది.

కానీ శేషు వుండదలచలేదు. మేనమామ వెంట వెళ్లిపోయాడు. రాధ, రఘులకు పెళ్లయింది. మావగారి పొలం, తమ పొలం కలిపి రఘు చూసుకోవటం మొదలెట్టాడు. కానీ అతనికి ఆ పని చేతకావటం లేదు. మెతకమనిషి కావడంతో అందరూ తోక ఝాడించారు. పెద్దకొడుకు పోట్లాడి వెళ్లిపోవడంతో తండ్రి డీలా పడ్డాడు. ఆరోగ్యం చెడింది. సరైన మార్గదర్శనం చేయలేకపోయాడు.

వ్యవసాయం నష్టాలు తెచ్చిపెడుతోంది. అప్పులు చేయవలసి వచ్చింది. కేశవ చచ్చిపోయాడు. రాధకు కూతురు పుట్టింది. ఆ పాపకు ఎప్పుడూ అనారోగ్యమే. ఎటు చూసినా దరిద్రం తాండవిస్తోంది. దానికి తోడు రాధ తండ్రి యింటికి తరచుగా వస్తూ అల్లుడి చేతకానితనాన్ని ఎత్తిచూపుతూ వెక్కిరిస్తున్నాడు. రాధకు జీవితమంటే విసుగెత్తిపోయింది.

భర్తను మాటిమాటికీ విసుక్కుంటోంది. రఘుకి యీ వ్యవసాయం తప్పనిసరి తద్దినమైంది. అతనికి మానసిక విశ్రాంతినిచ్చే ఏకైక సాధనం పుస్తకాలు చదవడం. వాటిని చూస్తే రాధ మండిపడుతోంది. తల్లి అన్నీ చూస్తూ ఏమీ అనటం లేదు కానీ యింటా బయటా రఘు అసమర్థత వలననే యింత అనర్థం దాపురించిందని, అదే శేషు వుండి వుంటే బ్రహ్మాండంగా వుండి వుండేదని, తన భార్యతో సహా అందరూ, అనుకుంటూండడం గమనించిన రఘు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉడుక్కోవడం మొదలుపెట్టాడు.

విదేశాలకు వెళ్లిన మూడేళ్లకు శేషు బాగా చదువుకుని, బాగా గడించి, తన మేనమామ పతితో సహా తిరిగి వస్తున్నాడని కబురు వచ్చింది. అతను వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని అందరూ ఆశ పెట్టుకున్నారు. డబ్బుంది కాబట్టి అప్పులు తీర్చేస్తాడనీ, వ్యవసాయాన్ని మళ్లీ ఒక దారిలో పెడతాడని, తమ నుంచి వెళ్లిపోయిన పనివాళ్లను మళ్లీ రప్పిస్తాడని అందరూ అనుకున్నారు. అతను వచ్చాడు. విషయాలన్నీ గ్రహించి, వ్యవసాయం చేపడతానన్నాడు.

అతన్ని చూడగానే రాధతో సహా అందరూ గంతులు వేయడం చూసి, రఘు అభిమానం మరింత దెబ్బ తింది. ‘డబ్బిస్తాను, అప్పులు తీర్చేయి’ అని అన్న ఆఫర్ చేస్తే, అక్కరలేదు, పొలం తాకట్టు పెడతాను’ అని బింకానికి పోయాడు. ఇప్పటికే అతనితో పోల్చి అతన్ని అవమానపరుస్తున్నారు. డబ్బు కూడా తీసుకుంటే మరింత లోకువ అవుతానని అతని భయం. అతని ఫీలింగ్స్ అర్థం చేసుకున్న శేషు ఒత్తిడి చేయలేదు.

కానీ పొలానికి వెళ్లి కొన్నాళ్లు పని చేసి, వ్యవహారాలు గాడిలో పెట్టి, అప్పుడు మళ్లీ విదేశాలకు వెళదామనుకున్నాడు. రాధ, శేషు విడిగా మాట్లాడుకునే అవకాశం వచ్చినపుడు రాధ మనసులోని భావాలు వెల్లడయ్యాయి. శేషు తనను యింకా ప్రేమిస్తున్నాడనే అనుకుంటోందామె. మళ్లీ విదేశాలకు వెళ్లడానికి కారణం గతంలో ఉన్న కారణమేనా? అని అడిగింది. శేషు ‘అబ్బే అదేమీ లేదు, ఇప్పుడు నువ్వు నాకు చెల్లెలివి’ అన్నాడు.

రాధకు అది రుచించలేదు. అతను తనంటే యింకా వెంపర్లాడుతున్నాడని అనుకోవడమే ఆమె కిష్టం. ‘నిన్నే చేసుకోవాల్సింది. ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నీ తమ్ముణ్ని కట్టుకుని నేనేం బావుకున్నాను?’ అనే ధోరణిలో మాట్లాడింది. కానీ శేషు ‘రఘు చాలా సున్నితమనస్కుడు. వాడిని కష్టపెట్టకు’ అని హితవు చెప్పాడు.

అంతలోనే అతనికి ఒక పెద్ద ఆఫర్ రావడంతో అవేళే బయలుదేరి వెళ్లిపోవాల్సి వచ్చింది. భంగపడిన రాధ అతను వెళ్లగానే కోపంతో భర్తతో ‘నీ బదులు శేషునే చేసుకుని వుండాల్సింది’ అంది. అతను కోపంతో ఆమెను కొట్టబోయాడు. తమాయించుకున్నా, ఆమెపై విముఖత పెరిగింది. ఇక ఆ పై నుంచి ‘శేషు గురించి కలలు కంటున్నావేమో పాపం’ అని వెక్కిరించ సాగాడు.

అయిదేళ్లు గడిచాయి. ఈ లోగా రఘు కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. వైద్యం అందక కూతురు, వేదనతో తల్లి చచ్చిపోయారు. పొలం మొత్తం పోయింది. ఎటు చూసినా దరిద్రమే. మనిషి బాగా జబ్బు పడ్డాడు. చెమర్చిన గోడల కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయాయి. తిండికి గడవడమే కష్టంగా వున్నపుడు యింటి బాగుకి, వైద్యానికి డబ్బెలా వస్తుంది? రాధ కూడా జబ్బు మనిషిలా అయిపోయింది. జీవితంపై విరక్తి కలిగింది. ఆమె తండ్రి పరంధామయ్య వీళ్ల యింట్లోనే వుంటూ సతాయిస్తూనే వున్నాడు.

ఇవన్నీ శేషుకి తెలియవు. పొరపాటు పెట్టుబడుల కారణంగా మధ్యలో కాస్త డబ్బు పోగొట్టుకోవడంతో అతను అనుకున్నదాని కంటె ఎక్కువకాలం విదేశాల్లో వుండిపోయాడు. కానీ చివరకు బాగానే మిగుల్చుకుని యింటికి తిరిగి వచ్చాడు. అతని ఉత్తరాలకు సమాధానాలు రాసేవాళ్లు ఎవరూ లేరు.

ఉన్న పరిస్థితి రాస్తే డబ్బు కోసం దేవిరించినట్లు వుంటుందని రఘు అభ్యంతరం. చిన్న తమ్ముడు నీలూ చెయ్యి ఒక యంత్రంలో పడి విరిగిపోవడంతో, దాని వైద్యానికి కూడా డబ్బు లేకపోవడంతో అతనే టెలిగ్రాం యిచ్చాడు. ఆ విషయం మరెవరికీ తెలియదు.

ఆ రోజు రఘుకి జ్వరం. విపరీతమైన దగ్గు. రాధ ఏమైనా సేవ చేయబోయినా వద్దన్నాడు. ‘నన్ను పెళ్లి చేసుకుని పొరపాటు చేశావు. ఈసారి శేషు వస్తే సిగ్గు పడకుండా డబ్బు అడిగి తీసుకుని, యీ పల్లె విడిచి పట్నం వెళ్లిపోదాం, అక్కడ నా చదువు విలువ ఏమిటో చూపిస్తాను. మీ అందరి మెప్పూ పొందుతాను.’ అన్నాడు. తీసుకునేదేదో అప్పుడే తీసుకుని వుంటే బాగుండేదిగా అని దెప్పి పొడిచింది రాధ. జరిగిందేదో జరిగింది, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకుందాం అంటూ ఆశాభావంతో మాట్లాడాడు.

కానీ పరంధామయ్యకు ఆ మాటల మీద నమ్మకమేమీ లేదు. నీరసంతో రఘు లోపలకి వెళ్లి పడుక్కోగానే కూతురి దగ్గరకు చేరి ‘వీడు పోవడం ఖాయం. ఈసారి శేషు వచ్చినపుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని యికనైనా సుఖపడు. వయసు ఏమంత మీరిపోలేదు.’ అని హితబోధ చేశాడు. దాంతో రాధకు పిచ్చికోపం వచ్చింది. ‘ఏమిటా పాడుమాటలు?’ అంటూ తండ్రి మీద దీపంలోని కిరోసిన్ పోసేసింది. పొరపాటు మాట అన్నానమ్మోయ్ అంటూ అతను బతిమాలుకుంటూండగా సరిగ్గా అదే సమయానికి తలుపు తోసుకుని శేషు వచ్చాడు. వెంట ఒక డాక్టరు వున్నాడు.

వస్తూనే డాక్టరును తమ్ముడి గదిలోకి తీసుకెళ్లాడు. డాక్టరు పరీక్ష చేస్తూండగా బయటకు వచ్చి ‘సంవత్సరంగా నా తమ్ముడు జబ్బుతో బాధపడుతూంటే నాకెందుకు రాయలేదు? నీలూ టెలిగ్రాం యిచ్చాడు కాబట్టి యిప్పటికైనా తెలిసింది. భర్త పట్ల నీ బాధ్యత యిదేనా?’ అంటూ రాధను నిందించాడు.

రఘు వద్దన్నాడని చెప్పడం తప్ప ఆమె వద్ద వేరే సమాధానం లేదు. ఇంతలో డాక్టరు బయటకు వచ్చి రఘు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, చివరి ఘడియల్లో వున్నాడనీ చెప్పి వెళ్లిపోయాడు. కావాలంటే వేరే చోటకి తీసుకెళ్లి వైద్యం చేయిస్తానని శేషు అన్నాడు కానీ రఘుకి నిజం తెలిసిపోయింది. అన్నగారిని గదిలోకి పిలిచి, తను చనిపోయిన తర్వాత రాధను పెళ్లి చేసుకోమని కోరాడు.

ఇది విని శేషు నిర్ఘాంతపోయాడు. బయటకు వచ్చి ‘వాడికి యిలాటి ఆలోచన ఎందుకు వచ్చింది?’ అని రాధను నిలదీశాడు. ‘గతసారి నువ్వు వచ్చి వెళ్లాక ఆవేశంలో శేషుని చేసుకుంటే బావుండేది, నీ ముఖం చూడడానికే అసహ్యంగా వుంది అన్నాను’ అని ఆమె ఒప్పుకుంది. శేషు రాధను తిట్టిపోశాడు. ‘అసలే సున్నితమనస్కుడు. నీ మాటలతో సగం చచ్చాడు. ఇప్పుడు పూర్తిగా ఛస్తున్నాడు. వాడికి చావుకి నువ్వే కారణం. అన్నీ తెలిసే నువ్వా మాటలన్నావు. నిజానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్.’ అని గట్టిగా అరిచాడు.

రాధ కోపం కట్టలు తెగింది. ‘ఏం చూసి ప్రేమించాలి నిన్ను? డబ్బుని చూశా? నీకు ఆ విషయంలో గర్వం వుంటే, నాకు మరో విషయంలో గర్వం వుంది. డబ్బు, సుఖం అన్నీ పోయినా నా వ్యక్తిత్వం మిగిలి వుంది. నేను మనసా, వాచా ఆయన్నే మొదట ఎంచుకున్నాను. నిన్ను ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించాననుకోవడం సిగ్గుచేటు.’ అని గట్టిగా చెప్పి ఏడవసాగింది.

అదే సమయానికి రఘు తన గదిలోంచి బయటకు వచ్చి ఆమె మాటలు విన్నాడు. వినగానే సంవత్సరాలుగా తనలో వుండిపోయిన సమస్య ఆ క్షణంలో తీరిపోయినట్లు ముఖంలో తృప్తి కనబడింది. అంతలో దగ్గుతెర వచ్చి ఆపుకోలేక, రక్తం కక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. శేషు, రాధ యిదంతా గమనించలేదు. శేషు రాధతో ‘గదిలోకి వెళ్లి వాడికి ఆ మాట చెప్పు.’ అన్నాడు. ‘నేను చెప్పినా నమ్మరాయన’ అందామె. అంతలోనే వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలో ప్రశాంతవదనంతో ప్రాణాలు వదిలేసిన భర్త కనబడ్డాడు. వెళ్లి కౌగలించుకుని అతని శిరస్సును హృదయానికి హత్తుకుంది.

ఇంతటితో నాటకం ముగిసింది. శేషు, రాధను పెళ్లాడాడా? లేక బాగోగులు చూసుకున్నాడా? అని రచయిత చెప్పలేదు. ఒరిజినల్‌లో కూడా అంతే. అయితే ఒరిజినల్‌లో లేని మూగ తమ్ముడి పాత్ర తెలుగులో వుంది కాబట్టి, కనీసం అతని కోసం, రాధ తండ్రి కోసం శేషు యికపై డబ్బు పంపిస్తూ వుంటాడని మనం వూహించుకోవాలి.

అన్నదమ్ముల మధ్య వైరమనేది బైబిల్ కాలం నాటి నుంచి, సుందోపసుందుల కాలం నుంచి వుంది. ఇక్కడ శేషు, రఘుల మధ్య వైరం లేదు. కానీ యితరులు పోలిక పెట్టి వాళ్ల జీవితాలను ధ్వంసం చేశారు. ఇద్దరి మధ్యలో ఒక స్త్రీ వుండడం విషయాన్ని మరింత క్లిష్టం చేసింది. తనది కాని రంగంలో దిగి, రఘు నాశనమయ్యాడు. చుట్టూ వున్నవాళ్లనీ నాశనం చేశాడు. విదేశాలకు వెళ్లిపోదామనుకున్న అతను రాధపై ప్రేమ కారణంగానే వ్యవసాయంలో దిగి, విఫలమయ్యాడు. చివరకు రాధ ప్రేమనూ పోగొట్టుకున్నాడు. శేషు వ్యవసాయంలోనూ రాణించాడు. 

బయటకు వెళ్లీ రాణించాడు కాబట్టి విజేత అనడానికి లేదు. ‌డబ్బు గడించాడు కానీ ప్రేమరీత్యా విఫలమయ్యాడు. రాధను పెళ్లి చేసుకోలేకపోయాడు సరే, వేరే ఎవరినైనా ప్రేమించో, పెళ్లాడో వుండవచ్చు కదా! అదీ జరగలేదు. రాధను సోదరిగా భావిస్తున్నానని అతను అనుకున్నా, ఆమెను మర్చిపోలేక పోయాడనే అనుకోవాలి. ఇక రాధ అన్ని విధాలా నష్టపోయింది. ఈ విషాదనాటకం విపరీతంగా ప్రజాదరణ పొందింది. – (ఫోటో – బియాండ్ ద హొరైజన్ నాటక ప్రదర్శన, ఇన్‌సెట్‌లో గొల్లపూడి)

- ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

Show comments