ఎమ్బీయస్: ఏడాదిలో అమరావతి ఉద్యమం ఏం సాధించింది?

అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాదయింది. ఉద్యమనాయకులు సీరియస్‌గా సమీక్షించుకునే సమయమిది. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు అవుతున్నపుడల్లా టీవీలో చర్చలు పెట్టడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏడాది మైలురాయి కూడా దాటుతోంది. 100 రోజుల సమీక్షకు, ఏడాది సమీక్షకు తేడా ఏమైనా కనబడుతోందా? ఉద్యమం విస్తరించిందా? పైకి ఎగసిందా? కొత్తగా రాజకీయ పరిణామాలు ఏవైనా చోటు చేసుకున్నాయా? కొనసాగిస్తే లాభముందా లేదా? ఇలాటి ప్రశ్నలు వేసుకుని ఉద్యమకారులు తదనుగుణంగా అడుగులు వేయాలి. లేకపోతే ఏడాది గడిచినా, రెండేళ్లు గడిచినా అవే నినాదాలు, అవే ప్రతిజ్ఞలు, అవే హెచ్చరికలు, అవే మొహాలు.

మరీ సాగితే బిగి తగ్గుతుంది - ఒక పరిమితికి మించి ఉద్యమం కొనసాగినప్పుడు దాని ఉధృతి తగ్గిపోతుంది. సముద్రానికైనా సరే ఆటుపోట్లు వుంటాయి. ఎప్పుడూ ఒకే జోరు మేన్‌టేన్ చేయడం ఎవరి తరం కాదు. కెసియార్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కొన్ని జిల్లాలలో వేడి కనబడింది. ఎంత కష్టపడినా తక్కిన జిల్లాలకు పాకలేదు. తర్వాత ఆ జిల్లాలలోనూ చప్పబడింది. ఉద్యమం దాదాపు ముగిసిపోయింది అనుకునే సమయంలో కెసియార్ మళ్లీ ఏదో ఒక కొత్త ఎత్తు వేసి కదలిక తెచ్చేవాడు. దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెసు, టిడిపిలలోని తెలంగాణ నాయకులు ఊపిరులూదేవారు. అధికారంలో వున్న కాంగ్రెసులో కెసియార్ కోవర్టులు గోరంతను కొండంతలు చేసి చెప్పి దిల్లీలో హడావుడి చేస్తూ వుండేవారు.

ఎవరెన్ని చేసినా కాంగ్రెసు అధిష్టానం ఉద్యమాన్ని అలా కొనసాగించనిచ్చింది తప్ప నిర్ణయం తీసుకోలేదు. చివరకు రాజకీయంగా లెక్కలు వేసుకుని (అవి శుద్ధ తప్పుడు లెక్కలని తర్వాత తెలిసిందనుకోండి) ఆఖరి నిమిషంలో విభజన నిర్ణయం తీసుకుంది కాబట్టి, దానికి బిజెపి, టిడిపి తమతమ కారణాల చేత మద్దతిచ్చాయి కాబట్టి, తెలంగాణ ఉద్యమం సఫలమైంది అని చెపుతున్నారు. నిజానికి విభజనకు కారణం వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల అత్యాశ, దిల్లీలో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక కాంగ్రెసు నాయకుల కుట్ర, సోనియా తెలివితక్కువతనం తప్ప ప్రజల కారణంగా ఉద్యమం విజయవంతమైంది అనడానికి లేదు. ఎందుకంటే కిరణ్‌కుమార్ హయాంలో  ప్రజలు దాదాపు ప్రత్యేక తెలంగాణ అంశాన్ని మర్చిపోయారు.

అంతిమంగా ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యం - అమరావతి ఉద్యమ ఫలితం కూడా రాష్ట్రప్రభుత్వనిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రాజకీయంగా ఏవైనా పెనుమార్పులు వచ్చి జగన్ అమరావతిలోనే అన్నీ వుంచుదాం అనుకునేవరకూ ఉద్యమానిది నత్తనడకే. రాష్ట్రప్రభుత్వం మారిపోయి, మూడు రాజధానుల నిర్ణయాన్ని తిరగతోడితే అప్పుడు ఉద్యమం విజయవంతమైంది అనవచ్చు. జగన్ మనసు మారడం లేదా పదవీచ్యుతుడు కావడం యిప్పట్లో జరిగేట్లా కనబడటం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైపోయాయి, రాజ్యాంగం భ్రష్టమై పోయింది లాటి వ్యాఖ్యలు హైకోర్టు చేస్తే లాభం లేదు. గవర్నరు ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలి. అలాటి లేఖ తెప్పించుకోవడానికి కేంద్రాన్ని నడిపే పార్టీ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి.

ఎందుకంటే ఇంతటి సుస్థిర ప్రభుత్వాన్ని రద్దు చేయడం మాటలు కాదు. ప్రజల్లో నిరసన రగిలితే కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ జవాబు చెప్పుకోవలసి వస్తుంది. ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించినపుడు మళ్లీ వైసిపియే అధికారంలోకి వస్తే మొత్తం కసరత్తు వ్యర్థమైనట్లే. అది జరగకుండా చూడాలంటే తక్కిన పార్టీలు బలంగా వుండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి అంత బలం లేదు. ఒకవేళ జగన్‌ను ఏదో ఒక కేసులో జైలుకి పంపినా, ముఖ్యమంత్రి మారతాడు తప్ప, వైసిపి ప్రభుత్వం మారదు. రాజధాని గురించి దాని విధానమూ మారదు.

కోర్టు ఆపగలదు తప్ప చేయించలేదు - రాష్ట్రప్రభుత్వ వైఖరి మారనంతకాలం హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పేపర్లో చదువుకుని ఓహో అనుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో మార్పు రాదు. ఫలానా భవననిర్మాణాన్ని ఆపేయండి అని కోర్టు చెప్పగలదు కానీ ఫలానిది, ఫలానావిధంగా యింత ఖర్చు పెట్టి కట్టాలి అని చెప్పలేదు. ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఎంత తాత్సారమైనా చేయవచ్చు, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం, చేద్దామనుకుంటున్నాం అంటూ కోర్టులో సమాధానాలు చెపుతూ కాలక్షేపం చేసేయవచ్చు. ‘అమరావతిలో అన్నీ పెట్టవద్దు, అసలే రాజధానే వద్దు, ఒకవేళ రాజధాని పెట్టినా, లాండ్ పూలింగ్ వద్దు, ప్రభుత్వస్థలాలలో పెట్టండి, పూలింగే కావాలనుకున్నా ఏ పలనాడులోనో తీసుకోండి తప్ప మూడు పంటలు పండే పొలాలు వద్దు.’. యిలా ఎన్ని చెప్పినా, ఎందరు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం విందా? దాని చిత్తమొచ్చినట్లు అది చేసింది కదా! ఇప్పుడు జగన్ సర్కారు వంతు. అదే హక్కు దఖలు పడింది. ఆ రోజు లాండ్ పూలింగుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ రోజు రాజధాని మార్చకూడదంటూ ఉద్యమం జరుగుతోంది. అదెంత సఫలమైందో, యిదీ అంతే సఫలమౌతుంది.

బంగారు బాతు వాదనలు - పైగా యిక్కడో తిరకాసుంది. రాజధాని మార్చకూడదు అని వీరంటారు. అబ్బే మేమెక్కడ మార్చాం కనుక, లెజిస్లేటివ్ కాపిటల్ అమరావతేగా అంటుంది ప్రభుత్వం. అలాక్కాదు, రాజధాని అంటే మా దృష్టిలో చంద్రబాబు బొమ్మలలాంతరులో చూపించిన అద్భుతనగరం, అది కట్టాల్సిందే అంటున్నారు అమరావతివాదులు. దానికి డబ్బు లేదు అంటుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలకు బోల్డు పెడుతున్నారుగా, డబ్బు లేకపోవడమేం అంటున్నారు వీళ్లు. అవి రాష్ట్రంలోని 13 జిల్లాలవాసులకూ ఉపకరించేవి. మొత్తమంతా మీ జిల్లాకే పెట్టమంటే ఎలా అంటుంది ప్రభుత్వం? మాకు యిప్పుడు పెడితే భవిష్యత్తులో తక్కిన 12 జిల్లాలనూ మేమే పోషిస్తాంగా అంటారు వీళ్లు.

నిజానికి అవన్నీ కాకిలెక్కలని అందరికీ తెలుసు. కరోనాకు ముందే దేశ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. కరోనా తర్వాత రాష్ట్రాలు, కేంద్రం అన్నీ చతికిలపడ్డాయి. ఏ పరిశ్రమా కోలుకోలేదు. కేంద్రమే రాష్ట్రాన్ని అప్పులు చేసుకుని బతకండి, మేం యివ్వాల్సిన బకాయిలు కూడా యిచ్చే పరిస్థితి లేదు అంటోంది. పోలవరం వంటి ప్రాజెక్టులకే నిధులు రాల్చటం లేదు. అలాటప్పుడు ఈ బంగారుబాతును తయారుచేస్తామంటే పెట్టుబడి ఎవరు పెడతారు? పైగా జగన్‌కు ఏ పనీ చేతకాదు, కూలగొట్టడం తప్ప కట్టడం రాదు అని ఓ పక్క అంటూనే యీ బంగారుబాతును తయారుచేయగలడని అమరావతివాదులు అనగలరా? ఆ మధ్య ఎవరో టిడిపి నాయకుడు టీవీ చర్చల్లో అన్నాడు, ‘కరోనాను కట్టడి చేయడం జగన్‌కు చేతకాదు, చంద్రబాబును పిలిచి సగౌరవంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగిస్తే ఆయన చేసి చూపిస్తారు’ అని. అలాగే అమరావతి నిర్మాణం బాధ్యత, నిధులు బాబు చేతికివ్వాలి అని ఎవరైనా అంటారేమో మరి!

కటింగ్ ద లాసెస్ - ఏది ఏమైనా వాళ్లనుకున్న అమరావతి ఏర్పడదని అక్కడి రైతులకు, పెట్టుబడిదారులకు పూర్తిగా అర్థమై పోయింది. ఓ కంపెనీ షేరు ధర పెరుగుతుందన్న ఆశతో షేర్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడి పెట్టినవారు, ధర పడిపోయినప్పుడు కాస్సేపు బాధపడినా, మానసికంగా ఎలా సర్దుకుంటారో అలాగే అమరావతి పెట్టుబడిదారులూ సర్దుకుని వుండాలి. షేరుమార్కెట్, గుఱ్ఱప్పందాలు లాటి వాటిల్లో నష్టం వచ్చినా ఫర్వాలేదు అనే జూదరి మనస్తత్వంతోనే పాల్గొనాలి కాబట్టి వాళ్లు సాధారణంగా ప్రొఫెషనల్సే అయివుంటారు. కానీ అమరావతికి వచ్చేసరికి అనేకమంది మధ్యతరగతివారు కూడా తాము జూదమాడుతున్నామని తెలుసుకోకుండానే జూదమాడేశారు.

వాళ్లు నమ్ముకుని పందెం కాసిన గుఱ్ఱం చంద్రబాబు. గుఱ్ఱప్పందాల విషయంలో వాటి చరిత్రను ముందే పబ్లిష్ చేసి యిస్తారు. బాబు విషయంలో ఆ చరిత్రంతా ఆయన రాసుకుని, మీడియా ద్వారా వ్యాప్తి చేసుకున్నదే. ఆయన పరిపాలనాదక్షుడు, ద్రష్ట, స్రష్ట, మయుడు, గయుడు.. అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆయన చేసినదంతా ఆల్‌రెడీ సకల సౌందర్యాలున్న హైదరాబాదుకు మేకప్ చేయడం మాత్రమే. నేదురుమల్లి జనార్దనరెడ్డి మొదలుపెట్టిన హైటెక్ సిటీని పూర్తి చేసి దాని మీద తన స్టాంపు వేసుకోవడమే. 23 జిల్లాల రాష్ట్రంలో తక్కిన చోట ఆయన పొడిచేసినదేమీ లేదు. అప్పటికే అన్నీ వున్న హైదరాబాదుకి మరిన్ని హంగులు సమకూర్చాడంతే. అన్నీ అమర్చినదానిలో అత్తగారు వేలెట్టిందన్న సామెత చందంగా 400 ఏళ్ల వయసున్న హైదరాబాదు నా సృష్టే అని చెప్పేసుకోవడం మొదలుపెట్టి యిప్పటికీ ఆపటం లేదు.

ఇది ఖతమ్ చేసి, అది శురూ చేస్తా - మంచు లక్ష్మి చేసిన యింటర్వ్యూలో ‘అన్నీ హైదరాబాదులోనే పెట్టారేం?’ అని అడిగితే ‘ముందు దీన్ని పూర్తి చేసి, తర్వాత తక్కినవాటి సంగతి చూద్దామనుకున్నాను.’ అని జవాబిచ్చారు బాబు. ఓ ఆర్నెల్లో ఏడాదో అయితే పోనీలే అని మిగతావాళ్లు వెయిట్ చేస్తారు. ‘9 ఏళ్లకు పైగా పాలించినా హైదరాబాదు సింగారం పూర్తి కాలేదా? మరి మా సంగతేమిటి?’ అంటూ 2004లో రాష్ట్రప్రజలు బాబును పదవీభ్రష్టుణ్ని చేశారు. షోకులు చేయించుకున్న హైదరాబాదు వాళ్లూ చేసింది చాల్లే వెళ్లిరా అన్నారు. అప్పటినుంచి పదేళ్లపాటు అరణ్యవాసమే.

2014లో బాబుకి స్వర్ణావకాశం వచ్చింది. రాష్ట్రవిభజనలో ఆయన ప్రముఖపాత్రను పట్టించుకోకుండా ఆంధ్రప్రజలు పట్టం కట్టారు. ‘విశ్వకర్మ లాటి నువ్వు మాకు కొత్త రాష్ట్రాన్ని నిర్మించిపెట్టు. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని పట్టించుకోకుండా ఎండగట్టావు. ఇప్పుడైనా, కనీసం 13 జిల్లాలైనా అభివృద్ధి చేసి చూపించు. తెలంగాణలో మీ పార్టీకి ఎలాగూ నూకలు చెల్లాయి. ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తే గర్వంగా తలెత్తుకుని తిరుగుతాం’ అంటూ అధికారాన్ని చేతిలో పెట్టి, ఆయన ఏం చెపితే దానికి తలూపారు. అయిదేళ్లు పోయాక సమీక్షించుకుంటే, ఎంతో మేధావి అనుకుని క్లీన్ స్లేట్ చేతికిస్తే దానిమీద పిచ్చిగీతలు రాసిపెట్టినట్లయింది. బాబు నిజంగా నిర్మాణదక్షుడైతే ఎందుకిలా జరిగింది? ఆయనకు ఏదీ చేతకాదన్నమాట.

ఆచరణవాది యిలా చేస్తాడా? - చేత వచ్చినవాడైతే కొంచెంకొంచెంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఏవేవో కట్టి చూపించేవాడు కదా! నిజంగా అమరావతిలో కొంతమేరకు ప్రభుత్వ పెట్టుబడులు పెట్టినా, ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించి వుంటే నగరం పెరిగేది కదా! అప్పుడు జగన్ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ మార్చే సాహసం చేసేవాడు కాదు కదా! ఒకవేళ మార్చినా సెక్రటేరియట్ బిల్డింగులు, మంత్రుల క్వార్టర్లు పోతే మాత్రం ఏమైంది? తక్కినవి వుండేవిగా! వాటివలన కమ్మర్షియల్ వేల్యూ పెరిగేదిగా! పెట్టుబడిదారుల్లో యింత ఆక్రోశం వుండేది కాదుగా! బిజెపి లక్షల కోట్లు కుమ్మరిస్తుందని మొదటి ఏడాది ఆశ పెట్టుకున్నాడనే అనుకుందాం. ఏడాది పాటికే తెలిసిపోయింది వాళ్లు వెనకబడిన ఏడు జిల్లాలకు డబ్బివ్వలేదు, బజెట్ లోటు తీర్చలేదు అని. తెలివైనవాడైతే యిక అప్పణ్నుంచి ప్రయివేటు పెట్టుబడులను తెచ్చేసి గబగబా ఏదో ఒకటి కట్టి ప్రజలకు తన దక్షత చూపించేవాడు.

ఇక్కడ పర్యావరణ సమస్యలూ అవీ వున్నాయి కాబట్టి యితర ప్రాంతాల్లో, యితర జిల్లాలలో తలా ఓ డిపార్టుమెంటు చొప్పున కట్టేసి వుంటే వాళ్లూ సంతోషించి వుండేవారు. పనులు చకచకా నడిచేవి. ఇది ఎవరైనా ప్రాక్టికల్ మనిషి చేసే పని. కానీ బాబు ఊహల్లో తేలిపోతూ అమరావతి డిజైన్లు, సింగపూరు, జపాన్ అంటూ కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మూడు శంకుస్థాపనలా! ఆ సందర్బంగా ప్రజలంతా పూజలు చేయడమా! పూజా విధానాలను ముఖ్యమంత్రి వివరించడమా! లండన్లో డిజైన్లా? సినిమా డైరక్టరు చేత ఆర్కిటెక్చర్ ప్లాన్లా? రైతులకు సింగపూరు పర్యటనలా! చివరకు వేళాకోళం వ్యవహారంగా మార్చేశారు బాబు. బుద్ధిశాలి ఐన ముఖ్యమంత్రి చేయవలసిన పనులా యివి!

పద్ధతి మారలేదు - నిజానికి అమరావతిని ఒక జోక్‌గా మార్చిన పాపం బాబుదే! అది రైతుల పాలిట క్రూయల్ జోక్! నిజంగా ఆయనకు రైతుల పట్ల ఏ మాత్రం సానుభూతి, సహానుభూతి వున్నా, ‘రేపు ఒకవేళ నేను మళ్లీ అధికారంలోకి రాకపోతే నన్ను నమ్మి భూములిచ్చిన వీళ్ల గతి ఏమౌతుంది? వాళ్ల హక్కులు రక్షించాలి కదా! కనీసం కొన్నయినా చప్పున కట్టి వాళ్ల ఆస్తుల విలువ పెంచాలి కదా’ అని ఆలోచించి ప్లాన్ బి తయారుచేసేవారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే అనే శంక ఎందుకు రావాలి అంటే 2014 ఎన్నికలలో జగన్‌పై కేవలం ఆరు లక్షల లోపు ఓట్ల తేడాతోనే గెలిచానన్న స్పృహ ఆయనకుంటుంది కదా! ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆశపెట్టి గుంజుకోగలరు కానీ ప్రజలను గుంజుకోలేరు కదా!

మంచు లక్ష్మి యింటర్వ్యూలో చెప్పినది 2014-19లో బాబు మళ్లీ రిపీట్ చేశారు. ముందు అమరావతి కట్టి, ఆ తర్వాత మిగతా జిల్లాల పని పడదామనుకున్నారు. వాళ్లకంత ఓపిక లేకపోయింది. 2004 నాటి ఫలితం 2019లో రిపీటైంది. తక్కిన జిల్లాలన్నీ వద్దు పొమ్మన్నాయి. చివరకు రాజధాని ప్రాంతంలో కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిడిపిని అంతకుముందు ఎన్నడూ చూడని లోతులకు తీసుకుపోయారు బాబు. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా వున్న తెలంగాణాలో పార్టీని ఖలాస్ చేసేశారు. మొన్న హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులెవరికీ డిపాజిట్లు దక్కలేదంటే ఎంత నగుబాటు! పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ జనరల్ సెక్రటరీ నివాసం వుంటున్న హైదరాబాదులోనే యిలా వుంటే యిక తక్కిన జిల్లాలలో ఎలా వుంటుందో ఊహించుకోవాల్సిందే!

నిండా ములిగినాయన యింకోరిని తేల్చగలడా? - ఈ రోజు అమరావతి రైతుల కష్టాలకు కారకుడు బాబే! ఆయన ఏ మాత్రం తెలివిగా వ్యవహరించినా రైతులకు యీ లెవెల్లో కడగండ్లు వుండేవి కావు. పెట్టుబడిదారులకు యీ మేరకు నష్టాలు వచ్చేవి కావు. గతం వదిలేసి, ప్రస్తుత పరిస్థితి చూసినా ఆంధ్రలో సైతం ఆయన ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోతున్నారు, ఉన్నా స్తబ్దంగా వుంటున్నారు. ఇలా నిండా ములిగినాయన తమను గట్టెక్కిస్తాడని ఉద్యమకారులు నమ్మితే వారి యింగితాన్ని ఏమనాలి? అంతకంటె వాళ్లు ‘చంద్రబాబును నమ్మి మోసపోయాం, మమ్మల్ని ఆదుకోండి. తాజా పరిస్థితుల్లో మాకు వీలైనంత మేలు చేయండి’ అనే లైను తీసుకుని వుంటే బాగుండేది.

‘జగన్‌ను మేము ముఖ్యమంత్రిగా గుర్తించం. ఆయన దగ్గరకు వెళ్లం. ఆయనే మా దగ్గరకు వచ్చి నిలబడాలి.’ అనడంతో ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నట్లయింది. వారు గుర్తించడానికి నిరాకరిస్తున్న విషయం ఏమిటంటే, బాబు యిచ్చిన హామీలన్నీ నోటిమాటలే, కాగితం మీద వాళ్ల కేసు స్ట్రాంగ్‌గా లేదు. (గతంలోనే వాళ్ల ఒప్పందాల గురించి నేను రాసిన వ్యాసాలు చూడవచ్చు) ప్రభుత్వంతో రాజీ పడి, సాధ్యమైనంత ఎక్కువ రాబట్టుకోవాలి తప్ప, ఎన్నాళ్లు ఉద్యమం చేస్తారు?

తక్కిన ప్రాంతాలకూ, తక్కిన పార్టీలకూ విస్తరించటం లేదు - ముఖ్యంగా వచ్చిన యిబ్బంది ఏమిటంటే, ఈ ఉద్యమం మూడు గ్రామాలకు మించి ముందుకు సాగటం లేదు. తక్కిన జిల్లాలలో స్పందన లేదు. ‘మీకేమీ యివ్వకూడదు, అన్నీ మాకే కావాలి.’ అంటే వాళ్లెందుకు కలిసివస్తారు? ‘నీ పెళ్లి నా మొహంలా వుంది, నా పెళ్లికి వచ్చి కాగడా వేయి’ అనే సామెత గుర్తుకు వస్తుంది. పాతకాలంలో రాత్రుళ్లు పెళ్లిళ్లు జరిగినప్పుడు కరంటు సౌకర్యం వుండేది కాదు కాబట్టి, వెలుతురు కోసం పెళ్లికొడుకు స్నేహితులు కొందరు కాగడాలు పట్టుకుని నిలబడేవారట. అన్నీ యిక్కడే పెడతాం అని బాబు అన్నపుడు అమరావతి వాళ్లు ‘పోనీ ఒకటి రెండు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, మా పక్క జిల్లాలలకు యివ్వండి’ అన్నారా ఏమన్నానా? ఇప్పుడు ఆ జిల్లాల వాళ్లందరూ వేడుక చూస్తున్నారు. ఆట్టే మాట్లాడితే చూడడం మానేశారు కూడా. అందుకే టీవీ5, ఆంధ్రజ్యోతి టీవీ ఛానెళ్లు తప్ప ఉద్యమాన్ని కవర్ చేయడం మానేశారు. ఇవాళ కూడా యీ ఛానెల్స్‌దే సందడి.

ఎప్పుడైతే దీనికి టిడిపి కలర్ వచ్చేసిందో, మిగతా పార్టీలకు యింట్రస్టు పోయింది. ఒకవేళ జగన్ మూడు రాజధానుల అంశాన్ని కట్టిపెట్టినా ఆ ఘనతంతా టిడిపికే పోతుంది తప్ప మాకెలాగూ దక్కదని వాళ్లనుకుంటారు. మిగతా పార్టీలలో పేరుకు కొందరు వచ్చినా, బాబు వర్గానికి చెందినవారిగా పేరుబడినవారే వచ్చారు. టిడిపివారు ఆశ పెట్టుకున్నదల్లా బిజెపి మీదే. తను ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్లూ కేంద్రానికి యిక్కడేం పని? అని హుంకరించిన బాబు యిప్పుడు కేంద్రమే కలగజేసుకుని రాజధాని వికేంద్రీకరణ, తరలింపు ఆపాలని ఆశించారు. తనకు అనుకూలమైన బిజెపి నాయకుల చేత మేరకు ప్రకటనలు చేయించారు. చివరకు కేంద్రం కుండ బద్దలు కొట్టేసింది, మాకు సంబంధం ఏమీ లేదు. అది రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిదే అని.  

బిజెపికి శంకుస్థాపన సెంటిమెంటు ఉంటుందా? - ఇక అక్కణ్నుంచి సెంటిమెంటు కార్డు బయటకు తీశారు. సాక్షాత్తూ మోదీ గారు శంకుస్థాపన చేసిన చోట నుంచి రాజధానిని తరలిస్తూంటే చూస్తూ ఎలా వూరుకుంటారు? అంటూ బిజెపిని రెచ్చగొట్టబోయారు. నాయకులకు శంకుస్థాపన సెంటిమెంటు ఉంటుందని ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎంతోమంది నాయకులకు తెలుసు, తాము శంకుస్థాపన చేయబోయే రాయి, సమాధి రాయిగా మిగిలిపోతుంది, యీ ప్రాజెక్టు పూర్తవదు అని. అసలు నిధులుంటే కదా కేటాయించడానికి! అయినా ప్రజలకు ఆశలు కల్పించడానికి, ఊరూరా శంకుస్థాపనలు చేసుకుంటూ పోతారు. ఒక్కోప్పుడు గత ముఖ్యమంత్రి చేసిన స్థలంలోనే కొత్తగా శంకుస్థాపన చేస్తారు కూడా. వాళ్లకు కావలసినది ఆ రోజు పబ్లిసిటీ, అంతే! రేపు వైజాగ్‌లో సెక్రటేరిటయట్ భవనానికి శంకుస్థాపన అంటూ పిలిస్తే మోదీ అక్కడకూ వచ్చి ఓ రాయి పాతవచ్చు.

అమరావతి విషయంలో బిజెపి చాలా తెలివిగా వ్యవహరిస్తోందనుకుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టిడిపి లైను తీసుకుని కేంద్ర కమిటీ అభిమానం పోగొట్టుకోవడంతో సోము వీర్రాజుకి అవకాశం వచ్చింది. ఆయన టిడిపి నాయకులలాగానే మాట్లాడిన ముగ్గురు నాయకులపై చర్య తీసుకుని రాయలసీమ బిజెపి నాయకుల్లో ఆశలు రేకెత్తించారు. ఎందుకంటే బిజెపి రాయలసీమ తీర్మానం ప్రకారం, దాని మానిఫెస్టో ప్రకారం తక్కినవి అమరావతిలో వున్నా, హైకోర్టు మాత్రం కర్నూలులో పెట్టాలి. తాజాగా సోము వీర్రాజు తుళ్లూరు రైతుల సభలో మాటల గారడీ చేశారు. ఆంధ్రకు అమరావతే రాజధాని అని పునరుద్ఘాటించారు. వైసిపి కూడా అదే అంటోంది. అమరావతే రాజధాని, ఎక్కడికీ వెళ్లటం లేదు. ఎటొచ్చీ లెజిస్లేటివ్ కాపిటల్ మాత్రమే అని.

హైకోర్టుపై బిజెపి స్టాండ్ ఏమిటి? - మరి తేడా ఎక్కడ? హైకోర్టును కర్నూలుకు తరలించడానికి అభ్యంతరం వుందా లేదాన్న విషయం వీర్రాజు చెప్పలేదు. తిరుపతి ఉపయెన్నిక దగ్గర్లో పెట్టుకుని అది అనడానికి సాహసం లేదు. పత్రికా విలేఖరులు కూడా ఆ ప్రశ్న అడిగి యిబ్బంది పెట్టటం లేదు. కేంద్ర నాయకత్వం రాజధాని వికేంద్రీకరణ మా అంశం కాదు అని చెప్పి తప్పుకున్నారు. ఇక రాష్ట్ర నాయకుడిగా వీర్రాజే దానిమీద స్పష్టంగా చెప్పాలి, హైకోర్టు మార్చవచ్చు, తక్కినవి మాత్రం యిక్కడే వుంచాలి అని. ఆ మాట కూడా అమరావతీ క్షేత్రంలో ఆయన చెప్పలేదు. దీని పర్యవసానం ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ఎలా వుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఆ ప్రాంతాల టిడిపి నాయకులు చప్పబడ్డారు. వాళ్లకయితే క్యాడర్ వుంది కాబట్టి పోతుందేమోనన్న భయాలు వుంటాయి. వీరికా బెంగ లేదు. కానీ తిరుపతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు తెచ్చుకోకపోతే తెలంగాణలో కలిగిన జోష్ యిక్కడ వుండదు.

జగన్ బిజెపిని ‘అటేపా? ఇటేపా?’ తేల్చి చెప్పమంటూ యిరకాటంలో పెట్టడానికి కర్నూలుకి హైకోర్టు తరలింపును అనుమతించమంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి, హోం మంత్రిని కోరారు. వాళ్లు నిరాకరిస్తే దాన్ని తిరుపతి ఉపయెన్నికల ప్రచారంలో వాడుకోవచ్చు. హైకోర్టు తరలిపోయినా అది తమ ఉద్యమానికి విఘాతమే అని అమరావతి ఉద్యమకారులు భావిస్తే చాలా యిబ్బంది పడతారు. అన్నిటికంటె ముఖ్యమైనది ఎగ్జిక్యూటివ్ కాపిటల్. సెక్రటేరియట్, మంత్రులు వుండేది అక్కడే. అది యిక్కడ వుంచి, కావాలంటే హైకోర్టును కర్నూలుకు, లెజిస్లేటివ్ కాపిటల్‌ను వైజాగ్‌కు తరలించుకోండి అని రాజీపడితే ఆచరణయోగ్యంగా వుంటుంది.

క్షేత్రస్థాయి వాస్తవాలు గుర్తెరగాలి - ఏది ఏమైనా ఏవో కొన్ని బిల్డింగులు, కొంత యాక్టివిటీ తప్ప వారాశించిన మాయానగరం ఎట్టి పరిస్థితుల్లోనూ వెలవదని ఉద్యమకారులు గ్రహిస్తే మంచిది. ఎందుకంటే సోము వీర్రాజు కూడా మేం అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. అంటూ వేల కోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా చేసేశాం అంటున్నారు. చంద్రబాబు స్వప్ననగరికి లక్షల కోట్లు కావాలి. అది బిజెపి కూడా ప్రామిస్ చేయటం లేదు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చినా ‘జగన్ తాయిలాల కోసం ఖజానా ఖాళీ చేసేశాడు. ఇది కట్టడానికి డబ్బు లేదు’ అనేస్తారు.

ఇటువంటి నిరాశాపూరితమైన వాతావరణంలో అమరావతి ఉద్యమకారులకు ఊరట నిస్తున్నది కోర్టులు చేసే వ్యాఖ్యలు! సమయం, సందర్భం కుదరకపోయినా ‘మూడు రాజధానుల ఆలోచన తెలివితక్కువ నిర్ణయం’ అని ఒక జడ్జిగారు వ్యాఖ్యానించారని చెప్పుకుని మురిసిపోతే లాభమేముంది? అది తీర్పులో పెట్టండి అంటే పెట్టరు, గట్టిగా రొక్కిస్తే ‘అది నా వ్యక్తిగత అభిప్రాయం’ అంటారు. (ఇంకా నయం, తనకు నచ్చిన సినిమాల గురించి, నచ్చని పుస్తకాల గురించి కూడా కోర్టు సమయాన్ని వెచ్చించి మనకు చెప్పటం లేదు) వీటివలన కక్షిదారులకు ఒరిగేదేమీ లేదు.

చివరగా చెప్పేదేమిటంటే, ఉద్యమం బలంగా లేదు. పైగా దానికి టిడిపి ముద్ర పడిపోయింది. ప్రభుత్వంతో డైలాగు మొదలుపెట్టడానికి ఉద్యమనాయకులు సిద్ధంగా లేదు. ఇతర పార్టీల నాయకులు టిడిపికి పేరు వస్తుందన్న జంకుతో అంటీముట్టనట్లు వున్నారు. మిగతా ప్రాంతాలలో వున్న ప్రయోజనాలు కూడా వారికి అడ్డుపడుతున్నాయి. అక్కడ పెట్టుబడులు పెట్టిన ఎన్నారైలు కావాలంటే డబ్బు పంపగలరు కానీ రాజకీయంగా సంక్షోభం సృష్టించగలిగే సమర్థులు కారు. అయివుంటే ఆ ప్రాంతపు వైసిపి ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి, వారి చేత వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ పార్టీకి లేఖ రాయించగలిగేవారు. అప్పుడు ఎంతో కొంత ఫలితం వుండేది. ఇప్పటిదాకా అది చేయలేకపోయారంటే వారికి ఆ శక్తి లేదన్నట్లే తోస్తోంది. ఈ పరిస్థితుల్లో మీడియా కవర్ చేసినంత కాలమే అమరావతి ఉద్యమానికి మనుగడ వుంటుందని నా ఊహ. 

ఎమ్బీయస్ ప్రసాద్

Show comments