ఎమ్బీయస్ : ఓ క్రైస్తవ గురువు విభిన్నమార్గం

చైనాపై నల్లమందు యుద్ధం ఆర్టికల్‌లో సామ్రాజ్యవాదులతో క్రైస్తవమతప్రచారకులు చేతులు కలిపిన విధానం గురించి నేను రాసినది చదివాక భారతదేశంలో క్రైస్తవవ్యాప్తి గురించి రాయండి అని కొందరు కోరారు. 

మామూలుగా అందరికీ తెలిసినది విద్య, వైద్యం అందించడం ద్వారా మిషనరీలు నిమ్నవర్గాల వారిని ఆకట్టుకున్నారనీ, విదేశాల్లో వున్న దాతల నుంచి పాలడబ్బాలు, బట్టలు వంటివి తెప్పించి యిక్కడ పంచడం ద్వారా, తమ మతంలో హెచ్చుతగ్గులుండవని, అందర్నీ సమానంగా, గౌరవంగా చూస్తామని భరోసా కల్పించడం ద్వారా మతవ్యాప్తి చేశారనీ! ముఖ్యంగా అణగారినవారుండే వాడలకు, సులభంగా చేరలేని దుర్గమ అరణ్యాలకు, పర్వతప్రాంతాలకు యితర మతగురువులు వెళ్లడానికి సంశయిస్తూండగా, వీళ్లు మాత్రం వెళ్లి వారిని అక్కున చేర్చుకోవడం వాళ్లను ఆకట్టుకుందని కూడా గమనించవచ్చు.

అయితే క్రైస్తవ మతవ్యాపకులు కేవలం అణగారిన వర్గాల వారిని, నిమ్నకులాల వారిని మాత్రమే తమ మతంలోకి మార్చుదామని అనుకున్నారా? అబ్బే, ఉన్నతవర్గాలవారూ, అగ్రవర్ణాలవారూ కూడా వారి మతంలో మారినప్పుడే వారికి గొప్ప. 2 వేల సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా క్రైస్తవం ఇండియాలో వాళ్లు అనుకున్న స్థాయిలో విస్తరించలేదు. 

పైగా మతం మారినవారిలో కొందరు మనస్ఫూర్తిగా మారకుండా, అటు క్రైస్తవసౌకర్యాలు, అటు దళితులుగా రిజర్వేషన్ సౌకర్యాలు పొందడానికి ఇంట ఒకలా, బయట ఒకలా చెప్పుకుంటూండడం, యిరుమతాల దేవుళ్లను ఆరాధించడం వారికి నచ్చే విషయం కాదు. కానీ భారతీయ సంస్కృతి అన్ని రకాల భావనలను యిముడ్చుకునే సంస్కృతి కాబట్టి, క్రైస్తవం పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్న విషయం గ్రహించి దక్కినదానితో సర్దుకుంటున్నారు.

అగ్రకులాల వారిని, పండితులను కూడా తమ మతం వైపు ఆకర్షించడానికి 17వ శతాబ్దంలో ప్రయత్నించిన ఒక క్రైస్తవమతగురువు నోబిలీ తొక్కిన విభిన్నమార్గం గురించి యీ వ్యాసంలో రాస్తున్నాను. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం కొంత వున్నా చరిత్రకారులు దిగవల్లి వేంకట శివరావుగారు 1944లో వెలువరించిన కథలు-గాథలు అనే పుస్తకంలో విపులంగా రాశారు. దాన్ని విశాలాంధ్ర వారు 2010లో పునర్ముద్రించారు. 

ఇది చదివేముందు మనం గ్రహించవలసినది ఒకటుంది. క్రైస్తవం దేశదేశాలకు వ్యాపించినప్పుడు అప్పటికే ఆయా దేశాలలో వున్న మతాచారాలను కలుపుకుంటూ విస్తరించింది. ఎందుకంటే ఒక ప్రాంత ప్రజలు తరతరాలుగా కొన్ని ఆచారాలను పాటిస్తూ వస్తారు. కొత్తమతం వచ్చింది కదాని చటుక్కున అవి మానేయలేరు. అందువలన ‘మా దేవుణ్ని అంగీకరిస్తే చాలు, వాటిని కొనసాగించినా మాకు పేచీ లేదు,’ అని వీళ్లు అనాల్సి వచ్చింది.

అందుకే ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో క్రైస్తవాచారాలు ఒక్కోలా కనబడతాయి. క్రైస్తవం వ్యాపించడానికి ముందు వాళ్లు ఆచరించే ఆచారాలు, వారికుండే నమ్మకాలూ అవన్నీ క్రైస్తవంలోకి వచ్చి చేరాయి. అందుకే పునర్జన్మ వంటి నమ్మకాలు మూలక్రైస్తవంలో లేకపోయినా, అనేక దేశాల్లో వున్నాయి. ఈ భేదాల వలననే, పైకి క్రైస్తవం అంటున్నా, వందలాది శాఖోపశాఖలున్నాయి. 

ఒకళ్ల చర్చికి మరొకళ్లు వెళ్లరు. మధ్యయుగాల్లో కాథలిక్స్, ప్రొటెస్టెంట్లు కొట్టుకుని చచ్చారు. ఇప్పటికి కొందరు ఛాందసులు అవతలివాళ్లను అంగీకరించరు. క్రైస్తవ మతగురువులు యితర దేశాలకు వచ్చినపుడు అక్కడి ప్రాంతీయభాషలు నేర్చుకోవడంతో బాటు, వారి ఆచారాలు కూడా అధ్యయనం చేస్తారు. వాటికి విరుద్ధంగా వెళ్లడానికి జంకుతారు.

మన దేశానికి వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో హిందువులకు బొట్టు పట్టింపు వుంది. కొన్ని ప్రాంతాల్లో అంత పట్టింపు లేదు. పూజ చేసేటప్పుడు పెట్టుకుంటే చాల్లే అనుకుంటారు. మన తెలుగువాళ్లలో బొట్టు పెట్టుకోవడం అరక్షణం ఆలస్యమైనా కంగారు పడిపోయేవారు. అలాగే తాళి కొన్ని ప్రాంతాలకే పరిమితం, మరి కొన్ని చోట్ల నుదుటిలో సిందూరం ముఖ్యం. ఇలా ప్రాంతం బట్టి, కులాచారం బట్టి అలవాట్లు వుంటాయి. 

బొట్టు పెట్టుకునే అలవాటున్న హిందూ మహిళను క్రైస్తవంలోకి మార్చి ‘ఇవాళ్టి నుంచి బొట్టు తీసేయి, తాళి తీసేయి’ అంటే యిబ్బందిగా ఫీలవుతుంది. అందువలన కావలిస్తే వుంచుకో అని క్రైస్తవగురువు చెప్పడంలో వింతేమీ లేదు. ఎందుకంటే క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదు, తాళి వేసుకోకూడదు అని వాళ్ల మతగ్రంథాలలో ఏమీ లేదు కదా! అలాగే మొక్కు తీర్చడానికి గుండు కొట్టించుకోవడాలూ సాగుతాయి. 

వేలాంగణ్ని వంటి క్రైస్తవక్షేత్రంలో శిరోముండనాలు చూడవచ్చు. మతం మారినంత సులభం కాదు, ఆచారాలు మార్చుకోవడం! ఇది గమనించిన నోబిలీ అనే క్రైస్తవ మతగురువు యీ ఆచారాల చుట్టూ తన మార్కెటింగు డిజైన్ చేసుకున్నాడు. హిందువులలో, బౌద్ధులలో, జైనులలో పూజారి అంటే ఎలా వుంటాడో చూసినవాళ్లకు, ఎవరైనా సూటూబూటూ వేసుకుని వచ్చి నేను మంత్రాలు చదవడానికి వచ్చాను అంటే మింగుడు పడుతుందా? 

అందువలన యితను పెద్ద కాషాయపు అంగీ తొడిగి, పైన ఒక కాషాయపు ఉత్తరీయం కప్పుకుని, అదే రంగు తలపాగ ధరించి, మెడలో ఉత్తర జందాల వంటి మూడు బంగారు పోగులు వేసుకుని, ఒక చేతిలో బౌద్ధసన్యాసిలా పెద్ద దండం పట్టుకుని, మరో చేతిలో కమండలం పట్టుకుని, సన్యాసిలా పాంకోళ్లు వేసుకుని అవతారం ఎత్తాడు. 

వెనక్కాల యిద్దరు బ్రాహ్మణ శిష్యులు! ఈ వేషంతో మీతో వేదాంత చర్చలు చేస్తాను, రండి అని పిలిస్తే ఏ హిందూ పండితుడు నిరాకరిస్తాడు? కొంతమంది పండితులను ఆకర్షిస్తే చాలు, తక్కినవాళ్లూ వచ్చి యీయనేం చెపుతున్నాడో విందాం అనే కుతూహలంతో వస్తారు. అదీ టెక్నిక్కు.

ఈ రాబర్టో డి నోబిలీ ఇటలీలోని టస్కనీలో 1577లో పోప్‌లకు బంధువులైన కులీన కుటుంబంలో పుట్టాడు. మాతృభాషతో పాటు గ్రీకు, లాటిను ధారాళంగా మాట్లాడేవాడు. క్రైస్తవమత ప్రచారకుడిగా మారి 1606లో తమిళనాడులోని మధురకు (ఇప్పుడు మధురై అంటున్నారు) వచ్చి అక్కడి మతవ్యాప్తిలో వున్న లోపాల గురించి అధ్యయనం చేశాడు. 

ఆ పాటికే పోర్చుగీసు వాళ్లు క్రైస్తవ మతవ్యాప్తి మొదలుపెట్టేశారు. అప్పటి రాజుల గురించి కాస్త చెప్తాను. కృష్ణదేవరాయలు మరణించిన 26 ఏళ్ల తర్వాత 1565లో జరిగిన తళ్లికోట యుద్ధంలో ఆయన అల్లుడు అళియ రామరాయలు ఓడిపోయాడు, చచ్చిపోయాడు. హంపి నగరం నాశనమైంది.

అప్పుడు రామరాయలు తమ్ముడు తిరుమల దేవరాయలు తన రాజధానిని పెనుకొండకు మార్చి అక్కణ్నుంచి పాలించాడు. ఆయన చిన్న కొడుకు వెంకటపతి దేవరాయ మహారాయలు 1585-1614 మధ్య పాలించాడు. ఆయన రాజ్యం కన్యాకుమారి వరకు వ్యాపించి వుంది.

ఈ సామ్రాజ్యం బలహీనమౌతున్న కొద్దీ మండలాధిపతులు, సామంత రాజులనిపించుకుంటూ కొన్నాళ్లకు స్వతంత్రులైపోయారు. ఇలా మైసూరును ఒడయార్లు ఏలారు. తంజావూరు, మధుర, జింజీ, చిత్రదుర్గ లను నాయకరాజులు ఏలారు. నోబిలీ వచ్చేటప్పటికి ముద్దుకృష్ణప్ప నాయకుడు అనే నాయకరాజు సామంత మండలేశ్వరుడిగా వుండేవాడు. 

అతను 1609లో చనిపోతే ముద్దువీరప్ప నాయకుడు ఆ పదవి చేపట్టి, 1614లో వెంకటపతి మరణించగానే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. వెంకటపతి నాటికే విజయనగర సామ్రాజ్యంలో పోర్చుగీసు వాళ్లు వ్యాపారనిమిత్తం వచ్చి చాలాచోట్ల స్థిరపడ్డారు. వర్తకులతో పాటే రోమన్ కాథలిక్స్‌లో ఓ వర్గమైన జెస్సూటులనే మిషనరీలు కూడా వచ్చి మతప్రచారం చేయసాగారు.

ఈ జెస్సూట్‌లు వింత దుస్తులు ధరించి, గొడ్డుమాంసం తింటూ, మద్యపానం చేస్తూ కులభేదాలు పాటించకుండా అందరితో కలిసి తిరగడం స్థానికులకు నచ్చలేదు. వీళ్లకు ‘పరంగీ’లని పేరు పెట్టి దూరం పెట్టారు. సముద్రతీరంలో వుండే పరవర్లనే పల్లెకారులు మాత్రమే వాళ్ల మాటలు విన్నారు. జెస్సూట్ మగవాళ్లకీ, పరవర్ స్త్రీలకూ పుట్టిన సంకరజాతి ఒకటి త్వరలోనే బయలుదేరింది. 

వెంకటపతి రాయలు యీ జెస్సూట్ ఫాదిరీలకు చర్చిలు కట్టుకోవడానికి, స్కూళ్లు పెట్టడానికి, మతప్రచారం చేయడానికి అనుమతి యిచ్చాడు. క్రైస్తవంలోకి మారిన పరవర్ల క్షేమం చూడడానికి అంటూ పోర్చుగీసు చర్చి గొంజాలో ఫెర్నాండెజ్ అనే ఫాదిరీని 1569లో మధురకు పంపింది. మధుర పాలకుడు కృష్ణప్ప అతన్ని చర్చి కట్టుకోనిచ్చాడు. ఆసుపత్రి పెట్టుకోనిచ్చాడు.

ఫెర్నాండెజ్ ప్రజలతో కలిసిమెలసి తిరిగేవాడు. ఆసుపత్రిలో క్రైస్తవులకే కాక యితరులకు కూడా మందులిచ్చేవాడు. అతని బ్రహ్మచర్యం, మంచితనం, మృదుభాషిత్వం అందరికీ నచ్చాయి. అతను చెప్తున్న కొత్తమతం సంగతేమిటో తెలుసుకుందామని కొందరు బ్రాహ్మణులు కూడా ఆయన యింటికి వచ్చి శాస్త్రచర్చలు జరిపేవారు. కానీ కథ అంతటితో ఆగిపోయేది తప్ప మతమార్పిడి జరిగేది కాదు. 

ఫెర్నాండెజ్ 12 సంవత్సరాల పాటు ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయిందని చెప్పి నోబిలీ గ్రహించాడు. ‘మనం గొడ్డుమాంసం తిని, మద్యపానం చేసే పోర్చుగీసు జాతివారమనే కారణంగా యిక్కడి ప్రజలకు మనపై అసహ్యభావం వుంది. పైగా మన నల్లటి దుస్తులు చూడగానే వాళ్లకు మనం మహమ్మారిగా కనిపిస్తున్నాం. 

ఇక్కడ కనబడే దుర్వర్తనులు, అహంభావులు తప్ప విద్యాధికులు, మర్యాదస్తులైన పోర్చుగీసు వారినెవరినీ చూడకపోవడం వలన పరంగీ అనే మాటను నీచార్థంలో ఉపయోగిస్తున్నారు.’ అంటూ తన పై అధికారులకు ఉత్తరాలు రాసి తన నూతన విధానానికి ఒప్పించాడు.

నోబిలీ 1607లో ఫెర్నాండెజ్‌తో సంబంధం లేకుండా కొత్త అవతారం ఎత్తదలిచాడు. మధురలోని బ్రాహ్మణుల దగ్గరకు వెళ్లి ‘నేను పరంగీని కాను, అసలు పోర్చుగీసు జాతివాణ్నే కాను. నాగరికతకు మకుటాయమానమైన రోములో ఓ ఉత్తమ రాజవంశానికి చెందిన రాకుమారుణ్ని. ప్రపంచం మీద విరక్తి కలిగి, సన్యాసం తీసుకున్నాను.’ అని చెప్పాడు. 

ఒక అగ్రహారంలో స్థలం తీసుకుని అక్కడ పూరిల్లు కట్టుకుని వుండేవాడు. మాంసం, మద్యం మానేశాడు. ఒక బ్రాహ్మణుణ్ని వంటవాడిగా పెట్టుకున్నాడు. ఇతర సేవకులు కూడా బ్రాహ్మణులే! సన్యాసుల లాగ సాయంత్రం నాలుగు గంటలకు కాస్త అన్నమూ, పాలూ, కూరగాయలూ తీసుకునేవాడు. రాత్రిపూట పస్తే. యూరోప్ వాళ్లతో ఏ సంపర్కమూ పెట్టుకోలేదు. హరిజనులతో కలవలేదు. తనకు తానే ‘జగద్గురు తత్వబోధకస్వామి’ అని పేరు పెట్టుకున్నాడు.

నల్లబట్టలు మానేశాడు. తెల్లబట్టలే వేసుకునేవాడు. తర్వాతి రోజుల్లో బయటకు వెళ్లినపుడు మొదట్లో చెప్పిన వేషం వేసేవాడు. మతప్రచారానికి బయటకు వెళ్లకుండా ఒక ఏడాదిపాటు రోజంతా యింట్లోనే వుండేవాడు. ఎవరైనా తనతో మాట్లాడడానికి వస్తే అతని శిష్యులు సమాధిలో ఉన్నారు, నిష్ఠలో ఉన్నారు అగమని చెప్పేవారు. 

రెండుమూడుసార్లు తిరిగితే తప్ప దర్శనం యిచ్చేవాడు కాదు. ఆఖరికి లోపలికి రానిచ్చినపుడు జేగురురంగు గుడ్డ కప్పివున్న వేదిక మీద పద్మాసనంలో కూర్చుని కనబడేవాడు. అతని ముందు కాషాయరంగు బట్టమీద చాప పరిచి సందర్శకులను దానిపై కూర్చోమని చెప్పేవాడు.

ఇతని గొప్పతనమంతా పాండిత్యంలో వుంది. దేశంలోకి వచ్చిన ఆరునెలల్లోనే తమిళంలో మాట్లాడడం నేర్చేసుకున్నాడు. తర్వాత ఒక బ్రాహ్మణ పండితుణ్ని నియమించుకుని అతని ద్వారా తెలుగు, సంస్కృతం నేర్చుకున్నాడు. 1610 కల్లా యీ మూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ భాషల్లో వున్న అనేక మతగ్రంథాలను కాచి వడపోశాడు. 

సొంతంగా పద్యాలు రాసి, శ్రావ్యంగా చదివేవాడు. హైందవ మతగ్రంథాలు, పురాణాలు రాసిన పద్ధతిలోనే తాను చెప్పదలచిన మతధర్మాన్ని గురించి భావగర్భితమైన ఒక సూత్రాన్ని చెప్పి దానికి వ్యాఖ్యానం చెప్పడానికి అనేక గ్రంథాల నుంచి, తన సొంత కవిత్వంలోంచి శ్లోకాలు, పద్యాలు, కథలు, గాథలు వివరిస్తూ దీర్ఘోపన్యాసం చేసేవాడు. అతను తమిళంలో రాసిన 9 తాళపత్ర సంపుటాలు 1660లో కనబడ్డాయిట.

నోబిలీ వేదాలు కూడా నేర్చుకున్నాడు. భాషలు నేర్పడానికి పెట్టుకున్న బ్రాహ్మడికి వేదాలు కూడా తెలుసు. వేదాలను కంఠస్థం చేయడం తప్ప లిఖితం చేయడం మహాపాతకం అని నమ్మే రోజుల్లో యితను అతన్ని ప్రలోభపెట్టి రాసి యిమ్మనమన్నాడు. తర్వాత వాటిలో లోతుపాతులు బాగా చదువుకున్నాడు. 

హిందువులకు మతబోధ చేసేటప్పుడు ‘నాలుగు వేదాలున్నాయని అందరికీ తెలుసు. కానీ వాటిల్లో మూడు వేదాలు మాత్రమే జనసామాన్యానికి లభిస్తున్నాయి. మోక్షమార్గం గురించి చెప్పిన నాల్గోది దొరకటం లేదని విని దేశం కాని దేశం నుంచి వచ్చి దాన్ని దొరకపుచ్చుకుని, మీ అందరికీ మోక్షమార్గం గురించి చెప్పడానికే వచ్చాను. భగవంతుడు ఒక్కడే. క్రైస్తవులు నమ్మే మూడు మూర్తులలో (ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్) సాక్షాత్కారం అవుతున్నాడు. 

నేను జందెంగా వేసుకునే మూడు పోగులూ ఆ మూడు శక్తులకు ప్రతీక. మానవులకు మోక్షమార్గం చూపడానికి, మానవుల పాపాలను భరించడానికి క్రీస్తు అవతారం ఎత్తడానికి దివ్యకన్యాకుమారి కడుపున పుట్టాడు. ఈ దేశంలో పూర్వపు ఋషులు, సన్యాసులు చెప్పే ధర్మాలనే నేను చెపుతున్నాను. లౌకిక వ్యవహారాల్లో ప్రజలు రాజుకి ఎలా లోబడి వుంటారో, భగవంతుని ధర్మశాసనాలకు అన్ని తరగతుల వారూ తరతమభేదం లేకుండా లోబడి వుండాలి.’ అని చెప్పేవాడు.

స్థానికులకు బాగా అలవాటైన మాటలనే క్రైస్తవానికి వాడాడు. చర్చిని కోవెల అనేవాడు. చర్చిలో యిచ్చేదానికి ప్రసాదం అనే వాడు. ఫాదిరీ అనకుండా గురు అనేవాడు. బైబిల్‌ను వేదం అనేవాడు. మాస్ ప్రేయర్‌ను పూజ అనే అనేవాడు.

క్రీస్తును హిందూదేవుడి మరో అవతారంగా ఎస్టాబ్లిష్ చేశాడు. (చిన్నపుడు ‘క్రీస్తు, కృష్ణుడు ఒకరేనా? వేర్వేరా?’ అనే వ్యాసాలు చదివేవాణ్ని. అసలా సందేహం ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపడేవాణ్ని. ఇదిగో యిలాంటివాళ్ల వలననే కాబోలు) ఈ విధంగా క్రైస్తవం అనేది హిందూమతానికి కొనసాగింపే అనే భావం కలిగించాడు. దీనితో బాటు మరో ట్రిక్కు చేశాడు. ఇప్పటికీ అది అమలౌతూనే వుంటుంది.

హిందువులలోని ఆధిపత్య కులాలవారు క్రైస్తవం తీసుకున్నపుడు తమ కులసూచకాలను కొనసాగించడానికి క్రైస్తవం అనుమతిస్తోంది. గమనిస్తే రెడ్డి, చౌదరి, నాయుడు యిలా పేర్లున్నవారు మాత్రమే ఆ పేర్లు మతం మారినా కొనసాగిస్తున్నారు. రాబర్ట్ దీక్షితులు, పీటర్ గుప్తా, జార్జి మాల.. యిలాటి పేర్లు వినబడవు. 

రాజశేఖరరెడ్డిని క్రైస్తవుడిగానే చూడాలి తప్ప రెడ్డిగా చూడకూడదంటూ నేను 2009లో ఒక వ్యాసం రాస్తే చాలా మంది క్రిస్టియన్ రెడ్లు అభ్యంతరం తెలుపుతూ మెయిల్స్ రాశారు. మా మతం క్రైస్తవం, కులం రెడ్డి. తప్పేముంది? అంటూ. క్రైస్తవంలో కులం వుందా? బైబిల్‌లో చూపించగలరా? అని వాదిస్తూ నేను జవాబుగా వ్యాసాలు రాశాను. అంటే మతం మారినా కులానికి ఢోకా లేదు సుమా అంటూ వీళ్లను అంతలా బ్రెయిన్‌వాష్ చేశారన్నమాట!

నోబిలీ బోధలు విని కొందరు బ్రాహ్మలు మతం మారడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ల ఆధిపత్యానికి, అగ్రకులానికి సూచకాలైన జందాలను, పిలకలను, గంధాక్షతల బొట్లను వదులుకోమన్నారు. ఏం ఫర్వాలేదు, వదలనక్కరలేదు అని మనవాడు హామీ యిచ్చాడు.

ఆ మేరకు ఇటలీలో వున్న తన పై అధికారులకు నచ్చచెప్పి అనుమతులు సంపాదించాడు. ‘అవన్నీ వారు అవలంబించే ఆచారాలు తప్ప మతసంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు కావు. వారు ఉన్నతవంశజులనీ, ఉన్నతకులానికి చెందినవారని చూపుకోవడానికి ఏర్పడిన బాహ్యచిహ్నాలు కాబట్టి అవి కొనసాగించడానికి ఏ అభ్యంతరమూ చెప్పనక్కరలేదు.’ అని ఇటలీ చర్చి వారు క్రాంగనూరు ఆర్చిబిషప్పుకి 1609లో, 1613లో రాసిన లేఖలున్నాయట.

దీనితో బాటు నోబిలీ భూతవైద్యం కూడా ప్రారంభించాడు. శిలువను రక్షరేకుగా కట్టేవాడు. క్రైస్తవపూజలోని పవిత్రజలాన్ని మంత్రోదకంగా యిచ్చేవాడు. శిష్యుల చాకచక్యంతో దీనికి చాలా ప్రచారం కలిగి, చివరకు అనేకమంది ప్రభువులు అతనితో స్నేహం చేయడానికి ఉవ్విళ్లూరే పరిస్థితి కలిగింది. 

ఒక హిందూగురువుతో నోబిలీ ఇరవై రోజులు, రోజుకి ఐదారుగంటల చొప్పున శాస్త్రచర్చ చేసి, ఆఖరి రోజున తనే గెలిచినట్లు జయభేరి వేయించి, ఆయన్ని క్రైస్తవంలోకి చేర్పించాడు. తనకు వేదం, భాషలు నేర్పిన పండితుణ్ని కూడా! చాలామంది బ్రాహ్మణులు క్రైస్తవంలోకి చేరడంతో వారిని చూసి యితరులూ చేరారు. ఇలా ఐదు సంవత్సరాలు గడిచేసరికి నోబిలీ ప్రభ వెలిగిపోసాగింది.

ఇదే అతనికి చేటు తెచ్చింది. మొదటినుంచి తంటాలు పడుతున్న ఫెర్నాండెజ్‌కు అసూయ కలిగింది. ఇవన్నీ అసహ్యకరమైన పద్ధతులు అంటూ ఫిర్యాదు చేశాడు. గోవాలో వున్న పోర్చుగీసు క్రైస్తవ మతాధికారులకు కూడా ఈర్ష్య కలిగి, మతం మారిన హిందువులు తమ పూర్వాచారాలను వదిలిపెట్టకుండా, క్రైస్తవానికి భ్రష్టు పట్టించారంటూ పోప్‌కు రాశారు. 

ఇటు హిందువుల్లో కూడా ఆందోళన పెరిగింది. కొత్తమతం ప్రభావంతో వైదికవృత్తిలో వున్న బ్రాహ్మలకు, గుళ్లకు ఆదాయాలు తగ్గాయి. పలుకుబడి తగ్గిపోసాగింది. అప్పుడందరూ కలిసి నోబిలీపై కత్తి కట్టారు. చర్చికి యిచ్చిన స్థలం మధుర దేవాలయానిది అంటూ ప్రధాన అర్చకుడు తగాదా పెట్టాడు.

ఈ గొడవలన్నీ చూసి యీ తరహా ప్రచారం ఆపమని రోమన్ చర్చి నోబిలీని హెచ్చరించింది. తక్కినవాళ్లలాగానే నువ్వూ వుండు, చాలు అన్నారు. దాంతో నోబిలీ బడిన శ్రమంతా వ్యర్థమైంది. క్రైస్తవ ఫాదిరీలు గతంలో మాదిరిగానే పూర్వపద్ధతుల్లోనే మద్యమాంసాలు సేవించడంతో క్రైస్తవంపై మోజు తగ్గిపోయి, హిందూమతం మళ్లీ పుంజుకుంది. 

1623 వచ్చేసరికి నోబిలీ మళ్లీ ప్రయోగం చేయబోయాడు. ఈ సరికి రోము చర్చికి కోపం తగ్గి వుంటుందని అనుకుని, మధురలో సనాతనవాదులు దృఢంగా వుండడంతో తిరుచినాపల్లి, సేలం వంటి యితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్వాముల అవతారంలో ప్రయత్నించి చూశాడు. కానీ అక్కడా సనాతనులు ఎదిరించారు. చివరకు అడవులకు పోయి, అక్కడ ప్రచారం చేయవలసి వచ్చింది.

ఇలా మొత్తం 42 ఏళ్లు నోబిలీ మధుర జిల్లాలో ప్రచారం చేశాడు. అతనికి చూపు తగ్గిపోయింది. మిషనరీ అధికారులు సింహళానికి పంపి విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అక్కడా స్వామి అవతారంలో ప్రచారం చేసి కొందర్ని మతంలో కలిపాడు. దాంతో మద్రాసు శివారైన మైలాపూరుకి పంపారు. 

అక్కడ అతను నలుగురు బ్రాహ్మణులతో కలిసి ఒక చిన్న మట్టి యింట్లో వుంటూ 1656లో, తన 79వ ఏట మరణించాడు. ఈ వింత మతప్రచారకుడి బొమ్మను అతని సమకాలికుడు 1609లో గీశాడు. మామూలు చిత్రంతో బాటు దాన్నీ పక్కన చూడవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2020)
mbsprasad@gmail.com

Show comments