పవన్ ఢిల్లీ టూర్.. ఎప్పట్లానే అదే అయోమయం

ఇటీవల రాజధాని రైతులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో పవన్ కల్యాణ్ వారికి భరోసా కల్పించి పంపించారు. "మీకెందుకు నేనున్నా, అవసరమైతే జాతీయ స్థాయిలో మీకోసం పోరాడతా, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అమరావతికి కట్టుబడి ఉందం"టూ.. చాలా ధీమాగా చెప్పి పంపించేశారు. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వం అమరావతి వ్యవహారాన్ని లైట్ తీసుకుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

కట్ చేస్తే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ అమరావతిపై బేలగా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

పవన్ ఢిల్లీ పర్యటనలో తిరుపతి ఉప ఎన్నికతో పాటు, అమరావతి వ్యవహారం కూడా ప్రముఖంగానే చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ చర్చల్లో బీజేపీ అధిష్టానం పవన్ ఆశలకు అనుగుణంగా మాట్లాడలేదు. అందుకే పవన్ ప్రసంగంలో ఎక్కడా మూడు రాజధానులు అనే ప్రస్తావనే రాలేదు.

ఒకవేళ పవన్ గతంలో చెప్పినట్టు బీజేపీ కేంద్ర నాయకత్వం అమరావతికి మాత్రమే  కట్టుబడి ఉంటే.. మూడు రాజధానులంటూ వైసీపీ చేస్తున్న అన్యాయానికి అడ్డుకట్ట పడుతుందని ధీమాగా చెప్పేవారే.

అయితే పవన్ కేవలం రాజధాని రైతుల గురించే మాట్లాడారు. రాజధానిలో చివరి రైతుకూ న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. రైతుల పక్షాన నిలబడతామని, నడ్డా నోటి నుంచి వచ్చిన మాటనే తాను మీడియాకు చెబుతున్నానని అన్నారు. 

అంటే కేవలం రైతులకు న్యాయం చేయడం కోసమే బీజేపీ-జనసేన పోరాటం చేస్తాయనమాట. మూడు రాజధానుల్ని కాదని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయంలో బీజేపీ అధిష్టానం పవన్ కి ఎలాంటి హామీ ఇవ్వలేదనే విషయం స్పష్టమైంది.

దీంతో పవన్ కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటూ కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. ఇక ఏపీలో అవినీతి, ఆలయాల అపవిత్రం, దేవతా విగ్రహాలు, రథాల ధ్వంసం అంటూ లేనిపోని హిందుత్వాన్ని భుజానికెత్తుకున్నారు పవన్. జేపీ నడ్డాతో ఈ విషయాలపై కూడా చర్చించామన్న జనసేనాని.. తాను కమలదళానికి వీర విధేయుడినని మరోసారి ప్రకటించుకున్నారు.

మొత్తమ్మీద మీడియాతో మాట్లాడేటప్పుడు పవన్ వాలకం చూస్తే.. హస్తిన పర్యటనతో ఆయన ఏమాత్రం సంతృప్తిగా లేరనే విషయం స్పష్టమవుతోంది. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అన్నట్టు.. పవన్ ఢిల్లీ టూర్ కాస్తా అయోమయంగా ముగిసింది. 

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments