సిటీలో స‌త్తా ఎవ‌రిది?

నగర ఓటరు కు ఓ చాన్స్ వచ్చింది. తనకు ఏం కావాలో..తనకు ఏం లేదో..అందుకోసం తనకు ఎవరు కావాలో..తనకు ఎవరు వద్దో ..తనకు తానే నిర్ణయించుకునే అవకాశం తన చేతిలోకే వచ్చింది.

నగర ఓటరు ఓటు ఎటు వేయబోతున్నారు. ఎవరిపై వేటు వేయబోతున్నారు. అసలు నగర ఓటరు మనోగతం ఎలా వుందీ అనే కన్నా, నగర పరిధిలో పార్టీల పరిస్థితి ఏమిటి?  పార్టీల పరిస్థితి బాగుందీ అంటే ఓటరు అనుకూలంగా వున్నట్లే కదా.  అందుకే పార్టీల వారీగా అనుకూల ప్రతికూల అంశాలపై కాస్త దృష్టి సారిద్దాం.

తిరుగువుందా..లేదా..తెరాస కు

గత సిటీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమతి. అయిదేళ్లు ఇట్టే గడచిపోయాయి. మళ్లీ ఓటరు ముంగిట నిల్చోవాల్సి వచ్చింది ఈ పార్టీ. అయిదేళ్లలో ఏం చేసారు అన్నదాన్ని బట్టే కదా ప్రజల ఆలోచన వుండేది. ఆ లెక్కన చూసుకుంటే తెరాసను వ్యతిరేకించడానికి పెద్దగా కారణాలు కనిపించకపోవచ్చు. 

తెరాస ప్రభుత్వం వేరు, సిటీలో పాలన వేరు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి అతి పెద్ద నగరానికి ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా వుంటుంది. అందువల్ల ప్రభుత్వ పాలన అనేదాని కన్నా, ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కువ ప్రభావితంగా వుంటాయి. ప్రభుత్వ చొరవతో, సూచనతో, నగరపాలక సంస్థ అమలు చేసిన కార్యక్రమాలు ప్రభావం కనబరుస్తాయి.

ఆ లెక్కన చూసుకుంటే గత అయిదేళ్లలో హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పనలో బాగానే వుంది. . మెట్రో రవాణా అందుబాటులోకి వచ్చింది.  రవాణా సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కడిక్కడ అండర్ పాస్ లు, ఫ్లయి ఓవర్లు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల ఏర్పాటు వంటివి బాగా చేపట్టారు. 

అందులో సందేహం లేదు. అలాగే సిటీ పరిధిలో కబ్జాలకు గురికాగా మిగిలిన చెరువులను కాపాడడం వరకు కూడా బాగానే పని చేసారు.  ఇక శాంతి భద్రతల విషయంలో కూడా పెద్దగా వంక పెట్టాల్సింది లేదు.

పైగా హైదరాబాద్ ఇటీవల బాగా అభివృద్ధి చెందింది. కరొనా నేపథ్యంలో కూడా కంపెనీలు బాగానే వున్నాయి. కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఉద్యోగవకాశాలు బాగానే వున్నాయి. టాలెంట్, క్వాలిఫికేషన్ వున్నవారు పెద్దగా ఇబ్బంది పడడం లేదు.

కానీ అలా అని వ్యతిరేక అంశాలు లేకపోలేదు. వ్యతిరేక అంశాలు కీలకంగా రెండే రెండు. ఒకటి స్లమ్ వాసులకు ఇచ్చిన హామీ మేరకు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్నవి ఇంకా పూర్తిగా రూపు దాల్చలేదు. ఇది ఒక విధంగా జనాలకు గట్టి అసంతృప్తి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఓటు బ్యాంక్ అన్ని వసతులు వున్న కాలనీల్లో కన్నా బస్తీల్లోనే ఎక్కువ వుంటుంది.

ఇక రెండో వ్యతిరేక అంశం. వరదల ముంపు. చాలా ఏళ్ల తరువాత వరద ముంపు ముంచెత్తింది హైదరాబాద్ నగరాన్ని. ఇది ఎవ్వరూ ఊహంచనిది. సాధారణంగా భారీ వర్షాలు పడతే, రోడ్లు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం అన్నది హైదరబాదీలకు అలవాటే. కానీ రోడ్ల మీదకు నీళ్లు ప్రవాహం మాదిరిగా వచ్చేసి, కార్లను దొర్లించుకుపోయి, ఇళ్లలోకి వచ్చేయడం అన్నది అరుదు. ఇదే సిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల అంశం అని అందరూ భావిస్తున్నారు.

అయితే ప్రతికూల, అనుకూల అంశాల సంగతి అలా వుంచితే ప్రజలు ఏ విధంగా ఆలోచించడానికి అవకాశం వుంది? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదనో? ఇంకా ఇవ్వలేదనో తెరాసను ఓడిస్తే పని జరుగుతుందా? ఇంకా మరో మూడేళ్లకు పైగా ఈ ప్రభుత్వమే కదా వుండేది? భాజపాను బల్దియాలో గెలిపించినంత మాత్రాన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చే అవకాశం వుందా? ఈ దిశగా ప్రజలు ఆలోచిస్తే పరిస్థితి ఏమిటి?

వరద ముంపులో ప్రభుత్వ వైఫల్యం ఏమేరకు? కబ్జాలకు పాల్పడి, నాలాలు ఆక్రమించింది ఎవరు? ప్రజలే కదా? ఇప్పుడు వరదముంపు ప్రభుత్వ వైఫల్యం అంటూ నెట్టేసి, అధికార పార్టీని పక్కకు నెట్టేస్తే, నిర్దాక్షిణ్యంగా ముంపు నివారణ చర్యలు అంటూ కబ్జాల తొలగించే పని ప్రారంభిస్తే ముందుగా ఇబ్బంది పడేది ఎవరు? .

వీధి కాలవలు కూడా మూసేసి, మెట్లు, ర్యాంప్ లు, పార్కింగ్ లు సెట్ చేసుకున్నది ఎవరు? ఇప్పుడు వీటన్నింటి మీద ప్రభుత్వం దృష్టి పెడితే, గెలచిన ప్రతిపక్ష కార్పొరేటర్ ఆపగలడా?  ఈ విధంగా ప్రజలు ఆలోచిస్తే పరిస్థితి ఏమిటి?

వరద సాయం ఆగిపోయింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డం పడ్డాయి. సరే, ఎన్నికల తరువాత ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం. అధికార పార్టీ కార్పొరేటర్ కాకపోతే ఎలా వుంటుంది పరిస్థితి? ఈ దిశగా కూడా జనం ఆలోచించడం మొదలుపెడితే పరిస్థితి ఏమిటి?

భాజపా..బలుపా? వాపా?

ఒకప్పుడు హైదరాబాద్ నగర ఎన్నికలు జరపడానికి ప్రభుత్వాలు భయపడేవి. ఎందుకంటే భాజపా సీట్లు ఎగరేసుకుపోతుందని. ఇది దశాబ్దాల కాలం కిందట ముచ్చట. టైగర్ నరేంద్ర లాంటి లీడర్లు వుండే కాలం అది. పైగా అప్పట్లో ప్రజల్లో ఒక రకమైన భయం వుండేది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం వుండేది. ఆ విషయంలో తమకు అండ ఇవ్వగలిగేది హిందూత్వ పార్టీ అయిన భాజపా అనే నమ్మకం వుండేది. అవసరం వుండేది.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగర పరిధిలో వున్న భాజపా ఓట్ బ్యాంక్ నానాటికీ సన్నగిల్లుతూ వచ్చింది. మోడీని, జాతీయ పార్టీ అన్న పాయింట్ ను, సిద్ధాంతాల‌ను చూపించి ఓట్లు అడగాల్సి వస్తోంది. అంతే తప్ప గెలిస్తే ఇది చేస్తారు అనే చెప్పే పరిస్థితి మాత్రం లేదు.

ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వుండి భాజపా హైదరాబాద్ కు చేసిందేమీ పెద్దగా లేదు. ఆ మాటకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరగబెట్టిందీ లేదు. వరద సాయం విషయంలో భాజపా హైదరాబాద్ కు చేసింది శూన్యం. అది ఆ పార్టీని వెన్నాడుతూనే వుంటుంది. ఇక మిగిలింది హిందూత్వ కార్డ్ మాత్రమే. ప్రస్తుతం హైదరాబాద్ లో మైనారిటీ, హిందూత్వ లాంటి వ్యవహారాలు ఏవీ లేవు. అందరూ కలిసి మెలసి ప్రశాంతంగా వుంటున్నారు.

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చింది లగాయితు ఇప్పటి వరకు పాతబస్తీ అల్లర్లు అన్నవి చాలా అరుదుగా జరిగాయి. పైగా గత రెండు దశాబ్దాలుగా అయితే సిటీ పూర్తిగా ప్రశాంతంగా వుంది. ఇప్పుడు మళ్లీ ఈ హిందూత్వ వగైరా వ్యవహారాలు బయటకు తీసి, తలకాయనొప్పులు తెచ్చుకోవాలని నగర ఓటరు అనుకుంటాడా? అన్నది అనుమానమే.

కుటుంబ పాలన, తెలంగాణ ఉద్యమ ఫలితం ఇలాంటివి అన్నీ శాసనసభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి తప్ప, స్థానిక ఎన్నికల్లో కాదు. భాజపా ఈ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగేది కేవలం సరైన అభ్యర్ధులను నిల‌బెట్టడం ద్వారానే.

ఎందుకంటే లోకల్ ఎలక్షన్లు అంటే పక్కా లోకల్ ఎలక్షన్లు. పట్టుమని పది వీధులు కూడా వుండని పరిధిలో జనాలకు పరిచయం, కులం, అందుబాటులో వుండడం లాంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందుకే భాజపా ఇప్పుడు చేయాల్సింది సరైన అభ్యర్థులను నిలబెట్టగలగడం. అది మాత్రమే ఆ పార్టీకి సిటీ ఎన్నికల్లో శ్రీరామరక్ష.

హైదరాబాద్ లో సెటిల్ అయిన ఉత్తరభారత దేశ ఓటర్లు కూడా భాజపాకు కలిసి వచ్చే అంశం. సింధీలు, రాజస్థానీలు, పంజాబీలు, భాజపా వైపు మొగ్గుచూపుతారనే అభిప్రాయం సర్వత్రా వుంది. దీనికి మాత్రం ఏ తరహా ఎన్నికలు అన్నది సంబంధం లేదు. అయితే ఇటీవల ఈ ట్రెండ్ కొంత వరకు మారింది. వీరు కూడా రాజకీయాల్లో చురుగ్గా వుంటూ పార్టీలకు అనుగుణంగా ఓటింగ్ ను మారుస్తున్నారు.

కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?

ఒకప్పుడు ఎదురులేని ఏలికగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో కూడా ఆ పార్టీకి హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే వుండేవి. భాజపాతో తొ ఢీ అంటే ఢీ అనకతప్పేది కాదు. అందుకే వీలయినంత వరకు హైదరాబాద్ ఎన్నికలు జరపడం అంటే కాంగ్రెస్ కొంచెం ముందు వెనుకలు ఆడేది. 

అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా వెనక్కు వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అధికార తెరాస నే కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటోంది. కాంగ్రెస్ నుంచి జంప్ లు ప్రారంభమైపోయాయి. అందువల్ల ఆ పార్టీ ఏదో సాధిస్తుందని అనుకోవడం కాస్త వాస్తవ దూరమే కావచ్చు.

కానీ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం తాను చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది. వున్నవాళ్లు వుండనీ, పోయిన వాళ్లు పోనీ, తమ పార్టీ జాబితా తమకు వుందని చకచకా ప్రకటిస్తోంది. అధికార తెరాసపై అసమ్మతి కేవలం భాజపాకే ఉపకరిస్తుందా? లేదా కాంగ్రెస్ కూ సహకరిస్తుందా అన్నది ఇప్పట్లో సమాధానం దొరికే ప్రశ్న కాదు.

మజ్లిస్ అండ్ అదర్స్

మజ్లిస్ కు పెద్దగా అనుకూల అంశాలు లేదా ప్రతికూల అంశాలు అనేవి ప్రత్యేకంగా వుండవు. ఆ పార్టీ స్టేటస్ స్థానికి ఎన్నికలకు సంబంధించినంత వరకు ఆ పార్టీ లెక్కల్లో పెద్దగా తేడా రాదు. ఇక్కడ కూడా అభ్యర్థుల బలాబలాల మీదే ఆధారపడి వుంటుంది వ్వవహారం. మజ్లిస్ యేతర పార్టీల ప్రభావం తక్కువే వుంటుంది.

వామపక్షాలు ఒకప్పుడు కాస్త అస్తిత్వం కలిగి వుండేవి. ఎందుకంటే నగరం చుట్టుపక్కల అంతా పరిశ్రమలే. ట్రేడ్ యూనియన్ మూవ్ మెంట్ గట్టిగానే వుండేది. కాంగ్రెస్ అనుబంధం ట్రేడ్ యూనియన్ తో పాటు వామపక్షాల సంఘాలు కూడా బలంగానే వుండేవి. కానీ అన్ని చోట్ల ఎలా అయితే కార్మిక సంఘాలు బలహీనపడుతూ వస్తున్నాయో, హైదరాబాద్ లో కూడా అదే జరిగింది. 

దీంతో ఆ ప్రభావం వామ పక్షాల ఓట్ బ్యాంక్ మీద పడింది. ఇప్పుడు వామపక్షాల అస్తిత్వం హైదరాబాద్ నగరంలో నామమాత్రమయింది. ఒకప్పుడు బలం చూపిన ఏరియాల్లో కూడా ఇప్పుడు గట్టిగా పోరాడితే తప్ప గెలవలేని పరిస్థితి అయింది.

ఆంధ్ర ఓటు

హైదరాబాద్ సిటీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటు అన్నది కీలకం. ఎందుకంటే దాదాపు అరవై ఏళ్లుగా ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది కానీ తరగడం లేదు. విభజన తరువాత ఏదో అయిపోతుందని, ఆంధ్ర జనాలు వెనక్కు వెళ్లిపోతారని పుట్టించిన వదంతులు అన్నీ పక్కా వదంతులుగానే మిగిలిపోయాయి. 

ఇక్కడి జనం, జీవన విధానం, భాష  సంస్కృతులతో ఆంధ్ర జనం మమేకమైపోయారు. అదే విధంగా ఆంధ్ర ఓటు కూడ మారుతూ వస్తోంది.  తెరాస వచ్చిన తరువాత ఆంధ్ర ఓటు తెలుగుదేశం పార్టీతోనే వుంటుందన్న భ్రమలు ఎప్పుడో తొలగిపోయాయి.

ఎక్కడి పరిస్థితులకు  అనుగుణంగా అక్కడ వుండాలన్న ఆలోచనా విధానం ఆంధ్ర ఓటర్లలో కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఫలితాలు గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కనిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాడి వదిలేసి, ఉమ్మడి రాజధానిని వదిలేసి, ఇక్కడ ఆంధ్రజనాలను వదిలేసి, కేవలం అమరావతికే ఎప్పుడయితే పరిమితం అయిపోయిందో, అప్పటి నుంచే ఆంధ్ర ఓటు అనేది ప్రత్యేకం కాకుండా అయిపోతూ వస్తోంది.

గతంలో జరిగిన కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ఎన్నికల్లో తెలుగుదేశం శతథా, సహస్రథా కృషి చేసినా గెలవలేకపోవడానికి కారణం ఇదే అనుకోవాలి. అయితే ఇటీవల ఈ ఓటు బ్యాంక్ మళ్లీ కాస్త చైతన్యం అవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం మరేమీ కాదు. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం.

తెలుగుదేశం పార్టీ మద్దతు సామాజిక వర్గం సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కాస్త చెప్పుకోదగ్గర సంఖ్యలో వుంది. ఆ వర్గానికి ఇప్పుడు దిక్కు తోచడం లేదు. ఆంధ్రలో వ్యాపారావకాశాలు అడుగంటుతున్నాయి. తెలంగాణలోనైనా కాస్త వ్యవహారాలు చూసుకోవాలి అంటే మన వాళ్లు అనేవాళ్లు అధికారంలో వుండాలి. 

పైగా ఆంధ్రలో చంద్రబాబు అధికారానికి దూరం కావడానికి, తెలంగాణ వదిలిపోవడానికి, అలాగే జగన్ కు తెలంగాణ నేతల నుంచి మద్దతు లభించడానికి మధ్య అన్ని విధాలా సంబంధాలు వున్నాయని, దానికి కారణమైన తెరాసకు ఓటు వేయాలా? వద్దా? అన్నది ఆలోచించుకోవాలని ఈ వర్గం పునరాలోచనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

తెరాసకు కూడా ఈ మేరకు ఉప్పు అందినట్లుంది. తెరాస స్వంత పత్రిక నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలో వెలువడిన అతి పెద్ద కథనం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. అయితే ఆంధ్ర ఓటు అంటే కేవలం ఈ ఒక్క వర్గం మాత్రమే కాదు. అందువల్ల ఆంధ్ర ఓటు తెరాసకు నెగిటివ్ అయిపోతుందన్న భయం అంతగా అవసరం లేదనే అనుకోవాలి.

ఆ ఊపు ఉందా?

దుబ్బాక ఉపఎన్నిక తరువాత భాజపా కావచ్చు, ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా వున్నవారు కావచ్చు, హైదరాబాద్ ఎన్నికల్లో ఏదో అద్భుతం జరిగిపోతుందని, తెరాసకు ఎదురుదెబ్బ తప్పదని గట్టిగా విశ్వసిస్తున్నారు. కానీ ఇది నిజంగానే ఏదో అద్భుతం జరిగితే తప్ప జరిగే పని కాదు. 

భాజపా కాస్త ఊపుమీద వున్నది వాస్తవం. అయితే అంత మాత్రం చేత మేయర్ పదవి కైవసం చేసుకోవడం అంత వీజీ కాదు. కనీసం వంద మార్కు సాధిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు నలభై వరకు ఎక్స్ అఫీషియో ఓట్లు తెరాసకు రెడీగా వున్నాయి. మ్యాజిక్ మార్క్ అయిన 76 కు తక్కువ పడే సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

అయితే ఇక్కడ అది కాదు సమస్య.  ఇప్పడు ఈ స్థానిక సమరంలో భాజపా ఏమాత్రం ప్రభావం కనబర్చగలిగినా, మేయర్ పదవి రాకపోయినా, చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు గెల్చుకోగలిగితే ఆ ప్రభావం వేరేగా వుంటుంది. ఎందుకంటే తెరాస ప్రభుత్వం ఎక్కువ పనితీరు కనబర్చింది పట్టణ ప్రాంతాల్లోనే. పల్లె ప్రాంతాల్లో గణనీయమైన మార్పేమీ రాలేదు. 

అందువల్ల స్థానిక సమరం కనుక భాజపా ఆశలకు మరింత ఊపిరిపోస్తే, అది రాబోయే శాసనసభ ఎన్నికలపై గట్టి ప్రభావం కనబరుస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటే తెరాస తన 90 స్థానాలు తను నిలబెట్టుకోవాల్సి వుంటుంది.

లేదూ నిజంగానే ప్రజల్లో కనిపించని మార్పు వచ్చిన మాట వాస్తవం అయితే ఇక చేసేది ఏమీ వుండదు. దుబ్బాక లెవెల్ మార్పు వుంటే, అలాంటిఫలితాలు సిటీ ఎన్నికల్లో ప్రతిఫలిస్తే, తెరాసకు డేంజెర్ బెల్స్ మోగుతున్నట్లే.

ఇన్నాళ్లు పట్టి వుంచిన అసమ్మతి లేదా అసంతృప్తి కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు ఇక చేసేది ఏమీ వుండకపోవచ్చు. అప్పుడు ఇక ముందస్తు విశ్లేషణలు అన్నీ గాలికిపోతాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్టులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

చాణక్య

Show comments