ఎమ్బీయస్ : నేతా ముక్త్ కాంగ్రెస్ – 2/2

ఎఐసిసి కమిటీలో సుమారు 2 వేల మంది సభ్యులున్నారు. కానీ ఎవరూ ఎవర్నీ సంప్రదించరు. అధికారమంతా గుప్పెడు మంది చేతిలో యిరుక్కుపోయింది. పార్టీ బాగుకై మేమేమీ చెయ్యం, ఇంకోళ్లని చెయ్యనివ్వం, యిది మా కుటుంబానికి చెందిన వ్యవహారం, బయటివాళ్లెవరూ రాకూడదు అని సోనియా హఠం వేసుకుని కూర్చుంది. 

ఆమె చుట్టూ వున్న కొంతమంది భజనపరులు అవునవును, ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు అని వంత పాడుతూంటారు. ఇలా పాడేవాళ్లు ఎవరైనా మొనగాళ్లా అంటే తమ సొంత రాష్ట్రాలలో సీట్లు గెలవలేనివారు. వయసులో వున్నంతకాలం పదవులు అనుభవించేసి, యిప్పుడు తమతో పాటు తమ పిల్లలకూ పదవులు యిప్పుంచుకుంటూ, (కాంగ్రెసులో వారసత్వమే నాయకత్వం) కొత్తవాళ్లెవరైనా రాబోతే అడ్డుకుంటూ కాలక్షేపం చేస్తున్నవారే. పార్టీ నిర్మాణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఏమీ కష్టపడకుండా ట్వీట్లతో కాలక్షేపం చేస్తారు.

బిజెపి చూడబోతే బూతులవారీగా కమిటీలు ఏర్పరచి, బాధ్యతలను పంచి, ఎన్నికలు గెలవడంతో పెర్‌ఫెక్ట్ అయిపోతోంది. మీరెందుకు అలా చేయలేరంటే, ‘మాది మాస్ మూవ్‌మెంట్ పార్టీ, క్యాడర్ బేస్‌డ్ పార్టీ కాదు’ అంటారు. స్టూడెంట్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్, యూత్ కాంగ్రెసు, సేవా దళ్ వంటి సంస్థలు బలంగా వుండేటప్పుడు వాటి సభ్యులు ఓటేసేవారు. 

ఇప్పుడు అవన్నీ చచ్చుబడ్డాయి. ఇవన్నీ ప్రజల నాడి తెలుసుకోవడానికి ఫీడ్‌బ్యాక్ యిస్తూండేవి. ఇప్పుడు బిజెపికి అదివ్వడానికి ఆరెస్సెస్ వుంది. ప్రజలే మనుకుంటున్నారు? ఎవరికి బలం వుంది? దేనికి స్పందిస్తారు ఇలాటివి వాళ్లు సమాచారం పోగు చేసి ఆరెస్సెస్ అధిష్టానం ద్వారా బిజెపికి చేరవేస్తున్నారు.

మరి కాంగ్రెసుకి అలాటి మెకానిజం లేదు. వేరే రాష్ట్రాల నాయకులను యీ రాష్ట్రానికి ఇన్‌చార్జిలుగా వేసి పరిస్థితిని అధ్యయనం చేసి రిపోర్టు యివ్వమంటారు. ఇక్కడకి తరచుగా వస్తే సొంత రాష్ట్రంలో తమ బేస్‌ కదిలిపోతుందని వాళ్లు ఓ పట్టాన రారు. వచ్చినపుడు పెద్ద అట్టహాసంతో వస్తారు. 

ఎయిర్‌పోర్టులోనే పార్టీలో పలువర్గాల వారు కుమ్ములాటల ద్వారా తమ భుజబలాన్ని ప్రదర్శిస్తారు. ఈయన జనంలోకి వెళ్లకుండా, పార్టీ ఆఫీసులోనే కూర్చుని, వర్గాల మధ్య సయోధ్య కోసం ప్రయత్నించి, ఉపదేశాలు యిచ్చి వెళతాడు. ఓటర్లు పార్టీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే తీరికే వుండదు.

తెలంగాణ విషయంలో కాంగ్రెసు వేసిన తప్పటడుగులు చూస్తేనే దాని ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఎంత అధ్వాన్నంగా వుందో తెలుస్తుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడంలో, కెసియార్‌ను అంచనా వేయడంలో, ఆంధ్రలో రియాక్షన్‌ను ఊహించడంలో అన్ని విధాలా తప్పుదోవ పట్టించారు దాని సలహాదారులు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్ష వగైరా కబుర్లు పైకి ఎన్ని చెప్పినా ఏ పార్టీయైనా తన రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటుంది. తనకు మంచి జరుగుతుందనే రాష్ట్రాన్ని విడగొట్టింది. ఏం బావుకుంది? 2009లో యీ ప్రాంతాల నుండి 42లో 33 మంది ఎంపీలను పంపగలిగితే, 2014లో ఇద్దర్ని, 2019లో ముగ్గుర్ని పంపగలిగింది. ఆంధ్రలో అయితే 2014, 2019లలో ఒక్కర్ని కూడా పంపలేకపోయింది.

దీనితో పాటు గమనించవలసిన విషయం మరోటి వుంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన తాత్సారం! దానివలన కెసియార్ ‘కాంగ్రెసు యివ్వలే, మేం కొట్లాడి తెచ్చినం’ అని చెప్పుకునే వీలు కలిగింది. వాయిదా వేసివేసి, చివరకు పార్లమెంటు ఆఖరి సమావేశాల్లో హడావుడిగా బిల్లు చేసి, ఆ క్రమంలో ఆంధ్రకు అన్యాయం చేసి, సర్వవిధాలగా భ్రష్టు పట్టారు, పట్టించారు. ఇలాటి తాత్సారమే కాంగ్రెసు యొక్క ప్రతీ నిర్ణయంలోనూ కనబడుతుంది. అన్నీ వాయిదా వేస్తూ పోవడమే. బిజెపి సంగతి అలా కాదు, చేద్దామనుకుంటే ఫటాఫట్ చేసేయడమే.

ఇలా కాంగ్రెసు పార్టీ ప్రజలకు దూరమై పోతూ వస్తోంది. ఒకప్పుడు ఆ పార్టీకి అగ్రవర్ణాల నుంచి, దళితుల దాకా, మైనారిటీలతో సహా అన్ని వర్గాల నుంచి కొన్ని కొన్ని ఓట్లు పడేవి. ఎందుకంటే అది అచ్చగా ఒక వర్గం పార్టీ కాదు, ఎవ్వరికీ పూర్తిగా చేయదు, అందరికీ కొంతకొంత చేస్తుంది అని పేరుబడింది. బిజెపి హిందూత్వ ఎజెండా చేపట్టిన దగ్గర్నుంచి, కాంగ్రెసులోని పడక్కుర్చీ మేధావులు దాన్ని మించిన హిందూత్వం మనం చూపించాలంటూ రాహుల్‌ను జంధ్యమున్న బ్రాహ్మడంటూ గుళ్లకు తిప్పారు. 

చివరకు అగ్రవర్ణాలు బిజెపితోనే వుండిపోగా, మైనారిటీలను, దళితులను యితర పార్టీలు కాంగ్రెసు నుంచి కాజేశాయి. బిసిలకు వేరే పార్టీలున్నాయి. కాంగ్రెసుకు ఏ వర్గంలోనూ బలం లేకుండా తేలింది. ప్రజల్లో కాంగ్రెసువాదులని చెప్పుకోవడానికి సిగ్గు పడే రీతిలో బిజెపి కాంగ్రెసుపై ‘దుష్ట’ ముద్ర కొట్టేసింది. గత 70 ఏళ్లల్లో కాంగ్రెసు విధ్వంసం చేయడం తప్ప ఒక్క మంచి పనీ చేయలేదని ప్రజల్ని నమ్మించగలుగుతోంది. ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసుకు ఓట్లేసేవారెవరు?

అయినా ఓట్లు పడుతున్నాయంటే, దానికి కారణం స్థానికంగా వున్న నాయకులు. వాళ్లను నిలుపుకోవాలంటే కాంగ్రెసుకి భవిష్యత్తు వుందని వాళ్లను నమ్మించగలగాలి. అధిష్టానంలో వున్న నిరాసక్తత, నిస్తేజం వారిని కృంగదీస్తోంది. తాజాగా బిహార్ ఎన్నికలలో చూడండి. కాంగ్రెసు గెలిచింది 19టిలో. పోనీ రెట్టింపు అంటే 40 స్థానాల్లో పోటీ చేస్తానని టిక్కెట్లు పుచ్చుకుంటే సరిపోయేది. కానీ బేరాలాడి 70 తీసుకున్నారు. 

70 స్థానాల్లో బిజెపి కూటమిని ఎదుర్కునేటంత జనం, ధనం, ప్రచారం వుందా అని చూసుకోవాలా లేదా? అది చేయకుండా ‘మాది జాతీయ పార్టీ, కొన్నేళ్ల క్రితం బిహార్‌ను ఒంటి చేత్తో పాలించాం. ఆరేళ్ల క్రితం దాకా కేంద్రంలో పాలించాం. బిజెపి వ్యతిరేకత కూటమికి కేంద్రబిందువు మేమే’ వంటి కబుర్లు చెప్పి బేరాలాడడం దేనికి? అనేక రాష్ట్రాలలో కమ్యూనిస్టులు తమ భాగస్వాములతో యిలాగే బేరాలాడి తాము చెడి, యింకోళ్లనీ చెడగొడతారు.

బిహార్ ఎన్నికలు, ఉపయెన్నికల (ప్రియాంకా ప్రచారం చేసిన యుపి ఉపఎన్నికలలో ఆరిటిలో  పోటీ చేస్తే నాలుగుటిలో డిపాజిట్టే రాలేదు, ఆవిడ యిటు రాలేదు కాబట్టి బిహార్‌లో 19యైనా వచ్చాయి) తర్వాత కాంగ్రెసు స్పెషల్ కమిటీ నవంబరు 17 న జూమ్‌లో సమావేశమైంది. అధ్యక్షురాలికి ఒంట్లో బాగోలేదు కాబట్టి హాజరు కాలేదు. 

ఉన్న ఆరుగురు సభ్యులలో అహ్మద్ పటేల్ ఆసుపత్రిలో వున్నాడు, ఆంటోనీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. ఇక మిగిలిన అంబికా సోనీ, కెసి వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జీవాలా ఏం మాట్లాడుకున్నారో మనకే కాదు, పార్టీకే చెప్పలేదు. అందుకే కపిల్ సిబ్బల్ వెక్కిరించాడు – ఫలితాలతో కాంగ్రెసు హై కమాండ్ తృప్తిగా వుంది కాబోలు, అందుకే కిమ్మనటం లేదు అని.

కాంగ్రెసు వైఫల్యం కారణంగానే బిహార్‌లో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చిందని అందరికీ అర్థం కాగానే, ప్రతిపక్షాలన్నీ కాంగ్రెసంటే చీదరించుకుంటున్నాయి. దానితో పొత్తంటే ధృతరాష్ట్ర కౌగిలి అనుకుంటున్నాయి. దీన్ని చక్కదిద్దుకోవాలంటే హెడాఫీసు పనిచేయాలి. దానికి దాని బాధ్యత గుర్తు చేసినందుకు లేఖారచయితలపై వేటు పడింది. 

వాళ్ల పదవుల్లో మార్పులు జరిగాయి – ఏదో దానివలన పెద్ద భూకంపం వచ్చేసినట్లు! సోనియా గాంధీ, మధ్యంతర అధ్యక్ష పదవి నుంచి తాత్కాలిక అధ్యక్ష పదవికి మారారు. తేడా ఏమిటో ఆవిడకే తెలియాలి. ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించేస్తానని ఆగస్టు 24న అన్నారు. అప్పుడే మూణ్నెళ్లయ్యాయి. ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులేమైనా పడ్డాయా?

నిజంగా ఎన్నికలు జరపాలని వుంటే మన నిమ్మగడ్డ వారికి అప్పగిస్తే ఆరు రోజుల్లో నిర్వహించి అవతల పడేసేవారు. కానీ ఆవిడకు ఆ ఉద్దేశం వుంటే కదా! జగన్ స్థానిక ఎన్నికలలా వాయిదాలు వేసుకుంటూ, తేదీలు తోసుకుంటూ పోదామనే ఆవిడ ఊహ. ఇలా ఎంతకాలం? అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఆవిడ వందిమాగధులు ‘గాంధీ కుటుంబానికి ప్రత్యామ్నాయం లేదు, దేశమంతా తెలిసిన పేరు వారిదొక్కరిదే’ అనే పల్లవి వదలరు. 

నిజానికి పార్టీ అధ్యక్షుల పేరు దేశప్రజలందరికీ తెలియకపోతే వాటిల్లే నష్టం ఏమైనా వుందా? ఆయనెవరో మాకు తెలియదు కాబట్టి పార్టీకి ఓటెయ్యం అంటారా?

1980లో బిజెపి పార్టీ పెట్టిన దగ్గర్నుంచి యిప్పటివరకు ఉన్న అధ్యక్షుల్లో వాజపేయి పేరు బాగా, ఆడ్వాణీ పేరు కొంతవరకు, దాని కంటె తక్కువగా రాజనాథ్ సింగ్ (యుపి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి) పేరు తెలుసు. ఇక మురళీ మనోహర్ జోషి, నితిన్ గడ్కరీ, కుశభావూ ఠాక్రే, వీరెవరో దక్షిణాదిన, తూర్పున ఎంతమందికి తెలుసు? బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు, జానా కృష్ణమూర్తి పేర్లు ఉత్తరాదివాళ్లకు ఏ మేరకు తెలుసు?  ప్రస్తుతం వున్న జెపి నడ్డా పేరు ఎంతమందికి తెలుసు కనుక? అంతెందుకు ఆరేడేళ్ల క్రితం దాకా అమిత్ షా పేరు జనాలకు తెలుసా? అయినా గత 40 ఏళ్లల్లో పార్టీ ఎంత ఎదిగిందో చూడండి.

కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుల గురించి చూడబోతే ఎవరెవరో వున్నపుడు కూడా పార్టీ పెరుగుతూ పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి అధ్యక్షుల్లో పట్టాభి సీతారామయ్య, పురుషోత్తమ్ దాస్ టాండన్, యుఎన్ ధేబర్, నీలం సంజీవరెడ్డి, కామరాజ్, నిజలింగప్ప, కాసు బ్రహ్మానందరెడ్డి, శంకర్ దయాళ్ శర్మ, దేవకాంత బారువా.. వీరి పేర్లన్నీ దేశం మొత్తం తెలుసని అనుకోగలమా? అంతెందుకు సోనియా 1998 అధ్యక్షురాలు అయ్యేందుకు ముందు 1996 నుంచి వున్న సీతారాం కేసరి గురించి ఎవరికి తెలుసు? అయినా కాంగ్రెసు పార్టీ ఎన్నికలు గెలుస్తూనే పోయింది. మధ్యమధ్యలో ఓడినా మళ్లీ గెలుస్తోంది.

ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి లింకు అనేది వుండాల్సిన పని లేదు. ఇందిరా గాంధీ కూడా 1978 వరకు, అంటే ఎన్నికలలో ఓడిపోయేవరకు అధ్యక్ష పదవిని పట్టించుకోలేదు. (ఎప్పుడో 1959లో ఓ ఏడాది వుందంతే) కానీ పదవి పోగానే పార్టీ అధ్యక్షులు ఎదురు తిరుగుతున్నారని చూసి నేనే పార్టీ అధ్యక్షురాలిని అంది. 

1980లో ప్రధాని అయినా ఆ పదవి వదలలేదు. ఇక అప్పణ్నుంచి ప్రధానిగా వున్నవాళ్లు పార్టీ అధ్యక్షపదవిని కూడా అట్టేపెట్టుకోవడం మరిగారు. పివి నరసింహారావుగారూ అదే చేశారు. ఆయన ఓడిపోయాక సీతారాం కేసరి వచ్చి, యింకో రెండేళ్లకు సోనియా చేతికి పగ్గాలు వచ్చాయి. అప్పణ్నుంచి 22 ఏళ్లగా ఆవిడే అధ్యక్షురాలు. మధ్యలో 2017-19 రెండేళ్లు మాత్రం రాహుల్‌ను డమ్మీ అధ్యక్షుణ్ని చేసింది.

అధ్యక్షుడి పేరు చూసి పార్టీకి ఓటెయ్యరని పూర్తిగా అర్థమౌతోంది. ఇక పార్టీ అధ్యక్షుడే దాని తరఫున ప్రధాని అభ్యర్థి అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఏ అధికారంలో వున్నపుడు సోనియా కాంగ్రెసు అధ్యక్షురాలు, మన్‌మోహన్ ప్రధాని. 

ఈ ఉదాహరణలతో తేలేదేమిటంటే – కాంగ్రెసు అధ్యక్షుడిగా వున్నవారు దేశమంతా తెలియనక్కరలేదు. కాస్త చురుగ్గా వుండి, నాయకులను తరచుగా కలుస్తూ వుండాలి. మంచి ఆర్గనైజర్ అయి వుండాలి. ఇక ప్రధాని అభ్యర్థి అంటారా? అయినప్పటి మాట కదా అంటూ ఎనౌన్స్ చేయనక్కరలేదు. అనేక రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకుండా గెలుస్తోంది. వీళ్లూ అదే పద్ధతిలో ప్రధాని ఎవరో ఫలితాల తర్వాత కూటమి నిర్ణయిస్తుంది అనవచ్చు. ఎందుకంటే ముందుగా ఎవరి పేరు చెప్పినా బిజెపి సోషల్ మీడియా వారిని చీల్చి చెండాడేస్తుంది.

అధ్యక్షుడు అనామకుడై, ప్రధాని అజ్ఞాతవ్యక్తియై వుంటే కాంగ్రెసు ఎలా గెలుస్తుందండీ అనుకోవద్దు. ఆ పార్టీ విషయానికి వస్తే నెగ్గినా, ఓడినా స్థానిక అభ్యర్థుల సత్తా మీదే జరుగుతుంది. వయనాడ్‌లో రాహుల్ గెలిచాడంటే ఓట్లు ఎవర్ని చూసి పడ్డాయనుకుంటున్నారు? కాంగ్రెసు నాయకులు చాలాకాలంగా ప్రజాజీవితంలో వుంటూ, వాళ్లకు పనులు చేసిపెడుతూ పలుకుబడి సంపాదించుకున్నారు. 

వాళ్లు కాంగ్రెసు ద్వారా గెలిచినా, బిజెపిలోకి ఫిరాయించి గెలిచినా అధికాంశం అవి వ్యక్తిగత విజయాలే. తాజా ఎన్నికలలో కూడా చూడండి, ఫిరాయింపుదారులు పెద్ద సంఖ్యలో గెలిచారు. ఇలాటి నాయకులను ఆకట్టుకుంటూ వారు ఫిరాయించకుండా చూడడమే కాంగ్రెసు తక్షణ కర్తవ్యం.

ఈ పని చేయడానికి గాంధీ కుటుంబసభ్యులు అక్కరలేదు. ఎంత అపభ్రంశంగా వ్యవహరిస్తున్నా, కాంగ్రెసుకు యిప్పటికీ 18 రాష్ట్రాలలో 20 శాతానికి మించిన ఓటు షేర్ వుంది. 10 శాతం లోపుగా 8 రాష్ట్రాలలో, 11-20 శాతం 5 రాష్ట్రాలలో, 21-30 శాతం 6 రాష్ట్రాలలో, 31-40 శాతం 8 రాష్ట్రాలలో, 41-50 శాతం 4 రాష్ట్రాలలో వుంది. 

2014 నుంచి 30 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 4033 అసెంబ్లీ స్థానాల్లో 22 శాతం, అంటే 888 గెలిచింది. (ఆధారం ఇండియా టుడే ఆగస్టు 3). ఈ ఓటు బ్యాంకుతో మరొకరెవరైనా సరే కాంగ్రెసుని పునరుజ్జీవనం చేయగలరు. తను దిగిపోతే యీ విషయం అందరికీ తేటతెల్లమై పోతుందని సోనియా భయం. అందుకే కుర్చీ వదలనంటోంది. బిజెపి కలలు కనే కాంగ్రెస్-ముక్త్ భారత్ ఏర్పడడానికి చాలాకాలం పట్టవచ్చు కానీ సోనియా తన కుర్చీ వదలకపోతే మాత్రం నేతా-ముక్త్ కాంగ్రెస్ మాత్రం అతి త్వరలో సాకారమౌతుంది. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
mbsprasad@gmail.com

Show comments